వందేండ్ల కాలేజీకి వందనాలు!

మూడంతస్తుల ముచ్చటైన భవనం.. ఇండో సార్సెనిక్ తోరణాలు..
నిలువెల్లా జాజిరంగు నిగారింపు.. అజంతా, ఎల్లోరా గుహలను పోలిన స్తంభాలు.. ఉల్లిగడ్డ గోపురాలు.. గంభీరమైన భవంతులు.. ఎత్తయిన ప్రాకారాలు.. సువిశాల ప్రాంగణాలు.. హైదరాబాద్ సంస్కృతికి, దక్కనీ సాంస్కృతిక, చారిత్రక సంప్రదాయాలకు నిలువుటద్దం సిటీ కాలేజ్. ఉద్యమాలకు, ఉజ్వల భవితకు కేంద్రమైన సిటీ కాలేజ్ నిర్మితమై వందేండ్లు. శతాబ్ది విద్యా నిలయానికి శతకోటి వందనాల యాది.
ఏడో తరగతిలో జూపార్క్‌కు వెళ్లేటప్పుడు సిటీ కాలేజ్‌ను చూపించారు మా టీచర్లు. ఏదో పాతపడ్డ బంగ్లా లెక్క ఉంటే అంతగా పట్టించుకోకుండా ‘సరే’ అన్నట్లు తలూపిన. తర్వాత ఎప్పుడూ సిటీ కాలేజ్‌ని చూడలేదు. అది 2004.. సిటీ కాలేజ్ మెట్లెక్కాల్సిన సమయం వచ్చేసింది. ఏడేండ్ల తర్వాత మళ్లీ సిటీ కాలేజ్‌ను చూశాను. ఈసారి లోపలికి వెళ్లాను. కానీ కాలేజ్ అంతా మారిపోయింది. పాతపడ్డ బంగ్లా లెక్క ఉన్న భవనం జాజి రంగేసుకొని నిగనిగలాడుతూ కనిపించింది. ఎటుచూసినా మొక్కలే.. గడ్డి తివాచీలే. అదొక ఉద్యానవనం.
మొదటిరోజు ఆ గంభీరమైన నిర్మాణాలను చూస్తూ ఉండిపోయా. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న గుహల్లాంటి తరగతి గదులను చూసి ఆశ్చర్యపోయిన. ఇవి నిజంగా గుహలను పోలినవే. అజంతా, ఎల్లోరా గుహల శైలితో వీటిని నిర్మించారు. ముఖభాగం ఇండో-సార్సెనిక్ తోరణాలను పోలి ఉంటుంది. ఈ విషయం తర్వాత తెలిసింది. పెద్ద పెద్ద ఆర్చ్‌లను చూసి ఇది కాలేజా లేక మ్యూజియమా అనిపించింది.
భవనం మీది ఉల్లిపాయ గోపురాలను చూసి ముచ్చటపడిన సందర్భాలెన్నో. ముఖద్వారాలు కాకుండా చిన్న చిన్న ప్రాంగణ ప్రదేశాలు ఉన్నాయి. వీటినుంచే తరగతులకు కాంతి సహజంగా ప్రసరిస్తుంది. మా ఊరు హైదరాబాద్ పక్కనే కాబట్టి ఇక్కడి మసీదులు, మినార్లు, బజార్లు, మహల్లు చాలా చూశాను. కానీ, సిటీ కాలేజ్‌లోకి వెళ్తే మాత్రం ఏదో కొత్తగా అన్పించేది. అందుకే కాలేజీకి డుమ్మా కొట్టాలనిపించేది కాదు. మూసీ పాత, కొత్త నగరాలకు ఒక విభజన రేఖ లాంటిది. ఈ రెండింటినీ అనుసంధానించే మొట్టమొదటి వంతెన పురానాపూల్. సిటీ కాలేజ్ పురానాపూల్, నయాపూల్ మధ్యన మూసీకి దక్షిణ తీరాన ఉంది.
