ప్రకృతి సంక్రాతి

కాల గమనానికి కొత్త గతి.. పట్నవాసికి సెలవులు.. పల్లెసీమకు ధాన్యరాసులు.. ముంగిలికి ముగ్గులు..పిల్లపాపలకు భోగిపండ్లు.. చిరు చిరుతలకు పతంగులు.. సంక్రాంతి తెచ్చే సంబురమిది! ఈ పల్లెక్రాంతి శోభకు ముచ్చటపడి కొందరు అతిథులు విచ్చేశారు.ఎక్కడెక్కడి నుంచో వచ్చేశారు. దేశదేశాల నుంచి రెక్కలు కట్టుకొని వాలిపోయారు. ఈసారైతే మరీనూ!పుష్కలంగా నీరు, అచ్చమైన పచ్చదనం, స్వచ్చమైన గాలి.. తెలంగాణను అరుదైన జీవజాలానికి అడ్డాగా మార్చేశాయి.విదేశీ అతిథులు మాత్రమే కాదు.. మన గడ్డమీద పుట్టిన పిట్టలు చిక్కటి పొదల మాటున చేరి పదాలు పాడుతున్నాయి. హరిణాలు పచ్చని పసరిక మేసి గంతులేస్తున్నాయి. పులులు రాజసంగా నడుస్తున్నాయి. జీవరాశుల మనుగడకు హరిత తెలంగాణను మించిన అనువైన ప్రదేశం లేదని నిరూపిస్తున్నాయి.
సంక్రాంతి కాలసంధి. సూర్యగమనాన్ని ఉత్తర, దక్షిణ ఆయనాలుగా విభజించి కాలగణనను తేలిక చేస్తుంది ఈ పండుగ. చలికి చిక్కిన జీవజాలానికి ఊరటనిస్తూ మకర సంక్రమణ మొదలు సూరీడు మెల్లమెల్లగా వేడి పుంజుకుంటాడు. భానూదయాన పలుకరించే తెలిమంచు తెరలు, మాపటేళకు చిరు చెమటలు పట్టే వైనం, మలిసంజెలో వీనుల విందుగా పక్షుల కిలకిలలు, జామురాతిరి నిర్మలాకాశంలో మిలమిల మెరిసే తారలు.. చెబుతూ పోతే, సంక్రాంతి వేళ పరిసరాలన్నీ కొత్త కాంతిని సంతరించుకుంటాయి. ఈ ప్రశాంత వాతావరణానికి తగిన ప్రకృతి తోడైతే.. సకల జీవరాశికీ సంబురమే. ఇలాంటి అనువైన పరిస్థితులు ఉన్నప్పుడే జీవవైవిధ్యం అద్భుతంగా కొనసాగుతుంది. తెలంగాణలో అచ్చంగా ఇలాంటి వాతావరణమే ఉందిప్పుడు. అందుకే ఇక్కడ ప్రతి గట్టు, చెట్టు, పుట్ట వైవిధ్యమైన జీవరాశికి ఆలవాలమై అలరారుతున్నది.
