శుక్రవారం 22 జనవరి 2021
Sunday - Nov 29, 2020 , 01:52:20

పగటి ద్వేషగాళ్లున్నారు.. పారాహుషార్‌!

పగటి ద్వేషగాళ్లున్నారు.. పారాహుషార్‌!

పులితోలు కప్పుకున్న మేకలూ, గోవులమని చెప్పుకునే నక్కలూ మన బస్తీలకు వస్తున్నాయి, మన కాలనీలను చుట్టుముడుతున్నాయి, మహానగరం మాదేనంటూ బీరాలు పలుకుతున్నాయి. కాలకూట విషాన్ని అమృతమని నమ్మిస్తున్నాయి. శిథిలాలమీద సౌధాలు కట్టుకోవడం, శవాలమీద సామ్రాజ్యాలు నిర్మించుకోవడం వాళ్లకు పుట్టుకతో తెలిసిన విద్య. విద్వేషమే వాళ్ల అసలు వేషం! ఓటేయడానికి వెళ్లే ముందు.. నాలుగువందల ఏండ్ల మచ్చలేని చరిత్రను గుర్తుచేసుకోండి! అరాచక కీచక సంతతిని బొందబెట్టండి. అభివృద్ధి నినాదానికి మద్దతు ఇవ్వండి. 

హైదరాబాదీలు కల్లాకపటం తెలియని కపోతాల లాంటివారే. బిడ్డకు ఒళ్లు వెచ్చబడగానే.. చింతలబస్తీ వెంకటలక్ష్మి చంటిపిల్లను చంకలో ఎత్తుకుని ప్రేమ్‌నగర్‌ మసీదు మెట్ల దగ్గర నిలబడుతుంది. సాయంకాలపు నమాజు పూర్తి చేసుకుని వచ్చే మస్తాన్‌సాబ్‌ దువా కోసం. పాస్టర్‌సాబ్‌ ఏటా ఆషాఢంలో రామ్‌లక్ష్మణ్‌ యాదవ్‌ ఇంటికి రావాల్సిందే.. బోనాల ధావత్‌కు! డబీర్‌పురా ఉస్మాన్‌భాయ్‌కి గోపాల్‌దాస్‌ పంతులుగారి ఇంట్లో భోజనం అంటే మహా ఇష్టం! వదినమ్మ వడ్డించే గుమ్మడికాయ వడియాలు, మామిడికాయ తొక్కు మక్కువగా ఆరగిస్తాడు. మొహర్రం నాడు ముస్లిం సోదరులు మాతం నిర్వహిస్తూ ఒళ్లంతా గాయాలతో సంతాపం ప్రకటిస్తుంటే, హిందూ మిత్రులు మంచినీళ్లు పోస్తూ మంచిమనసును చాటుకుంటారు. ఇక్కడ హిందూ ముస్లిం భాయీభాయీ! ఎవరి నమ్మకాలు వారివి. కానీ, మానవత్వాన్ని మరింత నమ్ముతారు. ఎవరి ప్రార్థనా విధానాలు వారివి. కానీ, ఏ మతమూ హింసను బోధించదని బలంగా విశ్వసిస్తారు. ఎవరి పండగలు వారివి. కానీ, అందరూ కలిసే జరుపుకుంటారు. ఎంతో భిన్నత్వం. అందులోనే ఏకత్వం! 

