శనివారం 23 జనవరి 2021
Sunday - Nov 01, 2020 , 00:43:41

అబలా జీవితము

అబలా జీవితము

(హరినారాయణ్‌ ఆప్టే రాసిన ‘పన్‌ లక్షత్‌ కోన్‌ ఘెతో’ మరాఠీ నవలకు తెలుగు అనువాదం) యమున తన అన్న స్నేహితురాళ్లతో బొమ్మలపెండ్లి ఆడుకుంటూ ఉండగా... నాన్నగారు ధుమధుమలాడుతూ వచ్చారు. పిల్లలిద్దరూ వణికిపోయారు. ఇంతలో అమ్మమ్మ ఊరికి వెళ్తున్నామని తెలిసింది. రైలు బండి ప్రయాణం హుషారుగా సాగింది. రైలు దిగాక అమ్మమ్మ వాళ్లింటికి బాడుగ బండీలో బయల్దేరారు. ఆ తరువాత కథ.. పి.వి. నరసింహారావు

నేను వాడికేమీ బదులు చెప్పలేదు. నా ఏడుపు నిర్విరామంగా సాగుతున్నది. అది చూసి బండివాడి కేమనిపించిందో ఏమో, బండి ఆపాడు. ఎద్దులు విడిచి వాటి ముందు రెండు చొప్పకట్టలు పడేసి తానూ ఒక వైపుకు పరుగుతీశాడు. ఏడ్పు ముమ్మరంలో నేనిదంతా గమనించలేదు. తాను వెళ్లాక బండిలో ఇద్దరు పసిపిల్లల గతేంకావాలనే ప్రశ్న వాడి బుఱ్ఱకు తట్టినట్టేలేదు. వాడు కొంతదూరం వెళ్ళాక నాకీ సంగతి బోధపడి నేను బిగ్గరగా వాడిని పిలువసాగాను. కాని ఎవ్వరూ పలుకలేదు.  ఇంకేం చేయమంటారు? పొద్దు పూర్తిగా కుంకుతున్నది. దారిలో మనిషెవ్వడూ కనిపించడంలేదు. మనుష్యుల ధ్వని వినిపించడంలేదు. అలాంటి సమయంలో పసిదాన్నైన నేను అడవిలో, ఉండిపోయాను ఒంటరిగా. అప్పటి నా పరిస్థితిని స్మరించుకుంటేనే నేడు నా కండ్లు చెమ్మగిల్లుతాయి. అలాంటప్పుడు నేనెంత దద్దరిల్లి యేడ్చానో, ఎవరైనా ఊహించగలరా? అయ్యా! నావంటి పసిపిల్లలు వంటింట్లో నుంచి వసారాలోకి లాంతరుతో వెళ్లాలన్నా తోడు లేనిదే సాధ్యపడదు. అలాంటప్పుడు నట్టడివిలో ముల్లె మూటల మధ్య నా వంటి అమ్మాయి ఒంటరిగా ఉండడం, నా పక్కన సుందరి నిద్రపోతూ ఉండటం ఈ దృశ్యాన్ని మీరే ఊహించండి. 

బాల్య సహజమైన ఊహవల్ల ఎన్నెన్ని ఘోర సంకటాలు సంభవిస్తాయని భయపడ్డానో లెక్కించి చెప్పడమసాధ్యం. ఎక్కడ చీమచిటుక్కుమన్నా హృదయం కంపించిపోతూ ఉంది. చివరకు నా అంతట నేనే ఏడ్పు చాలించి, ఎనలేని భయంతో పూర్తిగా బేజారై, ముల్లెమూట అట్టిటు సర్ది వాటిపైన మేనువాల్చి పచ్చడమేదో కప్పుకొని ఎలా పడిఉన్నానో, నా తిప్పలు నాకే తెలుసు! అంతరాళం నుంచి ఏదో చెప్పరాని సొద పైకుబికి వస్తున్నది. ఎదలో అంతులేని దడదడ అవిరామంగా నడుస్తున్నది. ఏ కొద్ది చప్పుడైనా ఎవరో వచ్చారనిపిస్తున్నది. ఆ ప్రాయంలో దొంగల భయంకన్న భూతాల భయమే అధికం. పచ్చడం కొసలను అన్ని పక్కల్లోనూ, తల కిందనూ గట్టిగా బిగించుకున్నాను. నట్టడవిలో బండి నిలిచిఉంది. ముసుగులో ముచ్చెమటలు కమ్మినా పచ్చడాన్ని మాత్రం తొలగించడం సాధ్యమౌతుందా నాకు? ఆ స్థితిలో ఒక్కొక్క క్షణం గడియగాను, గడియ జాముగాను, అతి కష్టం మీద గడుస్తున్నది. ఎన్నెన్ని మ్రొక్కులు మ్రొక్కానో లెక్కించి చెప్పడ మసలే సాధ్యం కాదు. అవన్నీ పిల్లల మ్రొక్కులే అనుకోండి-- ఒక దేవుడికి రెండు పైసల మిఠాయి, మరొక దేవుడికి అర్ధణా చక్కెర, ఇంకొక దైవానికి కొబ్బరికాయ, ఇలాంటివే మ్రొక్కులు! ఇంతేకాక తులసి చెట్టు చుట్టు రోజుకు వంద ప్రదక్షిణాలు చేస్తానని కూడా సంకల్పించాను... పోనిద్దురూ, అప్పటి నా మ్రొక్కులన్నీ వ్రాయాలంటే అదొక గ్రంథమౌతుంది. అందుకని ముందు కథ చెబుతాను.

