బుధవారం 27 జనవరి 2021
Sunday - Nov 29, 2020 , 02:44:16

కార్పొరేట్‌ సిటీ!

కార్పొరేట్‌ సిటీ!

మహానగరం అంటే మాటలు కాదు... లక్షలమందికి ఉపాధిని కల్పించాలి. రోజూ కోటి ఆశలతో వచ్చే కొత్త పౌరులకు ఓ దారి చూపాలి. ఇసుమంత అజాగ్రత్తగా ఉన్నా, వ్యవస్థ కుప్పకూలిపోతుంది. నగరం వలసపోతుంది. అలాంటిది, వందల ఏండ్లుగా  భాగ్యనగరంగా తన ఉనికిని నిలబెట్టుకుంటూనే ఉంది హైదరాబాద్‌. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, హైదరాబాద్‌ విశ్వ నగరంగా రూపుదిద్దుకున్నది..

పరిశ్రమలు హైదరాబాద్‌కు కొత్తేమీ కాదు. వందేళ్ల క్రితమే ఔషధాల నుంచి పొగాకు వరకు రకరకాల పరిశ్రమలు ఇక్కడ వృద్ధి చెందాయి. ప్రాగా టూల్స్‌, జిందా తిలిస్మాత్‌, చార్మినార్‌ సిగరెట్స్‌.. లాంటి ఎన్నో బ్రాండ్లు దశాబ్దాల తరబడి మార్కెట్‌ను కైవసం చేసుకున్నాయి. అనుకూలమైన వాతావరణం, రవాణా సౌకర్యాలు, విస్తారమైన ఖనిజాలు... అన్నింటికీ మించి, సంస్థను కన్నతల్లిగా భావించే మానవ వనరులు.. ఇక్కడ నెలకొల్పిన ప్రతీ పరిశ్రమనూ విజయవంతం చేశాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోవడం హైదరాబాద్‌ మరో ప్రత్యేకత. అందుకే గ్లోబలైజేషన్‌ తర్వాత వచ్చిన ఐటీ, బయోటెక్నాలజీ విప్లవాన్ని వెనువెంటనే అందిపుచ్చుకుంది. సత్యం లాంటి కంప్యూటర్‌ దిగ్గజాలైనా... డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో ఫార్మసీ, శాంతా బయోటెక్‌ లాంటి ఔషధ సంస్థలైనా నగరంతో పాటే విస్తరించాయి. ఇక పర్యాటకం, మెడికల్‌ టూరిజంలో అయితే ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది.

సరికొత్త దూకుడు

హైదరాబాద్‌ శరవేగంతో దూసుకుపోతున్నా... నీళ్లు, నిధులు, నియామకాలలో ఇక్కడి ప్రజలకు మొండిచెయ్యి మిగులుతున్నదనే ఆగ్రహం ఉద్యమాలకు దారితీసింది. కేసీఆర్‌ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత తెలంగాణకు కలికితురాయిగా ఉండే హైదరాబాద్‌ను మరింతగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. పరిశ్రమల స్థాపనలో అడుగడుగునా ఆటంకాలను సృష్టిస్తూ ఉంటాయని, ప్రభుత్వాల మీద చిరకాల విమర్శ ఉంది. దాన్ని తిప్పి కొడుతూ, 15 రోజుల్లోనే పరిశ్రమ ఏర్పాటుకు 

అవసరమయ్యే అన్ని అనుమతులనూ ఇవ్వడమే లక్ష్యంగా ‘టీఎస్‌ ఐపాస్‌' విధానాన్ని తీసుకువచ్చారు. కేవలం స్థాపనకే కాదు, పరిశ్రమలకు ప్రోత్సాహకరంగా ఉండేందుకు కరెంటు లాంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. అనేక రాయితీలనూ ప్రకటించారు. ఇక టీ-ప్రైడ్‌, టీ-ఐడియా, టీ-ప్రైమ్‌ లాంటి అసంఖ్యాకమైన విధానాలతో హైదరాబాద్‌లో పరిశ్రమల రంగానికి కొత్త ఊపును అందించింది ప్రభుత్వం. ఖాయిలా  పరిశ్రమలకు సైతం కొత్త ఊపిరిని అందించేందుకు ‘ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌'ను  ఏర్పాటు చేసింది. అందుకే ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌'లో ఏటా అగ్రస్థానాన్ని అందుకుంటున్నది. 

ఫలితం అనూహ్యం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచీ నగరానికి ఉన్న ఉజ్వల భవిష్యత్తును గమనించి ప్రతిష్ఠాత్మక సంస్థలెన్నో తరలి వచ్చాయి. మన దేశంలో తొలి ఐకియా స్టోర్‌కు హైదరాబాద్‌ గమ్యమైంది. నగర శివార్లలో రెండులక్షలకు పైగా చదరపు అడుగులతో, ఫ్లిప్‌కార్ట్‌ తన భారీ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను నెలకొల్పింది. మొబైల్‌ దిగ్గజం ‘వన్‌ప్లస్‌' పరిశోధన కేంద్రం, 

నోవార్టిస్‌ నాలెడ్జ్‌ సెంటర్‌, టాటా బోయింగ్‌ కర్మాగారం లాంటి అనేక ప్రాజెక్టులు నిర్విఘ్నంగా సాకారమయ్యాయి. ప్రాక్టర్‌ అండ్‌ గాంబిల్‌ 400 కోట్లతో ఇక్కడ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది, హ్యుందయ్‌ సైతం హైదరాబాద్‌కు వస్తానంటూ చర్చలు జరుపుతోంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఫార్మాసూటికల్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌' అయినా ఫార్మాసిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! పదిహేను వేల ఎకరాలలో, 150 సంస్థలతో, లక్షల కోట్ల పెట్టుబడులతో రూపొందుతున్న ఈ మంత్రనగరం... హైదరాబాద్‌ను దేశానికే ఔషధరాజధానిగా మార్చబోతున్నది. అనూహ్యమైన ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలే కాదు... ఆర్థికరంగానికి అంకుర పరిశ్రమలు కూడా కీలకమే! అందుకే స్టార్టప్స్‌ను ప్రోత్సహించడంలో హైదరాబాద్‌ ముందంజలోనే ఉంది. వెయ్యికి పైగా స్టార్టప్‌లకు ప్రాణం పోసింది. స్టార్టప్‌లకు అనుకూలంగా ఉన్న ఇలాంటి వాతావరణం వల్లే... స్కైరూట్‌, అర్బన్‌ కిసాన్‌ లాంటి సంస్థలు వార్తల్లో నిలిచాయి. ఆసియాలోని 30 ఏండ్లలోపు 30 మంది ప్రతిభావంతులలో ఏకంగా అయిదుగురు హైదరాబాదీలకు చోటు దక్కింది.  ఇదంతా ఆరంభమే!


logo