గురువారం 25 ఫిబ్రవరి 2021
Sunday - Jan 16, 2021 , 22:46:32

దేనికైనా.. ఓ లెక్క ఉంటుంది!

దేనికైనా.. ఓ లెక్క ఉంటుంది!

సూర్యుడి తొలి కిరణం నుంచి... తారల మిణుకుల వరకు... జీవితం ఎవరి ప్రమేయమూ లేకుండా సాదాసీదాగా గడిచిపోతున్నట్టు ఉంటుంది. కానీ ఆ బతుకుబండి నడక వెనుక ఎన్నో లెక్కలు ఉంటాయి. ‘ఇదంతా పైవాడి లీల’ అని కొందరు అనుకుంటే.. ‘ప్రాబబిలిటీ’ (సంభావ్యత) అని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతారు. ఈ అనంత విశ్వంలో ఒక్క భూమి మీద మాత్రమే జీవి ఉండటానికి కారణం ఆ సంభావ్యతే! సూర్యుడి నుంచి తగినంత దూరంలో ఉండటం, భూమి తిరిగే వాలు, వేగం, ప్రాణవాయువు శాతం... ఇలా సవాలక్ష అంశాలు కలిసి రావడం వల్లే మనిషి మనుగడ సాగుతున్నదని ఒక వాదన. కాస్త జాగ్రత్తగా గమనిస్తే... సమస్త ప్రకృతి వెనుకా ఏదో ఒక లెక్క కనిపిస్తూనే ఉంటుంది. ఆ కోవలోకే వస్తుంది ‘పరెటొ సిద్ధాంతం’. దీన్ని కనుక అవగాహన చేసుకుంటే... ఉత్పత్తి, వ్యాపారం, సమయపాలన లాంటి ఎన్నో కోణాలలో అనూహ్యమైన ఫలితాలు సాధించవచ్చన్నది నిపుణుల మాట.

బడి పిల్లవాడిని పట్టుకుని... ‘పెద్దయ్యాక నువ్వేం అవుతావు’ అని అడిగితే, ఎవరూ ‘గుమస్తా అవుతాను’ అని చెప్పరు. సైంటిస్ట్‌, డాక్టర్‌, ప్రధానమంత్రి అంటూ ఊరించే జవాబులే వినిపిస్తాయి. కానీ ఈ ప్రపంచంలో కొద్దిమంది మాత్రమే విజేతలుగా నిలుస్తారు. మిగతావాళ్లు... వాళ్లను ఆరాధిస్తూ, అనుసరిస్తూ గడిపేస్తారు. ఇందుకు, కారణాలు చాలానే ఉండవచ్చు. పట్టుదల లేకపోవడం, పరిస్థితులు కలిసిరాకపోవడం, నిర్ణయాలలో లోపం, అనారోగ్యం, వైఫల్యాలు.. లాంటి సవాలక్ష సవాళ్లు ఉంటాయి. వాటి నుంచి తప్పించి ముందుకు నడిపించేంత దొడ్డ మనసు జీవితానికి ఉండదు. ఇవన్నీ, లోతుగా గమనిస్తే అర్థమయ్యే విషయాలే. కానీ ఈ విజయ సూత్రానికి ఓ నిష్పత్తి ఉంటుందనీ, అది మనుషులకు మాత్రమే కాకుండా, మన చుట్టూ ఉండే ప్రకృతికి కూడా వర్తిస్తుందనీ గ్రహించినవాడు విల్‌ఫ్రడో పరెటొ!

