శనివారం 28 నవంబర్ 2020
Sunday - Oct 25, 2020 , 00:36:45

.. అంటేనే భయం!

.. అంటేనే భయం!

నాకు 23 ఏండ్లు. పెండ్లయి ఏడాది అవుతున్నది. నా భర్తతో సెక్స్‌ అంటేనే భయంగా ఉంటున్నది. ఆయన ముట్టుకుంటేనే చెమటలు పట్టి స్పృహ తప్పినంత పని అవుతున్నది. దాంతో ఆయన నన్ను తాకడానికి కూడా  అయిష్టపడుతున్నాడు. అసంతృప్తి, కోపం ప్రదర్శిస్తున్నాడు. ఈ సంగతి మా పెద్దలెవరికీ తెలియదు. మా సమస్యకు పరిష్కారం తెలపండి?  - ఓ సోదరి

అమ్మా! నీ సమస్యను ‘సెక్స్‌ ఫోబియా’ అంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. బాల్య, కౌమార, యవ్వన దశల్లో నువ్వు గడిపిన వాతావరణం, ఎలాంటి సెక్స్‌ ఎడ్యుకేషన్‌ దొరికింది అనేది నీ  ఆలోచనలను ప్రభావితం చేస్తుంది.  అశాస్త్రీయమైన, అపోహలతో కూడిన లైంగిక పరిజ్ఞానం వల్ల  ఇలాంటి ఆలోచనలు రావొచ్చు. సినిమాల్లో అత్యాచారాలు, ప్రసవ దృశ్యాలు, హింసాత్మక పోర్న్‌ సైట్స్‌ .. ఇవన్నీ పెండ్లిపై,  సెక్స్‌పై ఒక రకమైన భయాన్ని కలుగజేస్తాయి. శారీరకంగా మార్పులు మొదలైన రోజుల్లో పిల్లల ముందు పెద్దలు నెగెటివ్‌ అభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్ల కూడా సెక్స్‌ అంటేనే నీచమైన పనిగా  సబ్‌కాన్షియస్‌లో రిజిస్టర్‌ అవుతుంది. పెద్దయ్యాక కూడా అదే అభిప్రాయంతో ఉంటారు. తాము అందంగా లేమనీ, భర్తను ఆకర్షించలేమనే ఆత్మన్యూనతా భావన వల్ల కూడా ఇలాంటి ఆలోచనలు కలుగుతాయి. బాల్యంలో లైంగిక దాడులకు గురైన వారికి కూడా సెక్స్‌ అంటే భయం ఏర్పడుతుంది. గర్భం వస్తుందనో, కెరీర్‌ పాడవుతుందనో, సెక్స్‌ సమయంలో విపరీతమైన నొప్పి, రక్తస్రావం అవుతుందేమోననో.. కొందరు సెక్స్‌ ఫోబియాకు లోనవుతారు.

లక్షణాలు: సెక్స్‌లో తక్కువగా పాల్గొనడం, పూర్తిగా బహిష్కరించడం, చిన్నచిన్న స్పర్శలకు, ముద్దులకు కూడా చెమటలు పట్టి గుండె దడ పెరగడం. వాంతులు, విరోచనాలు కావడం, స్పృహతప్పి పడిపోవడం.

చికిత్స : సెక్స్‌పై సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి.  భర్తతో కలిసి సెక్సాలజిస్ట్‌ లేదా మారిటల్‌ థెరపిస్ట్‌-సైకోథెరపిస్ట్‌ను కలవండి. వాళ్లు సెక్స్‌పై నీకున్న భయానికి మూల కారణాన్ని విశ్లేషిస్తారు. సెక్స్‌ పట్ల, లైంగిక అవయవాల పట్ల శాస్త్రీయమైన అవగాహన కల్పించి భయాన్ని పోగొట్టే విధంగా సైకోథెరపీ, కౌన్సెలింగ్‌ ఇస్తారు. మీ పట్ల మీ ఆయన హింసాత్మకంగా ప్రవర్తిస్తుంటే.. అతడికి  అవసరమైన కౌన్సెలింగ్‌ ఇస్తారు. మీ ఇద్దరికీ మారిటల్‌ అండ్‌ రిలేషన్‌షిప్‌ థెరపీ చాలా అవసరం.

డాక్టర్‌ భారతి

సెక్సాలజిస్ట్‌, సైకోథెరపిస్ట్‌

మెడిసిస్‌ హాస్పిటల్‌, ఎల్బీనగర్‌, 

హైదరాబాద్‌. ఫోన్‌: 9849770409

ఈ మెయిల్‌: [email protected]