మంగళవారం 19 జనవరి 2021
Sunday - Oct 25, 2020 , 01:02:43

అబలా జీవితము

అబలా జీవితము

యమున తన అన్న స్నేహితురాళ్లతో బొమ్మలపెండ్లి ఆడుకుంటూ ఉండగా... నాన్నగారు ధుమధుమలాడుతూ వచ్చారు. పిల్లలిద్దరూ వణికిపోయారు. ఇంతలో అమ్మమ్మ ఊరికి వెళ్తున్నామని తెలిసింది. రైలు బండి ప్రయాణం హుషారుగా సాగింది. రైలు దిగాక అమ్మమ్మ వాళ్లింటికి బాడుగ బండీలో బయల్దేరారు. ఆ తరువాత కథ..(హరినారాయణ్‌ ఆప్టే రాసిన ‘పన్‌ లక్షత్‌ కోన్‌ ఘెతో’ మరాఠీ నవలకు తెలుగు అనువాదం)

స్టేషనులో కనపడ్డ వస్తువునల్లా కొనిపెట్టమని నేనూ, సుందరీ అమ్మనెంత వేధించామో ఈ సంఘటనలన్నీ పాఠకులు తమ బాల్య స్మృతుల నుంచో, లేక పిల్లలు కలవారు తమ ప్రస్తుతానుభవం నుంచో ఊహించుకోవాలని మనవి చేస్తున్నాను. నా మంకుతనం వల్ల అమ్మకెంత బాధ కలిగిందో ఆనాడు! అప్పుడే నాకది అర్థమైయుంటే ఎంత బాగుండేది! ఆమెనంత వేధించేవాణ్ని కాను. ఆనాటి ఆమె దుస్థితి నేడు కాని నాకర్థం కావడం లేదు. ఆమె ఖన్నవదనం, మా వేధింపుకు తాళలేక అప్పుడప్పుడు విసుగుతో అన్నమాటలు- ఇవన్నీ ఆమె మనఃక్లేశాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నప్పటికీ మా అజ్ఞాన నేత్రాల కవేవీ కానరాలేదు. అంతేగాక మా కోరికలన్నీ తీర్చలేదని అప్పుడప్పుడమ్మ మీద కోపం కూడా రాకపోలేదు మాకు... సరే, పోనివ్వండి. అదంతా నేడు స్మరించుకొని ప్రయోజనమేముంది? చిన్నతనంలో తల్లిదండ్రులను మనం పెట్టిన బాధలు తదుపరి జ్ఞాపకం వస్తే మనసెంతో పరితపించక మానదు. 

తాతగారిల్లంటే సరిగ్గా జ్ఞాపకం వచ్చింది. మొదటిసారి అమ్మ మాతో “తాతగారింటికి వెడదా”మన్న సంగతి చెప్పినప్పుడే ఈ మాట చెప్పవలసింది. మా గ్రామంలో మా తాత (నాన్ననాన్న) గారుండేవారు. తాతగారిల్లంటే వారిల్లనే మామూలుగా మేమనుకునేవాళ్లం. నాన్నగారి స్వభావంలోవలెనే తాతగారి స్వభావంలోనూ కొంత పరాయితనం మాకు గోచరిస్తూ వచ్చినందున తాతగారింటికి వెళ్లడమంటే మా కంత హుషారుగా లేదు. చాలామందికి తాతగారిల్లంటే మాతామహులిల్లని అర్థమౌతుంది. మా ఊహకు మాత్రం మరొక తాతగారిల్లనేది ఉంటుందనే తట్టలేదు.

తాతగారి ఊరు రైలుస్టేషనున్న ఊరికి చాలా సమీపం. అంటే సుమారేడెనిమిది కోసులు. రోడ్డుకూడా బాగుంది. అందుకని సుమారు నాలుగు నాలుగున్నర గంటలకు రైలు దిగామో లేదో బాడుగబండి మాట్లాడి తెమ్మని అమ్మ కృష్ణాజీపంత్‌కు చెప్పింది. స్టేషన్‌ తాలూకు గ్రామంలో రాత్రి గడపాలంటే మాకు స్థలాలు లేకపోలేదు. కాని ఒకరింటిలో మకాం వేయడం అమ్మకు సుతరాం ఇష్టంలేక ఆమె తొందర చేసి అప్పటికప్పుడు బండి తెప్పించింది. “పిల్లల్ని ఆకలితో ఎందుకుంచడం? ఈ ఊరి కేళ్‌కర్‌ గారింట్లో రాత్రి గడిపి ఉదయం బయల్దేరగూడదా?” అని కృష్ణాజీపంత్‌ సూచించి చూచాడు. అందుకు అమ్మ కచ్చితంగా సమాధానమిచ్చింది. “ఎవరింటికీ వెళ్లనక్కరలేదు. ఫలాహారం చేసి తెచ్చాను. ఆరున్నర గంటలకు దారిలో ఏదో బావి వద్ద పిల్లలకు పెట్టేస్తే సరి. సుందరికి కొంత క్షీరాన్నం మిగిలిఉండనే ఉంది.” ఈ మాటంటూనే ఆమె మూటలెత్తడం ప్రారంభించింది. మాకా, ప్రయాణపు సరదాతోనే సరిపోయింది. 

