ఆ ముగ్గురికీ నచ్చితే..పాట హిట్టే!

తెలుగు సినీ సంగీత హోరులో ఇప్పుడు తమన్ స్వరాలే వినిపిస్తున్నాయి. హుషారెత్తించే మాస్ పాటలతోపాటు హృదయాల్ని స్పృశించే మెలోడీలతో ఆయన సంగీత ప్రియుల్ని మైమరిపిస్తున్నారు.గతేడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రం ద్వారా కెరీర్లోనే అద్భుత విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమా పాటలు దేశవ్యాప్తంగా మార్మోగడంతోపాటు సోషల్‌మీడియాలో రికార్డులుసొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం తెలుగులో వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారాయన. ఈ సందర్భంగా ‘బతుకమ్మ’తో తమన్ పంచుకున్న స్వరాల సంగతులివి..
సినిమాలో సంగీత దర్శకుడి పాత్ర కేవలం బాణీలను అందించడం వరకు మాత్రమే పరిమితం కాదు. మ్యూజిక్ డైరెక్టర్‌ను ఓ స్టోరీటెల్లర్‌గా అభివర్ణించవచ్చు. అందుకే వరుసగా పెద్ద చిత్రాల్ని అంగీకరిస్తున్నా.. ప్రతి సినిమా కథ మొత్తం తెలుసుకుంటాను. కథలో అంతర్లీనంగా ఉండే భావోద్వేగాలను ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేస్తా. కథపై అవగాహన లేకపోతే పాటను సృష్టించలేం. స్వరకల్పనలో మరింత సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని అనునిత్యం తపిస్తుంటాను.
సమీకరణలు తెలుసుకోవాలి
ప్రతి హీరోకు ఓ అభిమానగణం ఉంటుంది. దాని విస్తృతి ఏమిటో తెలుసుకొని సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆ హీరో ైస్టెల్, మేనరిజమ్, వ్యక్తిత్వం.. అన్నీ ఆలోచించాలి. అగ్రహీరోలందరికీ ఒకే రకమైన సంగీతాన్ని ఇవ్వడం కుదరదు. ఒక్కో హీరోకి ఒక్కోశైలి సంగీతం సెట్ అవుతుంది. అదీగాక మన తెలుగు హీరోలకు ఫ్యాన్‌బేస్ ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. కాబట్టి, వారి చిత్రాలకు సంగీతం అందించే విషయంలో భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. నేను పుష్కరకాలంగా పరిశ్రమలో ఉంటున్నా. ఈ సమీకరణలన్నిటిపై మంచి అవగాహన ఉంది. అందుకే సంగీత ప్రియుల్ని మెచ్చేలా బాణీలను అందించగలుగుతున్నా.
దర్శకుడి అభిరుచుల మేరకే..
సినిమాకు బాణీలను సమకూర్చడం సంగీత దర్శకుల ఇండిపెండెంట్ వర్క్ కాదు. సినిమా అనే సృజనాత్మక శిల్పాన్ని మలిచే క్రతువులో స్వరకర్తలు ఓ ఉపకరణంలా వ్యవహరిస్తారు. అంతిమంగా దర్శకుడి అభిరుచికి అనుగుణంగా సంగీతం చేయాలి. అయితే నా మ్యూజిక్ శైలి, కంపోజర్‌గా నాకున్న ఇమేజ్ గురించి దర్శకులకు ముందే అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ కోణంలోనే అవుట్‌పుట్ ఇవ్వాలని కోరతారు. సినిమా స్క్రిప్ట్‌ను అర్థం చేసుకున్నప్పుడే మంచి బాణీలను ఇవ్వగలం. వీటితో పాటు ఓ సినిమా కోసం నిర్మాత వెచ్చించే డబ్బుకు ఓ సంగీతకారుడిగా నేను న్యాయం చేస్తున్నానా? లేదా? అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యూజిక్ కంపోజ్ చేస్తాను. మొత్తంగా చూస్తే సినిమా స్క్రిప్ట్, దర్శకుడి ఆలోచనలు, హీరో ఇమేజ్, ఆ ప్రాజెక్ట్కున్న క్రేజ్ ఈ అంశాలన్నీ సినీసంగీతాన్ని ప్రభావితం చేస్తాయి.
