కొవిడ్‌లో ఓ శుభవార్త

కొవిడ్ ముప్పు తప్పిపోలేదు. కాకపోతే, దాని ఉధృతి తగ్గుతున్నదనే సంకేతాలు మాత్రం కించిత్ ఆశను కలిగిస్తున్నాయి. ఈమధ్యే వచ్చిన మరో పరిశోధన ఇంకాస్త తీయగా వినిపిస్తున్నది. న్యూయార్క్‌లోని రోచెస్టర్ విశ్వవిద్యాలయ పరిశోధకుల ప్రకారం... ఇంతకుముందు తీవ్రంగా జలుబుబారిన పడ్డవారిలో కొవిడ్‌ను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ (యాంటీబాడీస్) బలంగా ఉండే అవకాశం ఉందట. కారణం! కరోనా వైరస్ అంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సూక్ష్మజీవి మాత్రమే కాదు. చాలా రకాల వైరస్ల గుంపు. అందులో కొవిడ్-19 ఒకటి మాత్రమే. కాబట్టి ఇంతకుముందు, వీటిలో కాస్త తక్కువ ప్రమాదం ఉన్న వైరస్ మన మీద దాడి చేసినప్పుడు... సహజంగానే దాన్ని ఎదుర్కొనేందుకు శరీరం యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేసుకుని ఉంటుంది. కరోనా వైరస్ మన శరీరంలోకి రాగానే ‘మెమరీ బీ సెల్స్' (కణాలు) దాన్ని గుర్తించి దాడి చేసేస్తాయి. అదృష్టవశాత్తూ ఈ ‘బీ సెల్స్'కి కరోనాలోని విభిన్న రకాలను గుర్తించే సామర్థ్యం లేదు. దాంతో అవి ఏ వైరస్ మీదైనా గుడ్డిగా దాడిచేస్తాయి. మరో విషయం ఏమిటంటే... ఈ బీ సెల్స్ కొన్ని దశాబ్దాల పాటు మన శరీరంలో ఉంటాయి. ఒకసారి కరోనా రక్షణ వ్యవస్థ ఏర్పడితే... అది దీర్ఘకాలం మనల్ని కాపాడే అవకాశం ఉంది.
చట్టబద్ధమైన హెచ్చరిక
‘ధూమపానం, మద్యపానం క్యాన్సర్‌కు దారితీయవచ్చు’ అనే ప్రకటన మనకు కొత్తేమీ కాదు. కానీ, ఆ రెండింటితోపాటు.. ఇప్పుడు మరో కారణాన్ని జోడించాలని అంటున్నారు శాస్త్రవేత్తలు. అదే అపరిశుభ్రత. మన దంతాలు చాలా బలమైనవి, కానీ సూక్ష్మక్రిములు చేరితే అంతటి బలమైన దంతాలు కూడా పుచ్చిపోతాయి. అలాంటిది, వాటితో క్యాన్సర్ వస్తుందంటే నమ్మకుండా ఎలా ఉండగలం! ఇటీవలి పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే... ‘ఓరల్ స్వామస్ సెల్ కార్సినోమా’ అనే క్యాన్సరుకు, నోటి అపరిశుభ్రతే ముఖ్య కారణమట. సుదీర్ఘకాలం అశ్రద్ధ చేస్తే... నోటి క్యాన్సర్ బాధపెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక నుంచీ పాన్, సిగరెట్, మద్యం లాంటి దురలవాట్లకు దూరంగా ఉన్నంత మాత్రాన సరిపోదన్నమాట. నోటి సంరక్షణ కూడా ముఖ్యమే!
లెక్క తేలలేదు!
‘రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగి తీరాలి’- తరచూ వినిపించే సలహా ఇది. ఇప్పుడిప్పుడే దీనిమీద చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ‘అసలు ఈ ఎనిమిది గ్లాసులు లెక్క ఎక్కడి నుంచి వచ్చింది?’ అనే శోధన మొదలైంది. అందులో తేలిన విషయం ఏమిటంటే... 1945 ప్రాంతంలో ఈ తరహా నమ్మకం బలపడిందట. మనిషి తినే ప్రతి కెలోరీ ఆహారానికీ ఒక మిల్లీలీటరు చొప్పున నీళ్లు తాగడం మంచిదని అప్పట్లో కొందరు వైద్యులు తేల్చారు. అలా సరాసరి రెండున్నర లీటర్ల నీరు శరీరానికి కావాల్సి ఉంటుందని అంచనా వేశారు. అంతేకానీ, ఇదేమీ ప్రామాణికమైన నివేదిక కాదు! రోజూ తప్పనిసరిగా ఇన్ని నీళ్లు తాగాల్సిందే అంటూ లెక్కలేసుకుని మరీ చేసే బలవంతపు ప్రయత్నం వల్ల దుష్ఫలితాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. చుట్టూ ఉండే ఉష్ణోగ్రతలు, తినే ఆహారం, చేసే పని, వయసు.. లాంటి అనేక అంశాల మీద, మనం తాగాల్సిన నీటి పరిమాణం ఆధారపడి ఉంటుందని గుర్తుచేస్తున్నారు. ఆ విషయంలో అనుమానం ఉంటే, ఈసారి డాక్టర్‌ను కలిసినప్పుడు తీర్చేసుకుంటే మంచిది.
తాజావార్తలు
- 4,54,049 మందికి కోవిడ్ టీకా ఇచ్చేశాం..
- 10 కోట్ల డౌన్లోడ్లు సాధించిన మోజ్
- ఆటా ప్రెసిడెంట్‌గా భువనేశ్ బుజాల బాధ్యతల స్వీకరణ
- ‘రెడ్’ కలెక్షన్స్..రామ్ టార్గెట్ రీచ్ అయ్యాడా..?
- ప్రియుడు చేతిలో యువతి దారుణ హత్య
- ఉపయోగించని బ్యాంకు అకౌంట్లు మూసేయండిలా!
- తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం : సీఎం కేసీఆర్
- ఆస్ట్రేలియా మాజీలకు అదిరిపోయే పంచ్ ఇచ్చిన అశ్విన్
- మరో క్రేజీ ప్రాజెక్టులో పూజాహెగ్డే..?
- ట్రాక్టర్ల ర్యాలీపై వెనక్కి తగ్గం..