గురువారం 03 డిసెంబర్ 2020
Sunday - Nov 22, 2020 , 03:12:30

పల్లె హుషార్‌.. కొవిడ్‌ పరార్‌!

పల్లె హుషార్‌.. కొవిడ్‌ పరార్‌!

కరోనా ప్రపంచాన్నంతా భయపెడుతున్నది. ప్రతి మనిషినీ వణికిస్తున్నది. కానీ, తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో మాత్రం ఆ వైరస్‌ జాడ మచ్చుకైనా లేదు. స్వచ్ఛంద సంస్థల కృషి, ప్రజల చైతన్యం, ప్రభుత్వ చేయూత.. మూడు వ్యవస్థలూ చేతులు కలిపితే, ఎన్ని అద్భుతాలైనా చేయవచ్చని నిరూపించే ఉదంతం ఇది. అగ్రదేశాలైన అమెరికా, చైనాలు సాధించలేని విజయం ఆ పల్లెలకు ఎలా సాధ్యమైంది?  ఆక్స్‌ఫర్డ్‌లూ, స్టాన్‌ఫోర్డ్‌లూ దృష్టి సారించాల్సిన కోణాలివి.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 70 కిలోమీటర్లు.చుట్టూ ఆకుపచ్చని కొండలు.ఆ కొండల మధ్య పాలపిట్టల్లా ఒదిగున్న ప్రాంతం..పాల్వంచ, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, చంద్రుగొండ, ఆళ్లపల్లి, మొలకలపల్లి, టేకులపల్లి మండలాలు. మొత్తం ముప్పై ఒక్క కుగ్రామాలు.నగరానికి దూరంగా ఉన్నారు కాబట్టి, అనాగరికులని అనుకుంటే పొరపాటు. గిరిజన గూడేలు కాబట్టి.. ఇరుకిరుకుగా, అపరిశుభ్రంగా ఉంటాయనుకుంటే మళ్లీ పొరపాటు.  ఆ నివాస సముదాయాలు ఆధునికమైన కాలనీలను మరిపిస్తాయి. ఇంటికీ ఇంటికీ మధ్య నలభై అడుగుల దూరమైనా ఉంటుంది. నివాసం చుట్టూ వెదురు కర్రలతో దడిలు కట్టుకుంటారు. ఇంటి వెనుక వేప, ఇప్ప చెట్లు తప్పక ఉంటాయి. ముక్కులకు జిల్లేడు ఆకు మాస్కులు చుట్టుకొని.. పలుగూ పారలతో పోడు వ్యవసాయం చేస్తూనో, వాగుల్లోంచి నీళ్లు మోసుకొస్తూనో కనిపిస్తారు స్థానిక జనం.‘ఇంకే వెరీ మా నాటే బొంకున్‌ కరోనా వాయేమాకి ఒన కారన్‌ ఓరు డాక్టర్‌...’ (ఇప్పటి వరకు మా ఊర్లకు కరోనా రాలేదు. దానికి కారణం ఆ డాక్టర్‌ సారులే!! )- అంటూ గోండు భాషలో సంతోషంగా ఓ వైపు వేలు చూపుతారు ఆక్కడి మహిళలు. అటువైపు చూస్తే ఇప్ప చెట్టు కింద కూర్చొని, ఇద్దరు యువ వైద్యులు చుట్టూ ఉన్న ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ దర్శనమిస్తారు. మరో ఇద్దరు మహిళా డాక్టర్లు వైద్యపరీక్షలు చేస్తూ అవసరమైన మందులు ఇస్తుంటారు. ఈ ఒక్క దృశ్యం చాలు, ఆ పల్లెల ఆరోగ్య విజయ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి. 

 అడవికి వైద్యం..

