శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sunday - Oct 25, 2020 , 01:47:45

మాటల ఊట.. పాటల తేట

మాటల ఊట.. పాటల తేట

సినిమా కళలో అనువాద రచన చక్కటి సృజనాత్మక ప్రక్రియ. మాతృకలోని భావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని అందుకు అనుగుణంగా సంభాషణలు రాయాల్సి ఉంటుంది. డబ్బింగ్‌ సినిమాకు మాటలు రాయాలంటే నేటివిటీని, సంస్కృతిపరమైన అంశాల్ని బాగా అర్థం చేసుకోవాలని చెబుతున్నారు గేయ, సంభాషణల రచయిత భాష్యశ్రీ.  ‘బిచ్చగాడు, ‘భేతాళుడు’, ‘ఇంద్రసేన’, ‘కాశీ’, ‘కిల్లర్‌' వంటి అనువాద చిత్రాలతో రచయితగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఆయన. ప్రస్తుతం సుమంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘కపటధారి’ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ‘బతుకమ్మ’తో భాష్యశ్రీ పంచుకున్న భావాలివి..

అనువాద ప్రక్రియ అనగానే మాతృకలోని భావాన్ని యథాతథంగా మరోభాషలోకి తర్జుమా చేయడం అనే భావన చాలామందిలో ఉంది. అది నిజం కాదు. డబ్బింగ్‌లో నేటివిటీకి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఒరిజినల్‌ సినిమాలోని భావాన్ని మన భాషలోకి అన్వయిస్తూనే నేటివిటీ దెబ్బతినకుండా చూసుకోవాలి. సినిమా చూసే ప్రేక్షకులకు కథ హైదరాబాద్‌లోనో లేదా మన పరిసరాల్లోనో జరుగుతుందనే ఫీలింగ్‌ కలగాలి. అలాంటి అనుభూతి కలిగించలేకపోతే అనువాద ఔచిత్యం దెబ్బతిన్నట్టే! పక్కాగా అనువాదం కుదిరిన చిత్రం స్ట్రెయిట్‌ చిత్రమనే భావన కలిగిస్తుంది.

మాట్లాడే విధానం 

డబ్బింగ్‌ సంభాషణలు రాసేటప్పుడు నటీనటులు మాట్లాడే విధానాన్ని బాగా పరిశీలించాలి. లిప్‌సింక్‌తో పాటు వారు ఏ స్పీడ్‌తో డైలాగ్‌ చెబుతున్నారో గమనించాలి. పెదాల కదలికలకు సరిపోయే పదాలు రాసి అయిపోయిందనుకోవద్దు. బలవంతంగా ఇరికించారన్న భావన ప్రేక్షకులకు రావొద్దు. మొదట సంభాషణల్లోని ఫ్లో ఎలా ఉందో తెలుసుకొని, అందులో ఇమిడిపోయేలా మాటలు రాసుకోవాలి. ఆ తర్వాతే లిప్‌సింక్‌ గురించి ఆలోచించాలి. ఒరిజినల్‌ డైలాగులను మక్కీ టు మక్కీ తర్జుమా చేస్తే దెబ్బతింటాం. డైలాగ్‌ సారాంశాన్ని యథాతథంగా తీసుకోవడం అన్ని సందర్భాల్లో సాధ్యపడదు. ఎందుకంటే ప్రతి భాషకు తనదైన సంస్కృతి, స్థానికత ప్రాతిపదికన కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వాటిని గుర్తెరిగి మాటలు రాయాల్సి ఉంటుంది. ఇతర భాషల్లోనూ అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా విభిన్న మాండలికాల్లో డైలాగులు ఉంటాయి. వాటిని అంతే ఎఫెక్టివ్‌గా అనువదించాల్సి ఉంటుంది.

విజయ్‌ ఆంటోనితో ప్రయాణం

‘దరువు’ సినిమాకు విజయ్‌ ఆంటోని సంగీతాన్నందించాడు. ఆ సినిమాకు పాట రాసే క్రమంలో ఆయన్ని కలిశాను. ఆ సమయంలోనే ఆయన హీరోగా పరిచయమయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. అప్పుడు జరిగిన చర్చల్లో మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. ఓ రెండేండ్ల తర్వాత ‘నకిలీ’ సినిమా కోసం పనిచేయాలని ఆయన దగ్గరి నుంచి పిలుపు వచ్చింది. అక్కడి నుంచి మా ఇద్దరి ప్రయాణం మొదలైంది. విజయ్‌ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’, ‘భేతాళుడు’, 

‘యమన్‌', ‘కాశీ’, ‘ఇంద్రసేన’, ‘రోషగాడు’, ‘కిల్లర్‌' సినిమాలకు నేనే పాటలు, మాటలు అందించాను. విజయ్‌తో అసోసియేషన్‌కు ముందు తెలుగులో ‘ఒంటరి’, నాని నటించిన ‘స్నేహితుడా’తోపాటు మరికొన్ని సినిమాలకు మాటలు రాశాను. అయితే ‘బిచ్చగాడు’ సినిమాతో మంచి బ్రేక్‌ లభించింది.