ముసోలినీ మురిసేలా

విల్‌ఫ్రడో పరెటొ.. ఫ్రాన్స్‌ జాతీయుడు. తండ్రి సంపన్న కుటుంబానికి చెందిన సివిల్‌ ఇంజినీరు. పరెటొ అదే బాటలో నడిచాడు. సివిల్‌ ఇంజినీరుగా మారాడు. కానీ భవన నిర్మాణం కంటే సమాజ నిర్మాణం మీదే ధ్యాస పెరిగింది. పౌరులకు ఆర్థిక స్వేచ్ఛ ఎక్కువగా ఉండాలనే ‘క్లాసికల్‌ లిబరలిజమ్‌' వైపు మొగ్గుచూపాడు. ఆర్థికవేత్తగా మారాడు. అప్పటివరకూ ఆర్థికశాస్త్రం అంటే సమాజం, ఉత్పత్తి, వనరులు అంటూ పెద్దపెద్ద విషయాల మీదే దృష్టి ఉండేది (మేక్రో ఎకనామిక్స్‌). ఆ ఆర్థిక వ్యవస్థలో భాగంగా మన వ్యక్తిగత జీవితాలు, చిన్నచిన్న సంస్థల ప్రభావం ఏమిటి? అనే స్థాయిలో సూక్ష్మ అర్థశాస్ర్తానికి (మైక్రో ఎకనామిక్స్‌) దారితీసిన వాళ్లలో పరెటొ ఒకరు. ఇక అసలు కథలోకి వస్తే, పరెటొకి తోటపని అంటే చాలా ఇష్టం. అలా తోటపని చేస్తుండగా ఓసారి... బఠాణీగింజల గురించి ఆయనకు ఓ విషయం ప్రస్ఫుటంగా తోచింది. తన పెరట్లోని బఠానీ గింజల్లో అయిదో వంతు మాత్రమే, విత్తనాలుగా ఉపయోగపడుతున్నాయి. 80 శాతం నిష్ఫలంగా మిగిలిపోతున్నాయి. ఈ 20:80 నిష్పత్తిని ఆర్థిక వ్యవస్థకు కూడా అన్వయించి చూశాడు పరెటొ. ఆశ్చర్యం! ఇటలీలో 80 శాతం భూములు 20 శాతం వ్యక్తుల చేతిలోనే కనిపించాయి.

పరెటొ ఒక కొత్త విషయాన్ని కనుగొన్నా, తన ఆలోచన కొన్ని పరిమితులకు లోబడి ఉండిపోయింది. ఈ 80:20 నిష్పత్తి కేవలం ఆర్థిక శాస్ర్తానికి, ఆధికారానికి మాత్రమే అన్వయించాడు. అంతేకాదు! ఆ 20 శాతంలోకి చేరేందుకు మానవప్రయత్నం కూడా ఉంటుందనే విషయానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రజాస్వామ్యం లాంటి విలువల పట్ల తనకు నమ్మకమే లేదు. కొంతమంది పేదలుగా ఉండిపోతారు- వాళ్ల ఖర్మ! కొంతమంది అధికారం చెలాయిస్తారు- వాళ్ల బలం! ఇవన్నీ చాలా సహజం... అన్నట్టే ఉండేవి తన ఆలోచనలు. అందుకేనేమో, తన ఉక్కు పిడికిలితో ప్రపంచాన్నే గడగడలాడించిన ఫాసిస్ట్‌ నాయకుడు ముసోలినీ మీద పరెటొ ప్రభావం కూడా ఉందని చెబుతారు.జపాన్‌ మెరిసేలా

పరెటొ తర్వాత జోసెఫ్‌ జురాన్‌ (రొమేనియా) అనే మేనేజ్‌మెంట్‌ శిక్షకుడు ఈ సూత్రాన్ని ఉత్పత్తికీ, వ్యాపారానికీ అన్వయించడంతో ‘పరెటొ సిద్ధాంతం’ పలువురి దృష్టిని ఆకర్షించింది. ఉత్పత్తి రంగంలో దశాబ్దాల అనుభవంతో జోసెఫ్‌ గమనించిందేమిటంటే... ఉత్పత్తులలో 80 శాతం లోపాలకు 20 శాతం సమస్యలే కారణం! అలాగే సంస్థలోని  20 శాతం ప్రతిభావంతుల వల్లే, 80 శాతం లక్ష్యాలు సాధించగలుగుతున్నారు. ఇక మార్కెటింగ్‌ రంగంలోనూ 20శాతం కస్టమర్లే, 80 శాతం లాభాలను అందిస్తున్నారు. ఆ 20 లోపాల మీద దృష్టి పెట్టాలనీ, ప్రతిభావంతులైన ఉద్యోగులను గుర్తించి ప్రోత్సహించాలనీ, లాభాలను అందించే కస్టమర్లను మరింతగా ఆకర్షించాలనీ జురాన్‌ పిలుపునిచ్చాడు. జురాన్‌ మాటలను పాశ్చాత్య దేశాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ రెండో ప్రపంచయుద్ధంలో దారుణంగా నష్టపోయి కొత్త రెక్కల కోసం పరితపిస్తున్న జపాన్‌ పారిశ్రామికవేత్తలకు, పరెటొ సిద్ధాంతం కొత్త ఆశలు కల్పించింది. జురాన్‌ను జపాన్‌ పిలిపించుకుని, తన సలహాలకు అనుగుణంగా పరిశ్రమల్లో మార్పులు చేయడం మొదలుపెట్టారు. క్రమంగా మేడ్‌ ఇన్‌ జపాన్‌ ఉత్పత్తులు, క్షిపణుల్లాగా ఖండాలను దాటుకు పోవడం మొదలుపెట్టాయి. అప్పుడిక నాలుక కరుచుకున్న అమెరికా, జురాన్‌ను తన దేశానికి ఆహ్వానించింది.