పల్లెల్లో పక్షి ప్రపంచం
గతంలో పల్లెలన్నీ కాకులు, గద్దలు, గువ్వలు, గోరింకలు, గోగరగాళ్లు, పాలపిట్టలు, చిలుకలు, ఊరపిచ్చుకల కిలకిలరావాలతో ఆహ్లాదకరంగా ఉండేవి. చెట్లపై గూళ్లు ఏర్పాటుచేసుకుని.. వాటిలో గుడ్లు పెట్టి తమ సంతతిని వృద్ధి చేసుకునే పక్షిజాతులు అంతరించిపోయే స్థితికి చేరుకొన్నాయి. భూతాపం కారణంగా భూమిమీద, సొరంగాల్లో గుడ్లుపెట్టే బురకలు, కౌంజుల పరిస్థితి కూడా అలాగే మారింది. తెలంగాణలో అడవుల పునరుద్ధరణతో అరుదైన జీవరాశులు మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి. హరితహారంతో మురిసిపోతున్న పల్లె పొలిమేరల్లో పక్షుల కిలకిలలు మళ్లీ మొదలైనాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో కిలోమీటర్ల మేర నీటిజాడలు, మిషన్ కాకతీయతో జలరాశితో తొణికిసలాడుతున్న చెరువులు, కుంటలు అరుదైన పక్షుల మనుగడకు ఇతోధికంగా సాయం చేస్తున్నాయి. కనుమరుగయ్యాయని అనుకున్న అనేక రకాల జంతువులు తిరిగి వనాల ఒడికి చేరుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భజలాలు పెరడంతో, ఏడాది పొడవునా గ్రామాల్లోని చెరువుల్లో నీటి ఊటలతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. గతంలో సగటున 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైతే.. ప్రస్తుతం 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నాయి. మత్తళ్లు దుంకుతున్న చెరువుల దగ్గర పశుపక్ష్యాదులు సందడి చేస్తున్నాయి. విదేశీ పక్షులకు ఆ చెరువులు ఆలవాలంగా మారిపోయాయి. కామన్ ఫాండ్ హెరాన్, ఐబిస్ జాతి కొంగలు, వైట్ హెరాన్, గ్రే హెరాన్ తదితర జాతి పక్షులు ఆవాసాలను ఏర్పాటుచేసుకున్నాయి. కారుకోళ్లు, బుడుబుంగలు, నీటి పిల్లులు, రకరకాల బాతులు దర్శనమిస్తున్నాయి. జలసిరులతో సాగైన పంట పొలాల్లో సీతాకోకచిలుకలు రంగులు పంచుతున్నాయి. ఆహారపు గొలుసు నియమం యథావిధిగా కొనసాగుతున్నందున ఊర పిచ్చుకలు చేలపై దర్శనమిస్తున్నాయి. అరుదైన కీటక, సర్ప జాతులు, వర్షాకాలంలో ఆరుద్ర పురుగులు, కుమ్మరి పురుగులు, వివిధ రకాల గొంగళి పురుగులు మనుగడ సాగిస్తున్నాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో పులుల సంచారం పెరుగగా.. కొండ గొర్రెలు, దుప్పులు, అడవి పందులు, నక్కలు, ముంగీసలు, కుందేళ్లు, ఉడుములు, అడవి పిల్లులు వలస వస్తున్నాయి.
మన రాష్ట్రంలో మకాం
సంక్రాంతి సీజన్లో పశ్చిమ దేశాల నుంచి రకరకాల పక్షులు ఆఫ్రికా, మధ్య ఆసియా, శ్రీలంక, భారతదేశానికి వలస వస్తాయి. పచ్చదనంతోపాటు నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతంలో నెలలపాటు జీవనం కొనసాగిస్తాయి. గతంలో తెలంగాణ మీదుగా ముందుకు వలస వెళ్లిన పక్షులు ఈమధ్య కాలంలో తమ గమ్యాన్ని మార్చుకుంటున్నాయి. పచ్చదనంతో, జలకళ ఉట్టిపడుతున్న మన పల్లెల్లోనే మకాం పెడుతున్నాయి. ఇండియన్ స్పాట్ బిల్డ్ డక్, కామన్ కూట్, హెటిరోనెట్టా ఆర్టీకాపిలా, రెడ్ వాటెడ్ లాపింగ్, గ్లాసిఐబిస్, వైట్ ఐబిస్, పర్పుల్ హెరాన్, డబుల్ క్రెస్టెడ్ కార్మోరెంట్, లెస్సర్ విజిలింగ్ డక్ వంటి విదేశీ పక్షులూ రాష్ట్రంలోని అనేక చోట్ల సందడి చేస్తున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఈ విదేశీ పక్షులు ఎక్కువ సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. బంగ్లాదేశ్, దక్షిణ ఆసియాలోని నదీ తీరాల్లో కనిపించే స్మూత్ ఇండియన్ ఆటర్స్ రకం పక్షులు మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామ చెరువులో దర్శనమిచ్చాయి. అంతరించిపోతున్న పక్షుల జాబితాలో ఉన్న ఈ విహంగాలు తెలంగాణలోని కొత్త హంగులకు ఫిదా అయిపోయి తమ సంతతి వృద్ధికి ఇదే సరైన ప్రదేశంగా భావించినట్టున్నాయి. అందుకే, ఈ ప్రాంతంలో వందలాదిగా విదేశీపక్షులు గుంపులు గుంపులుగా చేరి మిషన్ కాకతీయ చెరువుల్లో కాలక్షేపం చేస్తున్నాయి. ఎల్లంపల్లి బ్యాక్వాటర్స్లోనూ ఈ పక్షులు కనిపిస్తున్నాయి.
