గురువారం 03 డిసెంబర్ 2020
Sunday - Nov 22, 2020 , 02:48:50

ఏటికి ఎదురీదిన పడవ మల్లయ్య!

ఏటికి ఎదురీదిన పడవ మల్లయ్య!

పడవ మల్లయ్య.. పేరు చెవిన పడగానే, అతడి ఇంటిపేరు పడవేమో అనుకుంటాం. అలా అనుకుంటే పొరబడినట్లే. మల్లయ్య వృత్తే ఇంటిపేరులో ఇమిడిపోయింది. చెప్పాలంటే అదో పెద్ద కథ. గలగల పారే ఏరునే తన జీవన గమనంగా మలచుకుని.. పడవే పంచప్రాణాలుగా బతుకుబండి లాగించిన ఓ మల్లయ్య కథ ఇది. ఏటికి ఎదురీదడం సాధ్యంకాదని అంటుంటారు. కానీ తిండీతిప్పలు లేకుండా ఏకంగా 24 రోజులపాటు ఎదురీత కొట్టిన ఘనుడీయన. 

పడవ మల్లయ్యను చూడగానే.. మహాభారతంలో భీష్ముడు గుర్తుకొస్తాడు. ఆయనలాగే ఈయనా శతాధికుడే. ఆయన గంగాపుత్రుడు. ఈయనా గంగాపుత్రుడే! బతుకంతా నీటిలోనే గడిచిపోయింది. మల్లయ్య  జీవితమనే అంపశయ్య మీద భారంగా రోజులు గడుపుతున్నాడు. ఖమ్మం రూరల్‌ మండలం పోలిశెట్టిగూడెం మల్లయ్య స్వగ్రామం. ఎనభై సంవత్సరాలు వెనక్కి వెళితే.. పడవ మల్లయ్య చలాకీ యువకుడు. చిక్కుళ్ల మల్లయ్య అనేది తన అసలు పేరు. 1915 ప్రాంతంలో ఈ కాపరి బర్రె తోక పట్టుకుని వాగులోకి వెళ్లాడు. అంతలోనే, ప్రవాహ ఉధృతి పెరిగింది.. తనకేమో ఈత రాదు. వాగు మధ్యలోకి చేరుకున్నాక బర్రె తోక వదిలేశాడు. ఆ సంఘటన చూసిన వారంతా మల్లయ్య గల్లంతైనట్లేనని భావించారు. తను మాత్రం, ఈత రాకున్నా పట్టుదలతో ఒడ్డుకు చేరాడు. అవసరమే అతడికి ఆ క్షణంలో గురువై ఈత పాఠం నేర్పింది. ‘ఈతలో పట్టు సాధించావు కదా.. ఓ పడవ కొనుక్కుని జీవనం సాగించు’ అంటూ స్వప్నంలో ఓ స్వరం వినిపించింది. పడవ కొనడం అంటే, మాటలు కాదు. చాలా పైసలు కావాలి. అదంతా తనవల్ల కాదనుకొని మిన్నకుండిపోయాడు.

పడవ కోసం పయనం..

ఒకరోజు మల్లయ్య యథావిధిగా ఎల్లేరులో ప్రయాణికులను ఒడ్డుకు చేరుస్తూ ఉండగా నీటి వేగం  పెరిగింది. పడవ ముందుకు సాగని స్థితి. ఆ సంక్షోభ సమయంలో జనాన్ని క్షేమంగా దరిచేర్చిన మల్లయ్య, తన పడవను మాత్రం కాపాడుకోలేక పోయాడు. కళ్లెదుటే నీటిలో కొట్టుకుపోయింది. తన ప్రాణంలాంటి పడవ దూరమైపోవడంతో మల్లయ్య మనసు చెదిరిపోయింది. ఎలాగైనా పడవను దక్కించుకోవాలని అనుకున్నాడు. కొద్దిరోజులకు సరిపడా తినుబండారాలను సద్ది కట్టుకుని, పడవ కొట్టుకుపోయిన దిశగా ఈత ప్రారంభించాడు. ఇలా 24 రోజుల పాటు నీటిలోనే ఉన్నాడు. చివరికి విజయవాడకు చేరుకున్నాడు. అక్కడ తన పడవ ఆచూకీ దొరికింది. అదే పడవమీద తిరుగు ప్రయాణం సాగించాడు. పడవ కోసం వెళ్లిపోయిన మల్లయ్య ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటాడని అందరూ భావించారు. కుటుంబ సభ్యులు పదో రోజున దశదిన కర్మలను సైతం పూర్తి చేశారు. ఒంటినిండా గాయాలతో తిరిగివచ్చిన ఆ మనిషిని చూసి అందరూ విస్తుపోయారు. అవును, అతను ప్రవాహాన్ని జయించాడు.    

అధికారి చేయూతతో..

ఓసారి మద్దివారిగూడేనికి అధికారుల బృందం విచ్చేసింది. సర్కారు పనిమీద వాళ్లంతా ఏటిని దాటి అవతలి ఒడ్డుకు చేరాల్సి వచ్చింది. ఏరు చూస్తే నిండుగా ప్రవహిస్తున్నది. ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో మల్లయ్యే చొరవ తీసుకున్నాడు. ఆవలి ఒడ్డుకు చేర్చే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకున్నాడు. వెదురు బొంగులను తాళ్లతో కట్టి ఒక తెప్పను తయారు చేశాడు. దానిపై సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన ఉన్నతాధికారి మల్లయ్య సాహసానికి మెచ్చి అతడికి ఓ పడవను కొనిచ్చాడు. అత్యవసర సమయాల్లో ప్రజానీకాన్ని ఏరు దాటిస్తూ జీవనం సాగించమని సూచించాడు. అప్పటి నుంచీ ఏరు దాటిన వారినుంచి తలా ఒక రూపాయి పుచ్చుకుంటూ బతుకు వెళ్లదీయసాగాడు.

నిన్న మొన్నటి వరకూ..

మల్లయ్య ఇటీవలి వరకూ పడవే జీవనాధారంగా కాలం వెళ్లదీశాడు. ఏటిపై వంతెనలు కట్టడంతో అతడికి పని లేకుండా పోయింది. వయసు పైబడటంతో తనూ ఇంటికే పరిమితమయ్యాడు. పడవ మల్లయ్య ఈత ప్రావీణ్యం మీద నమ్మకం చిక్కని అప్పటి కామంచికల్లు గ్రామ సర్పంచి హనుమంతరామయ్య పడవ మల్లయ్యతో పందెం కాశాడు. ఓ పెద్ద బావిలో ఉంగరం వేసి, తీసుకురమ్మని సవాలు విసిరాడు. నిమిషాల వ్యవధిలో ఉంగరాన్ని వెతికి తెచ్చి సెభాష్‌ అనిపించుకున్నాడు మల్లయ్య. ‘మా ప్రాంత ప్రజలు ఇబ్బందులు తీరాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికక్కడ చెక్‌డ్యాంలు, బ్రిడ్జిలు కట్టించారు. నా అవసరం లేకుండా పోయింది. నా వయసు కూడా పైబడింది’ అంటాడు చిక్కుళ్ల మల్లయ్య అలియాస్‌ పడవ మల్లయ్య! ఏటికి ఎదురీదగలం కానీ, కాలానికి ఎదురీదలేం కదా!   

-తీగల నాగరాజు , ఖమ్మం రూరల్‌