అన్ని చోట్లా..

క్రమంగా పరెటొ సిద్ధాంతాన్ని ప్రతి రంగానికీ విస్తరించడం మొదలుపెట్టారు. 80 శాతం అసాంఘిక కార్యకలాపాలకు కారణం 20 శాతం నేరస్తులే అని న్యూజిలాండ్‌లో జరిగిన ‘డునెడిన్‌ స్టడీ’ అనే పరిశోధన తేల్చింది. ఫ్యాక్టరీలలో జరిగే 80 శాతం ప్రమాదాలకు మూలం 20 శాతం కారణాలే అని డాక్టర్‌ ఉడ్‌కుక్‌ అనే టొరెంటో పరిశోధకురాలు హెచ్చరించారు. అమెరికాలోని The Agency for Healthcare Research and Quality అనే సంస్థ అంచనా ప్రకారం, ఆరోగ్యరంగంలో 80 శాతం ఖర్చులు 20 శాతం రోగుల నుంచే వస్తున్నాయి. క్రీడల్లో విజయం సాధించేవాళ్లు, యూట్యూబ్‌లో ఎక్కువ వీక్షణలను అందుకునే వీడియోలు... అన్నీ పరెటొ సిద్ధాంతానికి అనుగుణంగా కనిపిస్తాయి. 

‘విధి’విధానం మారాలి

ఉన్నతమైన లక్ష్యం ఉంటే దానికోసం గొడ్డు చాకిరీ చేయాల్సిందే అనీ... క్షణం తీరిక లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా, చిన్నచిన్న సుఖాలను సైతం లెక్కచేయకుండా... జీవితాన్ని పణంగా పెట్టి అనుకున్నది సాధించాలని మనలో ఉన్న ఓ బలమైన అభిప్రాయం. కానీ ఇది తప్పంటారు రిచర్డ్‌. ఆర్కిమెడిస్‌ సిద్ధాంతానికి బీజం నీళ్లతొట్టెలో పడింది. న్యూటన్‌ హాయిగా యాపిల్‌ చెట్టుకింద కూర్చుని ఉన్నప్పుడే గురుత్వాకర్షణ గుట్టు తేలింది. మన వనరులను తెలివిగా వినియోగించుకుంటే, లక్ష్యాన్ని చేరుకునే దారిపట్ల సరైన ప్రణాళిక ఉంటే, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం దక్కుతుందని భరోసా ఇస్తాడు. ఇందుకు 80:20 సిద్ధాంతాన్ని వాడమని ప్రోత్సహిస్తాడు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నిదారులు ఉన్నాయి? వాటిలో సులువుగా, మన పనితీరుకు అనుగుణంగా ఉన్నదేది? అన్నది ఎంచుకుంటూ తర్కంతో లక్ష్యాన్ని గురిచూడాలంటాడు. పిట్టకన్నుకి మాత్రమే గురిపెట్టాడు కాబట్టి అర్జునుడు విశ్వవిజేత అయ్యాడు. చెట్టుని గమనించేవాడు, చిగురుటాకుకి సైతం చలిస్తాడు. ఇదీ రిచర్డ్‌ సూచనలోని సారాంశం.

