వినరా సుమతీ

2030- పక్షిరాజు మరోసారి మొబైల్ ఫోన్లమీద పగబట్టాడు. అందినవి అందినట్టు... మోడళ్లూ, సిరీస్‌లూ అన్న తేడా లేకుండా ప్రతి స్మార్ట్ ఫోన్నీ చెరపట్టాడు. ఆశ్చర్యం! ఎవరూ బాధ పడటం లేదు. ప్రతి జీవితమూ అంతే ప్రశాంతంగా, అంతే చురుగ్గా సాగిపోతున్నది. ఎవరితోనైనా మాట్లాడాలంటే పాత ఫోన్లు సరిపోతున్నాయి. న్యూస్ చూడాలంటే పేపర్లు, వీడియోలకి కంప్యూటర్లు... ఏదో కోల్పోయిన వెలితి మచ్చుకైనా కనిపించడం లేదు. కారణం! కాలక్షేపానికి మొబైల్ అవసరమే లేకుండా పోయింది. పని చేసుకుంటున్నా, డ్రైవ్ చేస్తున్నా... చెవికి ఓ హెడ్‌ఫోన్, ఆ హెడ్‌ఫోన్‌లో ఓ పాడ్‌కాస్ట్‌తో జీవితాలు హాయిగా గడిచిపోతున్నాయి. పుస్తకం చదవాలంటే ఆడియోబుక్స్ ఎలాగూ ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉన్నా... వేగంగా మారుతున్న పరిస్థితులు మాత్రం, ఇలాంటి భవిష్యత్తునే సూచిస్తున్నాయి. పక్షిరాజు ఎప్పటికీ రాడు. కానీ శ్రవణ మాధ్యమాల్లో విప్లవం మాత్రం ఇప్పటికే వచ్చేసింది.
ఓముప్పై ఏండ్ల క్రితం రేడియో మాత్రమే ప్రసార మాధ్యమంగా ఉండేది. టీవీ వచ్చాక దాని గొంతు తగ్గింది. మొబైల్ దాడి మొదలైన తర్వాత దాదాపుగా మూగబోయింది. కాలచక్రం మళ్లీ వెనక్కి తిరిగింది. ఏదైనా నేర్చుకోవాలన్నా, కాలక్షేపం చేయాలన్నా.. ‘వింటే సరిపోతుంది’ అనే ట్రెండ్ వేగం పుంజుకుంటున్నది. దానికి అనుగుణంగా ఎలాంటి సమాచారాన్నయినా శ్రవణరూపంలో అందించే ప్రయత్నాలు మొదలయ్యాయి. శ్రవణ మాధ్యమాలలో ప్రస్తుతం పాడ్కాస్టులదే పైచేయి. అలాగని ఈ పాడ్‌కాస్టులు ఇప్పటికిప్పుడు వచ్చినవి కాదు. వీటి వెనుక నలభై ఏండ్ల చరిత్ర ఉంది. వెబ్సైట్ విప్లవం రాకముందే రేడియో కంప్యూటింగ్ సర్వీసెస్ అనే సంస్థ ఆడియో ఫైల్స్‌ని అందించేది. ఈ సేవలు రకరకాలుగా మారుతూ, మన అభిరుచులనుబట్టి పాటల లాగానే ఆడియోఫైల్స్ని కూడా ‘ఆన్ డిమాండ్' అందించే సాఫ్ట్వేర్లు మొదలయ్యాయి. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక ఎవరైనా సరే తమ మనసులోని మాటను, చెప్పదల్చుకున్న విషయాన్నీ నలుగురితో పంచుకునే సౌలభ్యం పెరిగిపోయింది. బ్లాగుల విప్లవం మొదలైంది. వాటిలో మాటలూ మొదలయ్యాయి (ఆడియో బ్లాగింగ్). ఐ-పాడ్ ప్రవేశంతో వీటికి పాడ్‌కాస్ట్ అనే పేరు స్థిరపడిపోయింది.
కాసులు కష్టమే!
