బుధవారం 27 జనవరి 2021
Sunday - Jan 10, 2021 , 00:22:39

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

నలుదిక్కులా మాడవీధులు.. సప్త గోపురాలు.. అంతర్‌ బాహ్య ప్రాకారాలు.. ఆళ్వార్ల విగ్రహాలు, ముఖ మండపాలు, కాకతీయ సంప్రదాయ కృష్ణశిలా శిల్ప సౌరభంతో.. యాదాద్రి దివ్యక్షేత్రంగా, ఆధ్యాత్మిక నగరిగా రూపుదిద్దుకుంటున్నది.  పరమాత్ముని ప్రేరణ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సత్సంకల్పం, తెలంగాణ ప్రజల పుణ్యఫలాలు .. అన్నీ కలిసి ఓ మహాద్భుతాన్ని ఆవిష్కరించాయి. యాదాద్రి సమం క్షేత్రం బ్రహ్మాండే నాస్తికించన  అనిపించేలా అఖిలాండకోటి అధినాయకుడి ఆలయం నిర్మాణం జరుగుతున్నది. త్వరలోనే పనులు పూర్తవుతాయి. మూలవిరాట్టు దర్శనం ప్రారంభం అవుతుంది. ప్రపంచమంతా చేతులు జోడించి యాదాద్రి వైపుగా వరుసలు కట్టే సుముహూర్తం ఎంతో దూరంలో లేదు. క్షేత్ర దర్శనానికి ముందు, క్షేత్ర  మహత్తు తెలుసుకుంటేనే యాత్రాఫలం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని పెద్దలు చెబుతారు. నిన్నమొన్నటి తరాలకు ఆలయ ప్రశస్తి ఎంతో కొంత ఎరుకే. కానీ, నేటి తరానికి యాదాద్రి కథలు తెలియవు. ఈ లోటు తీర్చడానికి, ఆ ఆధ్యాత్మిక అగాథం పూడ్చడానికి ‘బతుకమ్మ’ తన బాధ్యతగా ఈ ధారావాహికను ప్రారంభిస్తున్నది.

 జై నారసింహా.. జై జై నారసింహా

 జయజయశ్రీ యాదగిరి నారసింహా      

ఓమ్‌ నమో నారసింహాయ

వజ్ర దంష్ర్టాయ వజ్రిణే

వజ్ర దేహాయ వజ్రాయ

నమో వజ్రనఖాయచ॥

బ్రాహ్మీ ముహూర్తంలో.. వేకువ నక్షత్ర శుభ సమయంలో.. కొండల గుండెలలో మార్మోగుతున్న మహామంత్రం. అనేక లక్షల గళాల సుస్వర వేదమంత్రంలా వినవస్తున్న ఆ సింహనాదం తన హృదయంలోనే ప్రతిధ్వనిస్తున్నదా అన్నట్టుగా శరీరం వణికిపోతున్నది.

జ్వాలా నరసింహుడు

యోగానంద నరసింహుడు

గండభేరుండ నరసింహుడు

భక్తాభయ నరసింహుడు

శ్రీ లక్ష్మీ నరసింహుడు 

ఈ నారసింహ మూర్తులు ఐదుగురూ - పంచనారసింహ క్షేత్రంలో వెలసిన వేదగిరి.. యాదర్షి తపో సంపన్నం చేసిన యాదాద్రి! ముక్కోటి దేవతలు ఒక్కటై- భూమండలంలో గ్రహపీడలను తొలగించి, సుఖ సంతోషాలను- అష్టయిశ్వర్యాలను ప్రసాదించమని సర్వశక్తియుతంగా ముక్తకంఠంతో ప్రార్థిస్తున్నట్టుగా ఉన్నది.

ఓమ్‌ - నమో నారసింహాయ

కనులముందు దివ్యమైన అవతారం కనిపిస్తున్నది. 

అది నారసింహావతారం!

శ్రీలక్ష్మీనరసింహుని ప్రసన్నరూపం!

“ఏమిటిది స్వామీ! నిజమా- కలా?”

దేనికి సంకేతమిది? ఏ గమ్యాన్ని, ఏ గమనాన్ని సూచిస్తున్నది? 

ఈ ప్రశ్నలూ, ఈ దృశ్యాలు - చూస్తున్నది ఒక వృద్ధ బ్రాహ్మణుడు.. గుళ్లపల్లి రామభట్టు, రోజూ పూజలు చేసే పరమ ధార్మికుడు.కంపించిపోతున్న దేహం. వణుకుతున్న స్వరం. దూరంగా ఎక్కడో.. ఎవరికీ కనిపించని దృశ్యాలు చూస్తున్న దిక్కు తెలియని చూపులు.

