ఆదివారం 07 మార్చి 2021
Sunday - Feb 06, 2021 , 22:42:26

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

వేదాలకు మూలమైన దేవుడు.. కథా నాయకుడై పురాణాలను నడిపించిన పరంధాముడు.. మనిషిలోని మృగ ప్రవృత్తిని పోగొట్టడానికి నరమృగావతారం ఎత్తిన మహా విష్ణువు.. తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో  తెలియజేస్తాడు.  ఆ ఆనంద పారవశ్యంలో మైమరచి పోతాడు రామభట్టు. దట్టమైన అడవి మధ్యలో, ఓ కొండ మీది ప్రాచీన ఆలయంలో  వెలిసిన స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు. అదే సమయంలో రారాజు ్రత్రిభువన మల్లుడు మంత్రి, సామంత, దండనాయకులతో తన మనసులోని భయాలను పంచుకుంటాడు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు..

శ్రీ నారసింహుని దర్శనం కోసం అటవీ ప్రాంతంలో అన్వేషణకై అడుగుముందుకు వేయాలా? రాజ్య భద్రతకు పెనుముప్పుగా పరిణమించనున్న విష్ణువర్ధనుడి దురాక్రమణా యత్నాన్ని అడ్డుకోవడానికి తక్షణమే యుద్ధం ప్రకటించాలా? ఏది ముందు, ఏది వెనుక? ఏది సాధ్యం? ఏది అసాధ్యం? పాలకుడు తీసుకొనే నిర్ణయాలు ప్రజల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. అందుకే పాలనా సంబంధమైన నిర్ణయాల్లో భావోద్వేగాలకు స్థానం ఉండరాదన్నది తన సిద్ధాంతం. నిర్ణయాలు తీసుకోవడంలో తనను మించినవారు లేరని, ఉండరనీ తనకొక నమ్మకమూ ఉంది. అలాంటి నమ్మకం ఉంటేనే ఏ ప్రభువైనా సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. 

ఎప్పుడూ సందేహాలతో సతమతమయ్యేవాడు రాజ్యాధికారానికి అర్హుడు కాడని తన తండ్రి విస్పష్టంగా బోధించేవాడు. పండిత మండలి అయినా, మంత్రి మండలి అయినా, చారులైనా, సైన్యాధికారులైనా, శాస్ర్తాలను చదువుకున్న జ్యోతిషులైనా ప్రభువుకు సూచనలు మాత్రమే చేయాలి. కార్యాచరణను నిర్దేశించకూడదు. ఎవరు ఏది సాధికారికంగా చెప్పినా, అది ఒకవైపు దృక్కోణమే అవుతుంది.  సలహా సంప్రదింపులు అవసరమే. కానీ, అది ఆచరణయోగ్యమా, కాదా? అని యోచించి నిర్ణయం తీసుకోవలసింది బరువు బాధ్యతలు మోసే పాలకుడు మాత్రమే!  ...ఈ విధంగా ఆలోచనలు చెలరేగాయి. ఒక స్పష్టమైన నిర్ణయం కూడా రూపుదిద్దుకున్నది. 

* * *

ఉగ్రం వీరం మహావిష్ణుం

జ్వలంతం సర్వతోముఖం

నృసింహం భీషణం భద్రం

మృత్యు మృత్యుం నమామ్యహం!

నమామ్యహం.. నమామ్యహం.. నమామ్యహం..

దట్టమైన కీకారణ్యంలో గుట్టలాంటి కొండ. పక్షుల కిలకిల రావాలతో ఆకుల గలగలలతో లయబద్ధంగా శబ్ద ప్రకంపనలు! వాటిని ఛేదిస్తూ మంత్రోచ్ఛాటన వలయాలుగా మారుమోగుతున్నది. ఆ అడవిలో కొండ దిగువ భాగంలో..

