బుధవారం 24 ఫిబ్రవరి 2021
Sunday - Feb 06, 2021 , 22:00:04

చారాణ కూరకు బారాణ మసాలా?!

చారాణ కూరకు బారాణ మసాలా?!

అగ్గువకు వచ్చిన వస్తువును/ పదార్థాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు.. దానికంటే నాలుగైదు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టే సందర్భంలో విరివిగా వాడే సామెత ‘చారాణ కూరకు బారాణ మసాలా?!’. డబ్బును వృథాగా ఖర్చుచేసే వారినీ, తెలివి తక్కువ వాళ్లనూ గద్దించే సందర్భంలోనూ  ప్రయోగిస్తారు. ఎనకటికి డబ్బుల్ని పైసల్లోనే ఎక్కువగా పలికేటోళ్లు. నయా పైసా.. ఐదు పైసలు.. పది పైసలు.. ఇరువై అయిదు పైసలు (చారాణ).. యాభై పైసలు (ఆటాణ).. డబ్బు ఐదు పైసలు (బారాణ).. నూరు పైసలు (ఒక్క రూపాయి)గా చెప్పేవాళ్లు. ఈ సామెతలో కూరకు అయ్యే ఖర్చు 20 పైసలు. కానీ, అందులో వేసే మసాలకు అయ్యే ఖర్చు మాత్రం 75 పైసలు. నాడు మన జానపదులు చెప్పిన ఈ సామెతకు నేటికీ ఆదరణ తగ్గలేదు. పట్నాల నుంచి పల్లెల వరకూ తెలంగాణ ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది.. ఉంటుంది కూడా.

మొత్తం ఏడు సనుగులు..


‘ఇగో.. మొత్తం ఏడు సనుగులు. ఐదు పిస్పిలు, రొండు సందూకులు.. లెక్క పెట్టుకో. పొల్ల, పొల్లడు పైలం. కూర్కకు’ అంటూ పండుగకు ఇంటికి వచ్చి అత్తగారింటికి వెళ్తున్న కూతురితో ఓ తల్లి చెప్పిన పదబంధం ఇది. ఈ వాక్యంలో సనుగులు అంటే వస్తువులు. పిస్పి అంటే సంచులు. సందూకు అంటే పెట్టె. పొల్ల అంటే అమ్మాయి. పొల్లడు అంటే పిల్లవాడు. పైలం అంటే జాగ్రత్త. కూర్కకు అంటే నిద్రపోకు. ఇప్పుడు దీని వివరణ చూద్దాం.. ‘మొత్తం ఏడు వస్తువులు.. వీటిల్లో ఐదు సంచులు, రెండు పెట్టెలు. పిల్లా, పిలగాడు జాగ్రత్త.. నిద్రపోకు అమ్మా’ అని తల్లి తన బిడ్డకు జాగ్రత్తలు చెబుతున్నది. ఇలాంటి జీవం, బలం నిండిన మన పల్లెపదుల మాటలు ఎప్పటికీ గుర్తుంటాయి.

పిలిచి పిల్లనిస్తే కులం లేదని లేచిపోయిండట!


కొన్నిసార్లు కొందరు వ్యక్తుల ప్రవర్తన మరీ విపరీతంగా ఉంటుంది. మనమే జాలిపడి వాళ్లను పిలిచి ఏదైనా ఇస్తామంటే అందులో లోపాలను వెతుకుతుంటారు. అది బాగలేదు.. ఇది బాగలేదు.. అంటూ వంకలు పెడుతుంటారు. ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించి చెప్పే సామెతే ‘పిలిచి పిల్లనిస్తే కులం లేదని లేచిపోయిండట’ అనేది. ఇంకోరకం వ్యక్తులు కూడా ఉంటారు. వారికీ ఈ సామెత అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. వారు ఎలాంటివారంటే.. అవకాశాలు రాక ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. కొందరికి వద్దన్నా అవకాశాలు వచ్చిపడుతుంటాయి. అయితే వారు మాత్రం ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోగా, .. చిన్న చిన్న కారణాలు చెప్పి దుర్వినియోగం చేస్తుంటారు. పైగా కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారికి ఈ సామెతను అన్వయించవచ్చు.

ఆ అజ్జకారితో నెగుల్తవా?!


‘వాడొక అజ్జకారోడు.. వానితో ఏడ నెగుల్తవ్‌ రా’, ‘అరేయ్‌ మళ్లీ జెప్తున్నా.. ఆ అజ్జకారి యవ్వారమే వద్దంటున్న’ అనే పదబంధాలు ఎప్పుడైనా విన్నారా? అజ్జకారి అంటే మాటకారి, గయ్యాళి టైపు. ఎవర్నీ మాట్లానివ్వకుండా తన మాటల్తో ఎదుటివాళ్ల దగ్గర గెలిచేవాళ్లను ఇలా అజ్జకారి అంటుంటారు పల్లెల్లో. పై పదబంధంలో ‘నెగుల్తం’ అంటే గెలువడం అని అర్థం. అత్తాకోడళ్ల గొడవల్లో అజ్జకారి, నెగుల్తవ్‌ అనే పదాలు బాగా వినిపిస్తుంటాయి. ‘గయ్యాళి అత్త కాదు.. గదేడ నెగులనిత్తది’ అనే పదబంధంలో నెగలనియ్యక పోవడం అంటే గెలువనియ్యక పోవడం అని. 

VIDEOS

logo