గ్రేటెస్ట్ హైదరాబాద్

తెలంగాణ వస్తే కరెంట్ ఉంటదా! హైదరాబాద్ ఆగమాగం అయితది!! ఈ మాటలకు కాలమే సరైన సమాధానం ఇచ్చింది. తెలంగాణ ఆయువు పట్టు హైదరాబాద్ అభివృద్ధి పథంలో పైపైకి దూసుకుపోతున్నది. మౌలిక వసతుల కల్పనలో నూతన అధ్యాయం మొదలైంది.ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు.. ప్రతిదారీ రహదారే! తాగునీటికి కృష్ణాగోదావరి జలాలు.. నగరవాసులకు రాజీలేని భద్రత.. నిరంతరాయంగా కొనసాగే విద్యుత్.. పచ్చదనాన్ని పెంచేందుకు పెద్ద ఎత్తున పార్కులు, హరితహారం.. ఒక్కటేమిటి.. అది ఇది ఏదని అన్ని రంగాల్లో హైదరాబాద్‌ను మకుటాయమానంగా నిలుపుతున్నది తెలంగాణ ప్రభుత్వం. అరవై ఏండ్లలో కాదు.. ఈ ఆరేండ్లలోనే సాధ్యమైన అద్భుతాలే ఇవన్నీ..
మొన్నటి దాకా పాలించిన వాళ్లు హైదరాబాద్ నగరాన్ని ఓ మురికి గుంటలాగ మార్చిండ్రు. దెబ్బ తీసిండ్రు. హైదరాబాద్ సిటీ ఒక స్వర్గ సీమ కావాలి. మురికివాడలు పోవాలి. ఈ కంపు పోవాలి. మూసీ మురికి వదిలిపోవాలి. అద్భుతమైన నగరంగా మారాలి. ఆ టైమొస్తది. మనమెంత ధనం సంపాదించినా ఎన్ని వందల కోట్లు వేలకోట్లు మన పిల్లలకు ఆస్తిగా ఇచ్చినా లాభం లేదు. పిల్లలు బతకగలిగే యోగ్యమైన పరిస్థితి ఉండాలె కద. బతకలేని పరిస్థితి ఉంటే.. ఎంత ధనం ఉండి ఏం లాభం? కాబట్టి బతకగలిగే పరిస్థితులు హైదరాబాద్‌ల ఉండాలె. పచ్చటి చెట్లుండాలె. ఏదైనా పెండ్లికో ఇంకో ఫంక్షన్‌కో పోదామంటే గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ కాకూడదు. ఏ బాదర బందీ లేకుండా జీవితం ప్రశాంతంగా ఉండాలె. నగరాన్ని మనం అట్లా తీర్చిదిద్దుకోవాలె. బెస్ట్ సిటీ ఇన్ ఇండియా.. బెస్ట్ సిటీ ఇన్ వరల్డ్.. ఏదని అడిగితే.. హైదరాబాద్ అనే పేరు రావాలె. విశ్వనగరం అంటే ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలు తమ జీవనశైలిలో కులమతాలకు అతీతంగా అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకోగలగాలి. ప్రజలు తిరిగేందుకు నాణ్యమైన రోడ్లు ఉండాలి. సంపూర్ణ మౌలిక సదుపాయాలు ఉండాలి. నాణ్యమైన జీవనం కొనసాగించేందుకు అనువుగా ఉండాలి. ఉన్నత విద్య, మెరుగైన వైద్యం అందించే సౌకర్యాలు ఉండాలి. పౌరులకు పూర్తి శాంతిభద్రతలను అందించగలగాలి. అప్పుడే చీకూ చింతా లేకుండా ఏ కుటుంబమైనా జీవనం కొనసాగించగలుగుతుంది’
- ముఖ్యమంత్రి కేసీఆర్
తన మాటను అక్షరాలా నిలబెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యమస్ఫూర్తితో భాగ్యనగరి భాగ్యాన్ని మార్చేశారు. ఆయన సంకల్పంతో నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నవశకం ఆరంభమైంది. గతంలో కనీవినీ ఎరుగనిరీతిలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, లింకురోడ్లు, రోడ్ల విస్తరణ తదితర పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు రూ.5,360 కోట్ల పనులు చేపట్టగా, ఇందులో సింహభాగం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరో రూ.1,355 కోట్ల పైచిలుకు పనులు ప్రతిపాదన దశలో ఉన్నాయి. ప్రధాన రోడ్లను కలుపుతూ ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు పెద్ద ఎత్తున లింకురోడ్ల నిర్మాణం జరుగుతున్నది. గత ఐదు దశాబ్దాల్లో చేపట్టిన