వ్యాపారం సులభతరం కావాలి! 

ఏదైనా ప్రక్రియ సంక్లిష్టం అయ్యేకొద్దీ సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువ. కాబటి,్ట వ్యాపారం ఎదుగుతున్న కొద్దీ, దాని పనితీరు మరింత సులభతరం కావాలి. అద్భుతాల్ని సృష్టించాలంటే అయోమయాన్ని దూరం చేసుకోవాలి. ఏ పని నుంచి, ఏ ఉద్యోగి నుంచి లాభం వస్తున్నదో అంచనా వేసి.. వారి మీదే దృష్టి పెట్టాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు, కస్టమర్లకు కూడా పరెటొ సూత్రం వర్తిస్తుంది. కనుక ఎక్కువ లాభాలను అందించే కస్టమర్లను వీలైనంత త్వరగా గుర్తించే ప్రయత్నం చేయాలి. ఉత్పత్తికి సంబంధించి వాళ్ల అభిప్రాయాలను, అవసరాలను ఎప్పటికప్పుడు గమనించాలి. వాళ్లతో సుదీర్ఘమైన అనుబంధం కొనసాగించే ప్రయత్నం చేయాలి. సంస్థలో ఉద్యోగుల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తే అవసరం. చాలా సందర్భాలలో పనికిమాలినవాళ్లకి ఎక్కువ జీతాలు, పదోన్నతులు ముడతాయనీ... కష్టపడేవారి బతుకు  ఎక్కడి గొంగళి అక్కడేననీ ఓ అభిప్రాయం. ఈ పద్ధతి మారితేనే సంస్థల మనుగడ సాధ్యమన్నది పరెటొ సిద్ధాంతం.విజయ బంధాలు

మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అనే కటువు మాటను కాసేపు పక్కనపెడితే... కొన్ని బంధాల వల్ల అటు మానసికంగానూ, ఇటు ఆర్థికంగానూ ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. వదిలించుకోలేని మొహమాటం తప్ప, మరో అతుకేదీ వాటిలో మిగిలుండదు. అందుకే, మన లక్ష్యంతోనూ జీవితంలోనూ కొనసాగే బంధాల కోసం పరెటొ సూత్రాన్ని వల్లె వేస్తాడు రిచర్డ్‌. పరస్పర గౌరవం, విశ్వాసం, ఆపదలో ఒకరికొకరు తోడు ఉండటం, ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరి సమక్షంలో మరొకరు సంతోషంగా ఉండటం... లాంటి ప్రాతిపదికల మీద బంధాలను కొనసాగించాలని చెబుతారు. కావాలంటే ఓసారి మీ పరిచయస్తుల జాబితాను రాసుకుని చూడండి... అందులో ఇరవై శాతమే పై ప్రాతిపదికలకు అనుగుణంగా ఉంటారని సవాలు చేస్తారు.విడమరిచిన పుస్తకం!

దశాబ్దాలుగా పరెటొ సిద్ధాంతం చాలా రంగాలమీద తన ప్రభావం చూపిస్తూనే ఉంది. ఓ వ్యాపార రహస్యంగానూ, విజయసూత్రంగానో ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తూనే వచ్చింది. 1997లో రిచర్డ్‌ కోష్‌ అనే బ్రిటన్‌ జాతీయుడి పుస్తకంతో ఈ సిద్ధాంతం ప్రపంచం నలుమూలలకీ విస్తరించింది. సమయపాలన నుంచి స్నేహం వరకు 80:20 సిద్ధాంతాన్ని జీవితానికి ఎలా అన్వయించి, పరిణతిని సాధించవచ్చో నిరూపించే ప్రయత్నం చేసింది. అందుకే 30కి పైగా భాషల్లోకి ఇది అనువాదం అయ్యింది. అందులో కొన్ని అంశాలను గమనిస్తే, 80:20 సూత్రాన్ని ఓసారి పాటించాలనే ఆసక్తి కలగడం తథ్యం.సంతోషమే పూర్తిబలం

