ఆదివారం 17 జనవరి 2021
Sunday - Nov 29, 2020 , 02:48:45

హైదరాబాద్‌ నా అక్షరం

హైదరాబాద్‌ నా అక్షరం

దాశరథి రంగాచార్య.. ఉద్యమాల భానుడు, తెలుగువారి వ్యాసుడు! పన్నెండేండ్ల వయసులోనే ప్రజా పోరాటాలకు అంకితం అయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. నగర పాలక సంస్థలో ఉద్యోగం చేశారు. ‘హైదరాబాద్‌ నా అంతరాత్మ’ అని ప్రకటించారు. ఆయన ‘జీవనయానం’లోని కొన్ని జ్ఞాపకాలు, కొంత అంతర్మథనం.. 

నాటికీ నేటికీ ఈ భూమి వసుంధరయే. ఏనాటి నుంచి దోచుకుంటున్నారో! అయినా కామధేనువు. అక్షయంగా అందిస్తూనే ఉంది. భరత ధాత్రి శాంతభూమి. ఏనాడూ ఎవరి మీదకూ దండెత్తలేదు. తొలినుంచి ఎందరో ఈ నేలను ఆక్రమిస్తూనే ఉన్నారు. ముసల్మానులు దండెత్తక ముందు వచ్చినవారు ఉన్నారు. వారంతా భారతీయులు అయిపోయారు. ముసల్మానులు భరతభూమికి వస్తున్నారు. వారికి తొలుత సింధునది దర్శనమిచ్చింది. వారు ‘స’ను ‘హ’గా పలుకుతారు. వారికి ఇది హిందుస్థాన్‌ అయింది. ఇక్కడి ప్రజలు హిందువులు. అప్పుడు ఇది మతవాచకం కాదు. ముసల్మానులు ఈ ధాత్రిని సుమారు వేయేళ్ళు పాలించారు. తాజ్‌మహలు వారి పరిపాలనకు చిహ్నంగా మిగిలిపోయిన ప్రేమధామం. ఈస్టిండియా కంపెనీ వారు వ్యాపారం కోసం తూర్పు తీరానికి చేరారు. చాలా భాగం భరత ధాత్రిని గెలిచారు. పాలించారు. 1857 తరువాత బ్రిటీష్‌ ప్రభుత్వం ఈ నేలను పాలించింది. వారికి హిందు- ముస్లిం ఐక్యత కంటగింపుగా పరిణమించింది. అప్పుడు వారు హిందు పదాన్ని మతంగా మార్చారు. మత కలహాలతో చిచ్చు పెట్టారు. భరత ధాత్రిని చీల్చిగాని వదలలేదు.

1859లో అనుకుంటా ఒకసారి నెహ్రూగారు హైదరాబాద్‌కు వచ్చారు. ప్రధానికి పౌరసన్మానం జరిగింది. హైదరాబాద్‌ - సికింద్రాబాద్‌ల ఉభయ మేయర్లు రెండు పూలదండలు వేశారు. ఉర్దూ, తెలుగు భాషల్లో ఇద్దరు సన్మానపత్రాలు చదివారు. నెహ్రూగారికి ఎందుకో ఇది నచ్చలేదు. ‘ఒక్క నగరానికి ఇద్దరు మేయర్లా?’ అన్నారు.

జవహర్‌లాల్‌ నెహ్రూ భారత ప్రధాని మాత్రం కారు- వారు ఆధునిక భారత నిర్మాత, సోషలిస్టు, మంచి చారిత్రక దృక్పథం కలవారు అనడానికి వారి ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’ సాక్ష్యం. అయితే వారికి అతివిశ్వాసం. తాను చెప్పిందే సత్యం అని నమ్మకం. అది కాదంటే పిచ్చికోపం! మైకులు నేలక్కొడ్తారు. పుస్తకాలు, కాగితాలు విసిరికొడ్తారు. ధుమధుమలాడ్తారు. వారిని శాంతపరచడం వారి కూతురు ఇందిరాగాంధీకి మాత్రమే సాధ్యం అయ్యేది. అందుకే నెహ్రూకు ఎవరూ ఎదురు చెప్పరు. అతను అన్నది చెల్లాలి. అందుకే అన్నాను:

ఒక్క డేలు కాలముండరాదన్నారు

పెక్కు రేలు యుగము వచ్చెననిరి

ఎప్పుడయిన రాజ్యమేలువా డొక్కడే

విశ్వజనులవాణి వినర రంగ!

