బుధవారం 02 డిసెంబర్ 2020
Sunday - Nov 01, 2020 , 01:13:01

మొబైల్‌ విప్లవం!

మొబైల్‌ విప్లవం!

చలనశీలమైంది సమాజం. పాతరాతి యుగం నుంచి పాలరాతి యుగం వరకూ ఎన్నో ఆవిష్కరణలు. ప్రతి సాంకేతిక ప్రగతీ మానవ జీవన గమనాన్ని ఊహించని రీతిలో మలుపు తిప్పిందే. యాంత్రిక విప్లవం.. పారిశ్రామిక విప్లవం.. అటుపై నిన్నామొన్నటి వరకు సాగిన కంప్యూటర్‌ విప్లవమే అందుకు నిదర్శనం. ప్రస్తుతం, మొబైల్‌ విప్లవం వర్ధిల్లుతున్నది. విద్య, వైద్యం, న్యాయం, ప్రభుత్వ పాలన, క్రయవిక్రయాలు..

  • మాల్‌ టు మల్టీప్లెక్స్‌

ఇలా సమస్త కార్యకలాపాలనూ కూర్చున్న చోటు నుంచే.. మునివేళ్లతో.. అరచేతిలోనే చక్కబెట్టుకునే స్థాయికి చేరుకున్నది సాంకేతికత! అంతా డిజిటల్‌ జీవనయానం, మొబైల్‌ విప్లవ మహత్యమే.  కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. సమస్త రంగాల మీదా, అన్ని వర్గాలపైనా పెను ప్రభావాన్ని చూపుతున్నది. సామాజిక, ఆర్థిక రంగాల్లో ఆ మహమ్మారి రేపిన కల్లోలం అంచనాలకు అందనిది. ఒక్కమాటలో చెప్పాలంటే జీవితం కొవిడ్‌కు ముందు.. ఆ తరువాత అన్నంతగా మారిపోయింది. 

మనిషికీ మనిషికీ మధ్య ఆత్మీయతలను చెరిపేసింది. అంతరాన్ని సృష్టించింది. భౌతిక దూరాన్ని పెంచింది. ప్రతి ఒక్కరిలో ప్రాణభీతిని కలిగించింది. ఆ దెబ్బకు, ఇంటి నుంచి అడుగు తీసి అడుగువేయాలంటేనే జంకుతున్నారు. ఫలితంగా అన్ని రంగాలూ కోలుకోలేనంతగా చతికిలపడ్డాయి. మరోవైపు, అందరి దృష్టీ ఆన్‌లైన్‌ వైపు మళ్లింది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని.. పలు వాణిజ్య రంగాలు తమ సేవలను విస్తరించుకుంటున్నాయి. ప్రభుత్వాలు సైతం పౌరసేవలను అంతర్జాలం ద్వారానే, కాగితాల జంజాటం లేకుండానే అందిస్తున్నాయి.  వృత్తి, ఉద్యోగం, పార్ట్‌టైమ్‌ కొలువులు.. ఏదో ఓ మార్గంలో సగటు మహిళ సంపాదన పరురాలు అవుతున్నది. ప్రభుత్వాలు ఉదారంగా ఇస్తున్న పింఛన్ల పుణ్యమా అని వృద్ధుల బ్యాంకు ఖాతాల్లో ఎంతో కొంత డబ్బు ఉంటున్నది. ఈ రెండు వర్గాల ఆర్థిక స్వేచ్ఛ మొబైల్‌ విప్లవానికి ఊతమిచ్చింది. ఆన్‌లైన్‌ క్లాసుల కారణంగా ప్రతి విద్యార్థీ సెల్‌ఫోన్‌ యజమాని అవుతున్నాడు.  