అలాగే ఒంటరిగా ఎంతోసేపు కూర్చున్నాను. పక్షుల కిలకిలారవం చాలవరకు తగ్గింది. చీకట్లు కమ్మసాగాయి. బండివాడు బండిని దారికి నట్టనడుమ నిలిపిపోయాడు. ఇంతలో వెనుకనుండి మరొక బండి వస్తున్నట్లు నాకనిపించింది. నేను తదేక శ్రద్ధతో వింటున్నాను. శ్వాస సైతం బిగబట్టి విన్నాను. క్షణక్షణం ఏదో బండి వస్తున్నదనే నమ్మకం నాకు క్రమేణా కలిగింది. ఆ బండి మనలాంటివారి దెవరిదైనా ఫరవాలేదు. కాని ఎవరైనా అఘాయిత్యం మనుషులదైతే నాగతేమౌతుంది? ఈ తర్కవితర్కంలోనే ఆ బండి వచ్చి మా బండి వెనుక నిలిచింది. అది రావడమే తడవు నేను తటాలున లేచి కూర్చున్నాను. నేనేదో మాట్లాడుదామనుకునేలోగా ఆ బండివాడు, “ఓరేయ్‌! బండోడా! ఎక్కడి యెదననాగన్నవురా! పక్కకు జరుపుబండి బిరాన!” అని అరవడం ప్రారంభించాడు.

“మా బండివాడు మా అన్నయ్యకోసం వెళ్ళాడురా అబ్బీ!” అని నేను సమాధానం చెప్పాను. నా మాటలు విని వాడికేమనిపించిందో, తటాలున తన బండి దిగి, మా బండి వద్దకు వచ్చి నలువైపులా కలియచూచాడు. బండిలో ముల్లె మూటలు, వేలెడంత నేను- ఇంతే వాడికి కనిపించింది. కప్పుకొని పండుకున్న సుందరి బహుశా వాడికి కనపడనే లేదు. వాడూ ఒంటరిగానే ఉన్నాడు. ఎవరినో స్టేషన్‌లో దిగబెట్టి ఖాళీ బండి తోలుకొని వస్తూ ఉండెనని మాకు తదుపరి తెలిసింది. నన్ను చూసి ఎంతో జాలిపడ్డట్టు నటిస్తూ ‘ఒంటరిగానే ఉన్నావా? బండివాడేడి?’ మొదలగు ప్రశ్నలు అడుగసాగాడు. నేనేమో పిచ్చిదాన్ని వాడికి సర్వం పూసకుచ్చినట్టు చెప్పేశాను. ఎక్కడ ప్రారంభించాననుకున్నారు? మొట్టమొదటి ఇల్లు విడిచిన దారాభ్య జరిగిన ఉదంతమంతా పొల్లుపోకుండా ఏకరువు పెట్టాను. అంతావిని వాడు మా మూటలు సర్దడం ప్రారంభించాడు. ఎంతో నిదానంగా, తన మూటలనే సర్దినట్లు ఒక్కొక్కటి తీయడం, పరీక్షించడం, పారవేయడం- ఈ కార్యక్రమానికి పూనుకున్నాడు. నాకెటూ పాల్పోలేదు. వెక్కివెక్కి యేడుస్తూ “ఇదేమిట్రా చేస్తున్నావు?” అని మాత్రం అనగలిగాను. అందుకు వాడు “నోరు ముయ్‌! అరిచావంటే ఆ బావిలో పడేత్తా జాగర్త!” అని గదమాయించాడు. ఎంత ప్రయత్నించినా నా యేడుపు మాత్రం ఆగలేదు. చివరికి అమ్మను, బండివాడిని, కృష్ణాజీపంతును, బిగ్గరగా పిలవడం ప్రారంభించాను. రెండు మూడు మార్లు పిలిచానో లేదో వాడు నా మొహంమీద చటీలున లెంపకాయ తగిలించి “మొత్తుకుంటావా పోరీ!” అని నన్ను లేవనెత్తాడు. నా నోటినుండి రక్తం రాసాగింది. ఇంత జరిగాక నా కేకలు నిలిచిపోయాయి. ఐనా యేడ్పు మాత్రం కొద్దో గొప్పో సాగుతూనే ఉంది. వాడు నన్ను లేవనెత్తి కొంత దూరాన బస్తా సంచిలా పడేశాడు, నాకొక ముల్లు కస్సున గుచ్చుకుంది. “ఖబర్దార్‌! అరిచావంటే రాయితో తలబద్దలు కొడ్తా!” అని హెచ్చరించి మళ్ళీ మా బండివైపు పోయాడు. నేనలాగే చచ్చినట్టు పడి ఉన్నాను. 