యూట్యూబ్‌లో వీడియోకి ఎన్ని క్లిక్స్ లభిస్తే అంత కిక్. ఎంతమంది సబ్‌స్ర్కైబర్లు ఉంటే అన్ని సౌలభ్యాలు. కానీ పాడ్కాస్టులలో అలా కాదు. ఎవరైనా స్పాన్సర్ చేస్తే కానీ రాబడి రాదు. మ్యూజిక్ యాప్స్‌లో పాడ్కాస్టులను ప్రసారం చేసినందుకు ఆ సంస్థలకి కొంత ఆదాయం వస్తుంది. కానీ దాన్ని పాడ్కాస్టర్లతో పంచుకునేందుకు అవి ఇష్టపడవు. ఒక్కోసారి, మన పాడ్కాస్టును ప్రసారం చేసినందుకు మనమే డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. ‘పాడ్‌కాస్టుల మీద నాకు ఒక్క రూపాయి ఆదాయం కూడా రాదు. కనీసం నా పాడ్కాస్టులను రికార్డు చేసే మైక్ అయినా స్పాన్సర్ చేయమని చాలా సంస్థలని అడిగాను. దానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు’ అని వాపోతారు ఒక పాడ్‌కాస్టర్. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. తమ తరఫున పాడ్కాస్టులను రూపొందించమంటూ కొన్ని సంస్థలు పాడ్కాస్టర్లను కోరుతున్నారు. ఎంతో కొంత పారితోషికమూ ఇస్తున్నాయి. విదేశాల్లో అయితే ‘యాడ్-ఇన్-సెషన్' అనే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. పాడ్‌కాస్ట్ డౌన్లోడ్లు పెరిగేకొద్దీ, వీటి మధ్యలో ప్రకటనలు చేర్చే సౌలభ్యం కల్పిస్తుందీ విధానం.
పుస్తకాల పరిస్థితీ..
ఒకప్పుడంటే విజ్ఞానానికైనా, వినోదానికైనా పుస్తకమే ముఖ్య సాధనంగా ఉండేది. కాలం మారిపోయింది. పుస్తకాలు చదివే ఓపికా తీరికా ఎవరికీ ఉండటం లేదు. ‘పుస్తకాలు కొనుక్కుని కూడా చదువుతారా!’ అని బుగ్గలు నొక్కుకునేవాళ్లకూ కొదవ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడియోబుక్స్ విప్లవం మొదలైంది. ఆఫీసులకు వెళ్తున్నప్పుడూ, ఇంటికి వస్తున్నప్పుడూ ప్రయాణ సమయంలో వీటిని వినేయవచ్చు. కేవలం ఆడియోబుక్స్ కోసమే ‘ఆడిబుల్' లాంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి. పుస్తకాల్లో ఉన్న విషయాన్నంతా గంటల తరబడి వినలేనివాళ్లకూ కొన్ని సౌలభ్యాలు ఉన్నాయి. ‘బ్లింకిస్ట్' లాంటి యాప్స్ పుస్తకంలోని సారాంశాన్ని కుదించి వినిపిస్తాయి. వీటిలో తెలుగు పుస్తకాల సంఖ్య నామమాత్రం కంటే తక్కువే! అలాగని ఆడియోబుక్స్లో మనం వెనుకబడ్డామని అనుకోవడానికి లేదు. దాసుభాషితం యాప్, కౌముది ఆడియో మ్యాగజైన్ లాంటివి మన ప్రభను చాటుతూనే ఉన్నాయి.ఆడియోబుక్స్ రంగంలో దాసుభాషితం రూపకర్త కొండూరు తులసీదాస్ది ఓ అరుదైన ప్రయాణం. ఒకప్పుడు విద్యాశాఖాధికారిగా పనిచేసిన తులసీదాస్ 2004లో పదవీ విరమణ చేశారు. మొదటి నుంచీ తెలుగు సాహిత్యం మీద ఉన్న అనురక్తితో, తన తీరిక సమయంలో పీవీఆర్కే ప్రసాద్ పుస్తకాలకి శ్రవణ రూపం ఇచ్చారు. వాటన్నిటినీ సౌండ్‌క్లౌడ్ అనే మాధ్యమంలో ఉంచేవారు. వాటికి మంచి స్పందన