శనివారం 06 మార్చి 2021
Sunday - Jan 23, 2021 , 23:14:29

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

కొత్త ధారావాహిక 3

జరిగిన కథ

వేదాలకు మూలమైన దేవుడు.. కథా నాయకుడై పురాణాలను నడిపించిన పరంధాముడు.. మనిషిలోని మృగ ప్రవృత్తిని పోగొట్టడానికి నరమృగావతారం ఎత్తిన మహా విష్ణువు.. తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో  తెలియజేస్తాడు.  ఆ ఆనంద పారవశ్యంలో మైమరచి పోతాడు రామభట్టు. దట్టమైన అడవి మధ్యలో, ఓ కొండ మీది ప్రాచీన ఆలయంలో  వెలిసిన స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు. అదే సమయంలో రారాజు ్రత్రిభువన మల్లుడు మంత్రి, సామంత, దండనాయకులతో తన మనసులోని భయాలను పంచుకుంటూ ఉంటాడు.ఆ తర్వాత?

-అల్లాణి శ్రీధర్‌


ఓమ్‌ నమో శ్రీనారసింహాయ!

తెల్లటి వస్త్రంపై ఎర్రటి అక్షరాలను చూస్తుంటే, త్రిభువన చక్రవర్తికి ఏమీ అర్థం కాలేదు. 

ఎవరీ రామభట్టు? ఎందుకు తన దర్శనం కోసం అంతగా ప్రయత్నించాడు. తనకు ఏం చెప్పదలిచాడు?

 స్వామివారి దశావతారాల్లో ఉగ్రరూపమైన నారసింహదేవుని ప్రస్తావన అసంకల్పితంగా ఎందుకు తన ముందుకు వస్తున్నది?

‘ఓమ్‌ నమో శ్రీనారసింహాయ’ అప్రయత్నంగా తనలో తానే స్వామి వారి నామాన్ని తలిచాడు. 

‘ఎక్కడ? రామభట్టు ఎక్కడ? వెంటనే మా ముందు ప్రవేశపెట్టండి’ కఠినమైన స్వరంతో ఆదేశించాడు. 

ఆ ఆదేశంతో వెళ్లిన దళపతి, విల్లు నుంచి వొదిలిన బాణంలా క్షణాల్లో వెనక్కివచ్చాడు.

‘ప్రభువులు క్షమించాలి. ఆ మనిషి కనిపించడం లేదు. సమయమిస్తే వెదికి పట్టుకుంటాం. తమ సమక్షంలో నిలబెడతాం’

 దళపతి మాటలు విని తల పంకించాడు. సాలోచనగా ఆంతరంగిక మందిరం వైపు కదిలాడు.

‘మహారాణీ!’

పిలుపు విని తలెత్తి చూసింది మహారాణి చంద్రలేఖ.

‘ప్రభూ!’

కనుల లోంచి జారబోతున్న కన్నీటి బిందువులను అక్కడే అదిమి పట్టి.. తలదించుకున్నది.

‘గుండె గొంతుకలో సుడులు తిరిగే వేదన, అణచి వేసే ప్రయత్నం చేస్తే అదుపులో ఉంటుందా దేవీ! బాధ  బయటపడితేనే మంచిది కదా!

ఆమెను అనునయించే ప్రయత్నం చేశాడు. కానీ, ఆయనకూ సాధ్యం కాలేదు. 

“ప్రభూ! పసిపిల్లవాడు. బాధతో అల్లల్లాడి పోతున్నాడు. భరించే శక్తిలేని లేత వయసు. రాజవైద్యులవారు త్వరలోనే నయమవుతుందని అంటున్నారు. 

అంతవరకూ..”

ఈసారి దుఃఖం అదుపు తప్పి.. ఆమె మాటల్లోనూ ప్రవహించింది. 

అంతవరకూ.. అంటే ఎంతవరకూ?

సకల శాస్త్ర పారంగతురాలు, సర్వకళా శోభితురాలు, కార్యేషుమంత్రి వంటి ధీర.. తన భార్య!

కానీ, ఇప్పడొక మాతృమూర్తి. కొడుకు క్షేమం కోసం తల్లడిల్లిపోతున్న ఒక తల్లి మాత్రమే!

‘భయపడవలసిందేమీ లేదు. త్వరలోనే ఈ రుగ్మత తొలగిపోతుంది’.

‘నిజమా ప్రభూ! మన కుమారుడు మళ్లీ మన కండ్ల ముందు క్రీడోత్సాహంతో పరుగులు తీస్తాడా? మునుపటిలా ఉత్సాహంతో సకల విద్యలూ నేర్చుకుంటాడా?’

ఆశగా అడిగింది.