మిశ్రమ శైలి మిళితమై ఉన్న భవనం మాదిరిగానే చదువుకోసం ఇక్కడకు వచ్చే విద్యార్థులు కూడా తీరొక్క ప్రాంతం నుంచి వస్తారు. వేర్వేరు జిల్లాలకు చెందిన వారితో స్నేహం చేయడం అక్కడే తొలిసారి. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. కాలేజ్‌లోకి వెళ్లేందుకు నాలుగు ప్రధాన ద్వారాలు ఉంటాయి. కానీ వాటిలో రెండే తెరిచి ఉంటాయి. అవే కావు.. సిటీ కాలేజ్‌లో ఇప్పటికీ తెరచుకోని గదులు ఎన్నో ఉన్నాయి. ఆ భవనంపైకి ఇప్పటికీ ఎవరూ ఎక్కరు కూడా. చిందరవందరగా పడివున్న బెంచీలు, కుర్చీలు బూజుపట్టి ఉంటాయి. లోపలికి ఎంటరవగానే ఓ చిన్నపాటి మెట్లగది కనిపిస్తుంది. నేను అక్కడ చదివిన మూడేండ్లలో అది ఏనాడూ తెరచి ఉండటం చూడలేదు. ‘రేయ్.. అక్కడికి వెళ్లొద్దురా.. అదొక చంద్రముఖి గది’ అని స్నేహితులు అంటుండేవారు. అది దాటుకొని మెట్లెక్కుతూ పైకెళ్తుంటే మాత్రం సినిమాలు గుర్తొచ్చేవి. ఎందుకంటే, అలాంటి డూప్లెక్స్ భవనాలు అప్పటివరకు చూడలేదు.
* * *
మెట్లకు ఎదురుగా గోడపై ‘Work Work Work, If you are poor, work If you are rich, work’ అనే సూక్తి కనిపిస్తుంది. ఇది సిటీ కాలేజ్ మోటో. ప్రతి విద్యార్థికి ఈ వాక్యం రోజూ తన లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ఒక రకంగా ఆ మాటే నన్ను బాగా ప్రేరేపించింది. కాలేజ్‌కి సంబంధించిన ప్రతీ నోట్‌పై ‘The empires of the future are empires of the mind’ అనే విన్స్టన్ చర్చిల్ సూక్తి ఉంటుంది. ఇది కాలేజ్ విజన్. చిన్న చిన్న ఇరుకు గదుల్లో స్కూల్, ఇంటర్మీడియట్ చదువుకున్న నాకు సిటీ కాలేజ్ ఒక మైదానంలా కనిపించింది. అక్కడ దేనికీ కొదువుండదు. కొత్తవాళ్లు ఎవరైనా వస్తే మాత్రం కాటగల్వడం పక్కా. వరండాలు, గదులు, బాల్కనీలు అన్ని పోర్షన్లకు, అన్ని ఫ్లోర్లకు ఒకేలా ఉంటాయి. అలా నేను మా తరగతి గదిలోకి కాకుండా వేరే తరగతిలోకి వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడి వాతావరణం నాలో చాలా మార్పులు తెచ్చింది. ప్రతి మూడునెలల్లో ఒక్కరోజైనా మా కాలేజ్‌లో సినిమా షూటింగ్ అవుతుండేది. అప్పటివరకు సినిమాలే తప్ప షూటింగ్‌లు చూడని మాకు ఇక్కడ చూసే భాగ్యం దొరికేది. కానీ అప్పుడప్పుడు క్లాస్‌లకు ఆటంకం కలగడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేసేవి. ఆందోళనలు ఇక్కడ కొత్తేం కాదు. తిరుగుబాటుకు, ఉద్యమానికి సిటీ కాలేజ్ కేంద్రం లాంటిది.