మళ్లీ 20 ఏండ్ల తర్వాత..
నెమళ్లు, రామచిలుకలు, గద్దలు, ఊర పిచ్చుకలు, రెడ్వెంట్బుల్స్, వడ్రంగి పిట్ట, గిజిగాళ్లు, హమ్మింగ్‌బర్డ్స్, కోయిలలు, బుర్క పిట్టలు, కౌంజులు, అడవి పావురాలు, గడ్డిపిట్టలు, గోరింకల సంఖ్య రాష్ట్రంలో నాలుగింతలు పెరిగిందని పేర్కొంటున్నారు అధికారులు. జగిత్యాల జిల్లాలో ఆరురకాల జాతులకు చెందిన కొంగలు కనిపిస్తున్నాయి. మహబూబాబాద్ మండలం జమాండ్ల పల్లి శివారులో కొంగర గిద్ద పక్షి కనిపించింది. దాదాపు 20 ఏండ్ల తర్వాత ఈ పక్షిని చూశామంటున్నారు స్థానికులు. కురవి మండలం శివారులో వడ్రంగి పిట్టలు పదిహేనేండ్ల తర్వాత కనిపించాయి. 20 ఏండ్లుగా జాడలేని పెద్దపులి సైతం ఇటీవల భూపాలపల్లి కానలో సంచరించడం విశేషం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెంచికల్పేట్లోని చిలుకలగుట్టలో రాబందులు ఆవాసం ఏర్పరచుకున్నాయి. అనంతగిరి అటవీ ప్రాంతంలో సుమారు 180 రకాల పక్షులు ఉన్నాయని హైదరాబాద్ బర్డ్స్ అసోసియేషన్ చెబుతున్నది. హిమాలయాలతోపాటు అసోం అడవుల్లో మాత్రమే కనిపించే ప్యారడైజ్ ఫ్లైక్యాచర్ అనే ఓ ప్రత్యేక పక్షి జాతితోపాటు సెవెన్ సిస్టర్స్ అనే పక్షులూ ఇక్కడికి వలస రావడం విశేషం.
పాకాలకు డస్కీ ఈగల్
వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల ప్రాంతానికి వలసపక్షుల సంఖ్య రెండు మూడేండ్లుగా క్రమంగా పెరుగుతున్నది. పాకాల అభయారణ్యంలో వెయ్యి ఎకరాల్లో చేపట్టిన ప్లాంటేషన్ పనులతో మైదాన ప్రాంతంలో, చెట్లపై సంచరించే పక్షులకు ఇది నెలవుగా మారింది. నిశాచర పక్షులకూ ఈ ప్రాంతం కేరాఫ్ అయింది. గతంలో ఇక్కడ రెండు రకాల గుడ్లగూబలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఏడు రకాల జాతులు ఇక్కడ ఆవాసం ఉంటున్నాయి. వీటిలో ఉత్తరాదిలో కనిపించే ‘డస్కీ ఈగల్' గుడ్లగూబ దక్షిణాదిలో కేవలం పాకాలలోనే దర్శనమివ్వడం విశేషం. డస్కీ ఈగల్‌తోపాటు పైడికంటి, బార్న్, బ్రౌన్ ఫిష్, మోటిల్డ్, అడవి గుడ్లగూబలు వివిధ ప్రాంతాల నుంచి పాకాల అభయారణ్యానికి చేరుకున్నాయి.
దేవాదుల జలాల సాక్షిగా..