ఈ పల్లెలన్నీ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంతో విద్య, వైద్యం, విద్యుత్‌ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. జనానికి గోండు, కోయ భాషలు మాత్రమే తెలుసు. కొద్దిగా తెలుగు మాట్లాడతారు. అలాంటి చోట ఏడాది క్రితం ‘ఇండిజీనస్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌' అడుగు పెట్టింది. కనీస అవసరాలకు దూరంగా ఉన్న 31 ఆవాసాల మధ్య (ఒక్కో ఆవాసంలో 150 నుండి 190 వరకు జనాభా ) విద్య, వైద్య సదుపాయాల కోసం పనిచేయడం ప్రారంభించింది. ఈ చిన్నచిన్న పల్లెలన్నీ కలిపితే.. దాదాపు 4,800 కుటుంబాలు ఉంటాయి. లాక్‌డౌన్‌కు ముందే, అంటే జనవరిలో ‘ఇండిజీనస్‌' వ్యవస్థ్దాపకులు డాక్టర్‌ నరేందర్‌, తన మిత్రుడు డాక్టర్‌ కపిల్‌ శర్మతో కలిసి ఆ గ్రామాల ఆరోగ్య స్ధితి గతుల మీద అధ్యయనం చేశారు.

 “అడవి ఒడిలో స్వేచ్ఛగా బతికే అమాయక జనం వీళ్లు. పచ్చదనాన్ని వదిలిపెట్టి జనారణ్యంలోకి రాలేరు. వాగులూ వంకలే ఆధారం. వీరికి వైద్యం అందించడంలో ఎనలేని సంతృప్తి ఉంది. కనీస వసతులు కల్పించి, జీవన స్థితిగతులను మార్చగలిగితే ఎంతో ఉపకారం చేసినవాళ్లం అవుతాం. ఇక్కడ అనారోగ్యానికి గురైతే ఆకుపసర్లే దిక్కు. ప్రాణాల మీదికి వస్తున్నా నాటు వైద్యం మీదే ఆధారపడతారు. మహిళలు ఇంట్లోనే పురుడు పోసుకుంటారు. ఏ రోగమో వస్తే.. దేవుడికి మొక్కుకుని పసుపు బొట్టు పెట్టుకోవడం, కోళ్లను బలి ఇవ్వడం, ఇప్ప సారా పోయడం వంటి మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయి. మహిళల్లో రక్తహీనత, పిల్లల్లో పౌష్టికాహార లోపం గుర్తించాం. ఆ పరిస్థితుల్ని మార్చడానికి స్థానిక యువతీయువకులకు డాక్టర్‌ కపిల్‌ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలుగా శిక్షణ ఇచ్చాం. వారి ద్వారానే గ్రామస్తుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాం” అని వివరించారు డాక్టర్‌ నరేందర్‌. అలా, ఆయా గ్రామాలకు చెందిన నలభై నాలుగుమంది యువతీ యువకులను కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లుగా తీర్చిదిద్దారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, బీపీ షుగర్‌లను చెక్‌ చేయడం, గర్భిణులకు పురిటి నొప్పులు వస్తే వెంటనే, ఆసుపత్రికి తీసుకెళ్లడం, పుట్టిన బిడ్డలకు ఆరోగ్య సమస్యలెదురైతే తక్షణం ఏఎన్‌ఎంలూ, ఆశా వర్కర్‌ల దృష్టికి తీసుకెళ్లడం వీళ్ల బాధ్యతలు.

ఏం చేశారు? 