సాంస్కృతికంగా ఉభయ నగరాలకు చారిత్రక నేపథ్యంలో ఎంతో అంతరం ఉంది. అది చెప్పగలవారు లేరు. నెహ్రూను కాదనలేక ఉభయ నగరాల కార్పొరేషన్లను విలీనం చేసే చట్టం చేశారు. అప్పుడు సంజీవరెడ్డిగారు ముఖ్యమంత్రి - సంజీవయ్యగారు స్థానిక పరిపాలనామాత్యులు. హైదరాబాద్‌ కార్పొరేషను ఆఫీసు మూసీకి ఆవల- పాత పట్నంలో- దారుల్‌షిఫాలో ఉండేది. ‘దారుల్‌ షిఫా’ అంటే సర్కారీ దవాఖాన. కులీ కుతుబ్‌షా కట్టించిన వైద్యశాలవల్ల ఆ వీధికి ఆ పేరు వచ్చింది. శిథిలమైన దారుల్‌ షిఫా కట్టడం ఇంకా ఉంది! అది దాటితే కూలనున్న దేవిడీలు. అటు తరువాత ‘మీర్‌ ఆలం మండి’ ఆ తరువాత చార్‌ కమాన్‌ -గుల్జార్‌ హౌజ్‌ అటునుంచి చార్‌మినార్‌ షాహ్‌ అలీబండ నుండి ఫలక్‌నుమాకు దారి. హైదరాబాద్‌లోని ప్రతి గల్లీ నాకు ఎరుకే.

నేను హైదరాబాద్‌ చేరుకోవడం వల్ల వ్యక్తిగతంగా నాకు కొన్ని ప్రయోజనాలు చేకూరాయి. ఈ బడిలో, నగరం ఒడిలో చాలా నేర్చుకున్నాను. నా రచనలకు స్ఫూర్తి పొందాను. విశాల పరిధిలో ప్రవేశించాను. వివిధ నాగరికతలు - వివిధ భాషలు - వివిధ సంస్కృతులతో పరిచయం - సాన్నిహిత్యం ఏర్పడ్డాయి.  పాతబస్తీ, కూలుతున్న దేవిడీలు - కన్నుమూస్తున్న నవాబుల జీవితం - పాత నాగరికత జాడ విడువని బస్తీలు - పురాతన పరిమళం వదలని పత్తర్‌ఘట్టీ ముత్యాల దుకాణాలు - మతం వాసన వదల్లేక జరుగుతున్న రాజకీయ కల్లోలాల మధ్య మత సహజీవనం నన్ను ఎంతగానో ఆకర్షించాయి. కార్పొరేషను కార్యాలయంలో మంచి గ్రంథాలయం ఉండేది. ఉర్దూ, తెలుగు, హిందీ పుస్తకాలు అనేకం ఉండేవి. పురాతన ‘భారతి’ ప్రతులు ఉండేవి. అది నాకు విందు. ఉర్దూ కవిత్వపు సొగసులు ఇక్కడే అర్థం అయినాయి. అన్ని పార్టీలు - భాషల కౌన్సిలర్లు నన్ను అభిమానించారు. ఒకళ్లిద్దరు కమ్యూనిస్టు కౌన్సిలర్లు ఉండేవారు. పోలీసు చర్య తరువాత పాతబస్తీ ముస్లిములను తొలుత కమ్యూనిస్టు పార్టీ ప్రభావతం చేసింది. కమ్యూనిస్టులు ప్రజలను వదిలి - వాదాలను ఆశ్రయించిన తరువాత - ముస్లిములను మత పార్టీలు ఆక్రమించాయి. ఇప్పటికీ హైదరాబాద్‌ ఉర్దూ కవులు, రచయితల్లో ఎక్కువ మంది ప్రగతిశీలురు.