బుధవారం 27 జనవరి 2021
Sunday - Oct 25, 2020 , 01:12:07

వాస్తు నగరి.. మంత్రపురి

వాస్తు నగరి.. మంత్రపురి

వెయ్యేండ్ల చరిత్ర కలిగిన మంత్రపురి (మంథని) అనేక అద్భుతాలకు నిలయం. పక్కా వాస్తును పాటిస్తూ, శాస్ర్తోక్తంగా నిర్మితమైన ఈ పట్టణంలో.. సామాన్యులకు ‘వాస్తు’ గురించి చింతే లేకుండా పోయింది. ఎందుకంటే, ఆ కాలంలోనే వాస్తు దేవత స్థాపన కోసం పట్టణ నలుదిక్కులతోపాటు నాలుగు మూలల్లోనూ బోయలింగాలను ప్రతిష్ఠించారు పెద్దలు. పొలిమేరల్లో ఎనిమిది లింగాలతో అష్టదిగ్బంధనం చేసి పట్టణాన్ని నిర్మించినట్లు చరిత్రకారుల ద్వారా తెలుస్తున్నది. 

ప్రస్తుతం, ఇంటి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ వాస్తును పాటిస్తున్నారు. అయితే, ఏకంగా ఒక పట్టణాన్నే వాస్తు ప్రకారం నిర్మించడమంటే విశేషమే. గోదావరి తీరంలో అగ్రహారంగా విరాజిల్లిన మంత్రపురి పట్టణ ప్రత్యేకత అదే. అది కూడా వెయ్యేండ్ల క్రితమే ఎలాంటి వాస్తు దోషం లేకుండా ఈ పట్టణాన్ని శాస్ర్తోక్తంగా నిర్మించారు. మొత్తం పట్టణానికి వాస్తు వర్తించేలా సరిహద్దులను నిర్ణయించి, పొలిమేరల్లో నాలుగు దిక్కులను, నాలుగు దిశలను కట్టడి చేస్తూ బోయ లింగాలను ప్రతిష్ఠించారు. వాటి మధ్యలోని భూభాగంలో వేదోక్తంగా మంత్రపురి నిర్మాణానికి పునాది వేశారు. ఫలితంగా గ్రామంలో ఏ ఇంటికీ వాస్తుదోషం ఉండదని స్థానికులు చెబుతున్నారు. కాబట్టే, మంత్రపురిలో ఎలాంటి వాస్తు ప్రస్తావనా లేకుండానే నూతన నిర్మాణాలను చేపడుతూ వస్తున్నారు. ఎనిమిది బోయలింగాల మధ్య వెలసిన మంత్రపురి నాటినుంచి నేటి వరకూ అనేక రంగాల్లో ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. అనాదిగా వేద పండితులకు, వేద విద్యాలయాలకూ, ఆలయాలకూ, ఆధ్యాత్మిక సంపదలకూ నిలయంగా ఉంటున్నది.

 నిరాదరణ...

మంత్రపురి పట్టణ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించిన బోయ లింగాలు నిరాదరణకు గురవుతున్నాయి. మొత్తం ఎనిమిది బోయలింగాల్లో రెండు మాత్రమే ఎంతోకొంత సురక్షితంగా ఉన్నాయి. ప్రస్తుతం, స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎదుట తూర్పు దిశలో ఒకటి, పోచమ్మవాడకట్టులోని ఇండ్ల స్థలాల్లో పడమర దిక్కున మరొకటి మాత్రమే దర్శనమిస్తున్నాయి. ప్రకృతి విధ్వంసాల కారణంగా కొన్ని, పర్యవేక్షణ కరువై ఇంకొన్ని.. మొత్తం ఆరు లింగాలు కాలగర్భంలో కలిసిపోయాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి ఎదురుగా ఉన్న పొలాల్లో ఓ బోయలింగం మట్టిలో కూరుకుపోయి కనిపిస్తున్నది. అయితే పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న బోయ లింగానికి భక్తులు మరమ్మతులు చేయించారు. చుట్టూ కంచె ఏర్పాటు చేశారు.ఎంతో ప్రత్యేకం 

‘ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మంత్రపురిని  పూర్తిస్థాయి వాస్తుతో నిర్మించారు. వేల ఏండ్ల క్రితమే ఎనిమిది బోయలింగాల మధ్య భాగంలో పట్టణానికి పునాది వేశారు. బోయలింగాల విశిష్టత గురించి మా పెద్దలు కథలు కథలుగా చెబుతారు. వీటి కారణంగానే మంథని.. వాస్తు దోషం అనేదే లేకుండా, తన ప్రత్యేకతను చాటుకుంటున్నది’ అంటారు వేద పండితులు మారుపాక ప్రశాంత్‌శర్మ. 

-బాసాని సాగర్‌


logo