 ఫిబ్రవరిలో.. కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన తొలి దశలోనే ఇక్కడి ప్రజలను స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అప్రమత్తం చేశారు. ఆరోగ్య కార్యకర్తలు గ్రామగ్రామానా తిరిగి జ్వరం, జలుబు దగ్గు కేసులను గుర్తించి మందులు ఇచ్చారు. అదృష్టవశాత్తు, అవన్నీ సాధారణ ఎలర్జీ వల్ల రావడంతో తొందరగానే నయం అయ్యాయి. ఆరోగ్య కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తపడ్డారు.  కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు స్థానికులే కావడంతో పల్లెల్లోకి కొత్తవారు వస్తే.. వెంటనే గుర్తిస్తారు. ఆ అతిథుల ఆరోగ్యం గురించి తెలుసుకున్నాకే లోపలికి అడుగు పెట్టనిస్తారు. రోజూ అక్కంతో (బూర), డప్పులతో ప్రజలకు కరోనా హెచ్చరికలు చేస్తుంటారు. రోజుకు ఐదుసార్లు చేతులు శుభ్రంగా కడుక్కునేలా ప్రోత్సహిస్తారు. సబ్బు లేకపోతే వేపాకు రసంతో, ఉప్పునీళ్లతో కడుక్కోవచ్చని సూచిస్తారు. తుమ్మో దగ్గో వచ్చిప్పుడు నోటినీ ముక్కునూ ఆకుతోనో వస్త్రంతోనో అడ్డుపెట్టుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తారు. ఇవన్నీ స్థానిక గోండు భాషలోనే సాగుతాయి. వీటితోపాటు రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలు అందిస్తారు. పోషకాహార లేమితో బాధపడుతున్న వారికి సమతుల్యమైన ఆహారం అందేలా సాయపడతారు. గోధుమలు, జొన్నలు, పల్లీ పిండితో చేసిన పౌష్టికాహారాన్ని చేరవేస్తారు.

జీవన శైలి కూడా...

కరోనాను జయించడంలో సంప్రదాయ జీవన విధానమూ సాయపడుతున్నది. నాగరిక సమాజానికి దూరంగా కొండలమధ్య జీవిస్తున్న ప్రజల అలవాట్లు బయటివాళ్లకు వింతగా అనిపించవచ్చు. దాహం తీర్చుకోవడానికి వాగుల్లోని ఊట నీరే ఆధారం. ఆ జలాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. చేతులతో తాకితే కలుషితమవుతాయని నమ్ముతారు. దీంతో, నేరుగా ముట్టకుండా వంగి నోటితో తాగుతారు. ఎంత పేదలైనా సరే, నివాసాలు ఇరుకిరుకుగా ఉండవు. రెండు ఇండ్లమధ్య 40 అడుగుల దూరం ఉండేలా కట్టుకుంటారు. డెలివరీ సమయంలో విడిగా చిన్న పూరిల్లు నిర్మించి, అందులోనే నిండు గర్భిణులను ఉంచుతారు. తల్లీబిడ్డలకు హానికర వైరస్‌లు సోకకుండా ఇదో ఏర్పాటు. ఇప్పటి క్వారంటైన్‌ పద్ధతిని వారు ఎప్పటి నుంచో పాటిస్తున్నారు. మనం ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న సేంద్రియ ఆహారం తరతరాలుగా ఆ గిరిజనుల ఆహారంలో భాగం. ఎర్రబియ్యం పండించుకుని తింటారు. విత్తనాలు చల్లి సాగు చేస్తారు. రసాయన ఎరువులు వాడరు. గొర్రెల వ్యర్థ్దాలను పొలంలో చల్లుతారు. ఏడాదంతా వీరికి ఆహారం సరిపోదు. వానా కాలంలో పనులు దొరకవు... దీంతో, ఎర్రచీమలనే రకరకాలుగా వండుకుని తింటారు. ఈ అలవాటు వల్ల, చీమలలోని ప్రొటీన్స్‌  వారిలో రోగనిరోధక శక్తిని పెంచాయని అంటారు వైద్యులు.కరోనా కట్టడిలో..