ప్రాజెక్టుల కన్నా ఈ ఆరేండ్లలో చేపట్టిన పనులే అధికంగా ఉండటం నవశకానికి అద్దం పడుతున్నది. అక్కడక్కడా ఫ్లైఓవర్లు నిర్మించి హైదరాబాద్ నిర్మాతలం మేమే అని చెప్పుకునేవారికి నిజంగా ఇది కనువిప్పుగా చెప్పవచ్చు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారమే లక్ష్యంగా రహదారులను సిగ్నల్ ఫ్రీ రోడ్లుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సుమారు రూ.23 వేల కోట్ల అంచనా వ్యయంతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం కోసం వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్ఆర్డీపీ)ను ప్రభుత్వం జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో చేపట్టింది. ఇందులో భాగంగా 54 జంక్షన్లలో 111 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్లు/స్కైవేలు, అండర్‌పాస్‌లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. దశలవారీగా ఇప్పటివరకు సుమారు రూ.6 వేల కోట్ల పనులు చేపట్టగా, అందులో సగానికిపైగా పూర్తయ్యాయి. పూర్తయిన వాటిలో నాలుగు అండర్‌పాస్‌లు, పది ఫ్లైఓవర్లు ఉన్నాయి. మరో 15 ఫ్లైఓవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కాకుండా ఐదు ఫ్లైఓవర్లు, రెండు అండర్‌పాస్‌ల ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే, ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ తగ్గించడం, రెండు ప్రధాన రోడ్లను జోడించడం కోసం రూ.313.65 కోట్లతో 37 లింకు రోడ్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో నాలుగు లింకు రోడ్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఇరుకుగా ఉన్న రోడ్లను పెద్ద ఎత్తున విస్తరించారు. ఎస్సార్డీపీ వల్ల ప్రధానంగా ట్రాఫిక్ సమస్యాత్మక ప్రాంతాలైన ఎల్బీనగర్, మాదాపూర్‌లకు ఉపశమనం కలిగింది. గతానికి భిన్నంగా అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా నగరం నలుమూలలా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టడం విశేషం. గత పాలకులు పూర్తి చేయకుండా వివిధ కారణాలతో మధ్యలో వదిలేసిన ఫతేనగర్ ఫ్లైఓవర్, నేరేడ్మెడ్ అండర్‌పాస్‌ను కూడా పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చారు.
తీగల వంతెన.. దుర్గం చెంతన
దుర్గం చెరువుపై రూ.184కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీగల వంతెన హైదరాబాద్ సిగలో మరో కలికితురాయిగా వెలుగొందుతున్నది. దేశంలో ఒకటి రెండు చోట్ల మాత్రమే ఇలాంటివి ఉన్నాయి. దీని నిర్మాణంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీకి వెళ్లేవారికి ఎంతో ఉపయోగకరం. ప్రస్తుతం ఉన్న రోడ్డుపై రద్దీ తగ్గడమే కాకుండా సుమారు రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గింది. ఆరు లేన్లతో నిర్మించిన ఈ బ్రిడ్జిపై శని, ఆది వారాల్లో వాహనాలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. వీకెండ్స్‌లో కేవలం కాలినడకన వెళ్లే ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పర్యాటక కేంద్రంగా హైదరాబాదీలను అలరిస్తున్నది. సెల్ఫీజోన్‌గా మారిపోయింది.
దూరభారాన్ని తగ్గించే లింక్ రోడ్స్..
