ధీర ధీర ధీర..రాపోలు ప్రతిభరా!

తెనాలి రామకృష్ణుడి తెలివితేటలు తెలుసు కదా? కథలు కథలుగా చదివే ఉంటాం. కృష్ణరాయల రాజసం గురించీ వినే ఉంటాం. చదవడం.. వినడం ఓకే. కానీ.. చూసే భాగ్యం లేకపాయెనే.. అనే భావన చాలామందిలో ఉంటుంది. ఆ వెలితిని పూడ్చే ప్రయత్నమే ‘ధీర’. రాయల రాజసాన్ని.. రామకృష్ణుడి చాతుర్యాన్ని.. 12 భాషలలో చూపించి అద్భుతం అనిపించాడు ఈ తెలంగాణ యువకుడు. 1520వ సంవత్సరంలోకి మనల్ని తీసుకెళ్లి.. విజయనగర సామ్రాజ్యంలో వదిలేశాడు బమ్మెర యువతేజం రాపోలు అరుణ్‌కుమార్!
అరుణ్‌కు గణితంలోని ‘థీరం’ బాగా ఇష్టమైన అంశం. థీరం అంటే ‘సిద్ధాంతం’. గణితంపై ఉన్న ఆసక్తితోనే ఇంటర్లో ఎంపీసీ.. డిగ్రీలో ఇంజినీరింగ్‌ను ఆప్షన్‌గా ఎంచుకున్నాడు. తాను చదివిన సిద్ధాంతాల స్ఫూర్తితో సొంతంగా ఒక సిద్ధాంతం రాద్దామని అనుకున్నా అనూహ్యంగా సినిమాల వైపు మళ్లి యానిమేషన్, మోషన్ క్యాప్చరింగ్‌లో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. మూడేండ్ల క్రితం ‘ఎ థీరం’ పేరుతో యానిమేషన్ స్టూడియో ఏర్పాటుచేసి.. తాను నేర్చుకున్న ‘థీరం’ను సినిమాలకు ఎలా అప్లయ్ చేశాడు? ఒక్కడిగా మొదలైన తన ప్రయాణం 50 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎలా వెళ్లింది? ఈ ప్రశ్నలకు జవాబు అరుణ్ మాటల్లోనే..
అతనొక ధీరుడు
వందల ఏండ్లు గడిచాయి. కానీ తెనాలి రామకృష్ణుడిని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటున్నాం. అతడి తెలివితేటలు, సమయస్ఫూర్తి మామూలువి కావు. అంతేకాదు తెనాలి రామకృష్ణుడు ఒక ధీరుడు. రాజ్యాన్ని రక్షించడంలో ఆయన కృషి గొప్పది. నా దృష్టిలో తెనాలి రామకృష్ణుడు పెద్ద హీరో. అందుకే సినిమా టైటిల్ ‘ధీర’కు ట్యాగ్‌లైన్‌గా బుద్ధి, రిద్ధి, సిద్ధి అని పెట్టాను. చిరంజీవి, రజనీకాంత్ వంటి నటుల సినిమాలు చూస్తున్నప్పుడు హీరో వచ్చాక విలన్ ఆగడాలు పోతాయని, ప్రజలకు మంచి జరుగుతుందని నమ్మకం కలిగేది. అవన్నీ కథలే అయినా ఏదో తెలియని అనుభూతి. తెనాలి రామకృష్ణుడి కాలంలో ఇలాంటి సంఘటనలు, సన్నివేశాలు నిజంగా జరిగాయి. శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజకవులను ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నామంటే అందులో తెనాలి రామకృష్ణుడి పాత్రే కీలకం. ఈ నేపథ్యంతోనే ‘ధీర’ తీర్చిదిద్దాను. ఇదొక చారిత్రక కాల్పనిక కథ.
