బుధవారం 27 జనవరి 2021
Sunday - Jan 02, 2021 , 20:31:35

మనసా.. తెలుసా

మనసా.. తెలుసా

మానసికంగా ఎంత బలంగా ఉంటే శారీరకంగా అంత దృఢంగా ఉంటాం. మానసిక కుంగుబాటు శక్తిహీనులను చేస్తుంది. దిగులు, బాధ, ఒంటరితనం - తదితర భావోద్వేగాలు మనిషిని బలహీనుడిని చేస్తాయి. మానసికంగా ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడానికి ఇదో పరీక్ష.. 

 • శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా విశ్రాంతి అవసరమని నాకు తెలుసు. ఇందుకు నా ప్రయత్నం నేను చేస్తాను. 
 • రిలాక్సేషన్‌ కోసం అందమైన ఊహల్లోకి జారుకుంటాను. చక్కని దృశ్యాలను, గత స్మృతులను నెమరేసుకుంటాను. 
 • సవాలుగా నిలిచే పనులను ప్రశాంతంగానే చేయాలను కుంటాను. వాటిని బరువుగా భావించను. 
 • ఒకవేళ ఇష్టం లేని పని చేయాల్సి వచ్చినా మనసు పెట్టి చేస్తాను. 
 • మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయని నమ్ముతాను. 
 • నా సంపాదనను, శక్తియుక్తులను ఇతరులతో పోల్చుకోను.
 • రోజువారీ ధ్యానం వల్ల నాకెంతో మేలు జరుగుతుందని విశ్వసిస్తాను. దానిని అమలుచేస్తాను.
 • నా మంచి గురించి లేదా నా బలహీనతల గురించి ‘సెల్ఫ్‌ టాక్‌' (నాలో నేను, నాతో నేను మాట్లాడుకోవడం) నాకిష్టం ఉండదు. 
 • ఇతరుల ఆనందాలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాను. 
 • ఎవరైనా నన్ను విమర్శిస్తే నవ్వుతాను. ఎవరైనా నన్ను పొగిడినా సరే, నేలమీదనే నిలబడతాను. 

ఫలితాలు..

ఈ స్టేట్‌మెంట్స్‌లో మీరు కచ్చితంగా ఏకీభవించినవి, పక్కాగా ఆచరిస్తున్నవి ‘టిక్‌' చేశాక, ‘మానసిక అలసట’ విషయంలో మీరే స్థాయిలో ఉన్నారో బేరీజువేసుకోండి. ప్రతి టిక్‌కు ఒక మార్కు.

8-10 : మీరు టిక్‌ చేసిన విషయాలను ఆచరిస్తూ ఉంటే..  రోజువారీ వ్యవహారాలను చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ, మీరు మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారనే అనుకోవాలి. 

5-7 : మానసిక ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ పెట్టాలి.   అలసట, ఒత్తిడి.. తదితర నెగటివ్‌ ఉద్వేగాలను వదిలించుకోండి.

1-4 : ఈ స్కోరు ప్రమాద కరమైంది. మానసిక ఆరోగ్యాన్ని మీరు పట్టించు కోవడం లేదని అర్థం అవుతున్నది. మీ జీవన విధానాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దుకోవాలి. 

ఇవీ మార్గాలు

 • మంచి పుస్తకాలు చదవండి. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ బుక్స్‌ మాత్రమే కాకుండా భగవద్గీత లాంటి  గ్రంథాలూ మీకు మార్గ నిర్దేశం చేస్తాయి. 
 • ధ్యానం, యోగా శరీరానికి, మనసుకు బలాన్నిస్తాయి. 
 • స్పష్టమైన లక్ష్యాలు ఏర్పరచుకుంటే.. చిన్న చిన్న అవాంతరాలు ఇబ్బందికరంగా అనిపించవు. 
 • అనవసర ద్వేషాలు, కోపతాపాలు తగ్గించుకుంటే మెదడు మీద ఒత్తిడి తగ్గి, మానసిక అలసట దూరమవుతుంది. 
 • అన్నిటికన్నా ముఖ్యమైంది.. మీకు ఎదురైన పరిస్థితులను హుందాగా ఆమోదించండి.


logo