‘తెలియదు, దేవీ’

ఆ మాటతో, నోట మాట రాలేదు.

‘ఏమంటున్నారు, ప్రభూ!’

‘నిజం తెలుసుకుంటున్నాను. భ్రమలు పెంచుకోవద్దంటున్నాను. బిడ్డ పుట్టడానికి ముందు, నా ముందు జీవ చైతన్యంతో నడయాడిన చంద్రలేఖలా ఉండి పొమ్మంటున్నాను. 

ఇది ఆవేశం కాదు. ఆదేశం కూడా కాదు. 

త్రిభువనాల మీద ఆధిపత్యం కలిగిన జగజ్జేత కూడా, జనన మరణాలపై అదుపు లేని అసహాయుడే అని గుర్తుంచుకోమంటున్నాను’

ఒక్కసారి, కనుల ముందున్న ప్రపంచం తలకిందులైంది ఆ ఇల్లాలికి.

కుమారుడిని దక్కించుకోలేని ఈ రాజ్యమెందుకు? ఈ వైభవమెందుకు?

అసలు ఈ జీవితమే ఎందుకు? వృథా, వృథా! 

కుప్పకూలిపోతుండగా, పొదివి పట్టుకొని తన దగ్గరకు తీసుకున్నాడు.. త్రిభువనుడు.

తాను అన్న మాటలు ఆమె హృదయాన్ని గాయపరుస్తాయని తెలుసు. తెలిసే అనవలసి వచ్చింది. జరుగుతుందని తెలిసినప్పుడు ఏం జరిగినా తట్టుకొనే శక్తి ఉండాలి. 

‘ప్రాణాలు పోవచ్చు’ అన్న స్పృహతో ఉంటేనే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. అది యుద్ధమైనా, వైద్యమైనా!

“ప్రభూ! ఒక్కమాట. కుమారుని వియోగాన్ని తట్టుకొనే శక్తి నాకు లేదు. వాడు వెళ్లిపోతే వాడితోపాటే నేనూ ఈ లోకం నుంచి వెళ్లిపోతాను. ఎందుకు చెప్తున్నానంటే, మీరు శక్తిమంతులు గనుక. మీరు మా ఇద్దరి వియోగాన్నీ భరించి ఉండగలరు. ఉంటారు!”

దుఃఖంతో తన సతీమణి పలికిన పలుకులు విన్నాడు. 

నిజమే.. తను ఉండాలి. ఈ తనువు ఉండాలి. తన కోసం కాదు, తన ప్రజల కోసం.

రాజ్యపాలన అంటే రాతి గుండెలా మారడం.

రాజ్యపాలన అంటే రాగద్వేషాలు లేకుండా ఉండటం. 

పరిపాలన చేసేవాడికి గతమూ, వ్యక్తిగతమూ ఉండకూడదు. దురాశ, నిరాశ ఉండకూడదు. 

ప్రజలందరి బాధ తన బాధ.

ప్రజలందరి సంతోషం తన సంతోషం. 

అంతే తప్ప, తనకు ప్రత్యేకంగా సంతోషం కానీ, దుఃఖం కానీ ఉండవు. ఉండకూడదు. 

గుండె గట్టి చేసుకున్నాడు. 

నిద్రలోనూ బాధను అనుభవిస్తున్న కుమారుడినీ, మెలకువ కూడా ఒక కలలా భావిస్తున్న భార్యనూ చూశాడు.

ఇప్పుడు రెండు యుద్ధాలు ఏక కాలంలో చేయాలి. 

తన కనుల ముందే కొడుకు మీదకు ముంచుకొస్తున్న మృత్యువుతో..

తన పాలన కాలంలోనే రాజ్యం మీదకు దండెత్తి వస్తున్న ఒక బలమైన శత్రువుతో...!

‘యాడున్నవో నా తండ్రీ..

యాది మరువని వాడా..

గుహలోపల ఉండి..

గుర్రుమనెటోడా..

కొండలల్ల నిలుచుండి

మా బతుకు నడిపెటోడా..

అడివిలనే నువ్వుంటే 

అవని ఆగమయిపోదా?

ఎట్ల చేరాలె నిన్ను.. 

ఎట్ల కొలువాలె నిన్ను..

యాడున్నవో నా తండ్రి..

యాది మారువనోడా’

విచిత్ర వస్త్రధారణతో ఉన్న ఒక ఎత్తయిన మనిషి పెద్దగా పాడుకుంటూ రాజవీధుల్లో తిరుగుతున్నాడు.  

తైల సంస్కారం లేని జడలు కట్టిన జుట్టు, వొంటిమీద ఒక మాసిపోయిన పంచె, చేతిలో ఒంకలు తిరిగిన కర్ర. భయం గొలిపే చూపులతో తన్మయత్వంతో పాడుతున్నాడు. 