డబ్బుంటే పెట్టుబడి పెట్టగలం, నైపుణ్యాన్ని ఎప్పటికైనా ఉపయోగించగలం, ఉద్యోగంలో మరో మెట్టు ఎదగగలం... కానీ సంతోషమో! అప్పటికప్పుడు అనుభవించాల్సిందే. కానీ ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో సంతోషంగా ఉండే కాలమే కనిపించడం లేదుగా. పరెటొ ద్వారా అందుకూ ఓ మార్గాన్ని చెబుతారు రిచర్డ్‌. మనం ఏ పని చేస్తున్నప్పుడు మనసుకు తృప్తిగా, సంతోషంగా ఉంటుందో గమనించమంటారు. చాలా సందర్భాలలో ఇతరుల జీవితాలను అనుకరించడం వల్లే నిరాశ, అపజయాలు ఎదురవుతుంటాయి. మనదైన గమ్యం సాధించినప్పుడే అనూహ్యమైన సంతోషం దక్కుతుంది. సంతోషంగా ఉండటం, మన పట్ల మనకు ఉండాల్సిన బాధ్యత!ధనికుల మంత్రం

వారెన్‌ బఫెట్‌ పేరు విననివాళ్లు అరుదు. ప్రపంచంలోనే ధనవంతులలో ఒకరు వారెన్‌. కుబేరుడిగానే కాదు, గొప్ప దాతగానూ చరిత్ర సృష్టించినవాడు. పెట్టుబడులతోనే వారెన్‌ ఇంత ఐశ్వర్యాన్ని సాధించడం విశేషం. The Tao of Warren Buffett అనే పుస్తకం ప్రకారం వారెన్‌ సాధించే 90 శాతం లాభాలకు కారణం 10 శాతం పెట్టుబడులే. ‘జీవితంలో చాలా పొరపాట్లు చేసేకంటే... కొన్ని పనులను పరిపూర్ణంగా చేయడం తేలిక కదా’ అంటాడు వారెన్‌. విప్లవాత్మక నిర్ణయాలకు మారుపేరైనా జెఫ్‌ బెజోస్‌  (అమెజాన్‌ వ్యవస్థాపకుడు) కూడా ఓ సందర్భంలో ఇలాంటి మాటే చెబుతాడు. ‘ఏదన్నా నిర్ణయం తీసుకోవడం కోసం.... నూటికి నూరు శాతం సమాచారం రావాలని ఎదురుచూస్తూ కూర్చుంటే, పరిస్థితులు చేయిదాటిపోతాయి. 70 శాతం సమాచారంతోనే నిర్ణయాన్ని తీసుకోగలగాలి’ అంటాడు బెజోస్‌. ఇది దాదాపుగా పరెటొ సిద్ధాంతాన్ని అనుకరించేదే!సమయ పాలన

సాధించాలనే తపన ఉంటే... మనసులో నిరంతరం అదే ధ్యాస ఉంటుంది. కాదనలేం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి నిమిషం కవ్విస్తుంటుంది. తప్పించుకోలేం. అలాగని కాలంతో పరుగులు పెడుతూ, ఒక్క క్షణం వృథా చేసినా అపరాధ భావంతో కుంగిపోతూ గడపవద్దని అంటాడు రిచర్డ్‌. వృథా పనులను గుర్తిస్తే... జీవితాన్ని ఆస్వాదించడానికీ, విజయం సాధించడానికీ కావాల్సినంత సమయం ఉంటుందన్నది పరెటొ సూత్రం. ఇతరులను తృప్తి పరచడానికి చేసేవి, మనస్సాక్షి అంగీకరించనివి, నైపుణ్యంతో పని లేనివి, విపరీతంగా సమయాన్ని తినేస్తున్నవి, ఫలితం మీద ఏ మాత్రం నమ్మకం కలిగించనివీ... లాంటి పనులకు దూరంగా ఉండమంటారు రిచర్డ్‌. అందుకు బదులుగా... లక్ష్యానికి చేరువ చేసేవి, మీ సృజనను వ్యక్తీకరించేవి, అసాధ్యం అనుకుని అందరూ పక్కన పెట్టేసినవి, మెరుగైన ఫలితాలను అందించేవి... లాంటి పనులు చేయాలంటారు. 

