సోమవారం 01 మార్చి 2021
Sunday - Feb 06, 2021 , 21:53:34

పుస్తక సమీక్ష

పుస్తక సమీక్ష

భావుక ప్రపంచం


భావుకథలు

సంకలనం: భావుక ఫేస్‌బుక్‌ గ్రూప్‌

పేజీలు: 477 వెల: రూ.300

ప్రతులకు: నవోదయ బుక్‌హౌజ్‌, 

విశాలాంధ్ర అన్ని పుస్తక కేంద్రాలు

సృజనాత్మక సాహిత్యంలో కథలది ప్రత్యేక స్థానం. రెక్కలు తొడిగిన ఊహల్లోంచి ఊడిపడే కథలు కొన్ని. చుట్టూ జరిగే సంఘటనల నుంచి పురుడు పోసుకునేవి ఇంకొన్ని. అనుభవాల దొంతరల్లో నుంచి దొర్లిపడే కథలు జీవిత పాఠాలు చెబుతాయి. మదిలో రగిలే గాథలు కొడిగడుతున్న మానవ సంబంధాలను ఎత్తి చూపుతాయి. కథావస్తువు ఏదైనా పాఠకుడికి సంతోషాన్నో, సందేశాన్నో ఇస్తుంది. అలాంటి అందమైన కథల సమాహారమే ఈ ‘భావుకథలు’. 85 మంది రచయితలు, రచయిత్రుల సృజనాత్మక విన్యాసం ఈ సంకలనం. ప్రతి కథలోనూ కొత్తదనం పలుకరిస్తుంది. కథనంలో కొంగొత్తదనం తొంగిచూస్తుంటుంది. వర్ధమాన కథకులకు అరుదైన అవకాశం ఇస్తూనే, లబ్ధప్రతిష్ఠులైన రచయితల కథలనూ ఇందులో జోడించారు. భావుక ఫేస్‌బుక్‌ గ్రూప్‌ చొరవతో కొత్తపాతల మేటి రచయితల కలయికతో వచ్చింది ‘భావుకథలు’. ఇందులోని ప్రతి కథా ఆనందాన్నిస్తుంది. ఆశ్చర్యపరుస్తుంది. ఆలోచింపజేస్తుంది. ఎవరికి వారు తమ జీవితాలను అన్వయించుకునే కథలెన్నో తారసపడతాయి. చదువుతూ ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడమే మనం చేయాల్సింది.

సాహితీ వ్యాసపీఠం


సందర్భ

రచన: సుధామ

పేజీలు: 406 వెల: రూ.300

ప్రతులకు: అన్ని ప్రముఖ 

పుస్తక కేంద్రాలు

ఎవరైనా ఒక మాట యథాలాపంగా చెబితే తప్పకుండా వినాల్సిన అవసరం లేదు. కానీ, ఆ వ్యక్తి, తన అనుభవాన్ని చెబితే, మన భవిష్యత్తును మార్చే మంచిమాట చెబితే.. తప్పకుండావినాల్సిందే. ఆ చెప్పిన మాటను ఎంత కష్టమైనా ఆచరించాల్సిందే. ప్రయోజనం వెంటనే కాకపోయినా.. ఎప్పుడో అప్పుడు తప్పకుండా దక్కుతుంది. ఆ మంచి మాట సాహితీ తేజస్సు, అపార అనుభవజ్ఞుడు, ఆకాశవాణి శ్రోతలకు చిరపరిచితుడు అయిన సుధామ చెబితే ప్రతి అక్షరం విలువైందే. అలాంటి మంచిమాటల మూట ‘సందర్భ’ వ్యాస సంపుటి. సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో ఆయన సందర్భోచితంగా పండించిన వ్యాసాల కదంబం ఈ పుస్తకం. వివిధ పత్రికలకు, మ్యాగజైన్స్‌కు పలు సందర్భాల్లో ఆయన రాసిన 76 వ్యాసాలతో ఈ సంకలనాన్ని తీర్చిదిద్దారు. సాహితీ శిఖరాల జీవన మధురిమలు, ఆకాశవాణి తరంగాలు, సాహితీ సమీక్షలు, విమర్శనాత్మక విశ్లేషణలు, నిత్య స్మరణీయులకు నివాళులు.. ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయిందులో. ప్రతి వ్యాసం ఏదో ఒక కొత్త విషయాన్ని పరిచయం చేస్తుంది. ఎంతో కొంత ఆశ్చర్యానికీ లోను చేస్తుంది.

ఉద్యమ పరిచయం


మనిషి పరిచయం

రచన: రామా చంద్రమౌళి

పేజీలు: 190 వెల: రూ.200

ప్రతులకు: నవోదయా బుక్‌హౌజ్‌, అమెజాన్‌, ఆథర్స్‌ప్రెస్‌

తెలంగాణ మలిదశ ఉద్యమం అనుకున్న గమ్యాన్ని ముద్దాడింది. ఈ క్రమంలో ఎందరో యువకులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అలా అర్ధాంతరంగా అసువులు బాసిన ఓ యువకుడి తల్లి ప్రస్థానమే ‘మనిషి పరిచయం’. ఆ అమ్మ పేగు కోత ఈ నవల. కొడుకు పోయిన దుఃఖాన్ని పంటి బిగువున అదిమిపెట్టి ఉద్యమపథంలో నడిచిన వీరమాత గాథ ఈ నవల. ‘మనిషి పరిచయం’ ఓ పాత్ర చుట్టూ అల్లుకున్న పోరాటం. ఆ పాత్ర చేపట్టిన పోరాటం. కొడుకు ఆశయ సాధన కోసం ఉద్యమంలో అడుగుపెట్టిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ నాయకురాలయింది. ఆ పాత్ర ఎదిగిన తీరును వివరిస్తూనే మలిదశ ఉద్యమంలోని మేలి మలుపులన్నీ మరోసారి కండ్ల ముందు సాక్షాత్కరింపజేశారు రచయిత. వాస్తవిక కథను వాస్తవిక కోణంలో ఆవిష్కరించారు. ఉద్యమ కాలంలో తల్లుల వేదన, యువత ఆవేశం, ఉద్యమనేతల పోరాట స్ఫూర్తి ఇలా విభిన్న అంశాలను స్పృశిస్తూ ‘మనిషి పరిచయం’తోపాటు మహోజ్వలమైన తెలంగాణ పోరాటాన్నీ మరోసారి పరిచయం చేశారు రచయిత రామా చంద్రమౌళి.

VIDEOS

logo