సంక్రాంతి సీజన్లో పలు ప్రాంతాల్లో సైబీరియన్ పక్షుల జాడ కనిపిస్తుంది. దశాబ్దాల కిందట జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చినమాడూరు సైబీరియన్ పక్షుల సంతానానికి వృద్ధి కేంద్రంగా ఉండేది. శీతకాలంలో రంగురంగుల రెక్కల కొంగలు ఇక్కడకు చేరుకొని గ్రామంలోని గోపి చెరువును నివాసంగా ఏర్పర్చుకునేవి. నెలలపాటు విడిది చేసి తమ సంతానాన్ని పెంపొందించుకొని పిల్లలతో కలిసి స్వస్థలాలకు వలస వెళ్లేవి. గోపి చెరువు ఎండిపోవడంతో ఈ విదేశీ అతిథుల రాక ఆగిపోయింది. రెండేండ్ల నుంచి దేవాదుల జలాలతో గోపి చెరువు జలకళ సంతరించుకుంటున్నది. దీంతో విదేశీ విహంగాల రాకడ మళ్లీ మొదలైంది. గుంపులుగా వచ్చినా ఒంటరి పక్షులే ఇవి! ఇక్కడికి వచ్చాక జంటను చూసుకుంటాయి. చెరువంతా తుంటరిగా తిరుగుతాయి. చెరువు గట్టునున్న చెట్లపై గూళ్లు కట్టుకుంటాయి. గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లల్ని కంటాయి. వాటికి రెక్కలొచ్చి ఎగరడం అలవాటయ్యాక పుట్టింటికి సెలవు చెప్పి స్వస్థలాలకు వెళ్లిపోతాయి. దేవరుప్పుల వాగుపై చౌడూరు, పెదమడూరు, కడవెండి, దేవరుప్పుల దగ్గర కట్టిన చెక్‌డ్యాంలతో 12 కిలోమీటర్ల మేర జలసిరి నిలిచి ఉండటంతో జలచరాలూ సమృద్ధిగా పెరిగాయి. దీంతో ఆహారానికి కొదువ లేకపోవడంతో అన్ని రకాల పక్షులూ ఈ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నాయి.
కిన్నెరసానిలో వన్నెల పక్షులు
అంతరించిపోతున్న జంతుజాతులను సంరక్షించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం కిన్నెరసాని అభయారణ్యాన్ని ఏర్పాటుచేసింది. ఈ అభయారణ్యం జింకలు, దుప్పులు, అడవి బర్రెలు, దున్నలు, ఎలుగుబంట్లతోపాటు అనేక రకాల పక్షిజాతులకు ఆలవాలమైంది. ఈ ప్రాంతంలోని కిన్నెరసాని ప్రాజెక్టు నీటిలో సేదతీరుతూ అవి మనుగడ సాగిస్తున్నాయి. భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట, పాల్వంచ తదితర ప్రాంతాల్లోని అడవులు కూడా జీవవైవిధ్యానికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. గోదావరి తీరం వెంబడి కూడా అనేకరకాల జంతుజాతులు రక్షణ పొందుతున్నాయి.
దేవునూర్‌లో పునుగుపిల్లి
వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్‌లో ఈనెల 14న ఓ రైతు బావిలో పునుగు పిల్లి కనిపించింది. అటవీశాఖ అధికారులు దానిని బయటకు తీసి అత్యంత అరుదైన జంతువుగా గుర్తించారు. తిరుమల అటవీ ప్రాంతంలో ఉండే ఇది దేవునూర్ ప్రాంతంలో కనిపించడం విశేషం. పునుగు పిల్లి కాఫీ కాయలు తిని గింజలను విసర్జిస్తుందని, ఈ గింజలతో తయారుచేసే కాఫీ అత్యంత ఖరీదని చెపుతుంటారు. ఒకకప్పు కాఫీ రూ.5వేల దాకా ఉంటుందని పేర్కొంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట కొమ్ములవంచ శివారు పాతచెరువు, కొత్తచెరువు, ఆకేరు అనకట్ట మత్తడి వద్ద మత్సకారుల వలలకు ఇటీవల సముద్రపు చేపలు చిక్కడం స్థానికంగా ఆశ్చర్యాన్ని కలిగించింది.