ఎవరో ఒక తపస్వి.. చాలాకాలం నుంచి ఒంటరిగా, తీవ్రంగా  తపస్సు చేస్తున్నట్టు  కనిపిస్తున్నాడు. కనులు మూసుకున్నాడు. ఉచ్ఛాస నిశ్వాసాలు ఉన్నాయా లేవా అన్నట్టుగా, నిశ్చలస్థితిలో ఉన్నాడు. విప్పారిన కళ్లతో తలలూపుతూ అక్కడే నిలబడి చూస్తున్నాయి రెండు లేడి కూనలు. కుందేళ్లు చెవులొగ్గి శ్రద్ధగా వింటున్నాయి. చెట్టు మొదలుకు చుట్టుకున్న సర్పం.. ఆ సుస్వరనాదాన్ని ‘శిశుర్వేత్తి- పశుర్వేత్తి.. వేత్తిగాన రసంఫణి’ అన్నట్టుగా తల ఎత్తి కదలకుండా వింటున్నది. కొమ్మమీదున్న పక్షులు ఆ మంత్ర పఠనాన్ని అనుకరణతో పలికే ప్రయత్నం చేస్తూ కుహూ కుహూమంటున్నాయి. క్షణకాలం కూడా కదలకుండా వుండలేని కోతులుకూడా మూతులపైన చేతులేసుకొని.. ఎక్కడ పొరపాటున శబ్దం వస్తే మంత్ర పఠనం ఆగిపోతుందేమో అనే భావంతో కదలక మెదలక అలా ఆగిపోయి ఉన్నాయి. 

పశుపక్ష్యాదులే కాదు, ప్రకృతి కూడా పరమభక్తితో ఆలకిస్తున్నట్టు.. స్తంభించిపోయి ఉన్నది. అప్పుడు వినిపించాయి. ఆ ప్రశాంతతను భగ్నం చేస్తూ.. కోలాహల ధ్వనులు!ఏనుగు ఘీంకారాలు, గుర్రపుడెక్కల చప్పుడు, తప్పెట్లూ తాళాలు. అడవిలో, ఆ కొండలలో నెలకొన్న నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ.. విపరీత శబ్దాలు! ఆ చప్పుళ్లకు అడవి ప్రాణులన్నీ కదిలిపోయి, చెల్లా చెదురయ్యాయి. ‘తన ఏకాంతాన్ని, భక్తి శ్రద్ధలను భంగపరిచిన వారు ఎవరా?’ అని తలెత్తి చూశాడు ఆ తపస్వి. 

ఎదురుగా..రాజలాంఛనలాతో, మందీ మార్బంతో తననే తీక్షణంగా చూస్తూ నిలబడి ఉన్న  చక్రవర్తి. ‘ఎవరు నువ్వు?’ ‘ఎందుకొచ్చావు?’ తాపసి అడిగాడు.

‘భువనగిరి సామ్రాజ్యాధినేత, విక్రమాంకదేవ చక్రవర్తి, త్రిభువనమల్ల సార్వభౌమున్నే.. ఎవరని ప్రశ్నిస్తున్నావా? వారెవరో నీకు తెలియదా?’ మహా దండనాయకుడు గద్దించి అడిగాడు. ‘అసలు నువ్వెవరు?’ త్రిభువనమల్లుడు తీవ్రమైన స్వరంతో ప్రశ్నించాడు. తన సామ్రాజ్యంలో తన పరివారం ఎదుట, ఒక సామాన్యుడు. అతడు తాపసి కావచ్చుగాక, తననే ఎవరని ప్రశ్నించడం సహించలేకపోయాడు. ‘మన్నించండి చక్రవర్తీ!’ ఇది మీ భూభాగమని నాకు తెలియదు. స్వామివారిదే అనుకొని ఇక్కడు జపతపాలు చేసుకుంటున్నాను’

‘స్వామి వారిదా? ఎవరా స్వామి?’

‘నరసింహస్వామి నా స్వామి! నా పేరు 

నరసింహదాసు’

‘ఏ దాసు అయితే ఏముంది కానీ.. నువ్వు స్వామిని దర్శించావా?’

‘లేదు, నాకు స్వామి దర్శన భాగ్యం దొరకలేదు. అది అంత సులభం కూడా కాదు. ఈ దుర్గమారణ్యంలో కొండమీద గుహలో దృశ్యాదృశ్యంగా వెలసివున్నాడు స్వామి. ఎక్కడో దూరంగా స్వామివారు ఉన్నారన్న భావనతో ప్రార్థిస్తుంటాను. అది వారికి చేరుతుందనే విషయం మాత్రం నాకు తెలుసు’

భక్తి తన్మయత్వంతో పలికాడు నరసింహ దాసు.‘ఎట్లా తెలుసు?’ అడిగాడు త్రిభువనుడు.