* * *
అది 1952 సెప్టెంబర్ 4. సిటీ కాలేజ్ విద్యార్థులు ఒక ఊరేగింపు నిర్వహించారు. ‘తెలంగాణ వారికే ఉద్యోగాలు దొరకాలి.. ముల్కీలు కానివారు వెనక్కు వెళ్లిపోవాలి’ అనేది వారి నినాదం. అందులో ఒక విద్యార్థి కేశవరావ్ జాదవ్. ఊరేగింపు మదీనా హోటల్ వద్దకు చేరుకుంది. ఇంతలో బుల్లెట్ల చప్పుడు వినిపించసాగింది. చూస్తే.. పోలీసుల కాల్పులు. ఒక విద్యార్థి ప్రాణాలు పోయాయి. మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. విద్యార్థులంతా ఉస్మానియాను ముట్టడించారు. మృతదేహాన్ని అప్పగించాలని పట్టుబట్టారు. హోం మినిస్టర్ దిగంబర్‌రావు వచ్చి విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ విద్యార్థులు వినలేదు. ఊరేగింపుగా వెళ్లి.. పత్తర్‌గట్టీ పోలీస్‌స్టేషన్‌ను తగులబెట్టారు. మదీనా వద్ద కాల్పులు జరిపింది ఆ స్టేషన్ పోలీసులే. స్టేషన్‌కు నిప్పంటించారన్న ఆగ్రహంతో పోలీసులు మళ్లీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మరో విద్యార్థి ప్రాణాలు వదిలాడు. ఆ రోజు మొత్తం నాలుగుసార్లు లాఠీచార్జీలు అయ్యాయి. రెండు, మూడుసార్లు కాల్పులు జరిగాయి. సైన్యం వచ్చింది. తెల్లారి నగరమంతా హర్తాళ్ జరిగింది. 16 గంటల కర్ఫ్యూ విధించారు. అల్లర్లు ఆగకపోవడంతో మరోసారి కాల్పులు జరిగాయి. ఈసారి మరో నలుగురు బలయ్యారు. అనేకమందికి గాయాలయ్యాయి. సుమారు 30 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. సాయంత్రం ఫతేమైదాన్‌లో బహిరంగ సభ జరిగింది. ‘విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవే’ అని రాజకీయ నాయకులు ఒప్పుకొన్నారు. అదేరోజు కృష్ణదేవరాయ భాషానిలయం స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి బూర్గుల సుల్తాన్‌బజార్ వెళ్తుండగా ఆందోళనకారులు ఆయన వాహనాన్ని తగులబెట్టారు. సిటీ కాలేజ్‌లో జరిగే ఆందోళనా కార్యక్రమంలో పాల్గొనడానికి హన్మకొండ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు ఆపేశారు. ‘ఇడ్లీ-సాంబార్ గ్యో బ్యాక్' నినాదంతో జరిగిన నాన్‌ముల్కీ ఉద్యమం పురుడు పోసుకున్నది సిటీ కాలేజ్‌లోనే.
* * *
ఇక్కడ చదువుకున్నందుకో ఏమోగానీ మేం తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్‌గా పనిచేశాం. 2007లో తెలంగాణ ఉద్యమ తీవ్రత లేని సమయంలో కూడా నేను ‘తెలంగాణ రాష్ట్రం’ పేరుతో పాకెట్ క్యాలెండర్లు కొట్టించాను. జర్నలిజంలోకి రావడానికి కూడా సిటీకాలేజే కారణం. సిటీ కాలేజ్ 2004లో స్వయంప్రతిపత్తి కలిగిన కాలేజ్‌గా గుర్తింపు పొందింది. ఈ విషయంలో అప్పటి ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ ప్రసాద్ కృషి చాలా గొప్పది. న్యాక్ గుర్తింపు పొందిన మా కాలేజ్‌లో రెగ్యులర్ కోర్సులతోపాటు కొన్ని అడిషనల్ కోర్సులు ప్రారంభించారు. అందులో ఒకటి జర్నలిజం డిప్లొమా. అప్పటి వరకు జర్నలిజంలో ఓ కోర్సు ఉందని నాకు తెలియదు. ఇక్కడే పాత్రికేయం పట్ల ఆసక్తి ఏర్పడింది.
సిటీ కాలేజ్ నుంచి చూస్తే చార్మినార్ కొమ్ములు కనిపిస్తాయి. ఆ మూడేండ్లలో ప్రతిరోజూ మేం చార్మినార్ చూసేవాళ్లం. మదీనా చౌరస్తాకు సమీపంలోనే దివాన్ దేవిడీ ఉంటుంది. దివాన్ దేవ్డీ పోస్టాఫీస్‌లో సిటీ కాలేజ్ విద్యార్థులకు రోజూ పని ఉండేది. ఇవే కాదు.. పురానాపూల్, బేగంబజార్, ఉస్మానియా, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఉస్మానియాలోని చారిత్రక చింతచెట్టు, పత్తర్‌గట్టీ, కమల్ థియేటర్, ఇమ్ల్లీబన్, గౌలిగూడ వంటి చారిత్రక ప్రదేశాలతో అనుబంధం ఏర్పడింది. కాలేజ్‌లో ఉన్నంతసేపు చల్లగా, హాయిగా ఉండేది. ‘ఇంత బాగా ఎలా కట్టార్రా’ అనుకునేవాళ్లం.