ఇండియాలో మొదటిది
‘ధీర’ను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో చేశాను. గతంలో రజనీకాంత్ కొచ్చాడియన్ (విక్రమసింహ) సినిమా ఈ టెక్నాలజీతోనే వచ్చింది. కాకపోతే అది పూర్తిగా విదేశాల్లోనే షూట్ అయిన చిత్రం. ధీర ఈ టెక్నాలజీతో వచ్చిన మొదటి ఇండియన్ సినిమా. ఒక తెలంగాణ యువకుడిగా ఇలాంటి టెక్నాలజీతో సినిమా చేసినందుకైతే నేను గర్విస్తున్నా. యానిమేషన్ అంటే పిల్లల సినిమా అనే అభిప్రాయం ఉంటుంది. పిల్లలు స్వయంగా సినిమా టాకీసుకు వెళ్లరు. పెద్దవాళ్లు తీసుకెళ్తేనే చూస్తారు. అది పిల్లలకు నచ్చవచ్చు.. నచ్చకపోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఆరేండ్ల నుంచి ఆరవై ఏండ్ల వరకు ప్రతి ఒక్కరికీ నచ్చేలా ధీరను తీర్చిదిద్దాను. 200 పాత్రలతో 12 భాషలలో తీశాను. ప్రతి భాషలోనూ అక్కడి ముఖ్యనటులు తెనాలి రామకృష్ణుడి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. హిందీలో వివేక్ ఒబెరాయ్, తమిళంలో విజయ్ సేతుపతి, తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, కన్నడలో ధ్రువ సర్జా, బెంగాలీలో జీత్, పంజాబీలో స్వజల్జోషి, ఒడియాలో సవ్యసాచిమిశ్రా స్వరం అందించారు. ఒప్పుకుంటారో లేదో అనుకున్నా. కానీ నేను అడిగిన వెంటనే అందరూ అంగీకరించడంతో నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.
అమ్మానాన్నల ప్రోత్సాహం
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర మా ఊరు. నేను ఐదో తరగతి ఉన్నప్పుడు హన్మకొండకు షిఫ్ట్ అయ్యాం. నాన్న చిరు వ్యాపారి. అమ్మ హన్మకొండ ఆర్టీసీ డిపోలో కండక్టర్. గణితంతో పాటు సినిమాలపై అమితాసక్తి ఏర్పడి ప్రతీ సినిమా చూసేవాడిని. చిరంజీవి సినిమాలు బాగా చూసేవాడిని. ఆయన డ్యాన్స్ అంటే ఇష్టం. నేనెప్పుడైనా అలిగితే మావాళ్లు సినిమా చూపించేవాళ్లు. అట్లా కాజిపేట, హన్మకొండ, వరంగల్‌లలో లెక్కలేనన్ని సినిమాలు చూసి ఉంటా. డైరెక్టర్ అవ్వాలనేది నా కల. ఆ కల సాకారం కోసం ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరంలోనే హైదరాబాద్‌కు వచ్చేశాను. అప్పటికే నాకు యానిమేషన్‌పై కొంత పట్టు ఉన్నది. చిన్న చిన్న వీడియోలు రూపొందించేవాడిని. ‘అదీ ఇదీ అని ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావ్. నీకు యానిమేషన్లో మంచి పట్టు ఉంది కదా? దాంట్లోనే పనిచెయ్. సినిమాలకు అది బాగా పనికొస్తుంది’ అని అమ్మానాన్న నన్ను ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతో యానిమేషన్ నేర్చుకొని.. ఏడు నెలలకే అన్నపూర్ణ స్టూడియోలో ఉద్యోగంలో చేరాను.