రావడంతో, నచ్చిన పుస్తకాలని ఆడియోబుక్స్గా మార్చే వ్యాపకాన్ని చేపట్టారు. తులసీదాస్ గారి అబ్బాయి కిరణ్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. తండ్రి అనురక్తిని గమనించిన కిరణ్, ఓ యాప్‌ని రూపొందించి ఇవ్వడంతో ‘దాసుభాషితం’ కొత్త పట్టాలెక్కింది. కథలు, నవలలు, కావ్యాలు, ప్రాచీన సాహిత్యం... ఇలా కాపీరైట్ సమస్యలు లేనివాటిని శ్రవణానువాదం చేసి వీటిలో పొందుపరచడం మొదలుపెట్టారు. వీరికి, సాహితీవేత్త డాక్టర్ మృణాళిని కూడా చేయూతగా నిలవడంతో అరుదైన పాడ్కాస్టులను అందించగలిగారు. దాసుభాషితంలో కొన్ని పుస్తకాలను ఉచితంగా వినవచ్చు. మరి కొన్నిటి కోసం కాస్త ధర చెల్లించాల్సి ఉంటుంది. పరి పోషకులు, మహారాజ పోషకులు అంటూ సబ్స్క్రిప్షన్లు కూడా ఉన్నాయి. ‘శ్రోతలకు నాణ్యమైన సేవలు అందించాలంటే రుసుములు నిర్ణయించక తప్పలేదు’ అంటారు తులసీదాస్. ‘ఒకరికి ఆకలి వేసినప్పుడు, మరొకరు తింటే ఉపయోగం లేదు. కానీ ఆడియోబుక్స్ అలా కాదు. ఎవరు వినిపించినా విన్న ప్రతి ఒక్కరి ఆర్తీ తీరుతుంది. భవిష్యత్తులో ఆడియోబుక్స్కి ఢోకా లేదు’ అని భరోసా ఇస్తారాయన. తెలుగు ఆడియో బుక్స్ రంగంలోకి ‘వినుమరి’, ‘కథ చెబుతా విను’ లాంటి యాప్స్ విస్తృతంగా రావడం చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది.
అదృష్టవశాత్తు, శ్రోతలకు మంచి కథలు వినిపించాలనుకునే ఔత్సాహికులకు తెలుగులో కొదువ లేదు. ఫేస్బుక్, యూట్యూబ్, సౌండ్‌క్లౌడ్ లాంటి మాధ్యమాల ద్వారా వీటిని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మానికి చెందిన మంజర్లపాటి కమలాకర్ ఇందుకు ఉదాహరణ. “నేను ఒకసారి తెలుగుకథలు అని గూగుల్ చేస్తే బూతు కథలు వచ్చాయి. మనసుకు కష్టమనిపించింది. వెంటనే ‘సాహిత్యం-చలనచిత్రం’ అనే యూట్యూబ్ చానల్ ఆరంభించాను. తెలుగులో ఉన్న మంచి సాహిత్యాన్ని వినిపించే ప్రయత్నం మొదలుపెట్టాను” అంటారు కమలాకర్. ఇందులో మల్లాది వెంకటకృష్ణమూర్తి, మల్లాది పద్మజ దంపతుల స్వరాలు సహా రచయితలు తమ స్వీయగళంతో వినిపించిన కథలెన్నో ఉన్నాయి. రావికొండలరావు, దర్శకుడు సుకుమార్ వంటివారు తమకు నచ్చిన రచనల గురించి చెప్పిన కబుర్లూ ఉన్నాయి. ‘మేలిమి బంగరు కథలు’ పేరుతో అల్లం శేషగిరిరావు, చలం వంటి అరుదైన రచయితల కథలెన్నో ఇక్కడ వినిపిస్తాయి. యూట్యూబ్ మాధ్యమం ద్వారా ‘వినిపించే’ ప్రయత్నం చేస్తున్న ఇలాంటి చానళ్లు మరికొన్ని లేకపోలేదు. పిటిఎస్కె రాజన్ స్థాపించిన ‘అజగవ’ అనే ఆడియో చానల్‌కు దాదాపు 50 వేల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. కాశీమజిలీ కథలు, శ్రీనాథుడి పద్యాలు వంటి ప్రాచీన సాహిత్యాన్ని తెలుగువారికి అందించే ప్రయత్నం చేస్తున్నదీ చానల్.