అమ్మపాట ప్రత్యేకం

‘బిచ్చగాడు’ సినిమాలో అమ్మ ప్రేమను, ఔన్నత్యాన్ని చాటుతూ నేను రాసిన ‘వందదేవుళ్లే కలిసొచ్చినా అమ్మ నీలాగా చూడలేరమ్మ’ అనే పాట నాకు మంచి పేరు తీసుకొచ్చింది.  ఆ సినిమా చూశాక మొదట ఈ పాటే రాశాను. తమిళ వెర్షన్‌ పాటలోని మెయిన్‌ పాయింట్‌ను తీసుకొని సరికొత్త భావాల్ని స్ఫురించేలా తెలుగులో రాశాను. గీత రచనలో నాకు చంద్రబోస్‌గారు స్ఫూర్తి. ఎంతో సంక్లిష్టమైన విషయాన్ని కూడా ఆయన సరళమైన భాషలో చెబుతారు. సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యే పదజాలంతో అద్భుతమైన భావాలను పలికిస్తారు. నా పాటల్లో కూడా గంభీరమైన పదాల్ని ప్రయోగించను. సామాన్యులకు అర్థమయ్యేలా తేలికైన పదాలనే ఎక్కువగా ఉపయోగిస్తుంటాను.

గీత రచనను ఆస్వాదిస్తా

సినిమాకు మాటలు అందివ్వడం కన్నా.. స్వతహాగా గీత రచననే ఎక్కువగా ఇష్టపడతాను. డైలాగ్స్‌ రాయడం ఎక్కువ సమయం తీసుకుంటుంది. పైగా చాలా శ్రమతో కూడుకున్న పని. పాట రాయడం త్వరగా పూర్తవుతుంది. మనలోని భావాల వ్యక్తీకరణకు పాట చక్కటి వేదికగా అనిపిస్తుంది. ఇప్పటివరకు నేను నాలుగువందల వరకు పాటలు  రాశాను. భవిష్యత్తులో మాటలతోపాటు పాటలు రాయడమూ కొనసాగిస్తాను. ఈ రెండు విభాగాల్లో  మరింతగా రాణించాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం నేను సుమంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘కపటధారి’ చిత్రానికి సంభాషణల్ని అందిస్తున్నా. కన్నడంలో భారీ విజయం సాధించిన ‘కావలిధారి’ చిత్రానికి రీమేక్‌ ఇది. మరో నాలుగు స్ట్రెయిట్‌ సినిమాలకు మాటలు, పాటలు రాస్తున్నా. అనువాద చిత్రాలతోపాటు తెలుగులో స్ట్రెయిట్‌ సినిమాలు ఇంకా ఎక్కువగా చేయాలనుంది. తెలుగు సినిమా పుస్తకంలో నాకంటూ ఓ పేజీ ఉండాలనే తపనతోనే నా కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నా.

డబ్బింగ్‌లోని సౌలభ్యం అదే..

అనువాద సినిమాకు మూడునాలుగు రోజుల్లో సంభాషణల్ని పూర్తి చేయొచ్చు. సినిమా కథ, సన్నివేశాల్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని పనికి ఉపక్రమిస్తే తక్కువ సమయంలోనే మాటలు పూర్తవుతాయి. అదే స్ట్రెయిట్‌ సినిమాకు సంభాషణల్ని సమకూర్చాలంటే ఒక్క వెర్షన్‌కే రెండు వారాల సమయం పడుతుంది.  అనేక మార్పులు చేర్పులతో ఫైనల్‌ వెర్షన్‌ సిద్ధం చేయాల్సి ఉంటుంది. డబ్బింగ్‌ సినిమాకు సంబంధించిన కంటెంట్‌ ముందే అందుబాటులో ఉంటుంది కాబట్టి పని సులువుగా అయిపోతుంది.

భాషపై పట్టు అనవసరం

డబ్బింగ్‌ సినిమాలకు మాటలు అందివ్వాలంటే అన్ని భాషలపై పట్టు ఉండాల్సిన అవసరం లేదు. నేను తమిళంతో పాటు కొన్ని మలయాళ సినిమాల తెలుగు వెర్షన్స్‌కు మాటలు రాశాను. వాస్తవానికి నాకు మలయాళంలో అంతగా ప్రవేశం లేదు. అయినా రాయగలిగాను. సినిమా చూస్తున్నప్పుడు కథలోని భావోద్వేగాల్ని చక్కగా అర్థం చేసుకుంటే చాలు. ప్రతి పదమూ అర్థం అవ్వాల్సిన పన్లేదు. మనం ఎన్నో కొరియన్‌ సినిమాలు చూస్తుంటాం. భాష రాకపోయినా పాత్రల మధ్య ఎమోషన్‌  ఏమిటో అర్థం చేసుకోగలుగుతాం. అలా కథలోని భావోద్వేగాల్ని ఒడిసిపట్టుకోగలిగితే సంభాషణలు సులభంగా రాసేయొచ్చు.