కృష్ణాజీపంత్‌ బండిలో సామానెక్కించాడు. తాను మాత్రం బండెక్కలేదు. “సాయంత్రం వేళ. కాలు సాగించడానికి నేను కొంత దూరం నడుస్తా” నన్నాడు. అది విని అన్నయ్యకు నడవాలనే బులుపు కలిగింది. అమ్మ అందుకు సమ్మతించింది. ఇంక నేను మాత్రమెలా ఊరుకుంటాను? నేనూ మారాం చేశాను నడుస్తానని. కాని అమ్మ నా మాట వినక సౌమ్యంగా “నీవు నడవలేవు, కొద్దిసేపటికి కన్నయ్యనూ బండెక్కమంటానులే” అని సముదాయించింది. నేను మరింత గట్టిపట్టుపట్టాను. ఆ క్షణంలో విసుగూ, కోపం ప్రతిబింబించిన అమ్మ ముఖం ఇప్పుడీ వాక్యం వ్రాస్తుంటే నా కండ్లకు కట్టినట్లున్నది. “పో! ఏమైనా చెయ్యి, మళ్లీ నన్నడిగావా జాగ్రత్త”అంటూ నన్ను తటాలున పక్కకు త్రోసివేసి సుందరిని చంకనేసుకుని బండెక్కింది. ఆ త్రోపుతో నేను కిందపడి రోదన ప్రారంభించాను. ఇంత గ్రంధం జరిగాక నేను నడిచివెళ్లడమెలా కుదురుతుంది? కృష్ణాజీపంత్‌ నన్ను బండ్లో కూర్చోబెట్టాడు. బండి కదిలింది. అన్నయ్య మాత్రం ఎప్పుడో రివ్వున ముందుకు పరుగు తీశాడు. వాడికి ఇటీవలి సంగతి తెలిసినట్టే లేదు. కొంతసేపటికి కృష్ణాజీపంత్‌ కూడా ముందుకు నడిచిపోయాడు. నేను వెక్కివెక్కి ఏడుస్తూ కూర్చున్నాను. అమ్మ మాత్రం నా ఏడ్పును లక్ష్యపెట్టక స్తబ్ధంగా కూర్చొని ఉంది. ఇంతలో సుందరికి కునికిపాట్లు రాసాగాయి. అమ్మ దాన్నొక పక్కన పరుండబెట్టి నిద్రపుచ్చింది. నారోదనం మాత్రం యథాతథంగా సాగిపోతున్నది. ఒక గంటసేపిలాగే గడచి ఉండవచ్చు. తదుపరి ఏమైందో ఏమో తటాలున అమ్మ నన్ను తన వద్దకు లాగి ఎదకు చేర్చుకొని యేడువసాగింది. నాకేదో ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది, నా ఏడ్పును వెంటనే ఆపి.. ఐతే అప్పటికి దానంతటదే ఆగిపోయే స్థితివచ్చిందనుకోండి. అమ్మ మెడను గట్టిగా కౌగిలించుకున్నాను. పదైదు నిమిషాలు పోయాక, “యమూ! నీకింక వేళాపాళా ఏమీ తెలియదు కదూ!” అని యెంత రుద్ధకంఠంతో అన్నదని చెప్పను! పాఠకులారా! ఆ మాటలు నా మనసులో నాటినట్టు మరెప్పుడూ, 