ప్రధాన రోడ్లపై రద్దీని నియంత్రించడంతోపాటు ప్రయాణ దూరాన్నీ తగ్గించే విధంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో రూ.313.65 కోట్ల వ్యయంతో 37 లింకురోడ్ల నిర్మాణాలు చేపట్టారు. సుమారు 44.70 కిలోమీటర్ల మేర రోడ్లలో ఇప్పటికే కొన్ని అందుబాటులోకి వచ్చాయి. అతితక్కువ భూసేకరణతో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. చిన్నచిన్న అడ్డంకులను తొలగించడం ద్వారా, రెండు ప్రధాన రోడ్లను కలపడం ద్వారా ప్రయాణికుల వ్యయప్రయాసలను నివారించే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా ఈస్ట్, వెస్ట్ జోన్లలో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించే ఉద్దేశంతో వీటి నిర్మాణం చేపట్టారు. దేశంలో మరెక్కడా లేని విధంగా నగరంలో ఈ విధానాన్ని చేపట్టడం విశేషం.
‘ఉక్కు’ సంకల్పం
ఫ్లైఓవర్ నిర్మాణం సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా అతి తక్కువ సమయంలో పనులు పూర్తయ్యేలా ఉక్కు వంతెనల నిర్మాణాలు చేపట్టారు. సంప్రదాయ ఫ్లైఓవర్ల కన్నా కొంత ఖర్చు ఎక్కువే అయినా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో వీటి నిర్మాణం చేపడుతున్నారు. పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద రూ.5 కోట్లతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జి ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అటు ఇందిరాపార్కు-వీఎస్టీ, నల్లగొండ క్రాస్‌రోడ్-ఒవైసీ జంక్షన్ మొదలయ్యాయి. వివిధ కారణాలతో అనేక ఏండ్లుగా ప్రతిపాదనల దశ దాటకుండా మూలుగుతున్న ఈ రెండు ఫ్లైఓవర్ల పనులను పట్టాలెక్కించడం విశేషం. కేవలం పునాదులు, ఫ్లైఓవర్‌పై రిటెయినింగ్ వాల్స్ మాత్రమే కాంక్రీట్‌తో నిర్మిస్తూ, మిగిలిన పిల్లర్లు, బీమ్‌లు అన్నీ స్టీల్‌తో తయారు చేయించి బిగించడం ఈ వంతెనల ప్రత్యేకత. ఇక ఇందిరాపార్కు-వీఎస్టీ పైవంతెనను మెట్రోరైలు కారిడార్ పైనుంచి దాటుకుంటూ నిర్మిస్తుండటం విశేషం.
అటు కృష్ణా.. ఇటు గోదావరి
భాగ్యనగరి దాహార్తిని తీర్చడానికి కృష్ణానది మూడో దశ ద్వారా రోజు 90 ఎంజీడీలు (మిలియన్ గ్యాలన్ పర్ డే)లను తరలించే పథకానికి సంబంధించిన పనులను నిర్ణీత సమయంలోపు పూర్తి చేసింది తెలంగాణ సర్కారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఎల్లంపల్లి నుంచి నగర శివారు శామీర్‌పేట వరకు నిత్యం 172 ఎంజీడీల మేర నీటిని తరలించే గోదావరి జలాల తొలి విడత పథకం పనులను శరవేగంగా పూర్తి చేయించారు. పైపులైన్ విస్తరణ పనుల్లో భాగంగా రైల్వే, ఆటవీశాఖ అనుమతుల విషయంలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విజయవంతం అయ్యారు. మండుటెండల్లోనూ గొంతు ఎండకుండా గ్రేటర్ ప్రజలకు కృష్ణా, గోదావరి నదీ జలాలను అందించారు. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి రోజూ 15 ఎంజీడీలు, కృష్ణా మూడు దశల ద్వారా 270 ఎంజీడీలు, గోదావరి ద్వారా 172 ఎంజీడీలను కలిపి 457 ఎంజీడీల మేర నీటిని దాదాపు 12 లక్షల నల్లాలకు సరఫరా చేస్తున్నారు.
