సోమవారం 01 మార్చి 2021
Sunday - Feb 06, 2021 , 21:46:12

ఐతారం పలారం పోషకాల ‘పాయసం’

ఐతారం పలారం పోషకాల ‘పాయసం’

పండుగలు, పర్వదినాలు అనగానే గుర్తొచ్చేవి నైవేద్యాలే. దేవుడి పేరు చెప్పుకొని ఎన్ని ఫలహారాలూపిండివంటలూ చేసుకుని తిన్నా దేవుడితోపాటు మనుషులకూ ఎంతో ప్రీతికరమైన పాయసం తాగితేనే అసలు పండగ.  పాలు, బెల్లం, పచ్చి కొబ్బరి, నెయ్యిలాంటి పదార్థాలతో తయారు చేసుకునే ఈ పాయసాలు రుచికి కమ్మగా ఉండటమేకాదు, ఎన్నో పోషక విలువలనూ కలిగి ఉంటాయి.  అందులోనూ, తెలంగాణ ‘పిండి పాయసం’ ప్రత్యేకతే వేరు.

పిండి పాయసం చేసేందుకు ఎక్కువగా బియ్యం, గోధుమ, మక్కజొన్న పిండిని వాడుతారు. వీటిలో ముఖ్యంగా కార్బొహైడ్రేట్స్‌, ఫైబర్‌లాంటి పోషకాలుంటాయి. బెల్లం, పాలు, నెయ్యిలాంటి పదార్థాలతో కలిపి వీటిని తీసుకోవడం వల్ల శరీరానికందే పోషకాల స్థాయి మరింత పెరుగుతుంది. 

జీర్ణక్రియను సాఫీగా జరిపి, గ్యాస్‌ ఉబ్బరాన్ని తగ్గించడంలో బెల్లం ఉపకరి స్తుంది. రక్తాన్ని శుద్ధిచేసి మెటబాలిజాన్ని క్రమబద్ధీకరిస్తుంది. బెల్లంలో సమృద్ధిగా ఉండే ఐరన్‌, ఎనీమియా రోగులకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా రక్తంలోని ప్రమాదకరమైన టాక్సిన్లను బయటకు పంపించి, చర్మానికి మంచి మెరుపునిస్తుంది. మొటిమలను కూడా నివారిస్తుంది.

బెల్లంలోని వేడిచేసే గుణం వల్ల జలుబు, దగ్గు, రొంపలాంటి వాటినుంచి ఉపశమనం లభిస్తుంది. బెల్లం తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌ పెరిగే ప్రమాదముండదు. కాబట్టి, మధుమేహంతో బాధపడేవారు కూడా ఈ పాయసాన్ని తీసుకోవచ్చు. 

పచ్చి కొబ్బరిలో పోషకాలు అపారం. ఇది శరీరానికి శక్తినిస్తుంది. దీనిలోని పోషకాలు అవయవాలు చురుగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి. కొబ్బరిలో పీచు పదార్థం ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపేస్తుంది. పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి.

నెయ్యి తింటే శరీరంలో కొవ్వు పెరిగి లావైపోతామనుకుంటారు చాలామంది. కానీ, నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలుంటాయి. ఇవి దేహంలో పేరుకున్న చెడు కొవ్వును హరించివేస్తాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. నెయ్యిలో దేహానికి అవసరమైన అమీనో యాసిడ్స్‌ ఉంటాయి. అవి ఫ్యాట్‌ సెల్స్‌ను క్షీణింపచేస్తాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు డైట్‌ ప్లాన్‌లో నెయ్యిని చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

పాయసం తయారీలో ముఖ్యమైనవి పాలు. ఇందులో పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, క్యాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, ఐరన్‌, సోడియం, పొటాషియం, పీచు పదార్థం, జింక్‌ సమృద్ధిగా ఉంటాయి. అదే విధంగా ఎ, బి, సి, డి విటమిన్లు కూడా పుష్కలం. మనకు కావాల్సిన అన్ని రకాల అమీనో యాసిడ్స్‌ పాలలో లభిస్తాయి.

కేసిన్‌ అనే ప్రొటీన్‌ పాలలో మాత్రమే ఉంటుంది. ఈ ఒక్క ప్రొటీన్‌ ఉంటే దాదాపు 80 శాతం మాంసకృత్తులు లభించినట్లే. పాలలో ఉండే ఎ విటమిన్‌ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బి విటమిన్‌ నాడీబలాన్ని వృద్ధి చేస్తుంది. విటమిన్‌ డి ఎముకలు, దంతాల దారుఢ్యానికి ఉపకరిస్తుంది. అందుకే శరీర ఎదుగుదలకు పరిపూర్ణంగా దోహదపడే పాలు పిల్లలకు అమృతప్రాయం. పిల్లలకూ, పెద్దలకూ పరిపూర్ణ సమీకృత ఆహారం.

VIDEOS

logo