ఆ క్రెడిట్ త్రివిక్రమ్‌కే
ట్యూన్స్ సిద్ధం చేసేటప్పుడు ఫలానా సమయంలోనే పనిచేయాలని ఆలోచించను. అర్ధరాత్రి ఐడియా వచ్చినా సరే వెంటనే స్వర రచనకు రెడీ అయిపోతాను. ప్రస్తుతమున్న ట్రెండ్‌లో ఏదో ఒక టైమ్‌లోనే పనిచేస్తానంటే కుదరదు. దర్శకనిర్మాతలకు ఇచ్చిన టైమ్ లిమిట్లో మ్యూజిక్ డెలివరీ చేయాలి. అందుకు అనేక ప్రక్రియల్ని దాటాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో సృజనాత్మకమైన సంఘర్షణతో పాటు ఎంతో టీమ్‌వర్క్ చేయాలి. ‘అల వైకుంఠపురములో’ చిత్రం నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే అద్భుతాలు జరగాలని ఎవరూ ప్లాన్ చేసుకోరు. ఈ సినిమాలోని పాటలకు ఆ స్థాయిలో ప్రాచుర్యం లభిస్తుందని అస్సలు ఊహించలేదు. టీమ్ అందరి కృషి వల్ల ఆ విజయం సాధ్యమైంది. ఆ పాటల సక్సెస్ క్రెడిట్ దర్శకుడు త్రివిక్రమ్‌కే ఇస్తాను.
సమన్వయం ముఖ్యం
సినిమా బాణీలను సృష్టించే విషయంలో పాట తాలూకు సాహిత్యం ప్రధాన భూమికను పోషిస్తుంది. పాటలోని భావాలే ట్యూన్‌కు అందాన్ని తీసుకొస్తాయి. ‘సామజవరగమన..’ లిరిక్ తీసుకుంటే అందులోని సాహిత్యం వల్లనే బాణీకి కొత్త సొగసు వచ్చింది. ఓ పాటలోని భావాన్ని సంగీత దర్శకుడు ఎంత గౌరవిస్తాడో దానికి కంపోజ్ చేసిన ట్యూన్ విని చెప్పొచ్చు. ఇక ఓ పాట స్వరకల్పన విషయంలో కేవలం సంగీత దర్శకుడే నిర్ణయాలు తీసుకోడు. దర్శకుడు, గీతరచయిత, స్వరకర్త.. ముగ్గురూ కూర్చొని చర్చిస్తారు. వారి మధ్య సమన్వయం కుదిరితే మంచి పాట వస్తుంది. ఈ ముగ్గురికీ నచ్చిన పాటలు దాదాపు హిట్ అయినట్టే!
విమర్శలు పట్టించుకోను
సినిమా సంగీతం విషయంలో ఎంతో మంది ప్రమేయం ఉంటుంది. గీతరచయితలు మొదలుకొని ఓ పెద్ద బృందంతో కలిసి పనిచేస్తుంటాం. అయితే మ్యూజిక్ విషయంలో కొన్ని సందర్భాల్లో కాపీ విమర్శలు వినిపిస్తుంటాయి. వాటి గురించి అస్సలు పట్టించుకోను. ఒకవేళ కాపీ ట్యూన్ అయితే అంతపెద్ద బృందంలో ఎవరూ తెలుసుకోలేరా? నేను పరిశ్రమలో అగ్రహీరోలు, దర్శకులు, గొప్ప ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తున్నా. కాపీ ట్యూన్ అయితే వారు తెలుసుకోలేరా? నా ప్రతిభపై నమ్మకంతో దర్శకనిర్మాతలు అవకాశాలిస్తున్నారు. పనిలేని వారు, సంగీత పరిజ్ఞానం లేనివారే కాపీ అంటూ సోషల్‌మీడియాలో విమర్శలు చేస్తుంటారు. దానివల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదు. నిజంగా కాపీ కొడితే ఎవరూ చూస్తూ ఊరుకోరు. నేను వందకుపైగా సినిమాలకు పనిచేశాను. కాపీ ట్యూన్ అంటూ ఇప్పటివరకు ఏ కంపెనీయైనా నా మీద కేసులు వేసిందా? కాబట్టి విమర్శలన్నీ అర్థం లేనివి. శ్రోతల్ని మెప్పించడమే లక్ష్యంగా నేను పనిచేస్తా. మిగతా విషయాల్ని పట్టించుకోను.
