శనివారం 16 జనవరి 2021
Sunday - Oct 25, 2020 , 01:18:02

కోటలో.. పూర్వికుల పండుగ

కోటలో.. పూర్వికుల పండుగ

దసరా సందర్భంగా దేశమంతా దేవుళ్లను కొలిస్తే, ఆదిలాబాద్‌ జిల్లా గిరిజనులు మాత్రం తమ పూర్వికులను పూజిస్తారు. తరతరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, ఉట్నూర్‌ గోండురాజుల కోటలో ప్రత్యేక పూజలు జరుపుతారు. శత్రువుల బారి నుంచి తమ జాతిని కాపాడిన గోండురాజులను మనస్ఫూర్తిగా స్మరించుకుంటారు. 

ఆదిలాబాద్‌ జిల్లా అనగానే గిరిజనులు, వారి సంప్రదాయాలే కండ్ల ముందు కదలాడుతాయి. నిజాం ప్రభువులకు ముందే ఈ ప్రాంతాన్ని గోండురాజులు పాలించినట్లు చరిత్ర చెబుతున్నది. ఉట్నూర్‌ కేంద్రంగా ఆత్రం రాజ్‌గోండులు, సీతాగొంది రాజుల పాలన అప్రతిహతంగా సాగింది. ప్రస్తుతం ఉట్నూర్‌ పట్టణంలోని గోండురాజుల ఖిల్లా, 700 ఏండ్ల వైభవోపేతమైన చరిత్రకు సాక్ష్యంగా మిగిలింది. క్రీ.శ. 1309లో గోండు రాజులు తమ స్థావరాల కోసం ఉట్నూర్‌ కోటను నిర్మించారు. ఆ తర్వాత 18వ శతాబ్దంలో వారి వంశస్థుడైన హనుమంత రాయుడు, ఈ కోటను పునరుద్ధరించారు. దీన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని మంత్రులు, సేనాధిపతులతో సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని రాజ్యపాలన చేశారు. 

అనంతరం అతని భార్య గోండు రాజ్యాన్ని ఏలారు. ఈ క్రమంలో నిజాం ప్రభువులతో సత్సంబంధాలు దెబ్బతినడంతో, నైజాం సైనికులు కోటపై దాడి చేశారు. దీంతో గోండు రాజుల వంశస్థులు కోటను వదిలి, అడవుల్లోకి వెళ్లారు. తాము పాలించిన ప్రజలతో మమేకమై, వారితోనే కలిసి జీవించడం మొదలు పెట్టారు. హనుమంత రాయుడి తమ్ముడు జగపతిరావు, ఉట్నూర్‌ సమీపంలోని లక్కారం గ్రామంలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. జీవితాంతం గోండుల సంక్షేమం కోసం శ్రమించారు. 

వశస్థుల పూజలు

దసరా పండుగను పురస్కరించుకొని ఉట్నూర్‌ కోటలో తమ పూర్వికులను స్మరించుకుంటూ, ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. రాజా హనుమంత్‌షా కాలం నుంచీ ఈ సంప్రదాయం కొనసాగుతున్నది. హనుమంత్‌షా కుమారుడు జల్‌ఫత్‌షా, ఇతని కుమారుడు రాజా దేవ్‌షాతోపాటు వివిధ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకొన్న ఆత్రం, సీతాగొంది వంశీయులు ఈ పూజలను జరిపిస్తున్నారు. లక్కారంతోపాటు సిర్పూర్‌(యు) నుంచి కూడా రాజ వంశీయులు, కుటుంబాలతో కలిసి కోటకు వస్తారు. సంప్రదాయ వాద్యాలను మోగిస్తూ, గడీలో పూజలు నిర్వహిస్తారు. కోటలోని సమాధుల వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం కోటపై జెండా ఎగురవేస్తారు. తమకో ఘన చరిత్రను ఇచ్చిన వ్యక్తులను గుర్తుచేసుకోవడం సంప్రదాయమే కాదు, సంస్కారం కూడా.వైభవానికి చిహ్నం

ఆదిలాబాద్‌ గోండు రాజుల చరిత్రకు ఉట్నూర్‌ కోట సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది. 300 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ కోటలో అడుగడుగునా అనేక విశేషాలు అబ్బుర పరుస్తారు. కోట ఆవరణలో నిర్మించిన కోనేరు అప్పటి శిల్పకళా వైభవాన్ని  కండ్లకు కడుతున్నది. స్నానాలు చేసిన తర్వాత దుస్తులు మార్చుకునేందుకు కూడా ప్రత్యేకంగా గదులను నిర్మించడం విశేషం. శత్రువుల నుంచి రక్షణ కోసం కోట చుట్టూ, ఎనిమిది అడుగుల లోతున కందకం తవ్వారు. అంతేకాకుండా ఉట్నూర్‌ కోట నుంచి సిర్పూర్‌(యు), ఖానాపూర్‌, నిర్మల్‌ కోటల్లోకి సొరంగ మార్గాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే శిథిలమైన ఈ కోటలో రహస్య మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఒక్కచోట మాత్రం సొరంగాల్లోకి వెళ్లే మార్గం కనిపిస్తున్నది. కోటకు తూర్పు భాగంలో ప్రధాన ప్రవేశ ద్వారం ఉంది. లోపలి గోడలను బురుజులను రాళ్లు, ఇటుకలు, డంగు సున్నంతో పటిష్ఠంగా నిర్మించారు. 

-చేపూరి శ్రీధర్‌