దూసుకొస్తున్న స్టేషన్లు
శ్రవణ మాధ్యమంలో పాడ్‌కాస్టులు, ఆడియో పుస్తకాల సందడి సరేసరి. రేడియోల ప్రాభవం కూడా మళ్లీ మొదలు కాబోతున్నది. సాంకేతికత అనుకూలించడమే ఇందుకు కారణం. రేడియోను స్థాపించడమంటే ఒకప్పుడు ఖర్చుతో కూడుకున్న పని. ప్రత్యేకమైన సర్వర్లు, స్టూడియోలు సరేసరి. కార్యక్రమాలను రికార్డు చేయడం, ఎడిట్ చేయడం.. అంతా ఓ తతంగంలా ఉండేది. ఇప్పుడలా కాదు. Shoutcast, Live365, radio.co లాంటి సంస్థలెన్నో తమ వేదికద్వారా ఎవరైనా సరే, రేడియో స్టేషన్‌ను నడిపే అవకాశం కల్పిస్తున్నాయి. మనకి నచ్చిన పేరుతో ప్రత్యేకమైన యాప్‌ను సిద్ధం చేసి ఇస్తున్నాయి. ఈ సేవల కోసం కొంత రుసుము చెల్లిస్తే చాలు. మన కంప్యూటర్ నుంచే ఓ రేడియో స్టేషన్ నడిపేయవచ్చు. లైవ్ ఇంటర్వ్యూలు, పాటలు, రూపకాలు... ఎలాంటి కార్యక్రమాన్నయినా ప్రసారం చేయవచ్చు. కొన్ని తెలుగు సంస్థలు ఇప్పుడిప్పుడే ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఒక్కసారి వీటి గురించి ప్రచారం మొదలైతే, ఆకాశమే హద్దుగా వీటి వృద్ధి ఉంటుంది.
మన చూపు దేనిమీదైనా ఉంటే మరో పని మీద దృష్టి పెట్టడం అసాధ్యం. కానీ శ్రవణం అలా కాదు. వింటూనే చాలా పనులను చేసుకోవచ్చు. దీనివల్ల కాలక్షేపమే కాదు, అలుపు కూడా తెలియదు. అందుకే పాటలు పొలం పనుల్లో భాగంగా ఉండేవి. ఒకేసారి, పనీ పాటా సాగేవి. తరం మారింది. కాలక్షేపంతోపాటు కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే ఆలోచన మొదలైంది. ఫలితమే శ్రవణ మాధ్యమాల విప్లవం. పాడ్‌కాస్ట్, ఆడియోబుక్, రేడియో... మాధ్యమం ఏదైనా సరే వినికిడి పెరుగుతున్నది. పైగా వీటిని ఎవరైనా రూపొందించే సౌలభ్యం ఉండటం మరో విశేషం. ఇక్కడ సామాన్యుడే రాజు. చేతిలో ఓ ఫోన్ లేదా రికార్డర్ ఉంటే చాలు, పాడ్‌కాస్ట్ చేసేయవచ్చు. దాన్ని ఎడిట్ చేసుకునేందుకు Audacity లాంటి ఉచిత సాఫ్ట్వేర్లు అందుబాటులు ఉన్నాయి. ఎలాంటి శ్రమా లేకుండా అప్లోడ్ చేయడానికి ‘Podbean’ లాంటి సంస్థలూ సిద్ధంగా ఉన్నాయి. కొద్దిగా స్థోమత ఉంటే మరిన్ని మెరుగైన సాఫ్ట్వేర్లు, పరికరాలూ దొరుకుతాయి. నేల నుంచి ఆకాశం దాకా ఎవరి హద్దు వారిదే కానీ ప్రతి ఒక్కరికీ ఇక్కడ చోటు ఉంది. అదే ముఖ్యం కదా!
పక్కా లోకల్
ఒకప్పుడు పాడ్‌కాస్ట్ సేవలు ఇంగ్లిష్‌లోనో, స్పానిష్ లాంటి అంతర్జాతీయ భాషల్లోనో ఉండేవి. కానీ డేటా అగ్గువైపోయిన తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ఈ ఏడాది చివరి నాటికి, ఇంటర్నెట్కు అలవాటు పడే కొత్తవారిలో 90 శాతం మంది స్థానిక భాషల్లోనే అంతర్జాలాన్ని ఆస్వాదించేందుకు ఇష్టపడుతారని గూగుల్ సర్వే చెబుతున్నది. అందుకు అనుగుణంగానే తెలుగులో పాడ్‌కాస్టులు, ఆడియో బుక్స్ లాంటివి విస్తరిస్తున్నాయి. ఇప్పటికే స్థానిక భాషల్లో పాడ్కాస్టులను ప్రోత్సహించేందుకు ఖబరీ, హెడ్‌ఫోన్, ఆవాజ్, క్యాస్ట్బాక్స్ లాంటి యాప్స్ వచ్చాయి. ఇక స్పాటిఫై, గానా, వింక్, జియోసావన్ లాంటి సంగీత ప్రధానమైన యాప్స్ స్థానిక భాషల్లో పాడ్‌కాస్టులు అందిస్తున్నాయి. వీటన్నింటిలో తెలుగువాడి హవా స్పష్టంగా కనిపిస్తున్నది. గరికపాటి జ్ఞాననిధి, యూపీఎస్సీ పాడ్‌కాస్ట్ లాంటివి ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఇక సినిమా దర్శకులు పూరీ జగన్నాథ్ పాడ్‌కాస్ట్ అయితే దేశంలోనే టాప్‌టెన్ టాక్షోస్లో ఒకటిగా నిలిచింది.