జల కల తీరిన వేళ: గత ప్రభుత్వాల హయాంలో వేసవి వచ్చిందంటే చాలు ప్రతిపక్షాలు ఆదే పనిగా మహిళలతో కలిసి ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టేవారు. కానీ, స్వరాష్ట్రంలో ఏ ఒక్క రోజూ అలాంటి నిరసనలు కనిపించిన దాఖలాలు లేవు. ఈ ఒక్క ఉదాహరణ చాలు, తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ ప్రజలకు నీటి గోస లేకుండా చేసిందని చెప్పడానికి. హైదరాబాద్ తాగునీటి కోసం సింగూరు, మంజీరా, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్లు ఉన్నా.. అవి పూర్తి స్థాయిలో అవసరాలు తీర్చలేకపోతున్నాయి. వీటి నిల్వలు ప్రతి ఏటా పడిపోతూ ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నీటి కొరతపై దృష్టి పెట్టి సమస్యలనుపరిష్కరించింది.వందేండ్ల వరకు నీటి కష్టాలు లేకుండా: మండు వేసవిలోనూ సమృద్ధిగా నీటిని అందించి గ్రేటర్ తాగునీటి విషయంలో తన చిత్తశుద్ధిని చాటుకున్నది ప్రభుత్వం. గ్రేటర్లో విలీనమైన శివారు మున్సిపాలిటీలకు రూ.1,900 కోట్లు హడ్కో నిధులను ఖర్చు చేసి రికార్డు స్థాయిలో పనులను పూర్తి చేసి నీటి కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టింది. అంతేకాకుండా, ఔటర్ రింగురోడ్డు లోపల 190 గ్రామాల నీటి సరఫరా బాధ్యతను తీసుకొని పట్టణ భగీరథ పథకం కింద రూ.750 కోట్లు ఖర్చు చేసి మెరుగైన సేవలు అందిస్తున్నది. వీటితోపాటు సీవరేజీ వ్యవస్థను బలోపేతం చేసింది. నిర్వహణలో అత్యాధునిక పద్ధతులను వినియోగించి, విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టింది. ఔటర్ రింగురోడ్డు లోపల వరకు దాదాపు రూ.12 వేల కోట్లతో సీవరేజీ మాస్టర్‌ప్లాన్ రూపకల్పన చేస్తున్నారు. రాబోయే వందేండ్ల వరకు నీటి కష్టాలు లేకుండా ఉండేందుకు మల్కాపూర్, కేశవాపూర్ల వద్ద రెండు డెడికేటెడ్ స్టోరేజ్ వాటర్ రిజర్వాయర్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా తొలి విడతగా కేశవాపూర్ భారీ స్టోరేజ్ రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయగా, ఆ పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నారు.
సుస్తీ లేని బస్తీలు
సాధారణంగా ఏ చిన్న జ్వరం వచ్చినా ప్రైవేటు క్లినిక్‌కు వెళితే కనీసం రూ.500 సమర్పించుకోవాల్సిందే. పీహెచ్‌సీలు, పెద్దాసుపత్రులకు వెళ్లాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో మన ముఖ్యమంత్రి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే ‘బస్తీ దవాఖాన’. ప్రజలకు ఇంటి ముంగిటే వైద్య సేవలు అందించడంలో భాగంగా బస్తీ దవాఖానల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గ్రేటర్ వ్యాప్తంగా 190 బస్తీ దవాఖానలను ప్రారంభించారు. ఇందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 115, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో 46, రంగారెడ్డి పరిధిలో 29 బస్తీ దవాఖానలు వైద్యసేవలు అందిస్తున్నాయి. సెప్టెంబర్ నెలాఖారు నాటికి ఈ దవాఖానల సంఖ్య 300కు పెంచనున్నట్లు ఇటీవలే మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆ పనులు వేగంగా సాగుతున్నాయి.
కేసీఆర్ కిట్.. సూపర్ హిట్
సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కేసీఆర్ కిట్ గ్రేటర్లో సూపర్ హిట్ అయింది. ప్రైవేటులో జరిగే అనవసర కోతలు తప్పి సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగాయి. ఈ కిట్ ద్వారా నగదుతోపాటు అంగన్వాడీ కేంద్రాల నుంచి పౌష్టికాహారం కూడా అందిస్తున్నారు. పేట్లబుర్జు, నిలోఫర్, గాంధీ, సుల్తాన్‌బజార్ ప్రసూతి దవాఖానల్లో ఏర్పాటు చేసిన ఎంఐసీయూ, ఎన్ఐసీయూలతో పాటు గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారంతో శిశుమరణాల రేటు చాలావరకు తగ్గింది. సాధారణ ప్రసవాల వల్ల మహిళల్లో అనారోగ్య సమస్యలు తగ్గాయి. శిశువులకు అందిస్తున్న అన్ని రకాల వ్యాక్సిన్లతో శిశుమరణాలు తగ్గాయి. గర్భిణులను ప్రసవ సమయంలో వారి ఇంటి నుంచి దవాఖానలో చేర్పించడం మొదలు ప్రసవం అయి డిశ్చార్జ్ తర్వాత వారిని తిరిగి ఇంటి దగ్గర క్షేమంగా చేర్చడం కోసం ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా 102 వాహనాలను ప్రవేశపెట్టారు.
