దగ్గుకు విరుగుడు తేనె!

అసలే కొవిడ్ కాలం. కాస్త దగ్గు వచ్చినా కరోనా ఏమో అని భయపడాల్సిన సమయం. కానీ అది సాధారణమైన దగ్గే అని తేలిపోతే మాత్రం, తగ్గించుకోవడానికి ఓ ఉపాయం ఉందంటున్నారు నిపుణులు. ఆక్స్ఫర్డ్ అధ్యయనం ప్రకారం, చాలారకాల దగ్గులకు వైరస్సే కారణం. వాటికి యాంటీ బయాటిక్స్ వల్ల ఉపయోగం ఉండదు. శరీరం దానంతట అదే సర్దుకోవాల్సిందే. పొడిదగ్గు తగ్గడం కోసం మనం వాడే మందులన్నీ సింప్టమాటిక్.. అంటే లక్షణాల నుంచి ఉపశమనం కలిగించేవే! వాటి బదులు తేనె వాడి చూడమంటున్నారు నిపుణులు. తేనె మన గొంతులో ఉండే మ్యూకస్ పొర మీద రక్షణ కవచంలా ఏర్పడుతుంది. చిరాకుని తగ్గిస్తుంది. అయితే మధుమేహం ఉన్నవారు మాత్రం, కాస్త తక్కువ మోతాదులో దీన్ని పుచ్చుకోవాలి. ఇక ఏడాదిలోపు చిన్నపిల్లల మీద తేనె ఒక్కోసారి దుష్ప్రభావం చూపే ప్రమాదమూ ఉంది. ఇలాంటి పరిమితుల మినహా... సాధారణ దగ్గు, జలుబుల సమయంలో తేనె దివ్యౌషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు.
మూత్రంతో గుండెపోటు!
చాలామంది మూత్ర విసర్జనను అశ్రద్ధ చేస్తుంటారు. పని ఒత్తిడిలో పడిపోయి ప్రకృతి ధర్మాన్ని దాటేస్తుంటారు. అలా చేయడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని తెలిసిందే! తరచూ ఇలా జరగడం వల్ల మూత్రాశయం చుట్టూ ఉండే కండరాలు బలహీనపడిపోతాయి. యూరినరీ ఇన్ఫెక్షన్లు చోటు చేసుకుంటాయి. కిడ్నీలు దెబ్బతినే ప్రమాదమూ లేకపోలేదు. అరుదైన సందర్భాలలో మూత్రాశయం పగిలిపోయి, ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. తైవాన్ విశ్వవిద్యాలయం వారు, ఇప్పుడు మరో సమస్య గురించి కూడా హెచ్చరిస్తున్నారు. మూత్రాశయం నిండిపోవడం వల్ల, గుండె మీద ఒత్తిడి పెరుగుతుందట. దాంతో అది మరింత వేగంగా కొట్టుకుంటుంది. ఫలితం! హృద్రోగులు మూత్రాన్ని ఆపే ప్రయత్నం చేస్తే, గుండెపోటు వచ్చే ఆస్కారం ఎక్కువని వారు హెచ్చరిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!
మితంగా పుచ్చుకుంటే..
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అనుమానమే లేదు. కానీ, మితంగా పుచ్చుకుంటే ఆల్కహాల్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయనే మాట తరచూ వినేదే. ఈ వాదనను బలపరిచే పరిశోధన ఒకటి వెలుగుచూసింది. ‘అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ’ అనే జర్నల్ నివేదిక ప్రకారం పరిమితంగా బీరు తాగేవారిలో కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గుముఖం పట్టాయట! గుండెకు మేలు చేసే యాంటి ఆక్సిడెంట్స్ ఎంతో కొంత పెరిగాయట కూడా. రక్తం గడ్డలు కట్టకుండా (బ్లడ్ క్లాట్స్) నివారించే ఫైబ్రినోజిన్ అనే ప్రొటీన్ కూడా వీరిలో ఎక్కువగా కనిపించడం విశేషం. ఇక రెడ్ వైన్ వల్ల ఇంతకంటే ఆరోగ్యం ఉంటుందని తేల్చిందీ పరిశోధన. ద్రాక్ష తొక్కులో ఉండే ‘రెస్వెరాట్రోల్' అనే అరుదైన యాంటి ఆక్సిడెంట్, కొలెస్ట్రాల్‌తోపాటు రక్తపోటునూ తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, మోతాదుకు మించి ఏ మాత్రం మద్యం పుచ్చుకున్నా సర్వ అవయవాలూ దెబ్బతింటాయని వారు హెచ్చరిస్తున్నారు.
బరువు తగ్గాలా... సాయం చేయండి!
సెడెంటరీ లైఫ్‌ైస్టెల్ అంటే - ఆఫీసులో గంటల తరబడి కూర్చుని పనిచేస్తూ, ఇంట్లో టీవీ ముందు కాలం గడిపేస్తూ.. కండ్లు తప్ప కాలు కదల్చని జీవన విధానం. దీనివల్ల మన జీవక్రియ (మెటబాలిజం) యావత్తూ అదుపు తప్పడానికి 73 శాతం ఆస్కారం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఇందుకు విరుగుడుగా, ఓ చిత్రమైన ఉపాయాన్ని సూచిస్తున్నారు. అప్పుడప్పుడూ సాటివారికి సాయం చేయమంటున్నారు. దీనివల్ల మన శరీరంలో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్, డోపమైన్ సెరటోనిన్ లాంటి సానుకూల హార్మోన్లు ఎన్నో విడుదల అవుతాయి. దీన్ని ‘హెల్పర్స్ హై’ అంటారు. సాటివారికి సాయం చేశామనే తృప్తివల్ల ఇలా జరుగుతుందని వారంటున్నారు. అది శారీరక సాయం అయితే, తెలియకుండానే తగినంత వ్యాయామం కూడా అవుతుంది.
తాజావార్తలు
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్‌పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
- ఫాస్టాగ్ కొంటున్నారా.. నకిలీలు ఉన్నాయి జాగ్రత్త!