గురువారం 03 డిసెంబర్ 2020
Sunday - Nov 22, 2020 , 02:56:16

ఇంటికో ఇంజినీర్‌!

ఇంటికో ఇంజినీర్‌!

అదొక మారుమూల గ్రామం. అంతా, ఫుట్‌పాత్‌ వ్యాపారాలతో జీవనం సాగించేవారే. మొత్తం 1500 ఇండ్లు ఉంటాయి. కానీ.. ఇంటికో ఇంజినీర్‌, ఐఐటియన్‌ కనిపిస్తారు. ఆ ఊరి బిడ్డలు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదెలా సాధ్యం?  ‘పట్వాటోలి’ ప్రపంచానికి పరిచయమెలా అయ్యింది? ‘పట్వాటోలి’.. బీహార్‌ గయా జిల్లాలోని మారుమూల గ్రామం. 1500 ఇండ్లు ఉంటాయి. ఇటీవల జేయీయీ లో ర్యాంకు సాధించినవారు ఈ ఊర్లో దాదాపు 30 మంది వరకూ ఉంటారు. ఇప్పటికే 300 మందికి పైగా ఇంజినీరింగ్‌ పట్టభద్రులు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం ముగిసేనాటికి ఆ సంఖ్య రెట్టింపు అవుతుందని గ్రామస్తుల అంచనా. 

గరీబోళ్ల కథ 

300 మంది ఇంజినీర్లు  అంటే, చిన్న సంఖ్యే కావచ్చు. కానీ పట్వాటోలీకి మాత్రం ఇది చాలా పెద్ద విజయమే. బ్రహ్మాండాన్ని సాధించినంత గొప్ప విషయం. ఎందుకంటే, ఇదో చిన్న పల్లె. గ్రామస్తులంతా చిన్నాచితకా పనులు చేసుకొని సాదాసీదా జీవనం గడిపేవారే. రోజంతా కష్టపడి తువ్వాళ్లు, బెడ్‌షీట్లు, గొడుగులు తయారుచేస్తారు. వాటిని ఫుట్‌పాత్‌ మీద అమ్ముతారు. బేరం మంచిగా జరిగితే సంతోషం. కడుపునిండా భోజనం చేస్తారు. బేరం కాకపోతే అర్ధాకలే!  అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవాళ్లు  జాతీయ స్థాయిలో జరిగే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌.. జేయీయీలో విజయం సాధించడం గొప్ప విషయమే. అందుకే ఫలితాలు వచ్చిన ప్రతీసారి పట్వాటోలీ గురించి చర్చ జరుగుతుంది. ఆ ఊరి యువత పతాక శీర్షికల్లోకి ఎక్కుతుంది. అనేక విజయగాథలు వెలుగులోకి వస్తాయి. పూరి గుడిసెల ముందు మీడియా లైట్లు మెరుస్తాయి. 

బ్యాంకుల్లో అప్పుచేసి 

పట్వాటోలీ గ్రామస్తులకు పూట గడవడమే కష్టం. అయితేనేం, లక్ష్యం పెద్దది  పెట్టుకున్నారు. ‘మేం చదువుకోక పేదరికంలో  మగ్గిపోయాం. కనీసం మా పిల్లలనైనా చదివించి ప్రయోజకులను చేయాలి’ అని స్థిరంగా చెబుతారు. ఉపవాసం ఉండైనా సరే బిడ్డలను బాగా చదివించాలన్న ఉద్దేశంతో పైసా పైసా కూడబెడుతున్నారు. బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని అత్యుత్తమ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎవరూ చదువుల ఖర్చులను భారమని భావించరు. ఒక బాధ్యతగా స్వీకరిస్తారు. కోచింగ్‌ సెంటర్ల నుంచీ ‘మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ చూస్తే మేమే కాదు, ఎవ్వరూ అవకాశం ఇవ్వరు. ఇప్పుడేదో ఆవేశంతో వచ్చి శిక్షణ ఇప్పిస్తామంటారు. తర్వాత డబ్బుల్లేవని మధ్యలోనే వదిలేస్తారు’ తరహా అవమానాలు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుల్లా నిర్వాహకులను ఒప్పించి శిక్షణ ఇప్పిస్తున్నారు.  

