శనివారం 05 డిసెంబర్ 2020
Sunday - Oct 25, 2020 , 01:36:49

వేదోక్త... వ్యవసాయం

వేదోక్త... వ్యవసాయం

ఆవు దూడను సమీపించినట్టు, వాయువు మేఘాన్ని కలుస్తుంది. ఆ తర్వాత, అదే మేఘం మట్టిని కలుస్తుంది. ఆ మట్టి విత్తును కలుస్తుంది. ఆ విత్తు .. దిగుబడిలా మారి, రాబడి రూపంలో రైతును కలుస్తుంది. ప్రాచీన భారతీయ సంప్రదాయం సేద్యాన్ని ఓ వృత్తిగా మాత్రమే చూడలేదు,  పవిత్ర యజ్ఞంగా భావించింది. ఆ మూలాలను గుర్తుచేస్తూ కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ యువకుడు వేదాలు ప్రవచించిన మార్గంలోనే నల్ల వడ్లు పండిస్తున్నాడు. 

పంటలు పండించడం అంటే, తోటి మనిషికి అన్నం పెట్టడమే. ‘దదాశ్వాన్నం దదాశ్వాన్నం దదాశ్వాన్నం యుద్ధిష్ఠర’ఆకలి తీర్చు, ఆకలి తీర్చు, ఆకలి తీర్చు! - అని మహాభారతంలో ధర్మరాజుకు హితవు చెబుతాడు శ్రీకృష్ణుడు.

.. అలా అన్నదాత, ప్రాణదాత వేరువేరు కాదని స్పష్టం చేస్తాడు పరమాత్ముడు. పిడికెడు అన్నం పెట్టడమే పుణ్యమైతే, గుప్పెడు ధాన్యం పండించడం మహాపుణ్యమే. కాబట్టే, ఎలాంటి రసాయనాలూ లేకుండా చతుర్వేద ఆధారిత వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామానికి చెందిన వేద విద్యార్థి.. కౌటిల్య కృష్ణన్‌. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయంలో యజుర్వేద భాష్యంలో ఎంఏ చేస్తున్న ఈ యువకుడు కృష్ణ బ్రిహి (నల్ల వడ్లు) రకాన్ని సాగు చేస్తున్నాడు. చరకుడు, పరాశరుడు వంటివారు వేదాలలో సంప్రదాయ వ్యవసాయ విధానాలను సూచించారనీ, అంతరించిపోయిన ఆ సంప్రదాయ పద్ధతులను తిరిగి  ప్రవేశపెట్టడానికి ‘కృషి భారతం ట్రస్ట్‌'ను ఏర్పాటు చేసినట్లు కౌటిల్య చెబుతున్నాడు. భూ సంరక్షణతోపాటు బీజ, ప్రకృతి, మానవ ఆరోగ్య సంరక్షణ వేద వ్యవసాయంతోనే సాధ్యమవుతుందని అతడి బలమైన అభిప్రాయం. తన గురువులు చక్రవర్తి రాఘవన్‌, నిరంజన్‌ మిశ్రా, మురళీధర్‌ శర్మ సహకారంతోనే ఇదంతా సాధ్యమైందని చెబుతున్నాడు. ఖాసింపేట శివారులో తనకు ఉన్న 30 గుంటల భూమిలో ప్రయోగాత్మకంగా నల్ల వడ్లు సాగు చేస్తున్నట్లు వివరిస్తున్నాడు. భవిష్యత్తులో గ్రామ గ్రామానా ప్రచారం చేస్తానని అంటున్నాడు.సాగు విధానం 