నేను బోత సర్కారు దవాఖానకు..
ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదు. అలాంటి వైద్యశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రేటర్లో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానలను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ‘వామ్మో.. సర్కారు దవాఖాన’ అనే నానుడిని పూర్తిగా మార్చివేసి.. ‘నేను బోత ప్రభుత్వ దవాఖానకు’ అనే స్థాయికి తీసుకువచ్చారు.
పరీక్షలూ ఎక్కడికక్కడే
ప్రతి ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. ఆరోగ్య కేంద్రాల్లో 56 రకాల వైద్యపరీక్షలను నిర్వహించి, ఆ నమూనాలను తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రంలో పరీక్షించిన తరువాత, నివేదికలను సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు ఆన్లైన్ ద్వారా పంపిస్తున్నారు. దీనివల్ల వ్యాధులను ప్రారంభదశలోనే గుర్తించవచ్చు. దీనివల్ల రోగులపై ఆర్థిక భారం తప్పుతున్నది.
కార్పొరేట్‌కు దీటుగా సేవలు...
ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్ తదితర బోధన వైద్యశాలలను పూర్తిస్థాయిలో పటిష్ట పరిచారు. ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో పడకల సామర్థ్యాన్ని 2000లకు, నిమ్స్ అత్యవసర విభాగంలో 100కు పెంచారు. నిలోఫర్‌లో 500 పడకలతో ప్రత్యేక ఐసీయూ బ్లాక్ ఏర్పాటు చేశారు. గాంధీ, ఉస్మానియాలో ప్రత్యేక ఐసీయూ విభాగాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉస్మానియాలో కార్డియాలజీ, అక్యూట్ న్యూరో సర్జికల్ కేర్, క్యాజువాల్టీ విభాగాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి పరిచారు. ఉస్మానియాలో 20 పడకల డయాలసిస్ కేంద్రం, మలక్‌పేట, నిమ్స్, గాంధీలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీని వల్ల కిడ్నీ సంబంధిత రోగులకు ఆర్థిక భారంతో పాటు ఆరోగ్యపరంగా ఉపశమనం కలిగింది. రోగులకు అవసరమైన సేవలతో పాటు.. వారికి సహాయకులుగా వచ్చే వారి కోసం ప్రత్యేక షెల్టర్లు అందుబాటులోకి తీసుకువచ్చారు.
రికార్డు స్థాయిలో శస్త్ర చికిత్సలు
ప్రపంచలోనే రెండోసారి, దేశంలో మొట్టమొదటిసారిగా ఆటో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్స నిర్వహించిన ఘనత తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఉస్మానియా దవాఖానకే దక్కింది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు తీసుకురావడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎనలేని కీర్తిని గడించింది. కిడ్నీ, కాలేయం, గుండె తదితర ప్రధాన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు సర్కార్ దవాఖానలు కేంద్ర బిందువుగా మారడంతో కార్పొరేట్ దోపిడి నుంచి పేదరోగులు బయటపడగలుగుతున్నారు.
మేమున్నామనీ.. మీకేం కాదనీ...
కరోనా విపత్కర పరిస్థితుల్లో కార్పొరేట్ దవాఖానలు మూతబడినా ‘నేనున్నానంటూ’ సర్కార్ దవాఖానలు కరోనా రోగులతో పాటు సాధారణ రోగులకూ సంజీవనిగా మారాయి. ప్రతి రోజు 20వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు పాజిటివ్ రోగులకు మెరుగైన వైద్యం అందించాయి. ఇంకా అందిస్తున్నాయి. హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు ఇంటివద్దకే టెలీ మెడిసిన్ కిట్లు, ఆన్లైన్ ద్వారా వైద్యుల పర్యవేక్షణ తదితర ప్రత్యేక చర్యలు తీసుకుని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది మన వైద్య ఆరోగ్యశాఖ.