గురువారం 03 డిసెంబర్ 2020
Sunday - Nov 22, 2020 , 03:00:51

గోడలు..పాఠాలు చెబుతాయి!

గోడలు..పాఠాలు చెబుతాయి!

అక్కడ.. ఒక గోడ తెలుగు సార్‌. వేమన పద్యం నేర్పిస్తుంది. ఒక గోడ లెక్కల మాస్టార్‌. ఎక్కాలు వల్లె వేయిస్తుంది. ఒక గోడ సైన్స్‌ మేడమ్‌. జీర్ణ వ్యవస్థ గురించి బోధిస్తుంది. మొదటిసారి ఆ ఆవరణలోకి అడుగుపెట్టినవాళ్లకు అదో విలువల మ్యూజియంలా అనిపిస్తుంది. ఆ మార్పు వెనుక.. ఏ కార్పొరేట్‌ సంస్థో లేదు. ఓ సాధారణ హెడ్‌మాస్టర్‌ ఉన్నారు. 

ఇదొక స్ఫూర్తిదాయకమైన ప్రభుత్వ పాఠశాల కథ. స్ఫూర్తి ప్రదాత అయిన ఒక టీచర్‌ కథ కూడా. బెంగళూరు హైవే మీద షాద్‌నగర్‌ - జడ్చర్ల మధ్యలో మాచారం అనే ఊరు ఉంది.అక్కడి నుంచి ఐదారు కిలోమీటర్లు లోపలికి మట్టిరోడ్డు గుండా ప్రయాణిస్తే.. చౌటగడ్డ తాండా వస్తుంది. అక్కడన్నీ చౌడు భూములూ, పెద్ద పెద్ద బండరాళ్లే. పట్టుమని 40 గడపలు కూడా ఉండవు. కానీ, ఆ ఊళ్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. పాఠశాల ముఖద్వారాన్ని చూస్తేనే మైమరచిపోతాం. లోపలికి కాలు పెడితే, ఒక్కసారిగా చిన్నారుల కలల ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది. వేలకువేలు ఫీజులు వసూలు చేసే కార్పొరేట్‌ స్కూళ్లు కూడా అలా ఉండవు. ఆ ఆవరణే ఓ ఉద్యానవనం. అడుగడుగునా ఆక్సీజన్‌ అందించే చెట్లే! వర్షపు నీరు వృథా కాకుండా.. ఇంకుడు గుంతలున్నాయి. పొడి చెత్త, తడి చెత్త వేయటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోషకాహారం కోసం కిచెన్‌ గార్డెన్‌ సిద్ధంగా ఉంటుంది.

గోడమీద విజ్ఞానం

ఆ బడి గోడలైతే మరీ ప్రత్యేకం. ప్రతి గోడకీ నినాదాలూ, సూత్రాలూ, సూక్తులూ! నాలుగు గోడలే నలభైమంది ఉపాధ్యాయులంత జ్ఞానాన్ని బోధిస్తాయి. ఓ గోడకి.. ఫ్లాగ్‌-జెండా, మదర్‌-అమ్మ, ఫాదర్‌- నాన్న ఇలా ఆంగ్ల పదాలకు అర్థాలు ఉంటాయి. మరో గోడకి ‘గురుర్‌ బ్రహ్మ, గురుర్విష్ణుః..’ శ్లోకం ఉంటుంది. నల్లా దగ్గర ‘తినడానికి ముందు చేతులు ఎందుకు కడగాలి?’ అన్న ప్రశ్న, దానితో పాటు చక్కని సమాధానమూ కనిపిస్తుంది. టాయిలెట్‌ బయట ‘శౌచాలయాన్ని వాడే విధానం’ సవివరంగా దర్శనం ఇస్తుంది. మరోచోట ‘ఎక్కడ జ్ఞానం విరివిగా విరుస్తుందో, ఆ భావాలలోకి, ఆ స్వేచ్ఛా స్వర్గానికి .. తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు’ అన్న రవీంద్రుని సూక్తి. ఇంకో చోట జాతీయ పతాక సృష్టికర్త సంక్షిప్త పరిచయం. ఆ గోడలు మానవ జీర్ణ వ్యవస్థను పరిచయం చేస్తాయి, రుతువులను కండ్ల ముందు నిలుపుతాయి. అంతేనా, పిల్లల హక్కులనూ వివరిస్తుందో గోడ చిత్రం. సమానత్వపు హక్కు,  ఆడుకునే హక్కు..’ చిన్నారుల హక్కుల పట్టిక అది. ఒక్కమాటలో చెప్పాలంటే.. అక్కడ గోడలు అంటే.. ఇటుకలూ, ఇసుక, సిమెంటు మాత్రమే కాదు. అపార విజ్ఞానం కూడా.  తలపైకెత్తిన ప్రతిసారీ విద్యార్థి ఓ కొత్త పాఠం నేర్చుకుంటాడు. నేర్చుకున్న పాఠాన్ని నెమరేసుకుంటాడు. 

‘ప్రధాన’ ఉపాధ్యాయుడు

ఈ స్కూలు హెడ్‌మాస్టర్‌ అందరికీ తలలో నాలుక! ఒక మార్పు కిరణం. పేరు.. బోగం నరేందర్‌. ఎనిమిదేండ్ల క్రితం  స్కూల్‌కి బదిలీ మీద వచ్చారు. ఆ సమయానికి బడి పాడుబడిన కొంపలా ఉండేది. చుట్టూ బండలు, పిచ్చి మొక్కలు, పాములూ తేళ్లూ! పాఠశాల రూపురేఖలు మార్చాలని తొలిరోజే సంకల్పించారు నరేందర్‌. ఏడాదికి కేవలం ఐదువేలు మాత్రమే గ్రాంట్‌ వచ్చే పాఠశాలను, లక్షన్నర ఖర్చుతో చదువుల గుడిలా మార్చారు. అందుకోసం అహర్నిశలు కష్టపడ్డారు. విద్యార్ధులను కూడా ఆణిముత్యాల్లా తీర్చిదిద్దుతున్నారు. ఆ బడి పిల్లలు రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తున్నారు. అభినందనలు నరేందర్‌ సార్‌!

-సాదిక్‌