శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sunday - Jan 23, 2021 , 23:25:31

రాత్రి పనితో.. సంతానలేమి!

రాత్రి పనితో.. సంతానలేమి!

అప్పట్లో ఎవరో ఒక రాజు.. రాత్రిని పగలుగానూ, పగలును రాత్రిగానూ చేశాడట. 30, 40 ఏండ్ల క్రితం ఇదొక సరదా కథగానే ఉండేది. ఇప్పుడది పెద్ద విషయమే కాదు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్‌ రంగం అభివృద్ధి చెందిన తరువాత రాత్రిపూట ఆఫీసులకు వెళ్లడం సర్వసాధారణం అయిపోయింది. కానీ, ఇలా పగటి పూట పడుకోవడం, రాత్రిపూట పనిచేయడం మన శరీరంపై అనేక రకాలుగా ప్రభావం చూపిస్తుంది. వాటిలో ఒకటి ఫర్టిలిటీ. 

ఏదైనా ఓ పద్ధతి ప్రకారం జరగాలి. మన శరీరంలో  జీవక్రియలన్నీ కూడా ఓ సమయం ప్రకారం జరుగుతాయి. దీన్నే మనం జీవగడియారంగా భావిస్తాం. ఈ జీవగడియారాన్ని డిస్ట్రబ్‌ చేస్తే మెటబాలిజమ్‌ అంతా అడ్డదిడ్డం అయిపోతుంది. పడుకోవాల్సిన సమయంలో పనిచేయడం, పనిచేసుకోవాల్సిన టైంలో పడుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితే ఏర్పడుతున్నది. అందుకే ఎక్కువమందిలో ఫర్టిలిటీ సమస్యలు కనిపిస్తున్నాయంటున్నాయి అధ్యయనాలు.రాత్రిపూట ఉద్యోగం చేసే మహిళల్లో అండం విడుదలలో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. అండాశయంలో నీటితిత్తులు ఏర్పడి అండోత్పత్తి జరగడం లేదు. అలా ఆడవాళ్లు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక మగవాళ్లలో రాత్రి రకరకాల షిఫ్టుల్లో పని చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా శృంగారంపై ఆసక్తి పోతున్నది. వీర్యకణాల సంఖ్య కూడా తగ్గుతున్నది. దీనికి ఊబకాయం తోడైతే వీర్యకణాల నాణ్యత దెబ్బతినడమే కాకుండా అంగస్తంభన సమస్యలు కూడా వస్తున్నాయని హెచ్చరిస్తున్నాయి అధ్యయనాలు.

ట్రాఫిక్‌లో.. గుండె భద్రం!

హైదరాబాద్‌లాంటి మహానగరాల్లో ట్రాఫిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది. ఎక్కువ కాలం ట్రాఫిక్‌కి ఎక్స్‌పోజ్‌ అయితే గుండె ప్రమాదంలో పడుతుందంటున్నారు పరిశోధకులు. సిగరెట్లు తాగితే గుండెకు ఎంత ప్రమాదమో, ఇలా వాహనాల వల్ల విడుదలయ్యే హానికర వాయువులను పీల్చడం వల్ల కూడా గుండె అంతకన్నా ఎక్కువ రిస్కులో పడుతుందంటున్నారు. రకరకాల కాలుష్య కారకాలతో గుండె రక్తనాళాలు గట్టి పడటమే ఇందుకు కారణమంటున్నారు పరిశోధకులు. డూయిస్‌బర్గ్‌-ఎస్సెన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు హాఫ్‌మాన్‌ మహారద్దీగా ఉండే నగరాలపై చేసిన అధ్యయనాల్లో ఈ విషయం స్పష్టమైంది. పొగతాగడం ద్వారా వచ్చే గుండెపోట్లతో పోలిస్తే కాలుష్యాలతో వచ్చే గుండె పోట్ల సంఖ్య రెట్టింపుగా ఉంటున్నదని అంటున్నారాయన. ప్రధానంగా వాహనాల పొగతో ఏర్పడే కాలుష్యాలే రక్తనాళాలకు ఎక్కువ హాని చేస్తాయని ఆయన పేర్కొన్నారు. మధుమేహం, పొగతాగే అలవాటు ఉన్నవారు ఈ కాలుష్యాల్లో తిరిగితే గుండెపోటు వచ్చే ప్రమాదం మరింత ఎక్కువని, దీనికి తోడు వాహనాల రణగొణ ధ్వనులు అధిక రక్తపోటును కలిగిస్తున్నాయని అంటున్నారాయన. వేడి టీ.. డేంజర్‌!

చాయ్‌ అంటే వేడిగానే తాగాలి. కొందరైతే ఏ మాత్రం చల్లారినా ఒక్క చుక్కకూడా నోట్లో పోయరు. అయితే అతిగా వేడిగా ఉన్న టీ గానీ, కాఫీ గానీ తాగితే ప్రమాదమంటున్నాయి అధ్యయనాలు. వేడిగా ఉండే చాయ్‌ రిలాక్సేషన్‌ని ఇస్తుందేమోగానీ అది ఆరోగ్యానికి ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇటీవల జరిగిన అధ్యయనాలు కూడా హెచ్చరిస్తున్నాయి. టీలో యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి కొంతవరకు ఆరోగ్యకరమే. కానీ, అతివేడి టీ తాగితే క్యాన్సర్‌ రిస్కు ఉంటుందంటున్నాయి ఈ అధ్యయనాలు. ఇటీవల జరిగిన పరిశోధన ప్రకారం ధూమపానం, మద్యపానంతో పాటు వేడివేడి టీ, కాఫీలు కూడా క్యాన్సర్‌కు కాక్‌టెయిల్‌ అవుతాయని తేలింది. ఇలాంటివాళ్లలో అన్నవాహిక క్యాన్సర్‌ రిస్కు అయిదొంతులు ఎక్కువ. 30 నుంచి 79 ఏండ్ల మధ్యనున్న సుమారు 4.50 లక్షల మందిపై తొమ్మిదేండ్లు అధ్యయనం చేసిన తరువాత ఈ విషయం తేల్చారు పరిశోధకులు. అతి వేడి పానీయాల వల్ల అన్నవాహిక కణాలు దెబ్బతిని క్యాన్సర్‌కు దారితీస్తున్నాయని సౌత్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు కూడా అంటున్నారు. 50 వేల మందిపై పదేండ్లపాటు చేసిన మరో అధ్యయనంలో వేడి వేడి టీ, కాఫీల వల్ల 317 మందికి అన్నవాహిక క్యాన్సర్‌ వచ్చినట్టు తేలింది. రోజూ 700 మి.లీ. వేడివేడి టీని (60 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్నది) తాగేవారిలో 90 శాతం వరకు అన్నవాహిక క్యాన్సర్‌ ప్రమాదం ఉన్నట్టు ఈ పరిశోధన చెప్తున్నది. గోరువెచ్చని టీ గానీ, కాఫీగానీ తాగితే మాత్రం లివర్‌ క్యాన్సర్‌ ప్రమాదం 15 శాతం తగ్గుతుందని లాన్సెట్‌ ఆంకాలజీ పత్రికలో ప్రచురితమైంది. అందుకే, చాయ్‌ వేడిగా తాగేఅలవాటు ఉంటే వెంటనే మానుకోండి.


VIDEOS

logo