‘2017లో ఇక్కడ 134 ఆదివాసీ గుంపులుఉన్నట్టు గుర్తించాం. ప్రస్తుతం 31 గుంపులతో పనిచేస్తున్నాం. సమతుల్య ఆహారం కొరత వల్ల చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. తాగునీటి సౌకర్యం లేకపోవడం వల్ల డయేరియాతో ఇబ్బంది పడుతుంటారు. కిలోమీటర్ల దూరం వరకూ ఆసుపత్రులు లేవు. అందుకే, ప్రసవాలు పెద్ద గండంగా మారాయి. చాలామంది పిల్లలు తమ తొలి పుట్టినరోజు వరకూ కూడా బతకడం లేదు. ఇదీ పరిస్థితి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ మొదలు కాగానే జ్వరం, జలుబు లక్షణాలు ఉన్న వారిని గుర్తించి.. మిగతా వారు స్వచ్ఛందంగా దూరంగా ఉండేలా అవగాహన కల్పించాం. ఊళ్లోకి కొత్తవారు రాకుండా నిత్యం ఇద్దరు హెల్త్‌ వర్కర్లు పహరా కాస్తుంటారు. డా.అర్చన, డా. స్వాతి, మిగతా వలంటీర్లు, నిరంతరం ఈ గ్రామాల్లో తిరుగుతూ అవసరమైన వారికి మందులు, పౌష్టికాహారం అందించారు. మొదట్లో వీళ్లకు మాస్కులు అందుబాటులో లేవు. చెట్ల ఆకులనే ముక్కుకు కట్టుకునేవారు. ఆ తరువాత కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి, బట్ట ఇచ్చి, వాళ్లే స్వయంగా మాస్కులు తయారు చేసుకునేలా శిక్షణ ఇచ్చాం. ఇన్ని జాగ్రత్తలు పాటించడం వల్లే.. ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా రాలేదు. ప్రతీ గ్రామం నుంచి ఒక ఆడ, ఒక మగ హెల్త్‌ వర్కర్‌ను తయారు చేశాం. వీరికి  మొబైల్‌ ఫోన్‌ ఇచ్చాం. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉంటే, డాక్టర్ల దృష్టికి తీసుకువెళ్లేలా అప్రమత్తం చేశాం. కరోనా కట్టడిలో హెల్త్‌వర్కర్ల పాత్ర మరువలేనిది. కాబట్టే, ఈ 31 గ్రామాలు సురక్షితంగా ఉన్నాయి.” అంటారు డాక్టర్‌ కపిల్‌ శర్మ. ఈ డాక్టర్లు తమ సేవలను వైద్యానికే పరిమితం చేయలేదు. చిన్నారుల చదువుల కోసం, ఐటీడీఏ అధికారులతో మాట్లాడి ‘బాల వెలుగు పథకం’ ద్వారా ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. చదువుకున్న యువకులను గుర్తించి వారికి టీచర్లుగా బాధ్యత అప్పగించారు. అలా దాదాపు ఎనభైమంది పిల్లలు చదువులమ్మ నీడకు చేరారు. తాగునీటి బావులు, కమ్యూనిటీ భవనాలు, సైకిల్‌ ఆంబులెన్స్‌లు కూడా మంజూరు చేశారు అధికారులు. ఇపుడు ఆ పల్లె ప్రజల జీవితం కొత్త చిగురులు తొడుగుతున్నది. చక్రాల డ్రమ్ములు..

