ఆదివారం 17 జనవరి 2021
Sunday - Nov 29, 2020 , 02:56:09

మహానగరానికి.. మూడో కన్ను!

మహానగరానికి.. మూడో కన్ను!

ఏమిటీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌? 

అన్ని ప్రభుత్వ రంగ వ్యవస్థలనూ సమన్వయం చేసుకుంటూ విపత్తుల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించడం, నిరంతర నిఘాతో నేరాలకు ముకుతాడు వేయడం.. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లక్ష్యాలు. దీనిలో ప్రధానమైంది స్టేట్‌ మల్టీ ఏజెన్సీ ఆపరేషన్స్‌ సెంటర్‌. ఈ సెంటర్‌లో పోలీస్‌, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఆరోగ్యశాఖ, ప్రకృతి విపత్తుల నిర్వహణశాఖ సహా ముఖ్యమైన అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కేంద్రాలు ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అన్ని శాఖల సమన్వయంతో సమస్యను పరిష్కరిస్తారు. రోజువారీ శాంతిభద్రతల నిర్వహణ, భారీ సభలూ ఉత్సవాల బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ కూడా ఇక్కడి నుంచి సులభంగా చేయవచ్చు. ఇవి యాక్షన్‌ సినిమాలో సీన్లలా అనిపిస్తున్నాయా? కానేకాదు. అతి త్వరలో మన అనుభవంలోకి రానున్న వాస్తవం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటుతో రాబోయే సుస్పష్టమైన మార్పు ఇది. పోలీస్‌ సహా అన్ని ప్రభుత్వశాఖలను సమన్వయం చేసుకునే తెలంగాణ స్టేట్‌ లెవల్‌ మల్టీ ఏజెన్సీ ఆపరేషన్స్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌-12లో నిర్మిస్తున్నారు.

సీన్‌-1 

అకస్మాత్తుగా ఓ షాపింగ్‌మాల్‌లో టలు అలుముకున్నాయి. మాల్‌లోని ఐదు అంతస్తుల్ల్లో 500 మంది వరకు చిక్కుకుపోయారు. నిమిషాల వ్యవధిలోనే పోలీస్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది, ఫైర్‌ ఇంజిన్లు, అంబులెన్స్‌లు స్పాట్‌కు చేరుకున్నాయి. చకచకా సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడంతోపాటు ఆస్తి నష్టం పెరగకుండా మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.. 

సీన్‌-2

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌ నుంచి సంబంధిత జిల్లా ఎస్పీతోపాటు క్షేత్రస్థాయి సిబ్బందికి, హైవేపై అందుబాటులో ఉన్న క్రేన్ల సిబ్బందికి, అంబులెన్స్‌కు  ఏకకాలంలో సమాచారం వెళ్లింది. పరిస్థితి జటిలం అయ్యేలోపే ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. గాయపడినవారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు..

అన్ని వ్యవస్థలూ ఒకేచోట

శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రజలను సకాలంలో రక్షించడంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎంతో ప్రధానమైంది. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో స్టేట్‌ మల్టీ ఏజెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ ఏర్పాటు ఉద్దేశం ఇదే. దీనిలో పట్టణాభివృద్ధి శాఖ, రవాణా శాఖ, మెట్రోరైల్‌, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, రెవెన్యూ, హోం, ఫైర్‌, పొల్యుషన్‌ కంట్రోల్‌.. ఇలా మొత్తం 19 విభాగాలకు చెందిన ఒక్కో ముఖ్య అధికారి 24 గంటలపాటు ఇక్కడ అందుబాటులో ఉంటారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వచ్చే సమాచారానికి సంబంధించి ఆయా శాఖల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై వెంటనే క్షేత్రస్థాయిలోని సిబ్బందిని ఇక్కడి నుంచే అలర్ట్‌ చేస్తారు. 

ఏమిటీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌? 

అన్ని ప్రభుత్వ రంగ వ్యవస్థలనూ సమన్వయం చేసుకుంటూ విపత్తుల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించడం, నిరంతర నిఘాతో నేరాలకు ముకుతాడు వేయడం.. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లక్ష్యాలు. దీనిలో ప్రధానమైంది స్టేట్‌ మల్టీ ఏజెన్సీ ఆపరేషన్స్‌ సెంటర్‌. ఈ సెంటర్‌లో పోలీస్‌, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఆరోగ్యశాఖ, ప్రకృతి విపత్తుల నిర్వహణశాఖ సహా ముఖ్యమైన అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కేంద్రాలు ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అన్ని శాఖల సమన్వయంతో సమస్యను పరిష్కరిస్తారు. రోజువారీ శాంతిభద్రతల నిర్వహణ, భారీ సభలూ ఉత్సవాల బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ కూడా ఇక్కడి నుంచి సులభంగా చేయవచ్చు. 