ఆర్డర్‌..ఆర్డర్‌

న్యాయ వ్యవస్థ సైతం ఆన్‌లైన్‌ సేవలను అందించే దిశగా ఏర్పాట్లు జరుపుతున్నది. ఇప్పటికే ఈ ఫైలింగ్‌ విధానానికి తెరలేపింది. 2006 అక్టోబర్‌ 2వ తేదీ నుంచి సుప్రీంకోర్టు ఈ-ఫైలింగ్‌ సౌకర్యాన్ని ఆరంభించింది. ఎవరైనా సరే ఇంట్లో  కూర్చోని ఇంటర్నెట్‌ ద్వారానే, అడ్వకేట్‌ అవసరం లేకుండానే కేసులను ఫైల్‌ చేసే వెసులుబాటును కల్పించింది. అదేవిధంగా కేసుల స్థితిగతులను, సుప్రీంకోర్టు తీర్పు కాపీలను, రోజువారీగా విచారణకు వచ్చే వ్యాజ్యాల పట్టికను చూసుకునే సౌలభ్యం ఏర్పడింది. త్వరలోనే కేసుల విచారణ, సాక్షులను ప్రశ్నించడం, కక్షిదారుల వాదోపవాదాల ప్రక్రియను ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టే దిశగా న్యాయశాఖ సమాలోచనలు చేస్తుండటం విశేషం. కోవిడ్‌ సంక్షోభ సమయంలో న్యాయస్థానాలు ముఖ్యమైన కేసుల్ని ఆన్‌లైన్‌లోనే విచారించాయి.

కరడుగట్టిన నేరస్థులను జైలు నుంచి కోర్టు వరకూ తీసుకెళ్లడం ఇబ్బందికరమని అనిపించినప్పుడు కూడా ఆన్‌లైన్‌ విచారణలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. జస్టిస్‌ డిలేడ్‌ ఈజ్‌ జస్టిస్‌ డినైడ్‌.. అన్నది ప్రాథమిక న్యాయ సూత్రం! ఆలస్యంగా అందే న్యాయం అసలు న్యాయమే కాదంటారు. పౌరులకు సత్వర న్యాయాన్ని అందించడానికి టెక్నాలజీ తన వంతు సహకారం అందిస్తున్నది. 

అన్ని వ్యవస్థల మాదిరిగానే పోలీస్‌ శాఖ సైతం నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నది. నిలుచున్న చోటనే కేసులను నమోదు చేస్తున్నది. ఫోన్‌ కాల్స్‌నూ, వీడియోలనూ, వాట్సాప్‌ చాట్స్‌నూ సాక్ష్యాలుగా చూపుతున్నది. ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించిన వారి విషయంలో.. సంబంధిత వాహనాల ఫొటోలు తీసి అప్పటికప్పుడు  జరిమానాలను విధిస్తున్నది. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘాను పర్యవేక్షిస్తున్నారు. జీపీఎస్‌ వ్యవస్థ ఆధారంగా క్లిష్టమైన కేసులను ఛేదిస్తున్నారు.

ఈ-కామర్స్‌

ఒకప్పుడు ఏదైనా కావాలంటే బండి తీసి, బజారుకు వెళ్లాల్సిందే. ప్రస్తుతం, ఇంటినుంచి కదలకుండానే అన్నీ సమకూర్చుకునే వెసులుబాటు కలిగింది. కొవిడ్‌ తర్వాత.. చిన్నపిల్లల చాక్లెట్లు మొదలు టీవీలు, ఫ్రిజ్‌లు ఇలా ఏ వస్తువునైనా ఆన్‌లైన్‌ ద్వారా కొనుగులు చేసేస్తున్నారు. వినియోగదారుల అవసరాలూ అభిరుచులకు అనుగుణంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలు తమ పరిధులను విస్తరించుకుంటున్నాయి. ఫారెస్టర్‌ సంస్థ అధ్యయనం ప్రకారం, 2019లో దేశవ్యాప్తంగా ఈ కామర్స్‌ రంగం 35 శాతం వృద్ధితో 32 బిలియన్‌ డాలర్ల వ్యాపారాన్ని నిర్వహించింది. కానీ ఈ ఏడాది, కరోనా దెబ్బతో ఆరు శాతం వృద్ధిని మాత్రమే సాధించింది. ఈ తిరోగమనం తాత్కాలికమేననీ మున్ముందు ఈ కామర్స్‌  పుంజుకునే అవకాశాలే పుష్కలమనీ అమెజాన్‌ గట్టిగా నమ్ముతున్నది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌ ద్వారా ఎలక్ట్రానిక్స్‌ పరికరాలను మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేసేవారు. తాజాగా నిత్యావసర సరుకులను కూడా ఎగబడి కొంటున్నారు. ఇంటికి కావాల్సిన ఉప్పులు పప్పులు  సైతం మొబైల్‌ యాప్స్‌ ద్వారా ఆర్డర్‌ చేస్తున్నారు. ఈ ధోరణి మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని ఈ కామర్స్‌ సంస్థలు గట్టిగానే చెబుతున్నాయి.