వరంగల్‌లో స్టూడియో
ప్రపంచ వ్యాప్తంగా యానిమేషన్‌కు గొప్ప భవిష్యత్తు ఉంది. ఈ రంగం బాగా విస్తృతమవుతున్నది. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు నన్ను ప్రత్యేకంగా అభినందించారు. వరంగల్ ఐటీ పార్కులో స్టూడియో నిర్మించేందుకు స్థలం కేటాయించారు. ‘ఎ థీరం’ స్టూడియోను అక్కడ నిర్మించుకుంటా. హైదరాబాద్‌లో అయితే చాలా ఖర్చవుతుంది. ఒకప్పటిలా కాదు ఇప్పుడు. ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది. టెక్నాలజీ అందుబాటులో ఉంది. వరంగల్ నుంచి పని చేసే పరిస్థితి ఉంది. త్రీడీ యానిమేషన్, మోషన్ క్యాప్చర్ రంగంలో పూర్తి స్థాయి వసతులతో వరంగల్‌లో స్టూడియోను నిర్మించడం నా లక్ష్యం. ఇది నాతోపాటు చాలా మందికి ఉపయోపడేలా చేస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది.
ఒక్కో మెట్టు ఎక్కుతూ
అన్నపూర్ణ స్టూడియో, మోషన్ క్యాప్చర్ సంయుక్తంగా అన్నపూర్ణ స్టూడియలోనే యానిమేషన్ కంపెనీని ప్రారంభించాయి. వందల కోట్ల వ్యాపారం నిర్వహించే పెద్దపెద్ద గేమింగ్ కంపెనీల ప్రాజెక్టులు వచ్చేవి. దీంతో నాకు వీడియో గేమ్స్, సినిమాలు చేసే అవకాశం కలిగింది. ఏది చేసినా కొత్తగా ఉండాలనే తపన ఉండేది నాకు. నా తపనకు తగ్గట్టుగా మంచి ఔట్పుట్ రావడంతో కంపెనీలో మంచి గుర్తింపు లభించింది. ఆ గుర్తింపే నన్ను చాలా తక్కువ కాలంలోనే టీమ్‌లీడర్‌గా మార్చింది. కొత్తగా చేరినవారి ప్రాజెక్టులను పరిశీలించే స్థాయికి తీసుకెళ్లింది. దీంతో క్తొత ప్రాజెక్టు ఏది చేసినా మరింత కొత్తగా.. ప్రయోగాత్మకంగా చేయాలనే కసి నాలో ఏర్పడింది. యూఏ, టీహెచ్క్యూ, హౌజ్ ఆఫ్ మూవీస్, యూబీస్టాఫ్ స్టూడియోస్, రాక్‌స్టార్ స్టూడియోస్ వంటి అంతర్జాతీయ గేమింగ్ సంస్థల ప్రాజెక్టులకు పనిచేశా. 2011లో ఆ కంపెనీ కెనడాకు వెళ్లిపోయినా నాకు ప్రాజెక్టులు వచ్చేవి. కొన్ని కంపెనీలు డైరెక్టుగా నాకు అవకాశం ఇచ్చేవి. యానిమేషన్ వర్క్ చేస్తూనే ‘మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్'లో డైరెక్షన్లో, అన్నపూర్ణ స్టూడియోలో స్క్రీన్‌ప్లే రైటింగ్ కోర్సులు చేశాను. అన్నపూర్ణ స్టూడియోలో యానిమేషన్ పనులు చేస్తూనే, అక్కడ జరిగే సినిమా షూటింగ్‌లను గమనిస్తుండేవాడిని. ఇవన్నీ నేను డైరెక్షన్ చేయగలననే నమ్మకాన్ని రెట్టింపు చేశాయి.
-పిన్నింటి గోపాల్
తాజావార్తలు
- సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఇతగాడే
- బంగారంపై మోజు పెరుగుతుంటే ధరలు తగ్గుతున్నాయ్.. ఎందుకంటే?!
- వేములవాడలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా
- పవన్‌తో నాకు ముడి పెడితే తాట తీస్తా: అశు రెడ్డి
- 9 నుంచి శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేక బస్సులు
- పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మాజీ పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’
- టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకే పీఆర్టీయూ మద్దతు
- మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..?
- సెకండ్ డోస్ తీసుకున్నాక.. కరోనా సోకింది..!
- మమతపై సువెందు పోటీ.. 57 మందితో బీజేపీ తొలి జాబితా