హైదరాబాద్‌కు చెందిన ‘సునో ఇండియా’ ప్రస్థానాన్ని గమనిస్తే, ఈ రంగంలో వస్తున్న మార్పు స్పష్టంగా తెలుస్తుంది. కేవలం పాడ్కాస్టులను మాత్రమే రూపొందించే తొలి దేశీ స్టార్టప్ ఇది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, హిందీల్లో కూడా పాడ్కాస్టులను రూపొందించేది. కానీ, పాడ్‌కాస్ట్ అంటే ఏమిటో కూడా తెలియని ఆ రోజుల్లో, సంస్థ నిలదొక్కుకోవడం చాలా కష్టమైపోయింది. క్రమంగా ఈ మాధ్యమం పట్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో, గత రెండేండ్ల కాలంలో వీరి పాడ్‌కాస్టులు కోటిమందిని చేరుకోగలిగాయి. వీటిలో పిల్లలకు తెలుగులో కథలు చెప్పే ‘కథ చెప్పవా అమ్మమ్మా!’, వార్తలను విశ్లేషించే ‘సమాచారం సమీక్ష’ పాడ్‌కాస్టుల భాగస్వామ్యం ప్రముఖం. బాహుబలి నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డను సునో ఇండియా ప్రస్థానం ఆకట్టుకుంది. ఈ సంస్థకు తగినంత పెట్టుబడి అందించి ప్రోత్సహిస్తున్నారు. ‘మీడియా అంతా టీఆర్పీలే పరమావధిగా సాగుతున్న సమయంలో, ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందించాలన్న వీరి నిబద్ధత నాకు నచ్చింది’ అంటారు శోభు యార్లగడ్డ. ఇందుకు ఓ కారణం లేకపోలేదు. పాడ్‌కాస్టులు, ఆడియో బుక్స్ లాంటి శ్రవణ మాధ్యమాల మీద ఇంకా ప్రభుత్వాలు కానీ, మీడియా సంస్థలు కానీ దృష్టి సారించలేదు. కాబట్టి ఎవరైనా తాము నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా నాలుగు మాటలను స్వేచ్ఛగా పంచుకునే అరుదైన అవకాశాన్ని ఇవి కల్పిస్తున్నాయి.
అరుదైన వృత్తిలో....
కొన్నాళ్ల క్రితం నేను ముంబైలోని ఓ పాడ్‌కాస్ట్ సంస్థలో చేరాను. ఈ రంగానికి ఉన్న భవిష్యత్తును గమనించి ప్రస్తుతం పూర్తిస్థాయి ‘పాడ్‌కాస్ట్ ప్రొడ్యూసర్'గా మారాను. పాడ్కాస్టులకు సంబంధించిన అన్ని సేవలూ అందిస్తుంటాను. ప్రస్తుతం ‘తెలుగువన్' కోసం క్రికెట్, న్యూస్ పాడ్కాస్టులను రూపొందిస్తున్నాను. నా దృష్టిలో పాడ్కాస్టులను రూపొందించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు రేడియోల్లో వచ్చిన కార్యక్రమాలని డిజిటైజ్ చేసుకోవచ్చు, సంస్థలు తమ బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకునేందుకు పాడ్‌కాస్టులు రూపొందించుకోవచ్చు. బడా కంపెనీలు న్యూస్ లెటర్ల బదులు పాడ్‌కాస్టులు పంపుకోవచ్చు. ఇలాంటి అనేక మార్గాలున్నాయి! ప్రస్తుతానికి తెలుగులో అయితే సరదాగా పాడ్‌కాస్టులు రూపొందించేవారే ఎక్కువగా ఉన్నారు. చాలామంది, ఒక సీజన్ పూర్తయిన తర్వాత మళ్లీ కనిపించడం లేదు. అలా కాకుండా నిరంతరం పాడ్కాస్టులను రూపొందిస్తూ ఉంటే, సరికొత్త మార్పులతో ముందుకు వస్తుంటే శ్రోతల సంఖ్య స్థిరంగా ఉంటుంది. రాబోయే కాలంలో ఆడియో బుక్స్‌కి కూడా మంచి ఆదరణ ఉంటుంది. తెలుగులో జానపద కథలు, పౌరాణిక గాథలకు సంబంధించి అసాధారణమైన కంటెంట్ ఉంది. ఈ శ్రవణ మాధ్యమాలు ప్రభుత్వానికి కూడా చాలా ఉపయోగపడతాయి. గ్రామీణ యువతకి నైపుణ్యాలని కల్పించడం, రైతులకు తగిన సలహాలు అందించడం, తమ పథకాలను ప్రజలకు చేరవేయడం లాంటి లక్ష్యాల కోసం పాడ్‌కాస్టులు, ఆడియోబుక్స్ చాలా ఉపయోగపడతాయి.
- సాయి నిఖిల్
స్క్రీన్ టైమ్
మొబైల్, టెలివిజన్, కంప్యూటర్.. ఇలా ఏదైనా సరే, స్క్రీన్వంకే చూడటాన్ని ‘స్క్రీన్ టైమ్' అంటారు. ఇది చిన్నపిల్లల్లో అయితే రోజు మొత్తం మీద గంటకు మించకూడదనీ, పెద్దల్లో అయితే రెండు గంటలు దాటకూడదనీ ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. కానీ, మన దేశంలో సగటు స్క్రీన్ టైమ్ నాలుగున్నర గంటలు ఉందని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్టు చెబుతున్నది. ఇక కంప్యూటర్ ముందు పనిచేసే వారైతే రోజుకు పది గంటలకు పైగా ఏదో ఒక స్క్రీన్ చూస్తూనే గడిపేస్తున్నారు. ఈ స్క్రీన్ టైమ్వల్ల నిద్ర సరిగా పట్టదనీ, ఊబకాయం వస్తుందనీ, మానసిక సమస్యలు తలెత్తుతాయనీ... ఇలా సవాలక్ష ఉత్పాతాల గురించి హెచ్చరిస్తున్నారు వైద్యులు. పిల్లల మానసిక శారీరక ఎదుగుదల మీదా, చదువుసంధ్యల మీదా ఈ స్క్రీన్ టైమ్ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని తేల్చేశారు. స్క్రీన్ టైమ్ గురించిన అవగాహన పెరుగుతున్న కొద్దీ శ్రవణ మాధ్యమాల పట్ల ఆసక్తి అధికం అవుతున్నది.
స్థానికమే కీలకం
మన దేశంలో ఉన్న భిన్నమైన భాషల కారణంగా, పాడ్‌కాస్ట్ ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్‌గా నిలిచాం. తెలుగులో ఇప్పుడు చాలా పాడ్కాస్టులే వస్తున్నాయి. నాణ్యతాపరంగా మరింత జాగ్రత్త పడితే, వ్యక్తీకరణలో ప్రయోగాలు చేస్తే తిరుగుండదు. మన దగ్గర పాడ్‌కాస్టులు వినే అలవాటు పెరగడానికి లాక్డౌన్ కూడా కొంత సాయపడింది. ఆ సమయంలో మేం అనూహ్యమైన ఎదుగుదలను గమనించాం. ముఖ్యంగా చిన్నపాటి నగరాల ప్రజలు కూడా పాడ్కాస్టులకు అలవాటు పడటం సంతోషించదగ్గ పరిణామం. ఆ మార్పు స్థిరంగా ఉండిపోవడం మరో విశేషం. గత ఐదేండ్లుగా తెలుగులో ఆడియోబుక్స్ పెరిగిపోయాయి. కానీ ఒక సమస్య మాత్రం లేకపోలేదు. డేటా ఇంచుమించు ఉచితంగా దొరుకుతున్న ఈ రోజుల్లో, అందులోని కంటెంట్ కూడా ఉచితంగానే లభించాలనే అపోహలో ఉన్నారు చాలామంది. ఒక నాణ్యమైన సేవని అందించడానికి ఎంతో కృషి అవసరం అన్న విషయాన్ని సమాజం గ్రహించాలి. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఈ శ్రవణ మాధ్యమాలు, అందులో స్థానిక భాషలు నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది.
