శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sunday - Jan 16, 2021 , 21:31:58

గుడిగంటలా మోగే పాట

గుడిగంటలా మోగే పాట

‘గుడి గంటలు మ్రోగినవేళ మది సంబరపడుతోంది’ అంటూ యువప్రేమికుల మనసుల్లో వలపు గంటను మోగించింది అతని కలం. ‘ఎదురంటూ ఇకలేదంటూ ఎగరాలిరా’ అని హుషారెత్తి  నినదించింది అతని పదం. తెలుగు సినీపాటల జగత్తులో తనదైన శైలితో ప్రత్యేకతను నిరూపించుకున్న రచయిత ఘంటాడి కృష్ణ. గీత రచయితగా, సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా అరుదైన ప్రస్థానం ఆయనది. కొత్తగూడెంలో గురుమూర్తి, వేంకటమ్మ దంపతులకు జన్మించారు ఘంటాడి కృష్ణ. సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన ఆయన.. సరిగమలపై మక్కువతో సంగీతంలో ఎంఏ చేశారు. ఘంటాడి కృష్ణ తండ్రి మంచి గాయకుడు. అలా వారసత్వంగా సుస్వరాల ప్రతిభ అలవడింది. చిన్నప్పటి నుంచీ పాటలు పాడుతూ చుట్టూ ఉన్నవారిని అలరించేవారు. క్రమంగా పాటల రచనపై దృష్టి సారించి.. అందులోనూ సఫలీకృతులు అయ్యారు కృష్ణ.

వలపు పదాలపై స్వారీ

1998లో వచ్చిన ‘ప్రేమపల్లకి’ సినిమాలో ‘వెల్లువై ఉరికెనులే వేణువై పాడెనులే’ పాటతో గీత రచయితగా ఘంటాడి సినీ ప్రస్థానం మొదలైంది. మొదటి పాటతోనే శ్రోతలను మెప్పించారు. ‘స్వర సంగమమే శృతిలో పలికే లయ బంధనమే.. జతగా కలిసే మధురస సుధలే మరులై కురిసే’ అంటూ సంగీతాన్ని సాహిత్యంతో అభిషేకించారు. ‘స్వర సంగమం’, ‘లయ బంధనం’.. ప్రయోగాలు సంగీత, సాహిత్యాల్లో ఆయన ప్రతిభను చాటిచెబుతాయి. 1999లో వచ్చిన ‘స్నేహితులు’ చిత్రంలోని ‘మల్లికవో మేనకవో మనసును దోచిన మదనుడి మరదలివో’ అనే ప్రణయగీతం ఘంటాడి సినీ ప్రయాణానికి సరికొత్త బాటలు వేసింది. అలతి అలతి పదాలు.. వలపు సౌందర్యంతో పోటీపడే భావావేశం ఈ పాటను సూపర్‌హిట్‌గా మలిచాయి. ‘అంతులేని నీ అందం ఇంద్రధనుస్సు కాదా! మరులు గొలుపు నీ చూపులే సూర్యకాంతి కాదా!’ అనే పంక్తులు ఓ కవికి ఉండాల్సిన ఊహాశక్తిని తెలియజేస్తాయి.

సూపర్‌హిట్‌ రచయిత

‘పోస్ట్‌మ్యాన్‌' చిత్రంలో ‘అచ్చ తెనుగులా పదారణాల కోమలాంగివే చెలీ’, ‘వంశోద్ధారకుడు’లో ‘కొండపల్లి బొమ్మా తొందరెందుకమ్మా చందనాల ముద్దుగుమ్మా’, ‘అమ్మాయి కోసం’ లో ‘ఓమ్మో హ్యాట్సఫ్‌ బ్రహ్మకు, ఈ బొమ్మ చేసి నాకిచ్చినందుకు’, ‘మనసున మనసై’ చిత్రంలో ‘ఎదురంటూ ఇక లేదంటూ ఎగరాలిరా! ఆనందం ఆ అంచుల్ని తాకాలిరా!’ .. తదితర పాటలు ఘంటాడి ప్రత్యేకతను నిరూపించాయి. ‘బాగున్నారా’ సినిమాలో క్లింటన్‌, మీరాబాయి, దయానాథ్‌, అజారుద్దీన్‌, టెండూల్కర్‌ల ప్రేమకథలను ప్రస్తావిస్తూ సాగే ‘తిరుమల తిరుపతి వెంకటేశా! వీళ్ల తీరు కాస్త చెప్పవయ్యా శ్రీనివాసా’ సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘డీల్‌'లో ‘ఎత్తుకెత్తు వేస్తు ఉంటాడు, చిత్తు చేసేదాకా వదలడు, నిప్పులాగా మండుతుంటాడు’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ ఆసక్తికరంగా సాగుతుంది. 2015లో వచ్చిన ‘సితార’, ‘అప్పారావు డ్రైవింగ్‌ స్కూల్‌', ‘కుంకుమ’, ‘బ్యాచిలర్స్‌' తదితర చిత్రాలకూ ఆయన పాటలు రాశారు. ‘సంపంగి’, ‘ప్రేమలో పావని కల్యాణ్‌' వంటి హిట్‌ చిత్రాలకు సంగీతం అందించారు. సుమారు 50 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఘంటాడి కృష్ణ  తెలుగుదనం నిండిన స్వచ్ఛమైన పాటల పరిమళమై విస్తరిస్తున్నారు. 

2000లో విడుదలైన ‘నిన్నే ప్రేమిస్తా’ చిత్రంలో ఘంటాడి కృష్ణ రాసిన ‘గుడిగంటలు మోగిన వేళ మది సంబరపడుతోంది..’ పాట ఎవర్‌గ్రీన్‌ హిట్స్‌ జాబితాలో చేరింది. ఈ ప్రేమగీతం ప్రత్యేక ఆదరణను పొందింది. ప్రేమికులందరికీ నిత్య పారాయణమైన గేయం ఇది. ‘చెలి పాదాలా పారాణల్లే అంటుకు తిరగాలి..’ అని ప్రేమికుడు మురిసిపోతే.. ‘నుదుటి బొట్టయి నాలో నువ్వు ఏకమవ్వాలి’ అని ప్రేయసి అంటుంది. ప్రేమికుల హృదయాల్లోకి తొంగి చూసి రాసినట్టుగా ఉంటాయీ పంక్తులు. చక్కని, చిక్కని భావంతో సాగిపోయే ఈ పాట కృష్ణకు మంచిపేరును తెచ్చింది.

-తిరునగరి శరత్‌ చంద్ర, 6309873682

VIDEOS

logo