* * *
అది 1921. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మూసీనదీ పక్కన సిటీ కాలేజ్ భవనానికి అంకురార్పణ చేశారు. అంతకుముందు 1856లో దార్-ఉల్-ఉలూమ్లో ఇది ఒక పాఠశాలగా ఉండేది. అదే ‘సిటీ హైస్కూల్'. తర్వాత దానిని మూసీ పక్కకు తరలింంచారు. ఉర్దూ మీడియంతో ఇంటర్మీడియట్ కాలేజీ ఏర్పాటు
చేసి ‘సిటీ కాలేజ్' అని పేరు పెట్టారు. సిటీ కాలేజ్ నిర్మాణానికి అప్పట్లో 8,36,919 రూపాయలు ఖర్చు అయ్యిందట. 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంటర్ కోర్సులు రద్దు చేయడం వల్ల దీంట్లో ప్రీయూనివర్సిటీ కోర్సు (పీయూసీ) ప్రవేశపెట్టారు. 1962లో బీఎస్సీ కోర్సులు ప్రవేశపెట్టి ‘సిటీ సైన్స్ కాలేజీ’ అని పేరు పెట్టారు. 1965లో ‘గవర్నమెంట్ సిటీ సైన్స్ కాలేజ్'గా మార్చారు. 1967లో బీఏ, బీకామ్ కోర్సులు జోడించటంతో ‘గవర్నమెంట్ సిటీ కాలేజ్'గా మారింది. ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ 2004లో అటానమస్ కాలేజ్‌గా గుర్తింపు పొందింది.
* * *
నేను అక్కడ చదువుకున్నప్పుడు డాక్టర్ డి.విజయ్ ప్రసాద్, సీఏఎల్ కామేశ్వరి, రామానుజా చార్యులు, రామ్మోహన్ ప్రిన్సిపాల్స్‌గా పనిచేశారు. కాలేజ్ తొలి ప్రిన్సిపాల్ ఆజం జంగ్ కాగా ప్రస్తుతం విజయలక్ష్మి ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ చదివిన నాకు సిటీకాలేజ్ ‘సామాజికం’ అనే కొత్త సబ్జెక్ట్‌ను పరిచయం చేసింది. శతాబ్ది సిటీ కాలేజ్‌కి శతకోటి వందనాలు!
కేంద్రమంత్రులుగా పనిచేసిన శివరాజ్ పాటిల్, పి. శివశంకర్, ముఖ్యమంత్రులుగా పాలన చేసిన ఎస్బీ చవాన్, వీరేంద్రపాటిల్, మర్రి చెన్నారెడ్డి, నటుడు మందాడి ప్రభాకర్‌రెడ్డి, క్రీడాకారుడు అర్షద్ అయూబ్ వంటివారు ఇక్కడే చదివారు. ఎంతోమంది వైస్ చాన్స్లర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు, ఒలింపియన్లు, పద్మశ్రీలు ఈ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు.
తాజావార్తలు
- అల్లరి నరేష్‌కు దిల్ రాజు బంపర్ ఆఫర్
- ప్రేమోన్మాది ఘాతుకం..
- అధునాతన 5జీ సేవలకు గూగుల్క్లౌడ్తో జత కలిసిన ఇంటెల్
- బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. ఇద్దరు దుర్మరణం
- చిలీకి నౌకను నిర్మించిన భారత సంస్థ ఎల్ అండ్ టీ
- అనసూయను ఆశ్చర్యంలో ముంచేసిన అభిమాని
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ
- తొలిరోజు పాఠశాలలకు 10 శాతంలోపే విద్యార్థులు
- టీఆర్ఎస్తోనే నిరంతర అభివృద్ధి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
- గురువాయూర్‌లో ఏనుగులకు పరుగుపందెం