ప్రతిభ ఒక్కటే సరిపోదు

తెలుగు చిత్రసీమలో సుదీర్ఘకాలంగా నృత్య దర్శకుడిగా కొనసాగుతున్నారు తెలంగాణకు చెందిన అన్నారాజ్ (రాజు). అరవై పైచిలుకు చిత్రాలకు నృత్యరీతుల్ని సమకూర్చారు. బాలీవుడ్ చిత్రాలకూ కొరియోగ్రఫీ చేశారు. నృత్య దర్శకుల సంఘాల్లో కూడా కీలక పదవులు నిర్వహించారు. ‘ఒక్కడున్నాడు’, ‘మల్లెపూవు’, ‘సత్యభామ’ వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ‘బతుకమ్మ’ పలుకరించినప్పుడు అన్నారాజ్ పంచుకున్న సంగతులివి..
మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపురం నా స్వగ్రామం. సరస్వతి శిశుమందిర్‌లో చదవడం వల్ల పదోతరగతిలోనే శాస్త్రీయ నృత్యం నేర్చుకునే అవకాశం దక్కింది. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత బ్రేక్ డ్యాన్స్ సాధన చేశాను. 1998లో సినిమాల్లో అడుగుపెట్టాను. తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలి వస్తున్న రోజులవి. తొలుత గ్రూప్ డ్యాన్సర్‌గా నా కెరీర్ మొదలైంది. ‘ధర్మచక్రం’, ‘అనగనగా ఒకరోజు’ వంటి సినిమాలు మొదలుకొని తెలుగు, హిందీ భాషల్లో రెండొందల చిత్రాలకు గ్రూప్ డ్యాన్సర్‌గా పనిచేశాను. కొన్నేండ్ల తర్వాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ‘ఒక్కడున్నాడు’ ద్వారా కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఆరంభమైంది. ‘బ్లేడ్ బాబ్జీ’, ‘మల్లెపువ్వు’, ‘సత్యభామ’, ‘సారాయి వీర్రాజు’, ‘అయ్యారే’, ‘వారేవా’, ‘లవ్యూ బంగారం’, ‘రైడ్', ‘కొత్త జంట’, ‘బిల్లా రంగా’ తదితర చిత్రాలు కొరియోగ్రాఫర్‌గా నాకు మంచి గుర్తింపునిచ్చాయి.
హీరో ఇమేజ్‌కు అనుగుణంగా..
నృత్యరీతులు సమకూర్చే విషయంలో హీరో ఇమేజ్‌కు పెద్దపీట వేస్తాం. మాస్లో అతనికి ఉన్న ఫాలోయింగ్, బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే స్టెప్పులపై ఎక్కువగా దృష్టిపెడతాం. డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉన్న కథానాయకులైతే మా పని కాస్త సులువుగా అయిపోతుంది. ఒకవేళ హీరోకు డ్యాన్స్‌లో ప్రతిభ అంతంత మాత్రమే ఉంటే, అతని శారీరక భాషకు సరిపోయే నృత్యరీతుల్ని కంపోజ్ చేయాల్సి ఉంటుంది. ఓ పాటకు లభించే గుర్తింపు కూడా, హీరో ఇమేజ్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
దర్శకుడి సలహాలు తీసుకుంటాం
సినిమాతో ముడిపడిన ఏ కళ అయినా దర్శకుడి దృష్టికోణం నుంచే ఆవిష్కృతమవుతుంది. నృత్యం విషయంలోనూ దర్శకుడి సలహాల్ని పాటించాల్సి ఉంటుంది. సినిమాలో పాట సందర్భం ఏమిటి? దానికి ఎలాంటి డ్యాన్స్ కంపోజ్ చేయాలి? సెట్, కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి? ఎలాంటి ఎలిమెంట్స్ ఎలివేట్ చేయాలి? ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఓ పాటకు నృత్యరీతుల్ని సమకూర్చాల్సి ఉంటుంది. ఇక మాంటేజ్ పాటల్లో దర్శకుడి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసిన తర్వాత దర్శకుడికి, హీరోకు ముందుగానే చూపిస్తాం. పాటలోని నృత్యరీతులకు తగినట్లుగా తన బాడీ లాంగ్వేజ్ ఆడ్జెస్ట్ అవుతుందో లేదో తెలియజేస్తాడు. ఆయన సూచనలకు అనుగుణంగా ఫైనల్ కంపోజిషన్‌లో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇక, ఆ తర్వాత దశలో మేం, రిహార్సల్స్ సెషన్‌కు వెళతాం.
