గురువారం 25 ఫిబ్రవరి 2021
Sunday - Jan 16, 2021 , 22:05:23

కళర్‌ ఫొటో

కళర్‌ ఫొటో

ఫొటో చాలామందికి ఓ మధుర జ్ఞాపకం.కానీ, ఆయనకు మాత్రం కళాత్మక నిజం.సమాజం చూడని కోణాన్ని అతడి కెమెరా లెన్స్‌ ఒడిసిపడతాయి.సమస్య తీవ్రతను ప్రపంచానికి పరిచయం చేస్తాయి.ఖమ్మం గొత్తికోయల గోస నుంచి పంజాబ్‌ రైతన్నల చావుల దాకా.. ఆ కెమెరా బంధించని దృశ్యం లేదు. అతడే హైదరాబాద్‌కు చెందిన హర్ష వడ్లమాని.

హర్ష గతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. మంచి జీతం.. అంతకుమించి అందమైన జీవితం. వారానికి రెండు రోజులు సెలవు. కానీ, వారమంతా నాలుగ్గోడల మధ్య పనిచేయడం హర్షకు నచ్చలేదు. రెక్కలు తొడిగి రివ్వున ఎగిరిపోవాలనుకున్నాడు. ఆసేతు హిమాచలం చుట్టిరావాలనుకున్నాడు. తన మనసును హత్తుకునే ప్రతి దృశ్యాన్నీ  కెమెరాతో శాశ్వతంగా నిలపాలనుకున్నాడు. ఇంట్లో పెద్దలకు ఇదే విషయం చెప్పి ఒప్పించాడు. 2008లో ఉద్యోగం వదిలేసి.. అలుపెరగని ప్రయాణం మొదలుపెట్టాడు హర్ష.

తెలంగాణ ఉద్యమంతో మొదలు

ఉద్యోగం వదిలేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ జర్నలిజంలో చేరాడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజులవి. హర్షకు కావాల్సినంత మెటీరియల్‌ దొరికింది. తన దగ్గరున్న సోని ఎరిక్సన్‌ మొబైల్‌ ఫోన్‌నే కెమెరాగా ఎంచుకున్నాడు. పోరు చిత్రాలను విభిన్న కోణంలో క్లిక్‌మనిపించి.. వాటిద్వారా ఉద్యమస్ఫూర్తిని రగిలించాడు. ఆనాడు మొదలైన హర్ష ఫొటో షూట్‌.. ఢిల్లీలో పంజాబ్‌ రైతుల ఆందోళన వరకు కొనసాగుతూనే ఉన్నది. 2013లో తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై ఓ ప్రాజెక్టు చేశాడు హర్ష. పల్లె సౌందర్యాన్ని ఒడిసి పట్టడానికి చేసిన ప్రయత్నంలో, రైతు ఆత్మహత్యలు ఆయన మనసును కలిచి వేశాయి. ఆ విషాదకర ఘట్టాలను కెమెరాతో రికార్డు చేశాడు.సమస్యను వెతుక్కుంటూ..