- పద్మప్రియ (సునో ఇండియా సహ-వ్యవస్థాపకురాలు)
మొదటివాడే కొనసాగుతున్నాడు...
నేను చదువుకునేటప్పుడే మంచి ప్లేస్మెంట్ వచ్చింది. కానీ సివిల్ సర్వీసెస్ మీద మక్కువతో ఆ పరీక్షలు రాయడం మొదలుపెట్టాను. అయిదుసార్లు రాసిన తర్వాత, ఆ పరీక్షలకి సిద్ధమయ్యే ప్రక్రియలోనే చాలా లోటుపాట్లు ఉన్నాయని అర్థమైంది. నేను అనుకున్నది సాధించలేకపోయినా, ఆ అనుభవంతో కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాను. వారాంతాల్లో దిగువ మధ్యతరగతి వాళ్లకి ఉచితంగా క్లాసులు చెప్పేవాడిని. ఇలాంటి సమయంలోనే నాకు పాడ్‌కాస్టుల గురించి తెలిసింది. ఈ మాధ్యమం ద్వారా 2019 నుంచి యూపీఎస్సీ పరీక్షలకు అవసరమయ్యే విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. సీజన్-2లో అంధ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పాడ్‌కాస్టులు రూపొందించాను. ఇక లాక్డౌన్ సమయంలో సీజన్ 3 మొదలుపెట్టి కరెంట్ అఫైర్స్, ప్రభుత్వ పథకాలు లాంటి పాడ్‌కాస్టులు అందించాను. ఇవన్నీ దేశవ్యాప్తంగా చాలాసార్లు ట్రెండింగ్ అయ్యాయి! ఇక నాలుగో సీజన్లో వేర్వేరు ప్రభుత్వ శాఖల అధికారులను గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకూ దాదాపు 60 పాడ్కాస్టులను రూపొందించాను. వీటిని 90వేల మంది విన్నారు. వీటివల్ల ఎంతో మేలు జరిగిందంటూ వందలమంది స్పందించారు. ఇదంతా కూడా నా వ్యక్తిగత ఆసక్తితో చేసిన ప్రయత్నమే!
- దినేష్
వేడివేడిగా..‘పూరి’!
ప్రయాణం చేసేటప్పుడు, పనిలో ఉన్నప్పుడు బోర్ కొట్టకుండా ఉండటం కోసం పాటలు వింటాం. కానీ అమెరికా, జర్మనీల్లో పాటల బదులు పాడ్‌కాస్ట్ వినే సంప్రదాయం పెరిగిపోయింది. మన దగ్గరా ఆ మాధ్యమం అందుబాటులో ఉన్నప్పటికీ మిలీనియల్ తరానికే అది పరిమితమన్న భావన ఉండేది. సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ దానికి ముగింపు పలికారనే చెప్పాలి. ఇది పాడ్కాస్టర్లే ఒప్పుకొంటున్న మాట! లాక్డౌన్ సమయంలో ‘పూరి మ్యూజింగ్స్' మొదలుపెట్టి వందకు పైగా పాడ్కాస్టులను అందించారు పూరీ. యుద్ధం నుంచి శాంతి వరకు, చరిత్ర నుంచి వర్తమానం వరకు తన మనసులో దాచుకున్న ప్రతి భావాన్నీ శ్రోతలతో పంచుకున్నారు. కోట్లమంది శ్రోతలు వీటిని ట్రెండింగ్ చేశారు. ఇదే బాటలో మరో దర్శకుడు హరీష్ శంకర్ మొదలుపెట్టిన ‘సౌండ్స్ గుడ్' పాడ్కాస్టుకి కూడా మంచి స్పందనే వస్తున్నది. ఎవరైనా సరే, తమ ఆలోచనలను పంచుకోవడానికి ఇది ఓ వేదిక అన్న బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది.
తాజావార్తలు
- హిమాచల్‌లో మహమ్మారి కలకలం : మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్!
- జాన్వీకపూర్ కొత్త ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
- రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి కొప్పుల
- టీకా వేసుకున్న రక్షణమంత్రి.. కోవిన్‌లో 50 లక్షల రిజిస్ట్రేషన్లు
- బకాయిలు చెల్లించకున్నా కరెంటు కట్ చేయం : అజిత్ పవార్
- Mi 10T 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీగా ధర తగ్గింపు
- వీడియో : అభినవ పోతన ఈ రైతన్న...
- మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!