పాపం ముందరిమాట నాకు జ్ఞప్తికేరాలేదు. బిగ్గరగా అరవడం ఇక సాధ్యపడలేదు. కాని నోరు మూసుకొని మాత్రం ఎంతసేపుంటాను. కొంతసేపటికి నేను మళ్లీ అరవడం ప్రారంభించాను. నా చేతితోనే ఎలాగో ముల్లు తీసుకొని పరిగెత్తుదామని లేచేసరికి “యమూ! ఎక్కడున్నావే?” అన్న మాటలు వినవచ్చాయి. ఆ క్షణంలో ఆ మాటలు చెవి సోకడంవల్ల నాకు కలిగిన అమందానందాన్ని వర్ణించలేను. ఆ కంఠస్వరం అన్నయ్యది. అది విని వాడిమీద నాకెంత ప్రగాఢ ప్రేమ ఉన్నదో నాకు మొట్టమొదటిసారి బోధపడిందంటే నమ్మండి. వాడిమాట విన్నానోలేదో, అప్పటికప్పుడే అపార బలం కలిగినట్లనిపించింది నాకు. 

“ఇక్కడే ఉన్నానన్నయ్యా!” అని బిగ్గరగా అరిచాను. ఇంతలో కృష్ణాజీపంతు, అమ్మ ఉభయులు సుందరితో సహా నావద్దకు వచ్చి “నీవిలా ఎందుకున్నావు? బండివాడేడి?” మొదలగు ప్రశ్నల పరంపర ప్రారంభించారు. విప్పిన మూటలు, నేను బండ్లో లేకుండటం, బండివాడు లేకుండటం, సుందరి ఒకర్తే ఏడుస్తుండటం ఈ దృశ్యం చూడగానే ఏదో అఘాయిత్యం జరిగిందదని వాళ్లూహించి ఉంటారు. జరిగిన కథంతా నేను వినిపించడమే తడవుగా అమ్మ నన్ను గట్టిగా కౌగలించుకొని “మిమ్మలిద్దర్ని విడిచి ఎందుకెళ్ళానే తల్లీ!” అని యేడువసాగింది. 

పాపం ముందరిమాట నాకు జ్ఞప్తికేరాలేదు. బిగ్గరగా అరవడం ఒక సాధ్యపడలేదు. కాని నోరు మూసుకొని మాత్రం ఎంతసేపుంటాను. కొంతసేపటికి నేను మళ్లీ అరవడం ప్రారంభించాను. నా చేతితోనే ఎలాగో ముల్లు తీసుకొని పరిగెత్తుదామని లేచేసరికి “యమూ! ఎక్కడున్నావే?” అన్న మాటలు వినవచ్చాయి. ఆ క్షణంలో ఆ మాటలు చెవి సోకడంవల్ల నాకు కలిగిన అమందానందాన్ని వర్ణించలేను. ఆ కంఠస్వరం అన్నయ్యది. అది విని వాడిమీద నాకెంత ప్రగాఢ ప్రేమ ఉన్నదో నాకు మొట్టమొదటిసారి బోధపడిందంటే నమ్మండి. వాడిమాట విన్నానోలేదో, అప్పటికప్పుడే అపార బలం కలిగినట్లనిపించింది నాకు. 


logo