పోలీసులకు ఆయుధంగా.. 

కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ తెలంగాణ పోలీస్‌కు గుండెకాయ కాబోతున్నది. మన రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న క్రిమినల్స్‌ పూర్తి సమాచారం, ఫింగర్‌ ప్రింట్స్‌, ఫొటోలు, నేర చరిత్రకు సంబంధించిన సమస్త సమాచారాన్నీ నిక్షిప్తం చేస్తారు. ఏదైనా నేరం జరిగినట్టు పోలీసులకు సమాచారం అందిన వెంటనే, సంబంధిత ఇన్వెస్టిగేషన్‌ అధికారి(ఐఓ) స్పాట్‌కు చేరేలోపే.. ఆ ప్రాంతంలో గతంలో జరిగిన అదే తరహా నేరాలు, నేరగాళ్ల సమాచారం అంతా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని హై ఎండ్‌ డాటా ఎనాలసిస్‌ సెంటర్‌ ద్వారా సదరు అధికారికి చేరుతుంది. దీనివల్ల కేసు దర్యాప్తు సులభం అవుతుంది. నేరస్థుడిని పట్టుకునే అవకాశాలు పెరుగుతాయి. 

ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌

కమాండ్‌, కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం సాధ్యం అవుతుంది. అవసరం అయితే, ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు తలెత్తకుండా వాహనాల మళ్లింపునకు చర్యలు తీసుకుంటారు. అంతర్గత మార్గాలే కాదు, తెలంగాణ నుంచి ఇతర రాష్ర్టాలకు వెళ్లే జాతీయ రహదారులను సైతం పర్యవేక్షించవచ్చు.  ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిని సీసీ టీవీ ఫుటేజీల ద్వారా గమనించి చలాన్లు ఝళిపించవచ్చు. సిటీ పోలీస్‌ కార్యాలయం సైతం కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోకి మారనున్నది.

కత్తి లాంటి.. ‘కమాండో’

  • హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌-12లో మొత్తం 19 అంతస్తుల్లో ప్రపంచస్థాయి కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. 
  • ఈ సెంటర్‌లో ప్రత్యేక డాటా సెంటర్‌ ఉంది. ఇక్కడ 22 పెటా బైట్ల సామర్థ్యం ఉన్న స్టోరేజీ ఉంటుంది. అనవసర సమాచారం నెల రోజుల తర్వాత డిలీట్‌ అవుతుంది. 
  • హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న పది లక్షల సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన ఒక ఇంటెగ్రేటెడ్‌ కమాండ్‌, కంట్రోల్‌ సెంటర్‌ ఇక్కడి నుంచే పనిచేస్తుంది.
  • టవర్స్‌లోని 14వ అంతస్తు నుంచి హైదరాబాద్‌ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూసేలా విజిటర్స్‌ గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. 
  • హైఎండ్‌ డాటా ఎనాలసిస్‌ సెంటర్‌లో సమాచారం అత్యంత గోప్యంగా, భద్రంగా ఉంటుంది. డాటా ఎనాలసిస్‌కు సిటీగ్రాఫ్‌ టెక్నాలజీని వినియోగించనున్నారు. 
  • ఉన్నతాధికారులు కాకుండా ఒక్కో షిప్ట్‌లో కనీసం 60 మంది టెక్నికల్‌ సిబ్బంది విధుల్లో ఉంటారు. ఇలా రోజుకు మూడు షిప్ట్‌లుగా పనిచేస్తారు. 
  • ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే, సీసీ టీవీల్లో ని ప్రత్యేక స్టాఫ్ట్‌వేర్‌ ద్వారా కెమెరానే నేరుగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు హెచ్చరికలు పంపుతుంది. వెంటనే సిబ్బంది అప్రమత్తం అవుతారు. 
  • రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, ఫైర్‌ స్టేషన్లు, పోలీస్‌ స్టేషన్లు,  ప్రధాన లొకేషన్లు, ప్రధాన బస్‌స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన కూడళ్లు, మార్కెట్లు.. ఇలా ప్రతి సమాచారం కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని హై ఎండ్‌ డాటా ఎనాలసిస్‌ సెంటర్‌కు అనుసంధానిస్తారు. 
  • హైదరాబాద్‌ నగరంలో దాదాపు 350 లొకేషన్లలో ఆటోమెటిక్‌ నంబర్‌ప్లేట్‌ రీడర్‌(ఏఎన్‌పీఆర్‌), లైసెన్స్‌ ప్లేట్‌ క్యాప్చర్‌ కెమెరా(ఎల్‌పీఆర్‌)ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలు హైదరాబాద్‌లోకి ప్రవేశించి ప్రతి వాహనం నంబర్‌, బండి కలర్‌, మోడల్‌ను సేకరించిన ఫొటోల రూపంలో పంపుతుంది.