అరచేతిలో మల్టీప్లెక్స్‌

మొబైల్‌ విప్లవం సామాజిక సంబంధాలను ఎంతగానో మార్చివేసింది. ఎక్కడ ఉన్నా నేరుగా వీడియో కాల్‌ ద్వారా ఆత్మీయులను పలకరించుకుంటున్నారు. టీవీ సీరియళ్లను నేరుగా బుల్లితెర మీద చూసేవారి కంటే, తమకు అనుకూలమైన సమయంలో మొబైల్‌లో చూసేవారి సంఖ్యే అధికమని గణాంకాలు చెబుతున్నాయి. ప్రైమ్‌టైమ్‌ సీరియళ్లు వచ్చే సమయానికి ఏ నగర జీవులో అయితే, ఇంటికి ఇంకా చేరుకుని ఉండకపోవచ్చు. ట్రాఫిక్‌లో చిక్కుకుని ఉండవచ్చు. లేదంటే, ఆ వేళకి టీవీలో ఏ క్రికెట్‌ మ్యాచో వస్తూ ఉండవచ్చు. రిమోట్‌ పిల్లల చేతిలో ఉండవచ్చు. మొబైల్‌ఫోన్‌లో అయితే ఏ ఇబ్బందీ ఉండదు. తీరిక ఉన్నప్పుడే వీక్షిస్తారు. సినిమాలను సైతం మొబైల్‌లోనే.. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ తదితర యాప్స్‌ ద్వారా వీక్షిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకూ ఇంటర్నెట్‌ సౌకర్యం విస్తరించడంతో.. 2023 నాటికి భారత దేశంలో ఓటీటీ వినియోగదారుల సంఖ్య ఐదు కోట్లకు చేరుతుందని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ అంచనా. ‘మొబైల్‌ మల్టీప్లెక్స్‌'ల విజృంభణను చూసి థియేటర్లు బిత్తరపోతున్నాయి. సెల్‌ఫోన్ల నాణ్యత పెరగడం, వాటిలో సౌండ్‌ సిస్టమ్‌ మరింత మెరుగుపడటం ఈ ధోరణికి ఊతమిచ్చింది. 

బంధాలపై బందూకు?

మనిషి బంధాలకూ బంధుత్వాలకూ దూరం అవుతున్నాడన్న మాట కొంత నిజమే కావచ్చు. కానీ, కరోనా కాలంలో మొబైల్‌ఫోన్‌ అనుబంధాలకు వారధిగా నిలిచింది. బోలెడంత తీరిక ఉండటంతో.. పాత టెలిఫోన్‌ డైరీలలో నంబర్లను వెతుక్కుని మరీ బాల్య మిత్రులకు ఫోన్లు చేసుకున్నారు. దూరపు చుట్టాల్ని పలకరించారు. ఆత్మీయులను పరామర్శించారు. అయినవారి బాగోగులు కనుక్కున్నారు. అంతేనా, వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారం గురించిన సమాచారాన్ని నలుగురితో పంచుకున్నారు. ‘గో కరోనా..గో’ నినాదాలతో ఆన్‌లైన్‌ను హోరెత్తించారు. సెల్‌ఫోన్‌ అనే ఓ పరికరం లేకపోతే.. సగానికి సగం మంది ఏ కుంగుబాటు సమస్యకో గురయ్యేవారు. ఆత్మహత్యలూ, ఆ ప్రయత్నాలూ జరిగేవి. కనుక మనమంతా మొబైల్‌ విప్లవానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

రవాణా రైట్‌రైట్‌..

