గురువారం 26 నవంబర్ 2020
Sunday - Nov 01, 2020 , 01:05:28

ఘుమ్‌ ఘుమాయించు విందు

ఘుమ్‌ ఘుమాయించు విందు

ఐతారం స్పెషలేంటి? ఈ ముక్క ప్రత్యేకంగా ఎవరినీ అడగాల్సిన పనిలేదు. ఆ ఇంటి నుంచి వచ్చే ఘుమఘుమలే చెప్పేస్తాయి. ముక్కల బిర్యానీ సిద్ధంగా ఉందని. ముక్కును పట్టుకులాగే పరిమళాలు, ఘాటు నషాళానికి అంటుతున్నా పరాక్రమించి తినే తీరు, ఒళ్లంతా చెమటలు ఊరుతున్నా నోరింత చేసి ముద్దలకు ముద్దలు లాగించే జోరు.. ఇవన్నీ బిర్యానీ విషయంలోనే సాధ్యం. నవాబుల కాలం నుంచి లాజవాబ్‌ వంటకంగా పేరున్న బిర్యానీ కాయగూరలతో కూడినా పసందుగానే ఉంటుంది.

బిర్యానీ అనగానే అబ్బో.. హెవీ అనేస్తాం. వేడి చేసేస్తుందనీ, ఒళ్లు వచ్చేస్తుందనీ నానా కారణాలు చెబుతూ నాలుకను కట్టేసుకుంటాం. బిర్యానీలో ఉపయోగించే ప్రతి వస్తువూ పోషకాల గనే! వేడికి విరుగుడుగా ఉల్లిపాయలు, అజీర్తి కాకుండా బిర్యానీ ఆకులు, మసాలా కీడు చేయకుండా పెరుగు.. ఇలా సకల దోషాలనూ పరిహరించే ఔషధ గుళికలు బిర్యానీలో వేస్తారు. ఫలితంగా అదిరిపోయే ఆహారం దొరికిందని ఆత్మారాముడు సంతోషిస్తాడు. ఆరోగ్యానికి ఏ ముప్పూ ఉండదు. కడుపు ఉబ్బరంగా ఉండకూడదంటే, భుక్తాయాసంతో బద్ధకించకుండా తిన్నాక పావుగంట నడక సాగిస్తే మేలు.

  •  లవంగాలు ఎనర్జీ బూస్టర్‌గా, యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. దంత సమస్యలను నివారిస్తాయి.
  • దాల్చినచెక్క బరువును తగ్గిస్తుంది. కొవ్వు నిల్వచేసే కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జలుబు, దగ్గులను సమర్థంగా ఎదుర్కొంటుంది. రక్తప్రసరణను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
  • సుగంధ ద్రవ్యాల్లో పేరెన్నికగన్న లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, శాజీరా, జాపత్రి.. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. రుచితోపాటు శరీరానికి కావాల్సిన పోషకాలనూ అందిస్తాయివి.
  • బిర్యానీకి సిసలైన రుచినిచ్చేవి బాస్మతీ బియ్యమే! వేరే బియ్యంతో పోలిస్తే బాస్మతీ రైస్‌లో గ్లయిసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. రక్తంలో చక్కెర నిల్వలు పెరుగుతాయన్న ఆందోళన అవసరం లేదు. బాస్మతీలో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువ. ఇది జీవక్రియలు సాఫీగా జరిగేలా చేస్తుంది. క్యాన్సర్‌ కణాలను నియంత్రిస్తుంది! 
  • బిర్యానీలో వాడే ఆకు ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. గుండెకు మంచిది. చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఇందులోని యాంటీమైక్రోబయల్‌ లక్షణాలు గాయాలు త్వరగా మానేందుకు దోహదం చేస్తాయి.
  • ఇలాచీ జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. ఇందులోని అల్కలాయిడ్లు, ఫ్లవనాయిడ్లు శ్వాస సామర్థ్యాన్ని పెంచుతాయి. చిగుళ్లను దృఢంగా చేస్తాయి. యాలకుల్లో క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. విటమిన్‌-బి, సి సమృద్ధిగా ఉంటాయి.

బిర్యానీ చేద్దామిలా..

శ్రమ లేకుండా సులభంగా అయిపోవాలంటే బిర్యానీని కుక్కర్‌లో వండుకోవాలి. ముందుగా కుక్కర్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వెయ్యాలి. కాగిన తర్వాత నాలుగు బిర్యానీ ఆకులు, మూడు దాల్చిన చెక్కలు, పావు టేబుల్‌ స్పూన్‌ శాజీర,  రెండు స్టార్‌ సోంపులు, ఆరు లవంగాలు, నాలుగు ఇలాచీలు వేయాలి. ఒక టేబుల్‌ స్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేయాలి. రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలు (పొడవుగా తరిగినవి) వేసి వాటిని మగ్గనివ్వాలి. తర్వాత తరిగిన క్యారెట్‌, బీన్స్‌, క్యాలీఫ్లవర్‌, ఆలుగడ్డ ముక్కలు, పచ్చిబఠానీ వేసి బాగా కలపాలి. అందులోనే అరకప్పు పెరుగు వేయాలి. చిటికెడు పసుపు, అర టీస్పూన్‌ కారంపొడి, బిర్యానీ మసాలా వేసి బాగా కలపాలి. కొత్తిమీర, పుదీనా ఆకులు వేయాలి. తర్వాత నానబెట్టిన బాస్మతీ రైస్‌ నాలుగు కప్పులు వేయాలి. ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి వేయాలి. బియ్యానికి సరిపడా నీళ్లు పోసి కుక్కర్‌ మూత పెట్టేయాలి. తక్కువ మంటపై 25 నిమిషాలపాటు ఉడకనిచ్చి స్టౌ ఆఫ్‌ చేయాలి. ఆవిరి పోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కుంకుమపువ్వు రెక్కలతో అలంకరిస్తే వెజ్‌ బిర్యానీ సిద్ధం.