శుక్రవారం 15 జనవరి 2021
Sunday - Dec 13, 2020 , 00:32:17

చరిత్రకెక్కిన.. చెన్నూరు

చరిత్రకెక్కిన.. చెన్నూరు

‘చెన్నూర్‌'.. పేరు వినిపించగానే మొదట గుర్తుకు వచ్చేది పంచక్రోశ ఉత్తర వాహిని.. గోదావరి. ఆ తర్వాత అంబా అగస్త్యేశ్వరాలయం (శివాలయం), అందులో నాలుగు శతాబ్దాలుగా వెలుగుతున్న అఖండజ్యోతి. మరో పూరీ క్షేత్రంగా కీర్తికెక్కిన జగన్నాథాలయం, పెద్ద చెరువులో నెలకొన్న అగస్త్య గుండం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలను ఇముడ్చుకున్న చెన్నూర్‌ దక్షిణ కాశిగా ప్రఖ్యాతిగాంచిన పట్టణం. 

ఆధ్యాత్మికంగా తెలంగాణలో గోదావరి నది ఎంతో విశిష్టమైంది. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో పుట్టి.. ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే గోదారమ్మ చెంతన ఎన్నో అద్భుత పట్టణాలు పురుడుపోసుకున్నాయి. వాటిలో ఒకటి మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌. 1,465 కిలోమీటర్ల గోదావరి నదీ ప్రయాణంలో.. మరెక్కడా లేని ప్రత్యేకత చెన్నూర్‌ ప్రాంతంలో దర్శనమిస్తుంది. సాధారణంగా దేశంలోని నదులన్నీ పశ్చిమ దిశనుంచి తూర్పునకు ప్రవహిస్తాయి. కానీ, చెన్నూర్‌ ప్రాంతంలో గోదావరి నది ఉత్తర దిశగా 15 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఒక్క కాశీలో మాత్రమే గంగానది ఆరు కిలోమీటర్లు ఉత్తర దిశలో ప్రవహిస్తుంది. అలాంటి అరుదైన నదీ ప్రవాహం ఇక్కడ దర్శనమిస్తుంది. చెన్నూర్‌ మండలం పొక్కూర్‌ గ్రామం నుంచి కోటపల్లి మండలం పారుపల్లి గుట్టల వరకూ.. ఉత్తర దిశగా నదీ ప్రవాహం సాగుతుంది. పారుపల్లి గుట్టలపై దిగంబరంగా ఉన్న భైరవుడి రూపాన్ని చూడలేకే గోదారమ్మ తన దిశను మార్చుకున్నదని స్థల      పురాణం. గోదావరి ప్రత్యేక ప్రవాహం వల్లే ఈ ప్రాంతానికి ‘ఉత్తర వాహినీ తీరం’ అనే పేరు వచ్చింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ నదిలో ఆంజనేయుడి తల్లి అంజనాదేవి స్నానమాచరించిందని ఐతిహ్యం. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించేందుకు, అస్థికలు నిమజ్జనం చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. 

అద్భుత క్షేత్రం 

ఐతిహ్యం ప్రకారం... త్రేతాయుగంలో అగస్త్యమహర్షి శాపవిమోచనార్థం దక్షిణ కాశిగా పేరు గాంచిన చెన్నూర్‌ ఉత్తరవాహిని వద్ద తపస్సు చేశారు. ఈ ప్రాంతంలోని దట్టమైన అరణ్యంలో వెలసిన శివలింగాన్ని చూసిన ఆయన, మొదటగా గుండాన్ని (ప్రస్తుత పెద్ద చెరువు) నిర్మించి, అందులో స్నానం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం చెన్నూరులోని అంబా అగస్తేశ్వరాలయం (శివాలయం)లో శివలింగాన్ని పునఃప్రతిష్ఠించారు.  దీంతో ఆ మహర్షికి పాపవిమోచనం అయినట్లు చెబుతారు.  అరణ్యవాసంలో పాండవులు ఈ ప్రాంతంలో సంచరించినట్లు, శ్రీరాముడు కూడా గోదావరి తీరంలో పర్యటించి అగస్త్యుడు ప్రతిష్ఠించిన లింగానికి పూజలు చేసినట్లు స్థలపురాణం.

శతాబ్దాల అఖండ జ్యోతి

చెన్నూర్‌ పట్టణంలోని అంబా అగస్త్యేశ్వరాలయంలో నాలుగు శతాబ్దాల క్రితం వెలిగించిన దీపం ఇప్పటికీ అఖండ జ్యోతిగా వెలుగుతున్నది. 400 ఏండ్ల క్రితం చెన్నూర్‌ ప్రాంతంలో నాదర్‌ (ఎంఈవో)గా పనిచేస్తున్న జక్కెపల్లి సదాశివయ్య ఈ జ్యోతిని వెలిగించారు. 

పేరు వెనుక కథ

చెన్న.. అంటే అందమైనది అని పండితులు చెబుతున్నారు. దీంతో చెన్నూర్‌ అంటే అందమైన ఊరు అని విశ్లేషిస్తున్నారు. కానీ శాసనాలు మాత్రం చెన్నూర్‌ అనే పేరు ‘చెరి నూరు ఊరు’ నుంచి వచ్చినట్లు వివరిస్తున్నాయి. దీని వెనకాల ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. చాలా కాలం క్రితం.. అంటే కాకతి గణపతి దేవ చక్రవర్తికి పూర్వమే ఈ ప్రాంతంలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు. ఇద్దరూ బాగా కష్టపడి వ్యవసాయం చేసేవారు. కష్టేఫలి అన్నట్లు వారి పొలాలు పుష్కలంగా పండేవి.  ఏటా చెరి నూరు బస్తాల (పుట్లు) ధాన్యం పంచుకునేవారు. అందువల్ల ‘చెరి నూరు ఊరు’గా పేరు వచ్చినట్లు చెబుతున్నారు. గణపతి దేవ చక్రవర్తి మంత్రి ప్రోలరాజు వేయించిన మంథని శాసనం ద్వారా ఈ విషయం స్పష్టమవుతున్నది. ‘చెరి నూరు’ తర్వాతి కాలంలో చెర్నూరు.. చెన్నూరుగా మారింది. 

-కొమ్మెర రామమూర్తి, చెన్నూర్‌ టౌన్‌