ఎవ్వరి మాటలూ నాటలేదు. ఆ మాటల్లో అమ్మ తన యావత్ప్రాణాన్ని ఒలకపోసిందా అనిపించింది. ఆమె అంతఃకరణ సర్వస్వం ఆ మాటల్లో ఊడిపడ్డట్లనిపించింది. అప్పుడామెకు సంభవించిన చిక్కు, ఆ చిక్కు వల్ల ఆమె మనసులో కలుగుతున్న కలవరం ఆమె మాటల్లో స్ఫుటంగా ధ్వనించింది... కాని నేడు కదా నాకిదంతా అర్థమౌతున్నది! నాడే అర్థమైతే ఎంత బాగుండేది! పదేపదే ఈ పశ్చాత్తాపంతో బాధపడుతున్నాను. ఇప్పుడర్థమౌతున్నదంతా నాడే అర్థమైయుంటే నేను పెట్టిన బాధ లెన్నెన్నో తప్పి ఉండేవి అమ్మకు, కనీసం తగ్గిఐనా ఉండేవి నిస్సందేహంగా... అమ్మ మాటవిని నేనామెతో మరింత హత్తుకు పోయాను. కొంతసే పిద్దరం కన్నీరు కార్చాము. బహుశా నాటి ఉదయం నుంచో లేక తత్పూర్వరాత్రి నుంచో అమ్మ మనసులో ప్రోగౌతు వచ్చిన దుఃఖమంతా ఏకాంతం దొరకడమే తడవుగా చెలియకట్టలు దాటి ఒక్కుమ్మడి ఉప్పెనయి పారిందనుకుంటాను. ఆమె మరేమేమో మాట్లాడదలచినట్లనిపించింది. కాని ఏమీ తెలియని ఈ కసిగందువుతో మాట్లాడటమేమిటని యోచించిందో లేక లోగుట్టు బయల్పరచడం మంచిది కాదని తర్కించిందో - మొత్తానికా తరువాత మాత్రం మూకీభావం వహించింది. ఎంతో సేపటికి “యమూ! నేనేడ్చానని నాయనమ్మకు చెప్పేవుసుమీ!” అని నన్ను హెచ్చరించి ఊరకుంది...

చాలాసేపైంది. మేమొకరి నొకరం చూస్తూ కూర్చున్నాము. నాకు కునికిపాటు ప్రారంభమైంది. కాని ఇంతలో కృష్ణాజీపంత్‌ బండి వద్దకు పరిగెత్తుతూ వచ్చి “ఏమండీ! గణపతి ఎక్కడా కనపడలేదండీ!” అని చెప్పాడు.“అంటే!” అని అమ్మ భయాశ్చర్యాలతో బిగ్గరగా అరిచింది.

అమ్మ అరుపులోని భయాందోళనల వల్ల పాపం కృష్ణాజీపంతెంత హడలిపోయాడో వర్ణింపశక్యం కాదు. ఆయన నోట మాటపెకల లేదు. ముందరివైపు బండివాడు తన్మయుడై బండి తోలుతున్నాడు. వాడికీ గొడవ అర్థమైనట్టే లేదు. అఱపుతోపాటు అమ్మ వెంటనే నడుస్తున్న బండి నుంచి దూకి “పదండి, పదండి, వాడిని వెదకుదాం!” అంటూ కృష్ణాజీ పంత్‌ కొరకైనా ఆగక పరుగుతీసింది. “యమూ! సుందరి నిద్రపోతున్నది, భద్రం!” అని మాత్రం నన్నుద్దేశించి చెప్పింది. కృష్ణాజీపంత్‌ కొన్ని క్షణాలు అక్కడే బొమ్మలాగ నిలిచిపోయాడు. తదుపరి అమ్మ వెనుక ఎప్పుడు పరుగెత్తాడో నాకు తెలియనే లేదు. నేనెంత బిగ్గరగా ఏడ్చానో దానికంతులేదు. ఇంతలో బండివాడు వెనక్కుచూచి, “ఏమమ్మాయ్‌! ఎందుకేడుత్తున్నవు?” అని అడిగాడు. వాడికి తిన్నగా జవాబివ్వడానికి బదులు, “ఒరేయ్‌!... ఏమిరా... అడుగుతావు! మా అన్నయ్య తప్పిపోయాడు రా....” అని ఏడ్పు వెక్కిళ్ళ మధ్య చెప్పగలిగాను. “ఆఁ? యాడపోయిండు మీ అన్న?  అమ్మగా రెటుపోయింది?” అని బండివాడు మళ్ళీ ప్రశ్నించాడు. 

-పి.వి. నరసింహారావు