‘పూసే పువ్వులు ఎలా పూస్తున్నాయో.. ఎగిరే పక్షులు ఎలా ఎగురుతున్నాయో.. నర నాగరికత తెలియని వన్యమృగాలు ఎలా సఖ్యతగా కలిసి జీవిస్తున్నాయో తెలుసుకుంటే.. స్వామివారు ఉనికిలో ఉన్న విషయం కూడా తెలుసుకోవచ్చు. దేవుడిదాకా ఎందుకు, మానవ మాతృలైన మీ వంటి ప్రభువుల సంగతే తీసుకుందాం.. ఎక్కడో వేల యోజనాల దూరంలో ఉన్న కర్షకుడికి కూడా మీ పాలన, మీ ఉనికి తెలుసు. ఎందుకంటే, మీ నుంచి అన్ని రకాల రక్షణ తనకు లభిస్తుందని.. అందుకే తను పన్నులు కట్టాలని తెలుసు కనుక! ఎక్కడో ఉన్న మామూలు మనిషినే తెలుసుకున్న మనకు, అన్ని చోట్లా ఉండే దేవుణ్ణి తెలుసుకోవడం అంత కష్టమా?’ నవ్వుతూ చెప్పాడు నరసింహదాసు. 

త్రిభువనుడు ఆలోచనలో పడ్డాడు. ఎక్కడున్నా సరే, జాడ కనిపెట్టి, ఈ సింహదేవుణ్ని తను దర్శించి తీరుతాడు.

‘కష్టనష్టాలు పక్కన పెట్టు.. ఆ సింహదేవుణ్ణి  చేరే మార్గం చూపెట్టు.. నీకు తగిన కానుకలు ఇస్తాం’.. ఆశ చూపాడు. 

నవ్వాడు నరసింహదాసు.‘తగిన అర్హత ఉన్న భక్తుడికి .. ఆయనను దర్శించుకునే మార్గం చెపితే.. మీరిచ్చే కానుకలను మించిన అనుగ్రహం స్వామివారే 

నాకు ఇస్తారు’..

‘ఓహో.. పిలిచి కానుకలిస్తాం అంటే నీకు నచ్చలేదన్నమాట.. అయితే విను. మర్యాదగా దారి చూపకపోతే తగిన శిక్ష మాత్రం ఇప్పుడే అనుభవిస్తావ్‌'

ఆ బెదిరింపు విని మౌనం వహించాడు నరసింహదాసు.

శిక్ష అంటేనే ఇంత భయపడేవాడు.. ఎన్ని మాటలు చెప్పాడు. 

త్రిభువన చక్రవర్తి పెదవులపై చిరుమందహాసం!

ప్రభువులకు ఎదురు నిలబడి.. అంత అమర్యాదగా మాట్లాడుతున్న ఈ మనిషిని ఎత్తి పక్కన పడేసి.. ముందుకు వెళ్తే మంచిది కదా అనుకున్నాడు దండనాయకుడు.ఆ ఆలోచనలతో ముందుకు  కదలబోయాడు.

‘అయితే ప్రభూ.. మీకు స్వామివారిని చూపిస్తే ఏం చేస్తారు. బంధించి తీసుకెళ్తారా? దండయాత్రకు వచ్చారా?’

‘ఏమిటీ పిచ్చి ప్రశ్నలు.. మతి ఉండే మాట్లాడుతున్నావా?’

త్రిభువనమల్లుని కోపం చూసి పరివారం వెంటనే ఆప్రమత్తమయ్యారు. వారు ఒక కనుసైగ చేస్తే ఈ మూర్ఖుణ్ణి ఎత్తి  అడవిలో విసిరేస్తే.. అప్పుడు తెలిసి వస్తుంది’ అనుకున్నారు. 

‘అయితే  విను చక్రవర్తీ! నీ రాజ్యానికి సరిహద్దులున్నాయి. మా స్వామికి లేవు. నువ్వు త్రిభువనమల్లుడివి కావచ్చు. ఆయన పదునాలుగు భువనభాండాలకు అధిపతి. నువ్వు ఈ వర్తమానంలోని రాజ్యానికి రాజువు. ఆయన భూత, వర్తమాన, భవిష్యత్‌ కాలాల్లో ఈ చరాచర సృష్టికే సర్వంసహాచక్రవర్తి!’ నరసింహదాసు మాట పూర్తి కాకుండానే.. దండ నాయకుడు అతని మెడ ఒడిసి పట్టుకున్నాడు. త్రిభువన చక్రవర్తికి పరిస్థితి అర్థం కాలేదు. ఏం చెప్పదలిచాడు ఈ మనిషి?