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రవాణా వ్యవస్థ కూడా అందిపుచ్చుకుంటున్నది. ఆన్‌లైన్‌ ద్వారా కూడా సేవలను అందిస్తున్నది. అందుకు ఉబెర్‌, ఓలా తదితర సంస్థలే ఉదాహరణ. ఇప్పుడివి మహానగరాలకే కాకుండా చిన్న చిన్న పట్టణాలకు సైతం తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అంతర్జాలం వేదికగా కస్టమర్లను, ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. నేరుగా వారివద్దకే వెళ్లి సేవలందిస్తున్నాయి. అద్దె కార్లు ఏ సమయంలో ఎక్కడ ఉన్నాయో, గమ్యస్థానానికి ఎంత సమయానికి చేరుకుంటాయో  ట్రాకింగ్‌ వ్యవస్థ ద్వారా ‘మినిట్‌ టు మినిట్‌' తెలుసుకుంటున్నారు కస్టమర్లు. చెల్లింపులు సైతం ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతాయి. రవాణాశాఖ సైతం అందుబాటులోని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పౌరులకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నది. ఇప్పటికే ఆర్టీఏ ఎం-వ్యాలెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాహనదారుడు తనకు సంబంధించిన లైసెన్స్‌, వాహన సంబంధిత పత్రాలను నిత్యం జేబులో పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేకుండా చేసింది. ఆర్టీఏ ఎం వ్యాలెట్‌ యాప్‌లోనే ఆయా పత్రాలను పొందుపరుచుకోవచ్చు. పోలీసులు అడిగినప్పుడు, మొబైల్‌ఫోన్‌లోని యాప్‌ను ఓపెన్‌ చేసి చూపించవచ్చు. అదే విధంగా గతంలో లైసెన్స్‌ తీసుకోవాలన్నా, అడ్రస్‌ మార్చుకోవాలన్నా, రెన్యువల్‌ చేసుకోవాలన్నా .. చిన్న చిన్న పనులకు కూడా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి లేదిప్పుడు.

పారిశ్రామికవేత్తలు ‘జూమ్‌'కే జై 

చాలామంది ఉద్యోగులు చుట్టాలు, దోస్తులతో ముచ్చట్లకు వాట్సాప్‌ వాడుతూ.. ఆఫీస్‌ పనులకు మాత్రం ‘జూమ్‌'కే జై కొడుతున్నారు. ఉద్యోగులతో, ఫీల్డ్‌ డిస్ట్రిబ్యూటర్లతో ఆన్‌లైన్‌లోనే మాట్లాడుతున్నారు. ఈ యాప్‌ హానికరమని తెలిసినా సౌకర్యాల దృష్ట్యా మొగ్గు చూపాల్సి వస్తున్నదని 29 శాతం మంది చెప్పారు. తమ పై అధికారులు వాడుతున్నారు కాబట్టి, తప్పనిసరిగా జూమ్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి వస్తున్నదని 27 శాతం మంది తెలిపారు. అయితే 15 శాతం మంది త్వరలో చైనా జూమ్‌ను వదిలి.. జియో మీట్‌కు మారుతామని చెప్పడం విశేషం. ఇక కాల్‌ రికార్డింగ్‌ మాదిరిగానే.. వీడియోకాల్స్‌ కూడా రికార్డ్‌ చేసుకునే సదుపాయం కావాలని 70 శాతం మంది కోరుకుంటున్నారు. 