కెరీర్‌ ఎంపికలో

కెరీర్‌ ఓ పద్మవ్యూహం. దారి మారిందని గమనించేలోపే కబళించేంత నిర్దయ దాని నైజం. అందుకే ఆచితూచి ఎంపిక చేసుకోవాలి. అందుకోసం పరెటొ సిద్ధాంతం ఎలా ఉపయోగపడుతుందో చెబుతారు రిచర్డ్‌. అందుకు ఆయన సూచించే చిట్కాలు ఇవీ... ఓ అరుదైన వృత్తినో, నైపుణ్యాన్నో ఎంచుకోండి.

  • ప్రావీణ్యమే మూలధనం అన్న విషయం గ్రహించండి.
  •  ఆ రంగంలోమీకంటూ ఓ మెంటర్‌నూ ఎంచుకోండి. 
  • అది మీ మనసుకు, సామర్థ్యానికి దగ్గరగా ఉండేదే కావాలి.
  • మీ ప్రతిభను గుర్తించే సంస్థ లేదా వినియోగదారులను గుర్తించి... వాళ్ల మనసును గెలుచుకోండి.
  • కెరీర్‌ తొలిరోజుల్లోనే మీ కాళ్ల మీద నిలబడే ప్రయత్నం చేయండి.
  • పరిధి విస్తరిస్తున్న కొద్దీ, చిన్నచిన్న పనులను ఇతరులకు అప్పగిస్తూ... మీ నైపుణ్యాన్ని మాత్రం స్థిరంగా ఉంచుకోండి.


ఐటీ రంగంలో 80/20

అది 1997. కంప్యూటర్‌ దిగ్గజం యాపిల్‌ క్రమంగా దివాలా వైపు అడుగులు వేస్తున్నది. ‘ఇక యాపిల్‌ పని అయిపోయింది’ అంటూ పతాక శీర్షికలు మొదలయ్యాయి. అలాంటి సమయంలో స్టీవ్‌ జాబ్స్‌ మరోసారి ఆ సంస్థ పగ్గాలు చేపట్టాడు. స్టీవ్‌ రాగానే, మరింత దూకుడుగా ప్రవర్తిస్తాడని అనుకున్నారంతా. సాంకేతికతను పరుగులు పెట్టిస్తాడనీ, సరికొత్త ఉత్పత్తులను ప్రకటిస్తాడని ఎదురుచూశారు. బదులుగా స్టీవ్‌... యాపిల్‌ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను పక్కన పెట్టేశాడు. ఐపాడ్‌ను కూడా కొన్నాళ్లు అటకెక్కించాడు. నాలుగే నాలుగు ఉత్పత్తుల మీద తన దృష్టి పెట్టాడు. ఐఫోన్‌ (స్మార్ట్‌ఫోన్‌), ఐప్యాడ్‌ (టాబ్‌), మాక్‌ (డెస్క్‌టాప్‌), యాపిల్‌ వాచ్‌ (స్మార్ట్‌ వాచ్‌).. ఇలా నాలుగు విభాగాలనీ ఏలేందుకు నాలుగు ఉత్పత్తులను వృద్ధి చేశాడు. వాటి నాణ్యతే ప్రచార సాధనం కావాలంటూ... ప్రకటనలమీద కూడా అంతగా ఆసక్తి చూపించలేదు. స్టీవ్‌ వ్యూహం ఫలించింది. యాపిల్‌ మరోసారి తీపి ఫలాలను అందుకుంది. యాపిల్‌ మాత్రమే కాదు.. మైక్రోసాఫ్ట్‌, ఐబీఎమ్‌లోనూ 80:20 సిద్ధాంతాన్ని అనుసరించిన దాఖలాలు ఉన్నాయి. కంప్యూటర్లలో తలెత్తే 80 శాతం సమస్యలకి... 20 శాతం లోపాలే కారణం అని మైక్రోసాఫ్ట్‌ గమనించి తదనుగుణంగా చర్యలు తీసుకుంది. 80 శాతం ప్రోగ్రామింగ్‌ సామర్థ్యానికి 20 శాతం కోడింగ్‌ కారణమని తెలిసిన ఐబీఎమ్‌... అటుగా దృష్టి పెట్టింది. మొత్తానికి ఐటీ విప్లవానికి కూడా ఈ పరెటొ సిద్ధాంతం దోహదపడిందని చెప్పుకోవచ్చు.ఏబీసీ విశ్లేషణ