హీరో క్యారెక్టరైజేషన్ ముఖ్యం
హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్, మాంటేజ్ గీతాల విషయంలో హీరో క్యారెక్టరైజేషన్, భావోద్వేగాలు కీలక భూమిక పోషిస్తాయి. హీరో పరిచయ గీతాన్ని, సినిమాలో అతని పాత్ర స్వభావం ప్రతిబింబించేలా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. నాయకానాయికల ప్రణయ గీతాల్లో సున్నితమైన హావభావాలతో పాటు వారి మధ్య ఉన్న ప్రేమబంధాన్ని ఆవిష్కరించాలి. అలా ఒక్కో పాటకు కొన్ని నియమాలుంటాయి. వాటన్నిటినీ పాటించినప్పుడే నృత్య శైలి, అందులోని ఉద్వేగం ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. ఇక ఐటెమ్ పాటల విషయంలో వినోదం, జోష్ అంశాలపై ఎక్కువగా దృష్టిపెడతాం. ప్రత్యేక గీతాలంటే మాస్ ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. కాబట్టి, అలాంటి వాటి కంపోజింగ్ విషయంలో శ్రమ అధికంగానే ఉంటుంది.
పోటీ పెరిగింది
ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండొందల మందికి పైగా డ్యాన్స్ డైరెక్టర్స్ ఉన్నారు. అందులో ఓ పదిమంది కెరీర్ మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నది. అంటే మిగతా వాళ్లు ప్రతిభ లేక వెనుకబడ్డారని కాదు. పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే ఉంటే సరిపోదు. పరిచయాలు, రెఫరెన్సులు చాలా ముఖ్యం. పెద్ద సినిమాల్లో కొత్త కొరియోగ్రాఫర్లను తీసుకునే విషయంలో దర్శకనిర్మాతలకు అభద్రతా భావం ఉంటుంది. కొత్తవాళ్ల ప్రతిభపై నమ్మకం ఉన్నా.. హీరోల అంచనాలకు వాళ్లు చేరుకుంటారో లేదోనన్న సంశయాలుంటాయి. దాంతో రిస్క్ తీసుకోకుండా ఎస్టాబ్లిష్డ్ కొరియోగ్రాఫర్స్‌ను ఎంపిక చేసుకుంటారు. చాలా మంది అగ్రహీరోలు తమతో ముందు నుంచి ప్రయాణం చేస్తున్న కొరియోగ్రాఫర్స్తోనే వృత్తిపరమైన అనుబంధాన్ని కొనసాగిస్తారు.
సొంత స్టయిల్‌తో..