చార్మినార్‌ కిందే.. భాగ్యలక్ష్మి దేవాలయం.అంబర్‌పేట ఖబర్‌స్థాన్‌ పక్కనే ఆంజనేయస్వామి గుడి. ఆ సహజీవన సౌందర్యం భాగ్యనగరానికి బాగా తెలుసు! కాబట్టే, షీర్‌ ఖుర్మాలో చక్కెరా, పాలూ కలిసినట్టు హిందూ ముస్లింలు కలిసిపోయారు.   గోల్కొండ ప్రభువులు ముస్లింలే అయినా, హిందువుల నమ్మకాల్ని గౌరవించారు, ఘనంగా పండగలు జరిపించారు. భాషా సంస్కృతులను నెత్తిన పెట్టుకున్నారు. అక్కన్న మాదన్నలనే సోదరులకు పెద్ద పదవులిచ్చి సత్కరించారు. ఇంతకు మించిన పరమత సహనం ఇంకెక్కడ ఉంటుంది? పాలకుల బాటలోనే ప్రజలూ నడిచారు. రంజాన్‌, మొహర్రం లాంటి సందర్భాల్లో హిందువులు.. ఆశువుగా పాటలు కట్టి కోలాటాలు ఆడేవారు. సూఫీ గురువులు హిందూ భజన సంప్రదాయాన్ని ప్రోత్సహించేవారు. సంగీత నృత్యాలకైతే అది స్వర్ణయుగమే. తారామతి, ప్రేమమతి .. సోదరీమణుల పేరిట ఏకంగా గ్రామాలే వెలిశాయి! రామదాసు భక్తి కీర్తనల్ని అమితంగా ఇష్టపడే.. తానీషా కుమార్తె ఆ వాగ్గేయకారుడిని ఖైదు నుంచి విడిపించిందని ఓ కథనం. 

ఇబ్రహీంను ఇభరాముడని కీర్తించారు తెలుగు కవులు. కందుకూరి రుద్రకవి ఇంకో అడుగు ముందుకేసి.. మల్కిభరాముని కీర్తిని ఒకవైపూ, కైలాసాన్ని ఒకవైపూ ఉంచితే.. సుల్తానుల కీర్తివైపే తాసు మొగ్గిందట! ‘అందరివాడు’ అనిపించుకున్న పాలకుడికే అంత అదృష్టం దక్కుతుంది. ఖులీ కుతుబ్‌షా అయితే.. ఏకంగా తెలుగు భాష నేర్చుకుని తెలుగులో కవిత్వం రాశాడని అంటారు. ఆయన ఉర్దూ కావ్యానికి  తెలుగు పలుకులు చక్కెర పలుకుల్లా కొత్తరుచిని తెచ్చిపెట్టాయట. దురదృష్టవశాత్తూ ఓ అగ్ని ప్రమాదంలో ప్రభువుల సాహిత్యమంతా బూడిద పాలైందని చెబుతారు. అసఫ్‌ జాహీల కాలంలోనూ భాయీభాయీ విధానమే కొనసాగింది. శాస్త్రీయ సంగీత విద్వాంసురాలైన చందాబాయిని నిజాం అలీఖాన్‌ సకల లాంఛనాలతో గౌరవించాడు. నిజాం రాజ్యంలోని సంస్థానాలూ సార్వభౌముడి బాటలోనే నడిచాయి. అధికార భాష ఉర్దూను ఎవరూ పరాయిదిగా భావించలేదు. 

అయ్‌ ఉర్దూ తు హిందుస్థాన్‌కి

చహ్‌తీ జుబాన్‌ హై

ఏ కిస్నే బేఖజూర్‌ తుఝే

ముసల్మాన్‌ బనాదియా..

‘ఉర్దూ! నువ్వు హిందుస్థాన్‌ ప్రియభాషవి. నిన్ను అన్యాయంగా ముసల్మాన్‌ను చేసింది ఎవరు’ అని బాధపడిపోయారు సాహితీ ప్రియులు.  