కృష్ణజింకల సందడి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ పరిసరాల్లో అరుదైన కృష్ణజింకలు వేలసంఖ్యలో తారసపడ్డాయి. ఇక్కడ నెమళ్లు గుంపులు గుంపులుగా నర్తిస్తూ ఆశ్చర్యపరుస్తాయి. కామారెడ్డి జిల్లాలోని పోచారం అభయారణ్యం ప్రాంతంలో చిరుతల సంచారం బాగా పెరిగింది. నక్కలు, ఇండియన్ వోల్ఫ్‌గా పేరొందిన తోడేళ్లు సైతం ఉనికికి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అంతరించిపోయిన అలుగులు అనే జీవి మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో వెలుగు చూడటం విశేషం.
సీతాకోకలకు ఆలవాలం
ఎక్కడైతే సీతాకోకచిలుకలు సంచరిస్తాయో అక్కడ జీవవైవిధ్యం పరిఢవిల్లుతుందని పర్యావరణవేత్తలు చెబుతారు. ఈ మాటను నిజం చేస్తూ తెలంగాణలో అరుదైన సీతాకోకలు రెక్కలు తొడిగి రెపరెపలాడుతున్నాయి. జగిత్యాల జిల్లా అటవీ ప్రాంతంలో అరుదైన సీతాకోక చిలుకలు ఉన్నట్టు ఇటీవలి పరిశోధనల్లో తేలింది. జిల్లాలోని కొడిమ్యాల మండలంలోని శనివారంపేట, మల్యాల మండలం ఒడ్యాడ్ మధ్య ఉన్న అడవిలో వీటి జాడ తెలిసింది. నీటి సామర్థ్యం పెరుగడం, అటవీ ప్రాంతంలో నీటి ఊటలు అధికంగా ఉండటంతో సీతాకోకచిలుకలు మట్టిలోని ఉప్పును స్వీకరించేందుకు పెద్దసంఖ్యలో వస్తున్నాయని పరిశోధనలో తేలింది. దాదాపు 160 జాతుల సీతాకోకచిలుకలు ఉన్నట్టు గుర్తించారు. ‘స్పెక్ట్ కాంటినెంటల్ స్విఫ్ట్' అనే సీతకోక చిలుక ఉనికిని తెలంగాణలో తొలిసారిగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవుల్లో 45 రకాల సీతాకోకచిలుకలు సంచరిస్తున్నట్టు పరిశోధనలో తేలింది.
కనకగిరిలో చిరుత
ఖమ్మం జిల్లా తల్లాడ దగ్గర్లోని కనకగిరి రిజర్వ్ ఫారెస్టులో చిరుతపులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అడవిలో ఏర్పాటుచేసిన కెమెరాల్లో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించారు. ఇది మాత్రమే కాకుండా ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు, సాంబారు, నీలిగాయ, అడవిదున్న, నెమళ్లు, అడవికుందేళ్లు, అడవిపందులు లాంటి జంతువులతోపాటు గువ్వలు, కోకిలలు, ఊరపిచ్చుకలు, పైడిబాగ్బర్డ్స్, గ్రీన్హార్న్బిల్ తదితర పక్షుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతున్నట్టు వారు పేర్కొన్నారు.
-నమస్తే తెలంగాణ, న్యూస్ నెట్వర్క్
తాజావార్తలు
- ట్రాక్టర్ ర్యాలీ: 550 ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్!
- వరుణ్, నటాషా వెడ్డింగ్ : తాజా ఫోటోలు వైరల్
- వంటిమామిడి మార్కెట్‌యార్డును సందర్శించిన సీఎం కేసీఆర్
- 'ఆందోళన నుంచి వైదొలుగుతున్నాం'
- అధికారుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు
- బిగ్‌బాస్ ఫేం మెహబూబ్ 'ఎవరురా ఆ పిల్ల' వీడియో సాంగ్ కేక
- ఏపీలో కొత్తగా 111 మందికి కరోనా
- టాప్ 10 ఐటీ సేవల బ్రాండ్ ‘’ ఇన్ఫోసిస్
- రైతు సంఘాల్లో చీలిక.. వైదొలగిన రెండు సంఘాలు
- సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది : మంత్రులు