సెల్‌ఫోన్‌ పాఠాలు

కొవిడ్‌ దెబ్బతో తీవ్రంగా కుదేలైన వాటిలో విద్యారంగం ఒకటి. పాఠశాలలు, కళాశాలలు మూతబడి ఇప్పటికి చాలాకాలం గడిచిపోయింది. విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతులకు పంపించేశారు. చాలా విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ పాఠాలపై దృష్టి సారించాయి. సామాజిక మాధ్యమాల ద్వారా తరగతులను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టాయి. అందుకు  గూగుల్‌ క్లాస్‌రూమ్‌, జూమ్‌, ఫేస్‌బుక్‌ తదితర మాధ్యమాలు వేదికలుగా నిలిచాయి. కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వాలు సైతం అందుకు ఊతమిస్తున్నాయి. ప్రత్యేక డీటీహెచ్‌ చానళ్లను అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 3.7 కోట్ల మందికి ఆన్‌లైన్‌ విద్యను అందించాలనే లక్ష్యంతో తొలుత 100 యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది. దీక్ష (డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫర్‌ నాలెడ్జ్‌ షేరింగ్‌) వేదిక ద్వారా 25 కోట్ల మంది పాఠశాల విద్యార్థులకు, శిక్షావాణి ద్వారా సీబీఎస్‌ఈ  9-12 తరగతుల విద్యార్థులకు ఉపయోగపడేలా ఎన్‌సీఆర్‌యీటీ (జాతీయ విద్యా వైజ్ఞానిక పరిశోధన సంస్థ)  సుమారు 400 పాఠ్యాంశాలను రూపొందించడం గమనార్హం. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ వెబ్‌సైట్‌, ఎంహెచ్‌ఆర్డీ జ్ఞానామృత్‌ చానల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఆన్‌లైన్‌ విద్య కోసం దూరదర్శన్‌ కిశోర్‌మంచ్‌లోని 21 చానళ్లకు అదనంగా దిశ టీవీ, దూరదర్శన్‌ ముక్తి విద్యావాణి తదితర చానళ్లను తీసుకొస్తున్నారు. ఆ వీడియోలు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటాయి. ఆ సమయానికి టీవీలో పాఠాలు వినలేకపోయిన వాళ్లంతా.. యూట్యూబ్‌ను ఆశ్రయించవచ్చు. కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌ వేదికగా సంగీతం, నృత్యం తదితర కళలలో కూడా శిక్షణ ఇస్తున్నాయి.

ఆలన.. పాలన

ప్రభుత్వాలు పౌరసేవలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా, పారదర్శకంగా సేవలను అందించేందుకు ఆసక్తిని చూపుతున్నాయి. ఇప్పటికే చాలా విభాగాలు టెక్నాలజీని సద్వినియోగం చేసుకున్నాయి. రేషన్‌కార్డులు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, కులం, ఆదాయం, పింఛన్లు.. వివిధ పథకాలకు దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారానే స్వీకరిస్తున్నాయి. అదే విధంగా లబ్ధిదారులకు డబ్బులను కూడా ఆన్‌లైన్‌ ద్వారానే చేరవేస్తున్నాయి. వివిధ శాఖల్లో టాబ్‌ల వినియోగం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా భూలావాదేవీలను సైతం ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహించాలని సంకల్పించింది. అందుకోసం ప్రత్యేకంగా ‘ధరణి’ అనే సైట్‌ను  రూపొందించింది. ఇందులో భూసంబంధిత వివరాలన్నీ... సాధారణ పౌరులకు అందుబాటులో ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే... తహసిల్దారు కార్యాలయం ఎక్కడో లేదు? సామాన్యుడి మొబైల్‌ ఫోన్‌లోనే ఉంటున్నది. చాలామంది యువ కలెక్టర్లు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ఫిర్యాదులకు తక్షణం స్పందిస్తున్నారు. అధికారిక ట్విటర్‌ ఖాతాలూ ఉంటున్నాయి. మంత్రి కేటీఆర్‌ ట్వటర్‌ ఖాతాలో అయితే నిత్యం వందలకొద్దీ ఫిర్యాదులూ, విన్నపాలూ! ప్రతి ముఖ్యమైన పోస్టుకూ స్పందిస్తారాయన. అదే, ఓ సామాన్యుడు హైదరాబాద్‌ వరకూ వచ్చి, ముఖ్యనేతలను కలవాలంటే ఎంత కష్టం?   

