గురువారం 21 జనవరి 2021
Sunday - Nov 22, 2020 , 02:22:01

పక్కా లోకల్‌.. మక్క కుడుముల్‌!

పక్కా లోకల్‌.. మక్క కుడుముల్‌!

  • కుడుములు అంటేనే ఆరోగ్యం. ఎవరైనా మనల్ని ‘వాడికేం బ్రో.. కుడుములా ఉన్నాడు’ అన్నారంటే, కాంప్లిమెంట్‌ కింద తీసుకోవాల్సిందే.   నూనెలూ మసాలాలూ గుప్పించకుండా వండే పోషకాహారం ఇది. ఎవరైనా సరే,నిస్సందేహంగా తినవచ్చు. పచ్చి మక్కలతో చేసే ఈ కుడుములు శరీరానికి కావలసిన సత్తువను అందిస్తాయి. 
  • ఈ సంప్రదాయ వంటకం క్రమక్రమంగా కనుమరుగవుతున్నది. 
  • మక్క కుడుము తెలంగాణ సంప్రదాయ వంటకం. వీటి తయారీలో వాడే పదార్థాలు రెండే రెండు. పచ్చిమక్కలు, ఉప్పు. ఇడ్లీలను పోలి ఉండే ఈ వంటకం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తీపిని ఇష్టపడేవారు కాస్త బెల్లం కలుపుకుని కూడా చేసుకోవచ్చు. డ్రైఫ్రూట్స్‌, నెయ్యి వేసిన కుడుములను కొన్ని ప్రాంతాల్లో దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.  
  • ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా పీడిస్తున్న సమస్య థైరాయిడ్‌. మక్కజొన్నలోని విటమిన్‌-ఇ, బి1, బి6 థైరాయిడ్‌ సమస్యనుంచి విముక్తి పొందడానికి దోహదం చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
  • పచ్చిమక్కలతోనే కాకుండా బియ్యంపిండి, మినుపపిండితోనూ ఆవిరి కుడుములను చేసుకోవచ్చు. ఇంకెందుకాలస్యం, ఓసారి ట్రై చేయండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! 
  • మహిళల్లో ఏర్పడే నెలసరి సమస్యలను పరిష్కరించేందుకు మక్క కుడుముల్లోని పోషకాలు ఎంతో దోహదపడతాయి. ఫాలోఫియన్‌ నాళాల్లో ఏర్పడే సిస్ట్‌ల సమస్యను ఎదుర్కోవడంలో మొక్కజొన్నలోని వివిధ విటమిన్‌లు సహాయపడతాయి. 
  • అధిక బరువు సమస్యతో బాధపడేవారికి మక్క కుడుములు మంచి ఆహారం. వీటిని తక్కువ మోతాదులో తిన్నా, ఫైబర్‌ ప్రభావం వల్ల త్వరగా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఇక, అప్పటికప్పుడు తిండి జోలికో, చిరుతిండి జోలికో వెళ్లం. తద్వారా అధిక బరువును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఫైబర్‌ కారణంగా జీర్ణ సమస్యలూ తలెత్తవు. ఏ వయసు వారైనా నిక్షేపంగా తినవచ్చు. ముఖ్యంగా పిల్లలకు ఇది బలవర్ధకమైన ఆహారం. 
  • మక్క కుడుములు చేయడం బ్రహ్మవిద్యేం కాదు. పచ్చి మక్కలను మెత్తగా రుబ్బి ఆవిరిపై ఉడికిస్తే సరిపోతుంది. నూనె లేకుండా చేసే ఈ కుడుములు గుండె ఆరోగ్యానికీ దోహదం చేస్తాయి. అధిక రక్తపోటును నియంత్రిస్తాయి కూడా. 
  • కుడుము తయారీలో నూనె వాడరు కాబట్టి, నూటికి నూరుశాతం కొలెస్ట్రాల్‌ ఫ్రీ ఆహారం. డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు కూడా పుచ్చుకోవచ్చు. మక్క కుడుముల్లో తక్కువగా ఉండే  గ్లయిసిమిక్‌ ఇండెక్స్‌ మధుమేహ రోగుల బ్లడ్‌ షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుతుందని అంటున్నారు పరిశోధకులు. అందువల్ల కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా తీసుకోని వాళ్ళుకూడా వీటిని డైట్‌లో భాగం చేసుకోవచ్చు.


logo