శుక్రవారం 22 జనవరి 2021
Sunday - Nov 29, 2020 , 02:18:18

మన్‌మన్‌ మే మహాన్‌ షెహర్‌

 మన్‌మన్‌ మే మహాన్‌ షెహర్‌

ఒక్కసారి హైదరాబాద్‌ గాలి తాకితే చాలు.. ఏదో ఆప్యాయత పలకరించినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడి ఇరానీ చాయ్‌ తాగితే.. జిహ్వ జన్మ ధన్యమైందనిపిస్తుంది. ఇక బిర్యానీ రుచి చూస్తే.. దాని కోసమే భాగ్యనగరికి పదే పదే రావాలనిపిస్తుంది. మనుషుల్లో ఆప్యాయత, వేషభాషల్లో విలక్షణత హైదరాబాద్‌కు ఖండాంతర ఖ్యాతిని కట్టబెట్టాయి. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ అందరి మనసుల్లో షాన్‌ షెహర్‌ హైదరాబాద్‌ నిషాన్‌ పదిలంగా నిలిచిపోయింది.

వెంటనే వచ్చేస్తా!

హైదరాబాద్‌లో నా చిన్నప్పటి మెమరీస్‌ ఎప్పుడూ గుర్తుంటాయి. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వాటిని తల్చుకుంటూనే ఉంటా. నేను టెన్త్‌ వరకూ చదివిన సెయింట్‌ ఆన్స్‌ గర్ల్స్‌ హై స్కూల్‌, మా ఇల్లు, హైదరాబాదీ ఫ్రెండ్స్‌ని నేనెప్పటికీ మర్చిపోలేను. మేం ముంబయికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఈ నగరాన్ని వదిలిపోతున్నామని చాలా బాధపడ్డాను. ఇప్పటికీ హైదరాబాద్‌లో ఏ ప్రోగ్రామ్‌కి పిలిచినా, వెంటనే ఒప్పేసుకుని హ్యాపీగా వచ్చేస్తాను.

-టబు

నా కోసం ఓ గది!

హైదరాబాద్‌ నా జన్మస్థానం. ఇక్కడే పుట్టాను.. అందుకేనేమో ఎవరు హైదరాబాద్‌కి పిలిచినా పరిగెత్తుకుంటూ వస్తాను. నా ఫ్రెండ్‌ (అమ్మ అని పిలుస్తాను) శోభా ప్రసాద్‌ వాళ్లింటికీ తరచూ వస్తుంటాను. ఫిల్మ్‌నగర్‌లోని వాళ్లింట్లో నాకోసం ఓ రూమ్‌ ప్రత్యేకంగా ఉంటుంది. నేనెప్పుడు వచ్చినా బ్యాగ్‌ మోసుకు రావాల్సిన పనిలేదు.. అందులో నా పిల్లల బొమ్మలతో సహా అన్నీ ఉంటాయి. ఆ రూమ్‌కి ‘సుష్‌' అని పేరు పెట్టింది అమ్మ. ముఖ్యంగా తను పెట్టే కాఫీ, తెలుగింటి పచ్చళ్లు, భక్ష్యాలు అంటే నాకెంతో ఇష్టం. హైదరాబాద్‌ కల్చర్‌ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ప్రపంచంలోని అద్భుతమైన వారసత్వ నగరాల్లో ఇదొకటి.

-సుస్మితా సేన్‌

నా పుట్టినిల్లు

నేను పుట్టింది హైదరాబాద్‌లోనే. కాకపోతే ఇక్కడ చదువుకోలేదు. కానీ, మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉండటం వల్ల వేసవి సెలవుల్లో వచ్చేదాన్ని. మా తాతయ్య ఎప్పుడూ నన్ను తెలుగు లేదా ఉర్దూలోనే మాట్లాడమనే వారు. నా రూట్స్‌ ఈ సిటీలోనే ఉన్నాయి. అందుకే నేను పక్కా హైదరాబాదీ అని గర్వంగా చెప్తా.

-అదితీరావు హైదరి

యునీక్‌ సిటీ

నాకు బాగా నచ్చే నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. భాగ్యనగర చారిత్రక నేపథ్యం, కట్టడాలు, సంస్కృతి, సంప్రదాయాలంటే చాలా ఇష్టం. ఇక్కడ చేతి వాచీల దగ్గరి నుంచి ఎత్నిక్‌ ఫ్యాషన్‌వేర్‌ వరకు యునీక్‌గా, ట్రెండీగా ఉంటాయి. నేనెప్పుడు హైదరాబాద్‌కి వచ్చినా కొత్తగా ఫీలవ్వను. బాగా పరిచయం ఉన్న నగరానికి వచ్చానన్న అనుభూతికి లోనవుతాను.

- ఐశ్వర్య రాయ్‌

మరచిపోలేని ఆతిథ్యం

టెక్నాలజీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పురాతన నగరం హైదరాబాద్‌. ఈ టెక్నాలజీ సెంటర్లు మరింత వృద్ధి చెందుతూ వరల్డ్‌ ఫేమస్‌ హైదరాబాదీ బిర్యానీని ఇంకా పాపులర్‌ చేయాలని కోరుకుంటున్నా. హైదరాబాద్‌ ఆతిథ్యాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.

- ఇవాంక ట్రంప్‌

బాల్యంలో వేసవి విడిది

నా చిన్నప్పుడు నాలుగైదు సంవత్సరాలు హైదరాబాద్‌ టోలిచౌకీలోని అమ్మమ్మ ఇంట్లో పెరిగాను. తర్వాత ఇక్కడ్నుంచి వెళ్లిపోయినా వేసవి సెలవులకు హైదరాబాద్‌ వచ్చేవాడిని. రెగ్యులర్‌గా చార్మినార్‌కు వెళ్తూ ఉండేవాడిని. హైదరాబాద్‌ మా అమ్మవాళ్ల ఊరు అని ఎప్పుడూ చెప్తూ ఉంటా. ఏదైనా షూటింగ్‌, క్రికెట్‌, ఈవెంట్స్‌కి హైదరాబాద్‌ వస్తున్నప్పుడు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంటుంది. నాకు హైదరాబాదీ హలీమన్నా, బిర్యానీ అన్నా చాలా ఇష్టం.

- షారుక్‌ ఖాన్‌


logo