“వస్తున్నానయ్యా- శ్రీ లక్ష్మీనరసింహా, 

నీ దగ్గరికే వస్తున్నానయ్యా-”

“అదిగో నా సింహదేవుడు. అన్ని రోగాలనుండి మనల్ని విముక్తం చేసే మహావైద్యుడు. దారిద్య్రాలను దూరం చేసి ఐశ్వర్యాన్నిచ్చే లక్ష్మీనరసింహుడు. తనని చూడమంటున్నాడు. రా.. రా! నా దర్శనం చేసుకోరా.. అని పిలుస్తున్నాడు. అక్కడే అఖండమైన జ్వాలా తోరణం కనిపిస్తున్నది. ఆదిశేషుని రూపమైన ఒక మహాసర్పం- కొండను చుట్టుకుంటూ జ్వాలా నరసింహుని పాదాలను అర్చిస్తున్నది. సకల దోషాలను మటుమాయం చేసే స్వామివారి బెత్తం- వరవేత్తం- మనల్ని పునీతులుగా చేసేందుకు సిద్ధంగా ఉంది. 

వెళ్దాం పదండి.

స్వామివారి దర్శనానికి పదండి”

ఉన్మాదిలా ఊగిపోతున్నాడు రామభట్టు. ఆయన అరుపులకు ఊరు ఊరంతా నిద్ర లేచింది. చుట్టూ మూగిన గ్రామస్థులు రామభట్టును గట్టిగా పట్టుకున్నారు. తన భర్తకు ఏం జరిగిందో, ఏం జరుగుతున్నదో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ఆయన భార్య కన్నీటితో దండం పెడుతున్నది. భర్త పరిస్థితి చూసి ఆమెకు నోట మాట రావడం లేదు.గ్రామాధికారి భద్రయ్య పరుగుపరుగున వచ్చాడు. రామభట్టు భక్తీ, ఆవేశం చూసి ఆశ్చర్యపోయాడు. “రామభట్టుగారూ- శాంతించండి. ఏం జరుగుతున్నదో మాకర్థం అయ్యేట్టు చెప్పండి.”అప్పుడు కొద్దిగా స్పృహలోకొచ్చాడు రామభట్టు.దూరంగా కనబడుతున్న కొండమీద నుండి చూపు మరల్చి, చుట్టూ చూశాడు. ఊరంతా తనను వింతగా చూస్తున్నారు. భార్యను చూస్తే, పరిస్థితి కొంత అర్థం అయింది.నారసింహుని వైభవం, ఆదిశేషుని అర్చన, మునీశ్వరుల స్తోత్రాలు- ఇదంతా కలా, నిజం కాదా? మరి దట్టమైన అడవి మధ్యలో ఓ కొండ, కొండపైన ప్రాచీన ఆలయం, జ్వాలా తోరణం- ఇవన్నీ నిజంగా కళ్లముందే కనబడినప్పుడు అది కల- ఎలా అవుతుంది.నిజంగానే సింహదేవుడు తనని రమ్మంటున్నాడు-“అదిగో ఆ అడవిలో కొండ- ఆ దేవదేవుడే మనందరికీ అండ.. పదండి వెళ్దాం” అన్నాడు దృఢంగా!అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు.గ్రామాధికారి భద్రయ్య ఆలోచించాడు. రామభట్టు పిచ్చివాడు కాదు. కలను నిజమనుకునే అయోమయస్థితి కలవాడు కానేకాదు. వేదవేదాంగాలు చదివిన పండితుడు. ధర్మానికే దారిచూపే ధార్మికుడు.“అయ్యగారూ, మీకు దర్శనమిచ్చిన సింహదేవుడు ఎక్కడున్నాడు?”“అదిగో- ఆ అడవిలోనే, ఆ కొండమీదనే కొలువై ఉన్నాడు నా స్వామి నరసింహస్వామి!”

“ఆ కొండపైనా-? దట్టమైన ఆ అడవిలోకి వెళ్ళడానికి మనకెలా సాధ్యమవుతుంది? కాలసర్పాలూ, క్రూరమృగాలు తిరిగే అడవిలోకి మనం ఎట్లా వెళ్ళగలం? పులులూ, సింహాలకే తప్ప ఆ సింహదేవుని దర్శనం మన లాంటి మనుషులకు సాధ్యం కాదు. కలలో చూసి మీరు చెప్తున్న క్షేత్ర దర్శనం కలలోనే చూడవలసింది. అదీ మీవంటి వేద పండితులే- మా వంటి సామాన్యులకు స్వామివారి దర్శనం దొరకదు”

..ఆ మాటలు విని రామభట్టు ఆలోచనలో పడ్డాడు.