  ‘ఇండిజీనస్‌' సహకారంతో సొంతంగా గిరిజనులే పిండి గిర్ని పెట్టుకొని, రాగులు, జొన్నలు, పల్లీలతో పౌష్టికాహారం తయారు చేసుకుంటున్నారు. మెషీన్ల మీద మాస్కులు కుట్టుకుంటున్నారు. సోలార్‌ లైట్ల వెలుగులో పిల్లల్ని చదివిస్తున్నారు. వాగు నీళ్లను వాటర్‌ ప్యూరిఫయర్‌తో శుద్ధి చేసి తాగుతున్నారు.ఈ గ్రామాల్లో నీళ్ల కోసం 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే. గుట్టలు ఎక్కీ దిగీ వాగులూ వంకల నుంచి బిందెలు మోసుకుంటూ రావాల్సిన పరిస్థితి. ఈ  కష్టాల నుండి గట్టెక్కించడానికి రెండు వేల కుటుంబాలకు నీళ్లను తెచ్చుకునే చక్రాల పరికరాలు సమకూర్చారు. వీటితో 40 లీటర్ల నీటిని ఒకేసారి సులువుగా తెచ్చుకోవచ్చు. భద్రాద్రి జిల్లా కలెక్టరేట్‌ సహాయంతో ఈ చక్రాల డ్రమ్ములు సమకూరాయి. వైద్యంతోపాటు చిన్నారులకు విద్యకోసం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో ప్రభుత్వ అనుమతితో 11 స్కూళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొవిడ్‌వల్ల తగు జాగ్రత్తలతో  పిల్లలకు పాఠాలు చెబుతూ మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు. ప్రజల రోగనిరోధక శక్తి పెంచడంలో ‘ఇండిజీనియస్‌' తయారు చేయిస్తున్న ప్రోటీన్‌ పౌడర్‌ దే కీలక పాత్ర. గోధుమలు, జొన్నలు, సెనగలు, పల్లీలను పిండి చేసి.. బెల్లం పొడి కలిపి ‘పంచపౌష్టి’ పేరుతో 31 గుంపులకు అందజేస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం, రేగెళ్ల గ్రామంలో దీని తయారీకోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ‘మా ప్రయత్నంలో ప్రభుత్వ సహకారం మరువలేనిది. జిల్లా యంత్రాంగం కూడా వెంటనే స్పందిస్తున్నది’ అంటారు ఆ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు.

ఈ మారుమూల పల్లెలు ఓ మంచి మార్పునకు సంకేతాలు. బలమైన సంకల్పం ఉంటే, అమెరికా సాధించలేనిదీ చైనా అరికట్టలేనిదీ.. సామాన్య ప్రజలకు సాధ్యం అవుతుందని ఆ గిరిజనులు నిరూపించారు.  వారి ఆత్మవిశ్వాసాన్ని చూసి కరోనా భయంతో వెను తిరిగింది. ఈ పల్లెల నుంచే కాదు ,ప్రపంచం నుంచీ కరోనా మహమ్మారిని పారదోలాలి. 

వైద్య నారాయణులు

 డాక్టర్‌ రమావత్‌ నరేందర్‌ హోమియో వైద్యుడు. స్వగ్రామం నల్గొండ జిల్లా, ముత్యాలమ్మ గుడి తండా. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. నగరంలో కొంతకాలం క్లినిక్‌ నడిపారు. కర్ణాటకలోని బీఆర్‌ హిల్స్‌లో నిరుపేదలకు వైద్యసేవలు అందిస్తున్న, డాక్టర్‌ హనుమప్ప సుదర్శన్‌ స్ఫూర్తితో వైద్యం అందుబాటులో లేని తెలంగాణ కొండ ప్రాంతపు జనానికి అండగా నిలిచారు. వారిలో ఒకడిగా మారారు. ‘ఇండిజీనస్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌'ను ఏర్పాటు చేసి, మారుమూల పల్లెల్లో విద్య, వైద్యం కోసం పనిచేస్తున్నారు. ‘ఏమీ లేనివారికి, ఏమీ ఆశించకుండా సేవ చేయడమే నిజమైన వైద్యం’ అంటారు నరేంద్ర.డాక్టర్‌ కపిల్‌ శర్మ  హైదరాబాద్‌ నివాసి. ఏడు సంవత్సరాలు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పనిచేశారు. డాక్టర్‌ నరేందర్‌ సామాజిక సేవలకు ప్రభావితుడై ఆయనతోపాటు గిరిజన తండాల్లో వైద్యం చేస్తున్నారు. నలభైనాలుగు మంది యువతీ యువకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారిద్వారా గ్రామస్తుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. వీరికి తోడుగా హైదరాబాద్‌కి చెందిన డాక్టర్‌ అర్చన కూడా ఈ తండాల్లో గిరిజన మహిళల ఆరోగ్యం కోసం పని చేస్తున్నారు. గర్భిణులలో రక్తహీనత,  పిల్లల్లో పౌష్టికాహార లోపాలను గుర్తించి తగిన వైద్య సూచనలు ఇస్తున్నారు.-శ్యాంమోహన్‌