తాను - స్వామి వారిపై దండయాత్రకు వచ్చాడా?

అట్లా అని ఎలా అనుకున్నాడు ఇతడు?

‘జాగ్రత్త - ఇక్కడ భక్తులకే ప్రవేశం. భయపెట్టేవాళ్లకు కాదు!’ అరుస్తున్నాడు నరసింహదాసు.

ఇక్కడ భక్తులకే ప్రవేశం

భక్తులకే ప్రవేశం.. భక్తులకే.. 

ఒక్కసారిగా ఒక మెరుపు మెరిసింది. 

త్రిభువనుడు దండనాయకుణ్ణి పక్కకు తోసేశాడు. అతని పట్టునుంచి నరసింహదాసుని విడిపించాడు. అప్పుడు ఎవరూ ఊహించని సన్నివేశం జరిగింది. పరివారమంతా నిశ్చేష్టులయ్యారు. త్రిభువనుడు తన వంటిమీద నగలను ఒకటొకటిగా తీసి వేస్తూ... కింద పడేస్తున్నాడు.

‘ప్రభూ!’ హాహాకారాలు  చేస్తున్నారు పరివారం. 

తన కిరీటాన్ని నరసింహదాసు, అంత వరకూ కూర్చొని వున్న బండరాయిపైన ఉంచాడు.

‘ఇక మీరంతా వెనకకు మరలండి. మేము అనుకొన్న పని నెరవేరిన తరువాతనే తిరిగి వస్తామని మహారాణికి చెప్పండి’. యువరాజు సోమేశ్వరుని పేరు మీదనే, నేనొచ్చేవరకూ రాజ్యపాలన నిర్వహించాలి. ఇది నా ఆజ్ఞ!’

ఆయన వొంటిమీద కట్టుకున్న పంచె, పైన ఒక అంగవస్త్రం మాత్రమే ఉన్నాయి. 

‘నరసింహదాసూ, నువ్వన్నది నిజమే! నేను భగవంతుడైన సింహదేవుని పైన యుద్ధమే ప్రకటిస్తున్నాను. ప్రభువుగా కాదు. ఒక భక్తుడిగా! సకల మానవాళికి కొండంత అండగా నిలవాల్సిన దేవాధిదేవుడు, కొండ గుహలో ఉండి పోవడమేమిటి? అరణ్యంలో దారిచేస్తాను. కొండను తొలిచి గుడి కడతాను. పిలిస్తే పలకవలసిన దేవుడు, పిలిచినా ఎందుకు రాడో చూస్తాను. ఇది ఈ నరుడికి, నరసింహునికి సంబంధించిన విషయం! వస్తున్నాను నారసింహా, దేవా, నీ దగ్గరికే వస్తున్నాను’. ఆ మాటలు వింటూనే నరసింహదాసు కండ్లవెంట కన్నీరు జలజలా రాలింది.

అప్రయత్నంగా చెయ్యెత్తి త్రిభువనుణ్ణి మనసారా ఆశీర్వదించాడు. 

‘ఎంత గొప్ప సంకల్పం నీది. నీవంటివాడు వెయ్యేండ్లకొకసారే జన్మిస్తాడు. నీ ఆశయం నెరవేరుతుంది. నమోశ్రీ నారసింహా’

‘నరసింహదాసుకి నమస్కరించి, వడివడిగా అడవిమార్గం వైపు ఒంటరిగా వెళ్లిపోయాడు. 

భారమైన హృదయాలతో పరివార జనం వెనక్కి మళ్లారు ప్రభువు ఆనతి ప్రకారం!

త్రిభువనుడు.. అడవిమార్గం గుండా ఉద్వేగ భరితుడై కీకారణ్యంలోకి ప్రవేశించడం చూశాయి చక్కగా మెరుస్తున్న రెండు కళ్లు!


VIDEOS

తాజావార్తలు


logo