“గ్రామాధికారిగారూ! ఇది మనవంటి సామాన్యులకు సాధ్యం కాకపోవచ్చు. కానీ సర్వశక్తి సంపన్నులైన చక్రవర్తులకు అసాధ్యం కాదు. పాలకుడికి సత్సంకల్పం ఉంటే ప్రజలకు స్వామివారి దర్శనభాగ్యం ఉంటే- నా కల నిజమవుతుంది. నాకు నమ్మకముంది. మన రాజుగారు ఈ విషయం తెలుసుకుంటే అడవిలోంచే మార్గం వేస్తారు. కొండమీద ఆలయాన్ని ప్రజలు సందర్శించుకునే విధంగా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయిస్తారు. కానీ మనవంటి సామాన్యులకు చక్రవర్తిని కలిసే అవకాశం ఎలా దొరుకుతుంది? చూద్దాం- స్వామివారి అనుగ్రహ ఫలం ఏ రకంగా ఉండబోతున్నదో..?”రామభట్టు అనుకున్నది నెరవేరడం దాదాపు అసాధ్యమని అందరికీ తెలుసు. చక్రవర్తుల దర్శనం కాదు, వారి అనుచరుల, అధికారుల దర్శనం కూడా అంత సులభ సాధ్యం కాదు.మరి ఇది చక్రవర్తుల వారి దృష్టికి చేరుతుందా?

“మహాభూమండలేశ్వర విక్రమాంకదేవ సార్వభౌమా! భువనగిరి అధినేతా! త్రిభువనమల్లు చక్రవర్తీ! జయము... జయము”

జయజయ ధ్వానాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. తనను ఆశీర్వదిస్తున్న కవివరేణ్యులు విద్యాపతికి అభివాదం చేశాడు త్రిభువన మల్లుడు.

వజ్రాలు, రత్నాలు తాపడం చేసిన సింహాసనంపైన కూర్చుని సభాసదులను తమతమ ఆసనాలలో కూర్చోవలసిందిగా సైగ చేశాడు. మంత్రులు, దండనాయకులు, పండితులు అధికారులు ఆసీనులైన ఆ సభా ప్రాంగణం భువనగిరి కోటలోనిది. శోభాయమానమైన ఆ సభ ఈ రోజున గంభీరంగా, ఉద్విగ్నంగా ఉంది.

కారణం- త్రిభువన మల్లుని ప్రసంగం!

దాన్ని ప్రసంగం అనేకంటే, బయటికి చెప్పిన స్వగతం అనవచ్చు. గతానికి సంబంధించిన కష్టనష్టాలు, వర్తమానానికి సంబంధించిన సుఖదుఃఖాలు, భవిష్యత్తుకు సంబంధించిన భయాందోళనలూ సభ ముందు ఉంచిన 

విపత్కర సందర్భం అది!

“సభా సదులారా! భువనగిరి దుర్గము దుర్భేద్యం. భువనగిరి సామ్రాజ్యం పసిడిపంటల హరితభూమి. ప్రజలు ధార్మికులు. అధికారులు ఆత్మీయులు. కాని పాలకుండలో ఒక బొట్టు విషం పడ్డా.. అది మొత్తాన్ని కలుషితం చేస్తుంది. ఏ చక్రవర్తి అయినా తను కోరుకునేది ఒక్కటే.. రాజ్యంలో సుఖశాంతులు, శాంతిభద్రతలు పదిలంగా ఉండాలని. ప్రజలు కోరుకునేది సుస్థిరత, సుభిక్ష పరిస్థితి.

ఆయన మాటకు అడ్డొస్తూ అన్నది రాణి. “ప్రభూ! ఇంత నిర్వేదం చెందవలసిన 

పరిస్థితులు ఉన్నాయా”

“మహారాణీ! చంద్రలేఖా! మేము ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నాం. ఎందరినో ఎదిరించాం. విజయాన్ని సాధించాం. న్యాయాన్ని ధర్మాన్ని పాటిస్తూ పరిపాలన నిర్వహిస్తున్నాం. సామ్రాజ్యాన్ని సంరక్షించే వీరఖడ్గమే కాదు, ప్రజల సంక్షేమాన్ని కూడా పరిరక్షించే ప్రణాళిక ఉండాలని మా దృఢ విశ్వాసం. కానీ అనుకోని ఆపద ఎదురైంది. మాలో మేమే ఇంతకాలం మథన పడ్డాం. ఇక దాన్ని బహిర్గతం చేయదలిచాం.”

ఒక్కసారిగా సభా ప్రాంగణమంతా నిశ్శబ్దం ఆవరించింది. భువనగిరి సామ్రాజ్యాధినేత త్రిభువనమల్ల చక్రవర్తికి అసహాయ పరిస్థితా? ఆపదా? అంతు తెలియని భయ సందేహాలు అందరి మనసుల్లోకి నిప్పులేని పొగలాగ.. క్రమక్రమంగా ప్రవేశించి ఊపిరిని క్షణకాలం స్తంభింపజేశాయి.

-అల్లాణి శ్రీధర్‌

(మిగతా వచ్చేవారం)logo