అక్కడితో ఆగిపోను
నా దృష్టిలో విజయానికి పరిమితులు ఉండవు. క్రీడాకారులు ఏదైనా కప్ గెలిస్తే అక్కడితో ఆగిపోరు. మరోసారి కూడా టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటారు. నేను కూడా అలాగే ఆలోచిస్తా. ‘అల వైకుంఠపురములో’ చిత్రం మంచి పేరు తీసుకొచ్చింది. యూట్యూబ్‌లో ఆ పాటలకు రికార్డు స్థాయి వీక్షణలు లభించాయి. ఆ సినిమా విజయం గొప్ప అనుభూతినిచ్చింది. అయితే నేను అక్కడితే ఆగిపోవాలనుకోవడం లేదు. ‘అల వైకుంఠపురములో’ సినిమా నాకు పదోతరగతి పాస్ కావడం లాంటిది. ఇంకా సాధించాల్సిన విజయాలు ఎన్నో ఉన్నాయి. నాలోని ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ శ్రోతల్ని అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్నా.
బాలీవుడ్ తీరు వేరు..
హిందీలో పనిచేశాను. బాలీవుడ్ పరిశ్రమ నుంచి మంచి ఆఫర్లే వస్తున్నాయి. అక్కడే ఒక్క సినిమాకు ఇద్దరుముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తుంటారు. ఒక్కోసారి పాటకు ఒకరు ట్యూన్ ఇస్తుంటారు. ఆ ధోరణిలో మార్పు వస్తే మంచిదనుకుంటున్నా. సినిమాకు ఒక సంగీత దర్శకుడైతేనే ఫలితం బాగుంటుందన్నది నా అభిప్రాయం. బాలీవుడ్ తాలూకు సమీకరణల్లో ఇమడం కష్టంగా అనిపిస్తున్నది. ఎవరైనా దక్షిణాది దర్శకులు హిందీలో సినిమా చేస్తూ ఆల్బమ్ మొత్తం నేను చేసేలా అవకాశమిస్తే అప్పుడు బాలీవుడ్ గురించి ఆలోచించాలనుకుంటున్నా. ప్రస్తుతం తెలుగులో ‘వకీల్‌సాబ్', ‘సర్కారు వారి పాట’, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్, ‘టక్ జగదీష్', బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబినేషన్ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నా.
ఆ విషయంలో రాజీ పడను
చిత్రసీమలో పోటీ గురించి ఆలోచించే తీరిక లేదు. ఎలాంటి పోటీనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. సంగీతపరంగా వస్తున్న ట్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్డేట్ అవుతుంటాను. వర్క్ క్వాలిటీ, ప్రొడక్షన్ విషయంలో నేను ఎప్పుడూ రాజీ పడను. నా సోషల్‌మీడియా ఖాతాల్ని చూస్తే నా పనిలోని నాణ్యత ఏమిటో అర్థమవుతుంది. అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక అంశాల్ని ఉపయోగించుకుంటూ మ్యూజిక్ విషయంలో ఉత్తమమైన అవుట్‌పుట్ ఇవ్వాలని తపిస్తుంటాను.
-కళాధర్ రావు
తాజావార్తలు
- నీట్ పీజీ-2021.. పెరిగిన ఫీజు, తగ్గిన ప్రశ్నలు
- టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డును బద్ధలుకొట్టిన మార్టిన్ గప్టిల్
- సమంత అభిమానులకు గుడ్ న్యూస్..!
- గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులపై నిషేధం ఎత్తేసిన బైడెన్
- అనుమానాస్పదస్థితిలో ఆటో డ్రైవర్ మృతి
- ఒకే స్కూళ్లో 229 మంది విద్యార్థులకు కరోనా
- ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య.. కేరళలో బంద్
- నగ్నంగా ఉన్న ఫొటో అడిగిన నెటిజన్.. షేర్ చేసిన శ్రీముఖి
- మణిపూర్‌లో స్వల్ప భూకంపం
- ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు