శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sunday - Oct 25, 2020 , 01:40:37

విజయం వైపు ప్రయాణం

విజయం వైపు ప్రయాణం

వ్యక్తిత్వ వికాస ప్రపంచంలో రాబిన్‌ శర్మ పేరు తెలియనివారు ఉండరు. వికాస పాఠాల్ని కథలుగా, అవసరమైతే నవలగా కూడా రాయగలిగే కలం ఆయనది. ‘ది మాస్టరి మాన్యువల్‌' రాబిన్‌శర్మ రచనలలో ఒకటి. వ్యక్తిగా, వృత్తి నిపుణుడిగా విజయం సాధించాలని కోరుకునేవారికి ఇదో ఫైవ్‌ పండిట్స్‌ గైడ్‌. ఆలోచనా విధానంలో మార్పులతో గొప్ప ఫలితాలను సాధించడం ఎలాగో ఈ పుస్తకంలో చెప్పారు.   

అందరితో ప్రేమగా మాట్లాడండి. సమస్యల్లో ఉన్నవాళ్లను పరామర్శించండి. బాధల్లో ఉన్నవాళ్లను ఓదార్చండి. అంతిమంగా మీరు ఎన్ని ఆస్తులు సంపాదించారన్నది కాదు, మీ అంత్యక్రియలకు ఎంతమంది హాజరయ్యారన్నది ప్రధానం. ప్రతి మనిషికి ఎన్నో కొన్ని భయాలు ఉంటాయి. ఒక్కసారి మీలోని భయాలేమిటో గుర్తు చేసుకోండి. వాటికి దూరంగా వెళ్లడం కాదు, క్రమక్రమంగా దగ్గరికి జరగాలి. కొండ మీది నుంచి కిందికి చూడాలంటే మీకు భయమా? అయితే, ముందుగా ఒకటో అంతస్తు నుంచి, ఆ తర్వాత రెండో అంతస్తు నుంచి.. నిర్భయంగా కిందికి చూడటం సాధన చేయండి. నీళ్లను తలచుకుంటేనే మీకు వణుకు పుడుతుందా? అయితే.. ముందు పిల్ల కాలువతో, ఆతర్వాత పెద్ద కాలువతో, ఆపైన చెరువుతో, నదితో, సముద్రంతో స్నేహం చేయండి. 

కలలేం  తిను బండారాలు కాదు. వాటికి గడువు తేదీ ఉండదు. జీవితంలోని చిట్టచివరి రోజు అయినా సరే, నెరవేరని కలలు ఏమైనా మిగిలి ఉంటే కనుక.. నిజం చేసుకునే ప్రయత్నం చేయండి. అసంపూర్ణ స్వప్నాలతో ఎవరూ జీవితాన్ని చాలించరాదు. అంతకు మించిన ఫెయిల్యూర్‌ ఉండదు. 

ఎప్పుడూ నిజాలే మాట్లాడండి. నిజం చెప్పినంత మాత్రాన ఎవరూ మీ తలకాయను తీసేయరు. కాకపోతే, ఆ చెప్పేదేదో కుండబద్దలు కొట్టినట్టు కాకుండా, సున్నితంగా చెప్పండి. అబద్ధాలతో ఏ బంధాన్నీ నిర్మించుకోలేం. అది ఇంట్లో కావచ్చు. ఆఫీసులో  కావచ్చు. సమాజంలోనూ కావచ్చు. తప్పు చేసినప్పుడు కూడా నిజమే మాట్లాడండి. నిజాయతీగా పశ్చాత్తాపం వ్యక్తం చేయండి. 

చిన్నచిన్న ఆనందాల్నీ, చిట్టిచిట్టి అనుభూతుల్నీ చిన్నచూపు చూడకండి. రిటైర్మెంట్‌ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఈ రోజు మనకు చిన్నవిగా అనిపించిన ఘట్టాలే గొప్ప జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.ఇతరులు మీతో స్నేహం చేస్తారేమోనని ఆశగా రెండేండ్లు ఎదురుచూడటం కన్నా, మీరే ఆ వ్యక్తులకు దగ్గర కావడానికి ఓ  రెండు నెలలు ప్రయత్నించండి చాలు. ఆ మనిషి మీ ఆత్మీయ నేస్తాల జాబితాలో చేరిపోతారు. మీ గురించి మీకు స్పష్టత ఉన్నప్పుడే, ఇతరుల గురించీ ఓ అభిప్రాయానికి రాగలరు. మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి ఉద్యోగిగా ఉండటం మంచిదే. కానీ, ఆ పరుగులో పడిపోయి, మిమ్మల్ని మీరు విస్మరించకండి. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి. పోషకాహారం తీసుకోండి. తగినంత వ్యాయామం చేయండి. నలభై దాటిన తర్వాత, ఏడాదికోసారి వైద్య పరీక్షలు చేయించుకోండి. పరిపూర్ణ విజేత అనిపించుకోవాలంటే పరిపూర్ణ ఆరోగ్యవంతులూ కావాలి.