వ్యవ‘సాయం’..

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో వ్యవసాయరంగమూ కొత్తపుంతలు తొక్కుతున్నది. నిపుణులు తమ సలహాలు, సూచనలను మొబైల్‌ ద్వారానే అందిస్తున్నారు. పంటకు సంబంధించిన ఫొటోలను మొబైల్‌లోని కెమెరాతో తీసి వాట్సాప్‌ చేస్తే చాలు.. తెగులు సోకిందా? లేదా? సోకితే ఏ మందులు వాడాలి?.. తదితర విషయాలను సంక్షిప్త సందేశాల ద్వారానో, వాట్సాప్‌ ద్వారానో వివరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పలు అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. అంతేగాక మొబైల్‌ విప్లవంతో పంట క్రయవిక్రయాలలో దళారులకు కాలం చెల్లిపోతున్నది. ఉత్పత్తిదారుడికి, వినియోగదారుడికి మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడుతున్నాయి. రైతులకు, వినియోగదారులకు ఒకే వేదికను కల్పిస్తూ పలు యాప్‌లు వచ్చాయి. దీంతో వినియోగదారులు నేరుగా రైతులతో ఆన్‌లైన్‌లో బేరమాడి తమకు కావాల్సిన పంటలను కొనుగోలు చేస్తున్నారు. దీని ద్వారా ఇటు రైతులు, అటు వినియోగదారులు.. ఇద్దరూ  లాభపడుతున్నారు. మొబైల్‌ ఆధారిత సేవలను అందించడానికి కొత్త కొత్త స్టార్టప్స్‌ రంగంలోకి దిగుతున్నాయి. ఓ ఆంత్రప్రెన్యూర్‌ అయితే, రైతులు మొబైల్‌ఫోన్‌తో నియంత్రించగలిగే డ్రోన్‌లనూ తయారు చేశాడు. ఘాటైన క్రిమి సంహారకాల వల ్ల అనేకమంది రైతులు శ్వాసకోశ రుగ్మతలకు బలి అవుతున్నారు.  చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయి. అవి క్యాన్సర్‌గానూ పరిణమిస్తున్నాయి. ఇక ఈ సమస్య ఉండదు. 


గంటలకొద్దీ టాకింగ్స్‌.. మీటింగ్స్‌ 

ఓ సర్వేలో పాల్గొన్నవారిలో 62 శాతం మంది వారానికి గంటకుపైగా వీడియోకాల్స్‌ మాట్లాడుతామని చెప్పడం విశేషం. ఇందులో 3 శాతం మంది 24 గంటలకుపైగా డిజిటల్‌ మీటింగ్స్‌లో గడిపేస్తున్నారట. అంటే.. సుమారు రోజుకు మూడున్నర గంటలు. టీచర్లు, ఉన్నతాధికారులు, ప్రైవేట్‌ సంస్థల్లో మేనేజర్లు, ఆపై స్థాయి అధికారులు ఈ క్యాటగిరీలో ఎక్కువగా ఉన్నారు. దేశంలో డేటా అగ్గువకు వస్తుండటం, మారుమూల గ్రామాలకు సైతం ఫోర్‌ జీ సేవలు అందుబాటులో ఉండటం, అధిక డేటాతో వర్క్‌ ఫ్రమ్‌ హోం ప్యాకేజీలు లభిస్తుండటంతో డిజిటల్‌ మీటింగ్స్‌ పెరిగిపోయాయని నివేదిక వెల్లడించింది. 