‘విలువనుబట్టి అర్హత’ అనే పరెటొ సూత్రం లాంటి సిద్ధాంతాలు ఇంకా చాలానే ఉన్నాయి. వాటిలో ఏబీసీ విశ్లేషణ ఒకటి. దీనిని సరుకుల నిల్వలో (ఇన్వెంటరీ) ఎక్కువగా అన్వయిస్తారు. ఒక సంస్థ నడిచేందుకు చాలా రకాల వస్తువులు అవసరం అవుతాయి. అదే ఓ ఫ్యాక్టరీ అయితే... ముడిసరుకుల సంగతి చెప్పనక్కర్లేదు. వీటన్నింటి మీదా నియంత్రణ ఉంచాలనుకుంటే కష్టమైపోతుంది. వినియోగాన్ని లేదా విలువను బట్టి వేర్వేరు జాగ్రత్తలు తీసుకోవడమే ఏబీసీ అనాలసిస్‌. ఏ (మరీ ముఖ్యమైన సరుకులు), బీ (కాస్త గమనించుకోవాల్సిన వస్తువులు), సీ (తేలికపాటి నియంత్రణ ఉండాల్సినవి) అన్న ఆధారంగా నిల్వలను విభజిస్తారు.

కొవిడ్‌ సమయంలో పరెటొ! 

కరోనా లాంటి వైరస్‌ల వ్యాప్తిలో కూడా పరెటొ సిద్ధాంతాన్ని అన్వయించవచ్చని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. వైరస్‌ సోకిన వాళ్లలో కొంతమంది మాత్రమే... విస్తృతంగా వైరస్‌ వ్యాపించడానికి (సూపర్‌ స్ప్రెడింగ్‌) తోడ్పడుతున్నారని ఓ పరిశోధనలో తేలింది. అలాగే, కొవిడ్‌లో 80 శాతం మరణాలు 65 ఏళ్లు దాటిన వారిలోనే సంభవిస్తున్నాయని అమెరికాలోని ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌' అంచనా వేసింది. దేశం మొత్తాన్నీ స్తంభింపచేయకుండా... రిస్క్‌ జోన్‌లో ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకుంటే, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉంటుందని మార్చిలోనే ఫోర్బ్స్‌ పత్రిక హెచ్చరించింది. 

మనకు తెలిసో తెలియకో పరెటొ సూత్రాన్ని నిత్యజీవితంలో అన్వయిస్తూనే ఉంటాము. పదిరకాల చెప్పులు ఉన్నా, వాటిలో ఎప్పుడూ ఒకటో రెండో జతలనే ఇష్టపడతాము. చదువుకునే రోజుల్లో సమయం మించిపోతుంటే ‘ఇంపార్టెంట్‌' పేరుతో కొన్ని ప్రశ్నలను బట్టీపడతాం. పరెటొ సిద్ధాంతం గురించి విన్న తర్వాత ప్రతి విషయంలోనూ 80:20 నిష్పత్తి గురించి వెతకాలనిపించడం ఖాయం. కానీ ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి విషయంలోనూ, ప్రతిసారీ ఇదే నిష్పత్తి కచ్చితంగా ఉంటుందని చెప్పడం పరెటో సూత్రం కాదు. ఏ రంగంలో అయినా... కీలకమైన అంశాలు చాలా తక్కువగా ఉంటాయి. అది 20 శాతం కావచ్చు, పదిశాతమూ కావచ్చు... ఒకోసారి ఒకే ఒక్కశాతం కావచ్చు. ఆ ఆయువుపట్టు మీద శ్రద్ధ పెడితే విజయాన్ని సాధించవచ్చు. 


VIDEOS

logo