వేదాల ప్రకారం జరిగే వ్యవసాయంలో... మొదట వృషభోత్సవం నిర్వహిస్తారు. నేలను దున్నడానికి బయల్దేరే ముందు.. ఎద్దును అందంగా అలంకరించి గ్రామంలో ఊరేగిస్తారు. భూమాతను వేదమంత్రాలతో పూజిస్తారు. నాగలికి తేనె, ఆవు నెయ్యి పూసి.. హలధారి సేద్యానికి శ్రీకారం చుడతాడు. తరువాత, నారుమడిని సిద్ధం చేస్తారు. రోహిణి కార్తెలో మృగశిర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, ఉత్తర ఫల్గుణి, హస్త, మూలా నక్షత్రాలలో సాగు పనులను ప్రారంభించి నారు పోస్తారు. ఎకరాకు సుమారు 12 కిలోల ధాన్యం అవసరం అవుతుంది. 15-20 రోజల తర్వాత నారు తీసి మొక్కల వేళ్లను తేనెలో ముంచి నాటు వేస్తారు. అనంతరం పొలానికి తగిన నీటిని అందిస్తారు. ఏ రసాయనాలూ వాడరు. చీడ పీడలు సోకకుండా ఎకరాకు పావు లీటరు దేశీ ఆవుపాలు, పావు లీటరు తేనె, 10 లీటర్ల నీటిలో కలిపి  పిచికారీ చేస్తారు. వరి ఎదుగుతున్న సమయంలో పొలం గట్ల పక్కన అక్కడక్కడా ఆవుపేడతో చేసిన పిడకలను వేసి అగ్నిహోత్రం వెలిగిస్తారు. ఆ పొగ కారణంగా చీడలు ఆశించవవు. 120 రోజులకు వరి కోతకొస్తుంది. కోతకు ముందు లక్ష్మీపూజ నిర్వహించాలి. 

ఖర్చులు.. లాభాలు

ఈ సేద్యంలో ఎకరానికి 12 కేజీల విత్తనం అవసరమవుతుంది. కిలో రూ.250 వరకు ఉంటుంది. ఈ లెక్కన ఎకరాకు మూడువేల వరకు ఖర్చవుతుంది. నాట్లు, కోత.. అన్నీ కలిపి రూ.12 వేల వరకు ఖర్చొస్తుంది. సరాసరి ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు  పెట్టుబడి అవుతుంది. కాగా, ఎకరంలో 15 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి లభిస్తుంది. ఈ లెక్కన బియ్యం 8 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్ల వరకు వస్తాయని కౌటిల్య చెబుతున్నాడు. నల్లవడ్లలో అపారమైన పోషక విలువలున్నాయి. కాల్షియం, ప్రొటీన్లు, ఐరన్‌, అమైలోజ్‌, లిపిడ్‌లు పుష్కలం. అంతే కాకుండా బీపీ, షుగర్‌ తదితర జీవనశైలి రుగ్మతలు నియంత్రణలో ఉంటాయి.  

 ‘మా గ్రామానికి చెందిన కౌటిల్య కృష్ణ వేద విద్యను అభ్యసించి ప్రాచీన వ్యవసాయాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించడం గర్వకారణం. యువత సాఫ్ట్‌వేర్‌ రంగానికి పరుగెడుతుంటే.. తను మాత్రం వేదాలను చదివి, రైతుగా మారాడు. భూమిని, విత్తనాలను, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలనే సంకల్పంతో కృషి భారతం పేరుతో ఓ ట్రస్టును స్థాపించడం అభినందనీయం’ అంటారు గ్రామ సర్పంచ్‌ తీగల మోహన్‌రెడ్డి.   

రైతు ఆరోగ్యంగా ఉంటేనే.. 

దేశానికి రైతే వెన్నెముక. రైతు ఆరోగ్యంగా ఉంటేనే దేశం శక్తిమంతంగా తయారవుతుంది. ప్రతి రైతూ కృష్ణ బ్రిహి(నల్లని వడ్ల)ని సాగు చేయాలి. దీన్నే ఆహారంగా స్వీకరించాలి. అప్పుడే, మరింత రెట్టింపు ఉత్సాహంతో వ్యవసాయ పనులు చేయ గలుగుతారు. 

- కౌటిల్య కృష్ణ (యువ వేద రైతు)

8686743452

-గుడాల శ్రీనివాస్‌