అతన్ని చూసి, పురజనులు భయంతో పక్కకు తప్పుకుంటున్నారు.

అదే మార్గంలో వొస్తున్న దండనాయకుడు, అతని వాలకం చూసి గుర్రం ఆపి.. అదిలించాడు.‘ఏయ్‌, ఎవర్నువ్వు?’

‘నేనెవరో నాకు తెల్సుగని నువ్వెవరో నీకు తెల్సా?’ నవ్వుతూ అంటూ, తన చేతిలో ఉన్న కర్రతో తనను తానే కొట్టుకున్నాడు.

అతని మాట వింటుంటే చర్రున కోపం వచ్చి గుర్రం మీద నుంచి దిగాడు దండ నాయకుడు. ఒరలోంచి కత్తి తీసి అతని మెడ మీద పెట్టాడు.

‘ఇప్పుడు చెప్పు.. ఎవర్నువు.. సరిగా చెప్పు? లేదంటే నీ తల తెగి పడుతుంది’ 

‘నా పేరు చెప్పాల్నా?’ బాగా యాది పెట్టుకో! యాదయ్య మా అయ్య.. అయ్య పేరు వింటే హడలి చస్తవ్‌' అంటూ ఎగిరి దండనాయకుడి గుండెపైన బలంగా తన్నాడు.

‘హా.. చస్తి’

వెనక్కు విరుచుకు పడిపోయాడు దండనాయకుడు.

‘నీ అయ్యకు చెప్పు. పెద్దయ్య పిలుస్తున్నాడు. తప్పక కలువాలె.. యాది పెట్టుకో’

అరుస్తూ ఆ దృఢమైన వ్యక్తి శరవేగంతో.. అడవి మార్గంలో కలిసిపోయాడు.

దండనాయకుడు చెప్పిందంతా విన్న త్రిభువనమల్లుడు తనకు ఎదురైన దృష్టాంతాలన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు. 

‘దండ నాయకా! ఆ మనిషి ఎటువైపు వెళ్లాడు?’

‘అడవి మార్గంలోకి వెళ్లిపోయాడు ప్రభూ. బహుశా అడవి మనిషి అయ్యుంటాడు. సైనిక దళాలను పంపి వెతికి పట్టుకుంటాం’ వినయంగా, భయంగా చెప్పాడు.

త్రిభువన చక్రవర్తి సాలోచనగా తలపంకించాడు. వెతికి పట్టుకోవలసింది వ్యక్తులను కాదు. వారు వ్యక్తీకరించిన సంకేతాలను! మనకు తెలియని ఏదో అదృశ్యశక్తి పంపిన సందేశాలను!

సందేహం లేదు. మంచో చెడో, ఏదో ఒక బలీయమైన శక్తి త్వరలో తనను ప్రభావితం చేయనున్నది.రాజ్యం క్షేమంగా ఉండాలంటే, అడుగు ముందుకే పడాలి. 

రాణీగారి మందిరంలో నుంచి వేద పండితుల శాంతిమంత్రం వినిపిస్తున్నది. 

ఓం భద్రం కర్ణేభిః శృణుయానుదేవాః

భద్రం పశ్యేనూక్షభిర్య జత్రాః

స్థిరై రంగైస్తుష్టు వాగ్‌ం సన్తనూభిః

ర్వశేమ దేవహితం యుదాయుః

ఈ మంత్రార్థం తనకు అవగతమే.

‘దేవతలారా.. మేమెప్పుడూ భద్రమైనవే మా చెవులతో విందుము గాక! కన్నులలో భద్రమైనవే చూచెదముగాకా ! మీ గుణకీర్తనము చేసే మేము మా పూర్ణజీవిత కాలాన్ని  దృఢ గాత్రులమై ఆరోగ్యంగా జీవించెదము గాక! త్రిభువన చక్రవర్తి సాలోచనగా తలపంకించాడు. వెతికి పట్టుకోవలసింది వ్యక్తులను కాదు. వారు వ్యక్తీకరించిన సంకేతాలను! మనకు తెలియని ఏదో అదృశ్యశక్తి పంపిన సందేశాలను! సందేహం లేదు. మంచో చెడో, ఏదో ఒక బలీయమైన శక్తి త్వరలో తనను ప్రభావితం చేయనున్నది. రాజ్యం క్షేమంగా ఉండాలంటే, అడుగు ముందుకే పడాలి. రాణీగారి మందిరంలో నుంచి వేద పండితుల శాంతిమంత్రం వినిపిస్తున్నది.

VIDEOS

logo