ఒకప్పుడు కొరియోగ్రాఫర్స్ పేర్లు తెర వెనుకే ఉండేవి. సినిమాలకు ఎవరు నృత్యరీతులు సమకూర్చారో ప్రేక్షకులకు అంతగా తెలిసేది కాదు. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. తెరపై హీరోల డ్యాన్స్ మూమెంట్స్‌ను చూసిన వెంటనే, వాటికి ఎవరు కంపోజ్ చేశారో చెబుతున్నారు. కొరియోగ్రాఫర్స్ సామాన్య ప్రేక్షకులకు కూడా అంతగా తెలిసిపోయారు. తమ వ్యక్తిగత ప్రతిభతో సొంత మార్క్‌ను సృష్టించుకోవడంలో చాలా మంది నృత్య దర్శకులు సక్సెస్ అవుతున్నారు. ప్రభుదేవా, లారెన్స్ పేర్లు గుర్తుకురాగానే వారి నృత్యశైలి కళ్లముందు కదలాడుతుంది. ప్రతిభతో పాటు అవకాశాలను అందిపుచ్చుకునే నేర్పు ఉంటే ఈ రంగంలో మంచి స్థానానికి చేరుకోగలం. ప్రస్తుతం నేను ‘బోలో హవా’ అనే బాలీవుడ్ సినిమాకు డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నా. అనిల్‌కపూర్, సోనాలీబింద్రే జంటగా నటిస్తున్న సినిమాకూ నృత్యరీతులను సమకూర్చనున్నా.
స్టయిల్ మారింది కానీ...
ఐటెమ్‌సాంగ్స్ ఇండస్ట్రీ ఆరంభం నుంచీ ఉన్నాయి. అయితే వాటి మేకింగ్‌లో మార్పులొచ్చాయి. పాత చిత్రాల్లో హీరోహీరోయిన్లు రెగ్యులర్ కాస్ట్యూమ్స్ ధరించి ప్రత్యేక గీతాల్లో ప్రేక్షకుల్ని హుషారెత్తించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి, స్పెషల్ సాంగ్స్ మేకింగ్‌లో కొత్త ధోరణులు వచ్చాయి. ప్రస్తుతం ఐటెమ్‌సాంగ్స్ విషయంలో కాస్ట్యూమ్స్ మొదలుకొని సెట్ నిర్మాణం కూడా ప్రముఖ ప్రాత పోషిస్తున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రత్యేక గీతాల కంపోజింగ్‌లో వైవిధ్యం కోసం ప్రపంచవ్యాప్తంగా డ్యాన్స్ ఇండస్ట్రీలో ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయో పరిశీలిస్తుంటారు.
అన్ని శైలులూ తెలియాలి
నృత్యంతో ముడిపడిన ‘సాగరసంగమం’, ‘స్వర్ణకమలం’ వంటి చిత్రాలకు శాస్త్రీయ నృత్యంలో నిష్ణాతులైన వారే కొరియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం సంప్రదాయ నృత్య నేపథ్యంతో సినిమాలు రావడం లేదు. ఆ దిశగా ఎవరూ ప్రయత్నాలు చేయడం లేదు. ఇప్పుడు సినిమాల్లో ప్రధానంగా వెస్ట్రన్, ఫోక్, పాప్..కలబోసి ఫ్యూజన్ తరహాలో సరికొత్త నృత్యరీతుల్ని అందించాలని కొరియోగ్రాఫర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడున్న పోటీలో రాణించాలంటే నాట్యకళలోని అన్ని రీతులపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. అంతేకాదు ఎక్కడ ఏది అవసరమో అంచనావేసి, కంపోజ్ చేసే
నేర్పు ఉండాలి.
-కళాధర్ రావు
తాజావార్తలు
- సుధీర్ బాబు లెగ్ వర్కవుట్స్..వీడియో వైరల్
- పసుపు రైతులను ఆదుకోవడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలం
- వివాహ విందు కోసం వచ్చి.. కానరాని లోకాలకు..!
- అమిత్ షా పదవికి రాజీనామా చేయాలి : రణదీప్ సూర్జేవాలా
- మీ పిల్లలకు రైస్ మిల్క్ తాగిస్తున్నారా!
- అన్‌లాక్ : తెరుచుకోనున్న స్విమ్మింగ్ పూల్స్
- 23 లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
- ఒకే రోజు 8 చిత్రాలు..జనవరి 29న సినీ జాతర..!
- విశాఖ ఉక్కు ప్రైవేటుపరమైనట్లేనా..?
- బ్లడ్‌లో హై ఒమెగా-3 ఫ్యాట్‌తో నో కొవిడ్ రిస్క్