బుధవారం 20 జనవరి 2021
Sunday - Nov 01, 2020 , 01:02:47

అంతా రామ్‌మయం!

అంతా రామ్‌మయం!

మంచిర్యాల జిల్లా. చెన్నూర్‌ మండల కేంద్రం. సోమేశ్వరాలయం సమీపంలోని ఆ ఇల్లు దారిన పోయేవారిని ఇట్టే ఆకట్టు కుంటుంది. అందుకు కారణాలు అనేకం. ఆ ఇంటి పేరు ‘శ్రీరామ నిలయం’.ఇంట్లోని ప్రతి మగబిడ్డ పేరు చివరనా ‘రామ్‌' తప్పనిసరిగా ఉంటుంది. ఇది తరాల సంప్రదాయం.

సీతారాం.. చతుర్వేద ఘనాపాఠి. వేదాన్ని తలకిందులుగానూ  వైదిక శాస్త్రంలో ఉద్ధండ పండితుడు. వేదంలో అక్షరావధానం, నేత్రావధానం చేయగలిగిన ప్రజ్ఞావంతుడు. నాటి శృంగేరి పీఠాధిపతి నృసింహభారతీ మహాస్వామి చేతులమీదుగా ఘన సన్మానం పొందిన పండితుడు. సీతారాం భార్య వెంకుబాయి. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు స్వయంభట్ల బాపు, చిన్న కొడుకు శ్రీరాం. నరసుబాయి, శ్రీరాం దంపతుల సంతానమే.. సఖారాం. పుట్టకముందే తండ్రినీ, పుట్టిన పదమూడో నాడు తల్లినీ కోల్పోయారు. తాత సీతారాం సంరక్షణలో పెరిగారు. మాజీ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావుతో కలిసి హెచ్‌ఎస్‌సీ పరీక్ష రాశారు. ఈ పరీక్షలో పీవీ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానాన్ని పొందగా, సఖారాం మూడో స్థానాన్ని సాధించారు. నాటి నిజాం ప్రభుత్వం ‘ఫర్మానా’ (అధికారిక ఆదేశ పత్రం)లో వీరి పేర్లను ముద్రించింది. సఖారాం ప్రతిభకు గుర్తింపుగా రెవెన్యూ విభాగంలో ‘నకల్‌ నఫీస్‌'(కాపీయిస్ట్‌) ఉద్యోగం వరించింది. మూడున్నర దశాబ్దాలకు పైగా ప్రజలకు సేవ చేశారు. అంచెలంచెలుగా ఎదిగి 1973 ఏప్రిల్‌ 30న నిర్మల్‌లో తహసీల్దార్‌గా ఉద్యోగ విరమణ పొందారు. స్వయంభట్ల సఖారాం కులదైవం వేములవాడ రాజరాజేశ్వర స్వామి, ఇలదైవం సీతారాముల వారు. రాములవారి పూజ పూర్తికానిదే పచ్చి మంచినీళ్లయినా ముట్టేవారు కాదు. శిథిల స్థితిలో ఉన్న అనేక ఆలయాలను పునరుద్ధరించారు. 

పేరు చివరన ‘రాం’

 చెన్నూర్‌లో తాను కట్టించుకున్న  ఇంటికి ‘శ్రీ రామ నిలయం’ అని నామకరణం చేశారు సఖారాం. ఆ నివాసం అతిథి అభ్యాగతులతో నిత్యం సందడిగా ఉండేది. సఖారాం తాత అయిన ఘనాపాఠి సీతారాం మొదలు నేటి తరం వరకూ ఆ ఇంట్లో పుట్టిన ప్రతి మగవారి పేరు చివరన ‘రాం’ అని ఉండటం గమనార్హం. స్వయంభట్ల సీతారాం ఘనాపాఠి, వెంకుబాయిల కొడుకు శ్రీరాం. ఆయన తనయుడు స్వయంభట్ల సఖారాం. ఈయన కొడుకులు.. సీతారాం, జయరాం, రాజారాం, రఘురాం, జానకిరాం. తర్వాతి తరంలో.. సఖారాం పెద్ద కొడుకైన సీతారాం తన కొడుకులకు వెంకటరాం, పట్టాభిరాం, హరిరాం (శ్రీకాంత్‌) అని నామకరణం చేశారు. జయరాం తన బిడ్డకు దత్తురాం అని పేరు పెట్టారు. రాజారాం వారసుడి పేరు దత్త సాయిరాం, రఘురాం కొడుకు రోహన్‌ రాం, జానకిరాం తనయుడు అభిరాం. మూడో తరం విషయానికి వస్తే.. వెంకటరాం తన కొడుకుకు సాకేత్‌రాం అని, పట్టాభిరాం తన కొడుకుకు సమిత్‌ రాం అనీ, హరిరాం తన కొడుకులకు భార్గవరాం, షణ్ముఖ రాం అనీ పేర్లు పెట్టారు. ఇదే పరంపర కొనసాగుతుందని ఆ కుటుంబీకులు తెలిపారు. 


పీవీతో ఎనలేని అనుబంధం

‘బహుభాషా కోవిదుడు పీవీతో చెన్నూర్‌కు ఎనలేని అనుబంధం ఉంది. ఇది ఈ ప్రాంతం వారు గర్వించదగిన విషయం. స్వయంభట్ల సఖారాంతో కలిసి పీవీ హెచ్‌ఎస్‌సీ పరీక్ష రాశారు. ఇద్దరూ రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు పొందారు’ అని గుర్తుచేసుకుంటారు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, రిటైర్డ్‌ కో ఆపరేటివ్‌ ఉద్యోగి మహావాది సుధాకర్‌ రావు. ‘మానాన్న ఉద్యోగం చేస్తున్నప్పుడు వివిధ దేవాలయాలకు ఇతోధికంగా దానాలు చేసేవారు. రాముడంటే అపారమైన భక్తి. మా ఇంటికి శ్రీరామ నిలయం అని పేరు పెట్టారు. ఇంట్లోనూ ప్రత్యేకంగా పూజగదిని ఏర్పాటు చేశారు. నాన్న సేవలు మాకు స్ఫూర్తినిస్తాయి. ఆయన పనితీరు మాకు ఆదర్శం’ అంటారు సఖారాం తనయుడు స్వయంభట్ల రఘురాం.  

-కొమ్మెర రామమూర్తి


logo