బుధవారం 27 జనవరి 2021
Sunday - Nov 29, 2020 , 01:45:51

‘హైదరాబాద్‌ జిందాబాద్‌

‘హైదరాబాద్‌ జిందాబాద్‌

బాబుకో, పాపకో క్లాసులో ఫస్ట్‌ ర్యాంక్‌ వస్తే ఎంతో సంతోషిస్తాం! ఆ విషయాన్ని వాట్సాప్‌లో మిత్రులతో , బంధువులతో షేర్‌ చేసుకుంటాం. ఆఫీసు అప్రెయిజల్స్‌లో మనకు గ్రేడ్‌-ఎ ఇస్తే  ఎగిరి గంతేస్తాం. దోస్తుగాళ్లను పిలిచి మరీ  పార్టీ ఇస్తాం.  అలాంటిది, ఏకంగా మన నగరానికి అనేకానేక పురస్కారాలు వస్తే ఇంకెంత మురిసిపోవాలి?  మనసులోనే  ‘హైదరాబాద్‌ జిందాబాద్‌'  అని నినదిద్దాం! 

నివాసయోగ్యనగరం

దేశంలో నివాసయోగ్యత, ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్‌ అత్యుత్తమ నగరంగా ప్రథమ స్థానంలో నిలిచింది. హాలిడిఫై డాట్‌కామ్‌ వెబ్‌సైట్‌ ఈ సర్వే నిర్వహించింది. ముంబయి, పుణె, బెంగళూరు వంటి మహానగరాలను వెనక్కినెట్టి అగ్రపథాన నిలిచింది భాగ్యనగరం. 

చెత్త నిర్వహణలో కొత్త రికార్డు

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ దేశంలోని మొత్తం 29 రాష్ర్టాల రాజధానులు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులో ఉన్న ఘనవ్యర్థాల నిర్వహణను పరిశీలించి.. హైదరాబాద్‌ నగరానికి స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో అగ్రపీఠం వేసింది. విదేశాల్లో మాత్రమే అమలులో ఉన్న తడిచెత్త, పొడిచెత్త సేకరణను జీహెచ్‌ఎంసీ పరిధిలో అమలుచేస్తున్నందుకుగాను ‘నవభారత్‌ టైమ్స్‌' ఉత్తమ కార్పొరేషన్‌ అవార్డును ప్రకటించింది.

‘డబుల్‌' ధమాకా

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్ల పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రతి పేద కుటుంబమూ అన్ని రకాల మౌలిక సదుపాయాలు, వసతులు ఉన్న ఇండ్లలో జీవించాలనే సంకల్పంతో ఒక్క గ్రేటర్‌ పరిధిలోనే లక్ష గృహాలు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా కొల్లూర్‌-2లో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు హడ్కో బెస్ట్‌ ప్రాక్టీస్‌ అవార్డు అందజేసింది. ఈ సముదాయానికి జాతీయ స్థాయి పోటీలో కూడా పతకం లభించింది.

ప్రధానమంత్రి ఎక్సలెన్స్‌ అవార్డ్‌

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకుగాను పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో జీహెచ్‌ఎంసీకి ప్రధానమంత్రి ఎక్సలెన్స్‌ అవార్డ్‌ దక్కింది. కోటి జనాభాకు చక్కని పౌరసేవలు అందిస్తున్నందుకూ, దీర్ఘకాలిక అభివృద్ధి చేపడుతున్నందుకూ మోదీ చేతుల మీదుగా  సర్కారు తరఫున జీహెచ్‌ఎంసీ కమిషనర్‌  అవార్డును స్వీకరించారు. 

డిజిటల్‌ హైదరాబాద్‌

డిజిటల్‌ ఇండియా జాతీయ పురస్కారాల్లో తెలంగాణ మూడు అవార్డులను అందుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటల్‌ సేవలకు గాను ఈ అవార్డులు దక్కాయి. వెబ్‌ రత్న విభాగంలో మహబూబ్‌నగర్‌కి గోల్డ్‌ ఐకాన్‌ అవార్డ్‌తోపాటు ఔట్‌స్టాండింగ్‌ డిజిటల్‌ ఇనిషియేటివ్‌ బై లోకల్‌ బాడీ కింద జీహెచ్‌ఎంసీకి ప్లాటినం అవార్డు, బెస్ట్‌ మొబైల్‌ యాప్‌ విభాగంలో టీ-యాప్‌ ఫోలియోకి సిల్వర్‌ అవార్డు దక్కాయి. 


logo