తెలంగాణలో తన ప్రయాణం మొదలుపెట్టిన హర్ష దేశంలోని మారుమూల ప్రాంతాలెన్నో తిరిగాడు. సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్లిపోయేవాడు. అక్కడి పరిస్థితులను కెమెరా నేత్రంతో చూసి.. ఫొటోలతో ప్రపంచానికి పరిచయం చేసేవాడు. పలు జాతీయ, అంతర్జాతీయ మ్యాగజైన్లు, దిన పత్రికలకు  ఫ్రీలాన్స్‌ ఫొటోగ్రాఫర్‌గా పని చేసేవాడు. అలా వచ్చిన ఆదాయంతోనే తన క్రతువును కొనసాగించాడు. సల్వాజుడుం దాడులు, గొత్తికోయల పరిస్థితి, తమిళనాడులో పరువు హత్యలు, పంజాబ్‌లో రైతుల ఆత్మహత్యలు.. చరిత్ర పట్టించుకోని ఎన్నెన్నో సందర్భాలకు హర్ష తన కెమెరా ద్వారా శాశ్వతత్వాన్ని ప్రసాదించాడు. మరట్వాడాలో నీటి ఎద్దడిపై.. 40 రోజులు అక్కడే ఉండి పరిస్థితి తీవ్రతను తెలియజేసేలా అద్భుతమైన ఫొటోలు తీశాడు.‘లాథూర్‌, ఉస్మానాబాద్‌వంటి ప్రాంతాల్లో తిరిగాను. ఇక్కడివాళ్లు కొందరు ముంబయికి వలస వెళ్లారు. నేనూ ముంబయికి చేరుకొని వలసదారుల అడ్డాలకు వెళ్లి వారి పరిస్థితిని ఫొటోలు తీసి ప్రపంచానికి చూపించాను. నీటికి కటకటలాడుతున్న ప్రాంతంలో అగ్రకులాల వాళ్లు దళిత బస్తీలకు తాగునీరు నిలిపివేయడం దారుణం అనిపించింది. గుక్కెడు నీళ్లు అందక మనుషులు చనిపోయిన సంఘటనలనూ నేను కండ్లారా చూశాను’ అంటాడు హర్ష.కథలు చిత్రాలుగా..

2018లో లంబాడాలకు, గోండులకు ఘర్షణలు జరిగినప్పుడు కూడా హర్ష అక్కడి సమస్యను తెలియజేస్తూ ఎన్నో ఫొటోలు తీశాడు. ‘అందమైన ఫొటోలను ఎవరైనా తీస్తారు. అందమైన జీవితాలు బుగ్గిపాలవుతుంటే తీయడమే అసలైన ఫొటోగ్రఫీ. నేను తీసిన చిత్రాలను మ్యాగజైన్స్‌, జర్నల్స్‌, దినపత్రికలు వాడుతుంటాయి. ఇవే నా దృష్టిలో పెద్ద ఎగ్జిబిషన్స్‌. వీటి ద్వారానే సమస్య తీవ్రత ఎక్కువమందికి తెలుస్తుందనేది నా అభిప్రాయం. అందుకే ఎగ్జిబిషన్స్‌ పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపను. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర రోజుకో ఆందోళన జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో జనం వస్తుంటారు. అక్కడికి వచ్చేవాళ్లు ఎలాంటివారు? వారి నినాదం ఏంటి? ఇదే నా కథావస్తువు. అలాగని పెద్ద పెద్ద వ్యాసాలు రాయను. నా ఫొటోగ్రఫీద్వారా వారి కష్టం పదిమందికీ రీచ్‌ అయ్యేలా చేస్తాను’ అని చెబుతాడు హర్ష. ఈ యువకుడి ‘కళ’ర్‌ ఫొటోలు రాబోయే తరాలకు చరిత్ర పాఠాలు కావాలని ఆశిద్దాం.రోజుకో చోటుకు

ఒక ఆఫీస్‌ పెట్టుకొని.. కుర్చీలో కూర్చొని సహజత్వానికి విరుద్ధంగా పని చేయడమంటే నాకు నచ్చదు. తొలుత బ్లాగింగ్‌ చేసిన నేను, తర్వాత ఫొటోగ్రఫీ ద్వారా ప్రజా సమస్యలపై స్పందించడం ప్రారంభించాను. 2013లో ఖమ్మంలోని గొత్తికోయలపై అధ్యయనం చేశాను. నా ప్రాజెక్టుల్లో కొన్ని నా సొంతం కోసం చేసినవి ఉన్నాయి. మరికొన్ని నేషనల్‌.. ఇంటర్నేషనల్‌ మ్యాగజైన్స్‌ కోసం చేస్తుంటాను. 2014లో ఓసారి అసోం వెళ్లాను. రొమేనియా ప్రాంతంలో నదికోతకు గురై దాదాపు 30 ఊళ్లు నీళ్లలో కలిసిపోయాయి. అక్కడి ప్రజల జీవన పరిస్థితులపై ప్రాజెక్ట్‌ చేశాను. నేటికీ రోజుకో ప్రాంతానికి వెళ్తూనే ఉంటాను.”
VIDEOS

logo