శుక్రవారం 22 జనవరి 2021
Sunday - Jan 09, 2021 , 23:56:15

ఈ గ్రంథాలయం వయసు 103 ఏండ్లు

ఈ గ్రంథాలయం వయసు 103 ఏండ్లు

కాల ప్రవాహంలో ఎన్నో కొట్టుకుపోతాయి. గడ్డుకాలానికి ఎదురొడ్డి, కాలానుగుణంగా మారుతూ.. కలకాలం నిలిచిపోయేవి కొన్ని ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, వాటిని అద్భుతాలు అనాల్సిందే! అలాంటి ఓ అద్భుతం ఆంధ్ర సరస్వతి నిలయం. నల్లగొండ నడిబొడ్డున ఉన్న ఈ గ్రంథాలయం వయస్సు అచ్చంగా 103 ఏండ్లు. పఠనాసక్తి సన్నగిల్లుతున్న  రోజుల్లోనూ ఈ శతాధిక సంస్థకు అభిమానులు ఉన్నారు. ఈ పుస్తక నిధి వైభవాన్ని చదివేయండి.

1918 మార్చి 13న ప్రారంభమైంది ఆంధ్ర సరస్వతి నిలయం. భవిష్యత్‌ తరాల కోసం ఆ తరం పెద్దలు ఏర్పాటు చేసిన గ్రంథాలయం ఇది. పులిజాల వెంకటరామారావు, షబ్నవీసు వెంకట నరసింహారావు, జగిని ఆదినారాయణ గుప్త వంటి ప్రముఖులు దీని ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 152 పుస్తకాలతో ప్రారంభమైన ఈ గ్రంథాలయంలో 1950 నాటికే 16వేల పైచిలుకు పుస్తకాలు ఉండేవి. ప్రస్తుతం సుమారు 68వేల అపురూప గ్రంథాలు ఈ సరస్వతీ నిలయంలో కొలువుదీరాయి. తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్‌, ఉర్దూ, ఇతర భాషలకు చెందిన పుస్తకాలు కూడా చదువరులకు అందుబాటులో ఉన్నాయి.

సామాజిక వికాసిని

జ్ఞాన సంపదను అందించడంలోనే కాదు, ఉద్యమాలకు ఊపిరులూదడంలోనూ ఈ గ్రంథాలయం వేదికగా నిలిచింది. తెలంగాణ గడ్డమీద జరిగిన పలు పోరాటాలకు సజీవ సాక్షిగా నిలిచింది. సామాజిక వికాసానికి ఈ గ్రంథాలయం ఎంతగానో దోహదం చేసింది. అనేక ఉద్యమాలకు పురిటిగడ్డగా నిలిచిన నల్లగొండ ప్రాంతంలో రైతుసంఘం (వ్యవసాయదారుల), వర్తక సంఘం (వైశ్యుల), భజన సమాజం కార్యక్రమాలకు దీటుగా గ్రంథాలయోద్యమం కూడా జోరుగా సాగింది. నిత్యం సాహితీ సభలు, కవి సమ్మేళనాలు, రాజకీయ-సాంఘిక అంశాలపై చర్చలకు వేదికగా నిలిచి ఎందరిలోనో స్ఫూర్తిని రగిలించింది. ఆనాటి సమావేశాలకు దాదాపు 2,000 మంది వరకు హాజరవుతుండేవారు. సరస్వతి నిలయానికి ఆదరణ పెరుగుతుండటంతో తర్వాతి కాలంలో ప్రజల సహకారంతో పులిజాల రంగారావు ఈ గ్రంథాలయం కోసం నూతన భవనాన్ని కట్టించారు.

పాత పత్రికల నిధి

1953లో ఆంధ్ర సరస్వతి నిలయం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విలీనమైంది. నాటి నుంచి దినదిన ప్రవర్ధమానమై ప్రస్తుతం తెలంగాణలో ప్రామాణిక జిల్లా కేంద్ర గ్రంథాలయంగా విలసిల్లుతున్నది. ఈ సరస్వతి నిలయం ప్రేరణతోనే నీలగిరి గ్రంథాలయం, శ్రీ భారతి నిలయం గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 43 గ్రంథాలయాల స్థాపన జరిగింది. పురాతన గ్రంథాలెన్నో సరస్వతి నిలయంలో నేటికీ దర్శనమిస్తాయి. 1922లో షబ్నవీసు వెంకట నరసింహారావు ప్రారంభించిన నీలగిరి వార పత్రిక, అదే ఏడాది ఒద్దిరాజు సోదరులు స్థాపించిన ‘తెనుగు’ వారపత్రిక ప్రతులను ఇప్పటికీ సరస్వతి నిలయంలో చూడవచ్చు. దశాబ్దాల కిందట తెలంగాణలోని సాహితీ సాంస్కృతిక వైభవాన్ని ఈ పత్రికల ద్వారా తెలుసుకోవచ్చు.రూ.5 భోజన సౌకర్యం

శతాధిక వసంతాలు గడిచినా ఆంధ్ర సరస్వతి నిలయానికి ఆదరణ తగ్గలేదు. నేటికీ వందలాది మంది విద్యార్థులు, చదువరులు నిత్యం గ్రంథాలయానికి వస్తుంటారు. పోటీపరీక్షలకు కావలసిన సమస్త సమాచార పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీంతో ఉద్యోగార్థులు సరస్వతి నిలయం నీడలో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. ఇక్కడి రీడింగ్‌ హాల్‌లో ఒకేసారి వందమంది చదువుకునే వీలుంది. పోటీపరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారి కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అందులో ఒకేసారి 50 మంది కూర్చొని చదువుకోవచ్చు. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రంథాలయానికి వచ్చే వారి కోసం రూ.5 భోజన వసతి కల్పించడం విశేషం. ప్యూరిఫైడ్‌ వాటర్‌ సౌకర్యం కూడా ఉంది. చదువుకునే వారికి ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ సహకారంతో ఈ సౌకర్యాలు కల్పించామని చెబుతున్నారు గ్రంథాలయ నిర్వాహకులు. నూరేండ్ల ఘన చరిత్రకు సాక్షిగా నిలుస్తూ మది మదిలో మనోవిజ్ఞానాన్ని రేకెత్తిస్తూ, ప్రతి మెదడులో జ్ఞానజ్యోతిని వెలిగిస్తున్న ఈ గ్రంథాలయం.. సరస్వతీ కటాక్షానికి చిరునామాగా మరిన్ని శతాబ్దాలు ఉంటుందనడంలో సందేహం లేదు.

- డా॥ రవికుమార్‌ చేగొని, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం

మహామహులు మాట్లాడిన చోటు

సరస్వతి నిలయంలోని ఆడిటోరియం ఎన్నో సాహితీ కార్యక్రమాలకు వేదిక. సురవరం ప్రతాపరెడ్డి, రామచంద్రనాయక్‌, గౌరు వెంకట్రామయ్య, ఆడేపల్లి మృత్యుంజయరావు, భాగ్యరెడ్డి వర్మ వంటి ఎందరో ప్రముఖులు గ్రంథాలయ వార్షికోత్సవ సభలు, ఇతర సమ్మేళనాల్లో పాల్గొని ప్రసంగించారు. ఇక్కడి ఆడిటోరియంలో పలు సాహితీ సభలు నిరాటంకంగా సాగుతున్నాయి. పిల్లల కోసం, మహిళల కోసం ప్రత్యేక విభాగాలున్నాయి. పత్రికల విభాగంలో ఒకేసారి యాభై మంది కూర్చొని చదువుకునే వీలుంది.


logo