ఆలోచనలను మార్చేశాడు

ఇరవై ఏండ్ల క్రితం..ఐటీ బూమ్‌ దేశాన్ని ఒక ఊపు ఊపినా పట్వాటోలీ ప్రజలకు అదేంటో కూడా తెలియదు. దేశవ్యాప్తంగా జేయీయీ కోచింగ్‌ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అప్పటికి, ఆ ఊర్లో స్కూలే సరిగా లేదు. దగ్గర్లో ఎక్కడా మంచి కాలేజీలు ఉండేవి కాదు. ఇక ఉద్యోగాల మాట దేవుడెరుగు. అబ్బాయిలు పదో తరగతికే దుకాణం కట్టేస్తే, అమ్మాయిలు అసలు బడికే వెళ్లకపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరి ప్రజల ఆలోచనల్ని మార్చేశాడు జితేందర్‌ ప్రసాద్‌. ఆయనే, తను ఇప్పుడు అమెరికాలో స్థిరపడ్డాడు. మంచి ఉద్యోగం, మంచి జీవితంతో సంతోషంగా ఉన్నాడు. జితేందర్‌ చూపిన బాటలోనే వందలాది యువత ఐఐటియన్లుగా మారేందుకు సిద్ధపడుతున్నారు.  జితేందర్‌ తర్వాత, 16 మంది పరీక్ష రాశారు. వారిలో ఏడుమంది మంచి ర్యాంక్‌ సంపాదించారు. 2014లో సతీష్‌కుమార్‌, 2015లో విజయ్‌కుమార్‌, 2019లో దేవ్‌ నారాయణ్‌.. ఇలా ప్రతీ సంవత్సరం విజయాన్ని సాధిస్తూ జితేందర్‌ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్క పట్వాటోలీలోనే కాకుండా ప్రతీ గ్రామంలోనూ ఈ స్ఫూర్తిని విస్తరించే ప్రయత్నంలో..  ‘నవ్‌ ప్రయాస్‌' అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అలా, ఒక వ్యక్తి ప్రభావంతో  పల్లె మొత్తం ఇంజినీర్ల కార్ఖానాగా మారింది! విజయకాంక్ష కూడా ఓ అంటువ్యాధి లాంటిదే!

లక్షల్లో జీతం 

చీకట్లో కూర్చుని.. అయ్యో చీకటి అని బాధపడితే వెలుతురు రాదు. దీపం వెలిగించాల్సిందే! పేదరికాన్ని తలుచుకుని బాధపడిపోతే ఎలా? కాబట్టే, చదువునే నమ్ముకుంటున్నారు పట్వాటోలీ యువత. తల్లిదండ్రుల కన్న కలల్ని సాకారం చేసేందుకు సంకల్పిస్తున్నారు ఆ ఊరి బిడ్డలు. లక్ష్య సాధన కోసం కష్టపడి చదువుతున్నారు. ప్రతీ సంవత్సరం ఈ గ్రామానికి చెందిన ఏడెనిమిది మంది విద్యార్థులు అమెరికా, ఇంగ్లండ్‌ వంటి దేశాల్లో ప్లేస్‌మెంట్స్‌ పొందుతున్నారంటే వారి కృషిని అర్థం చేసుకోవచ్చు. వార్షిక వేతనం రూ.15 లక్షలకు పైగా ఉండటంతో తల్లిదండ్రులు పట్టరాని ఆనందంతో ఉన్నారు. కష్టానికి తగిన ఫలితం లభించిందని సంబరపడుతున్నారు.