మనిషినిబట్టే సంస్కారం.  సంస్కారాన్ని బట్టే సాహిత్యం. ఓ దశలో ఉర్దూ, తెలుగూ ప్రేయసీప్రియుల్లా చెట్టాపట్టాలేసుకుని తిరిగాయి. సభల్లో పాల్గొన్నాయి. వేదికలెక్కాయి. పురస్కారాలు అందుకున్నాయి. ఎంత గాఢమైన అనుబంధం అంటే.. అచ్చమైన ఉర్దూ పదాలుకూడా స్వచ్ఛమైన తెలుగుమాటలే అన్నంతంగా కలిసిపోయాయి. కొన్ని యునానీ ఔషధాలకూ తెలుగు పేర్లు పెట్టుకున్నారట. ఖవ్వాలీని తెలుగుకవ్వంతో చిలికారు దాశరథి. గజల్స్‌కు తెలుగు గజ్జెలు కట్టారు సినారె. హైదరాబాదీల ఆహార్యంలోనూ హిందూ ముస్లిం జుగల్బందీ తొంగి చూస్తుంది. పాతతరం పెద్ద మనుషులు.. మతాలకు అతీతంగా షేర్వానీ ధరించారు. టోపీ పెట్టుకున్నారు. ఆత్మీయులకు ‘సలాములు’ చేశారు. ముస్లింల సంస్కారంలో నమస్కారమూ ఓ భాగమైంది

భాగ్యనగరాన్ని వరదలు ముంచెత్తాయి. మూసీ పొంగి పొర్లింది. రెండొందల ఇరవై చెరువులు నిండాయి. వంతెనలు కుప్పకూలాయి. ఇరవై వేల ఇండ్లు మట్టి ముద్దల్లా మారాయి. 

ఆ సమయంలో..

ఓ చింతచెట్టు ఎన్నో ప్రాణాలను కాపాడింది. ఆ కొమ్మల్ని పట్టుకుని చావు చింతను గెలిచిన వాళ్లలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులూ ఉన్నారు. ప్రాణభయంతో తనను ఆశ్రయించినవారిని ‘నీదే మతం?’ అని అడగకుండానే ఆ వృక్షం ప్రాణభిక్ష పెట్టింది. చెట్టుకు ఉన్నపాటి సంస్కారం కూడా లేదు.. చెట్టంత నాయకులమని చెప్పుకునే కొందరికి! మతాన్నిబట్టి మనుషుల్ని విడదీయడం ఏమిటి?  ఇన్నేండ్ల తర్వాత మూలాల శూలశోధన అవసరమా?

పూల్‌కి పత్తీసె కట్‌సక్తా హై 

హీరేకా జిగర్‌ 

మర్దెనాదాపర్‌ కలామె  నర్శె  నాజూక్‌ బే అసర్‌

..వజ్రాన్ని దిరిశన పూవు రేకుతో ఛేదించవచ్చు. కానీ, మూర్ఖుడిని మంచిమాటతో మార్చడం అసాధ్యం.

మాటతో కుదరనప్పుడు ఓటుతోనే బుద్ధిచెప్పాలి. బేవకూఫ్‌ రాజకీయాల నుంచి హైదరాబాద్‌ను భద్రంగా కాపాడుకోవాలి. ఇది మన నగరం. మన పిల్లాపాపలు ప్రశాంతంగా బతకాల్సిన నగరం!

అదొక స్వర్ణయుగం..

వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేసినప్పుడు.. మత విశ్వాసాన్ని పక్కనపెట్టి మహబూబ్‌ అలీఖాన్‌.. మూసీకి చేతులెత్తి మొక్కాడు. పసుపు కుంకుమలు సమర్పించి శాంతించమని వేడుకున్నాడు. ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో మహారాజా కిషన్‌ పర్షాద్‌ వంటి మేధావులకు అపార గౌరవం దక్కింది. ఒకానొక దశలో కొన్ని ఉన్మాద శక్తులు  గొడవలు సృష్టించాయి. అల్లర్లను ఉసిగొల్పాయి. ఆ సమయంలోనూ సామాన్యులు సహనం కోల్పోలేదు. హిందూ జనాభా అధికంగా ఉండే ప్రాంతంలో.. ముస్లిం కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ముస్లింలు అధికంగా ఉండే బస్తీలలో హిందువులకు తమ ఇండ్లలో ఆశ్రయం కల్పించారు. అభినవ పోతన వానమామలై వరదాచార్యులవారు ఒకానొక కల్లోల సమయంలో బ్రాహ్మణుడికి దొరికిన ముస్లిం బాలికను కథానాయికను చేసి ‘విప్రలబ్ద’ అనే కావ్యం రాశారు.     


logo