మొబైల్‌ వైద్యం

2001లో ఉమ్మడి ఏపీలోని చిత్తూరుకు 20 కిలోమీటర్ల దూరంలో అరగొండ గ్రామం నుంచి ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) తొలిసారిగా టెలీ హెల్త్‌ విధానాన్ని అమలు చేసింది. అటు తరువాత, ఈ సాంకేతికతను ఈశాన్య రాష్ర్టాల్లో 45 గ్రామాలకు విస్తరించింది. అయినా, కరోనా వచ్చే వరకూ టెలిఫోన్‌ వైద్యంపై ఆధారపడిన వారు బహుస్వల్పం. అంతగా ప్రాచుర్యం పొందలేదు. కరోనా దెబ్బతో ఈ-వైద్యానికి అమాంతంగా ఆదరణ పెరిగింది. హాస్పిటల్‌కు వెళ్లేవారి సంఖ్య 50 శాతానికి పడిపోయిందని పలు సర్వేలు తెలుపుతున్నాయి. త్వరలోనే టెలీ వైద్యం ద్వారా చికిత్స పొందేవారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు దాటవచ్చని అంచనా. తాజాగా మూడునాలుగు నెలల వ్యవధిలోనే ఈ- వైద్యం పొందేవారి సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది. కొవిడ్‌ భయానికి చాలామంది వైద్యులు నేరుగా రోగుల్ని చూడటానికి జంకుతున్నారు. దీంతో, చిన్నాచితకా డాక్టర్ల నుంచి కార్పొరేట్‌ వైద్యుల వరకూ.. అందరూ ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి వచ్చేస్తున్నారు. వైద్యమే కాదు, మందులు కూడా ఆన్‌లైన్‌లో ఆర్డరు చేసుకోవచ్చు. అంతేనా, రోగ నిర్ధారణ పరీక్షలు కూడా ఇంటికొచ్చే చేస్తున్నారు.  కొన్ని స్వచ్ఛంద సంస్థలు మారుమూల పల్లెల్లో మొబైల్‌ ఆధారిత దవాఖానలను నిర్వహిస్తూ.. ఎక్కడో మహానగరాల్లో ఉన్న డాక్టర్ల ద్వారా వైద్యాన్ని అందిస్తున్నాయి. వైద్యులు లేని ఊర్లు ఉండవచ్చు కానీ, మొబైల్‌ఫోన్‌ లేని ఇల్లు లేదు కదా! అది మహానగరం కావచ్చు, మండల కేంద్రం కావచ్చు, గిరిజన తండా కావచ్చు!  ఒక్క క్లిక్కుతో పెద్ద డాక్టరు ప్రత్యక్షం అవుతాడు.

నిజమే, మొబైల్‌ ఆధారిత విద్యా వైద్యాలకు పరిమితులూ ఉన్నాయి. సెల్‌ఫోన్‌ లేదనో, ఆన్‌లైన్‌ పాఠం అర్థం కావడం లేదనో ఆత్మహత్యకు పాల్పడుతున్న విద్యార్థులు ఉన్నారు. లాటరీ తగిలిందని  ఏ అగంతకులో ఫోన్‌ చేయగానే ఆన్‌లైన్‌లో డబ్బు పంపే అమాయకుల సంఖ్యా తక్కువేం కాదు.  ఓ చిన్న విత్తు మొక్కగా మారడం వెనుక కూడా ప్రసవ వేదన అంత కష్టం ఉన్నప్పుడు.. ప్రజల జీవన విధానాన్ని సమూలంగా మార్చేసే పెనుమార్పులకు ముందు ఇంకెన్ని కష్టాలు ఉండాలీ? ఇదీ అంతే! కాకపోతే, ఆ నష్టాన్ని నామమాత్రం చేయడానికి ప్రభుత్వాలు పూనుకుంటే సరిపోతుంది.