శనివారం 23 జనవరి 2021
Sunday - Nov 29, 2020 , 00:59:42

గ్యారా కద్దూ.. బారా కొత్వాల్‌

గ్యారా కద్దూ.. బారా కొత్వాల్‌

నిజంగానే జరిగిన ఓ సంఘటనలోంచి ఈ సామెత పుట్టింది. సురవరం ప్రతాపరెడ్డి ఈ సామెతను వివరిస్తూ.. నాటి సమాజ స్థితిగతులపై ఒక కథ కూడా రాశారు. అమాయక గ్రామీణులు పొట్ట చేత పట్టుకుని పట్టణానికి వస్తే, ప్రతివాడూ తానే అధికారిని అంటూ ఎట్లా మోసం చేసేవాడో ఈ సామెత కండ్లకు కడుతుంది. ఓ అమాయకుడు శివారు గ్రామం నుంచీ పదకొండు ఆనపకాయల్ని అమ్మటానికి వచ్చాడు. ఫుట్‌పాత్‌పై పరుచుకొని కూర్చుంటే ఎవరెవరో వచ్చి నేను ఈ నగరానికి కొత్వాల్‌ను, ఇక్కడ పర్మిషన్‌ లేకుండా కూర్చున్నందుకు ‘గిరఫ్తార్‌' చేస్తా అని బెదిరించి ఒక కాయను పట్టుకొని పోయేవారు. ఇలాగే పదకొండు కాయలు మాయం అయిపోయాయి. పన్నెండో మనిషి వచ్చి ‘నేనే అసలైన కొత్వాల్‌ను. ఇక్కడ పనీ పాటా లేకుండా ఖాళీగా ఎందుకు కూర్చున్నావ్‌ గిరఫ్తార్‌ చేస్తా’ అని బెదిరించాడట. దీంతో ఆ గ్రామీణుడు ‘గ్యారా కద్దూ బారా కొత్వాల్‌' అని ఏడుస్తూ కథంతా చెప్పాడట. 

జో కమ్‌ సోఁచ్‌తా హై ఓ జ్యాదా బోల్తా హై

ఆలోచన తక్కువగా ఉంటే మాటలు ఎక్కువగా వస్తాయి. మెదడు బరువుగా లేకపోతే నాలుక వదులుగా ఉన్నట్టే. ఉత్త కుండకు ఊపులెక్కువ.

పహలే ఆప్‌, పహలే ఆప్‌.. ఇత్నే మే గాడీ నికల్‌ గయీ

నవాబులకు మర్యాదలు ఎక్కువ. ఇద్దరు నవాబులు ప్లాట్‌ఫాంపై కలుసుకుని సలాములు సమర్పించుకున్నారు. ఇంతలో రైల్‌ గాడీ వచ్చింది. ‘ముందు మీరు ఎక్కండి’ అని ఒకరు మర్యాద చూపితే.. ‘లేదులేదు. తమరే ఎక్కండి’ అని మరొకరు గుజారిష్‌ (విన్నపం) చేశారు. అంతలోనే, రైలు రావడమూ జరిగింది. పోవడమూ జరిగింది. మర్యాదలు మితిమీరినప్పుడు ఈ సామెతను గుర్తుచేసుకుని నవ్వుకుంటారు.

హైద్రాబాద్‌ కీ హవా ఏక్‌ లాఖ్‌ కీ దవా

నలభై, యాభై సంవత్సరాల కింద హైద్రాబాద్‌ నగరానికి సంబంధించిన సామెత ఇది. ఆ బంగారు దినాలలో స్వచ్ఛమైన శీతల పవనాల వల్ల, గండిపేట్‌  నీళ్ల వల్ల ఆరోగ్యాలు బాగుపడేవనీ, లక్ష రూపాయలు పెట్టినా దొరకని మందు హైద్రాబాద్‌ గాలి అనీ వృద్దులు ఈ సామెత రూపంలో చెప్పేవారు. ఇప్పుడు మనం “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు” అని పాడుకోవలసిన దుస్థితి.

శక్కర్‌ షర్మానా గూడ్‌ గభ్‌రానా

‘ఈ మామిడిపండ్లు తియ్యగా ఉంటాయా’ అని తోపుడు బండిమీద మామిడిపండ్లు అమ్మే ఒక ముసలి ముసల్మాన్‌ను అడిగితే,  నిరక్షరాస్యుడిలా కనబడే ఆ ముదుసలి ఈ సామెతను చెప్పాడు. అంటే, ఈ మామిడి పండ్ల తియ్యదనాన్ని కనుక శక్కర రుచి చూస్తే ‘అయ్యో నా కంటె తియ్యగా ఉందే’ అని సిగ్గు పడతదట. ఇక బెల్లమేమో ‘అబ్బో ఇంత తియ్యదనమా’ అని గాభరా పడ్తుందట. నిరక్షరాస్యుల భాషా చాతుర్యానికి ఇదొక మంచి తార్కాణం.

బగల్‌ మే చురి మూమే రాం రాం

కొన్ని రాజకీయ పార్టీలకూ కొందరు మేకవన్నె నేతలకూ ఈ సామెత అతికినట్టు సరిపోతుంది. కనబడకుండా కడుపులో కత్తులు దాచుకొని, పెదాల మీద మాత్రం రామనామం జపించేవాళ్ల గురించే ఈ మాటలన్నీ. విద్వేషమే వారి అసలు వేషం. 


logo