గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Oct 18, 2020 , 02:25:34

పూల పండుగొచ్చె ఉయ్యాలో..

 పూల పండుగొచ్చె ఉయ్యాలో..

చిత్తు చిత్తుల బొమ్మ.. 

శివుడి ముద్దుల గుమ్మ..

ఇప్పుడు ఏ వాడలో 

చూసినా ఈ బంగారు 

బొమ్మ గురించే ఆటలూ, 

పాటలూ..

గుమ్మడి ఆకుల అరుగుపై.. 

తంగెడు పూల పీఠమెక్కి.. 

గునుగు పూల వెలుగుల మధ్య.. 

బతుకమ్మ కొలువుదీరింది.

పూల పథాల్లో పల్లె పదాలు 

లయబద్ధంగా సాగుతున్నాయి.

పట్నవాసులు తీరొక్క పూలకు 

వేర్వేరు రకాల పుష్పాలు 

జతచేర్చి బతుకమ్మను 

ముస్తాబు చేస్తున్నారు.

విరుల నివేదనతో 

అమ్మ ఆరాధనను ఘనంగా 

నిర్వహిస్తున్నారు. 

బతుకమ్మ వైభవాన్ని 

హరిత భరితం చేస్తున్నారు.

పూల పండుగొచ్చె ఉయ్యాలో.. 

ఆ పూల ముచ్చట్లివిగో ఉయ్యాలో..

ప్రకృతితో మమేకమయ్యే మనిషి జీవితం మొదటగా ముడిపడేది పూలతోనే. వాకిట్లో పలకరించే మల్లెలు, పెరట్లో వికసించే మందారాలు, రహదారి వెంట కాగితం పూలు, పొలం గట్ల వెంబడి సీతజడ పుష్పాలు, గుడికెళ్తే నందివర్ధనాలు, బడికెళ్తే చక్రం పూలు.. ఏ దోవలో వెళ్లినా విరుల తావి మరులు గొల్పుతూనే ఉంటుంది. అందుకే అర్చన, అర్పణ, ఆనందోత్సాహాలు, సరసాలు, సంతాపాలు.. ఇలా పూలు లేని కార్యక్రమం లేదు. తరువును పెనవేసుకున్న తీగలా, మనిషి జీవితాలు పూలను అల్లుకున్నాయి. ఈ పుష్ప విలాసానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేదిక బతుకమ్మ పండుగ. ఇష్టదైవాన్ని పూలతో అర్చించడం కాదిక్కడ.. రంగురంగుల పూలనే అమ్మవారిలా ప్రతిష్ఠించి పూజించడం బతుకమ్మ ప్రత్యేకత. అడవితల్లి ఒడిలో అందంగా పెరిగిన పూలను సేకరించి, అమ్మోరు తల్లిగా అలంకరించి తెలంగాణ పల్లెపల్లెలూ మురిసిపోతాయి. బతుకునిచ్చిన తల్లివి నువ్వేనంటూ పాటలతో, ఆటలతో కొలిచి నీటిలో విడిచి ఆనందాన్ని పంచుకుంటారు.

కావ్య కుసుమాలు

చెట్టు ముందా? విత్తు ముందా? ఈ మీమాంస మధ్యలో ఓ నిగూఢ సత్యం దాగున్నది. విత్తు రావాలంటే కొమ్మ మొగ్గ తొడగాలి, మొగ్గ విరిబాల కావాలి, భ్రమరం రావాలి, మకరందం గ్రోలాలి, మరో పువ్వుపై వాలాలి, తేనెముల్లు గుచ్చుకుని పువ్వు పులకించాలి, తనలోతాను ముడుచుకుపోవాలి, పిందెగా మారాలి, కాయగా ఎదగాలి, పండుగా రాలాలి. అప్పుడు కదా విత్తు వచ్చేది. ఆ తర్వాతే కదా నేల ఈని మొక్క పుట్టుకొచ్చేది. అంటే సృష్టి కార్యమంతా పువ్వులోనే ఉంది. అందుకే పూల ప్రస్తావన లేని కావ్యం లేదు. విరుల ఊసు లేని కవిత్వం ఉండదు. ఆదిశంకరుల స్తోత్రమైనా, కాళిదాసు కావ్యమైనా, శ్రీనాథుడి పద్యమైనా, కృష్ణశాస్త్రి గేయమైనా పూలతలను అల్లుకొనే వర్ధిల్లాయి. ఆధునిక సినీకవులూ పూలను పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. అంతెందుకు నచ్చిన చిన్నదాన్ని మచ్చిక చేసుకునేందుకూ విరులను ఆశ్రయించాల్సిందే! కన్నులను కలువలతో, ముక్కును సంపెంగతో, అధరాలను గులాబీ రెక్కలతో, పైఎదలను పద్మాలతో... నానావిధ పరిమళ పుష్పార్చన చేస్తేనే గానీ, అమ్మాయిగారి అనుగ్రహం లభించదు మరి. ఆ దేవిగారు కోరిందనే కదా ఓ పువ్వు కోసం ఇంద్రలోకంపై దండెత్తి శ్రీకృష్ణుడు పారిజాతాపహరణం చేసింది. సన్యాసిగా ఉన్న సదాశివుడు పార్వతీ వల్లభుడైంది కూడా మన్మథుడి సుమశరం ప్రభావంతోనే కదా!! పురాణాల కాలం నుంచి నవీన యుగం వరకు ఇలాంటి పూల కథలు ‘విరి’విగా ఉన్నవే!

విరులు చెప్పే మాట

కొమ్మకు పూసిన పూలన్నీ పూజకు అంకితం కాలేవు. అలాగని కుసుమం చిన్నబోదు. హరిపూజకు కోసుకుపోయినా, గజమాలలో చోటివ్వడానికి తుంచినా, ఫ్లవర్‌ బొకేలో దూర్చడానికి దూసినా, కురుల్లో చోటుదక్కినా, ఊలు దారాలతో గొంతుకు ఉరిబిగించినా, కనిపెంచిన తీగ తల్లి పాదాలపై కడతేరిపోయినా, పచ్చికపై పడినా, బండరాయిపై రాలినా ఒకే రీతిన స్వాగతిస్తాయి పువ్వులు. ఆయువు తీరేంత వరకు పరిమళిస్తూనే ఉంటాయి. ఉన్న నాలుగు ఘడియలు మనోహరంగా శోభిస్తాయి. ఆ ముగ్ధ సౌందర్యాన్ని చూస్తే మనసులోని దుగ్ధంతా దగ్ధం అయిపోతుంది. తన చెంతకు వచ్చి చక్కిలిగింతలు పెట్టిన గాలికి పరిమళం అద్ది రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాయి పూలు. ఇచ్చింది తీసుకోవడం కాదు.. తిరిగి ఇచ్చే లక్షణమూ అలవర్చుకోవాలనే సత్యముంది ఇందులో. 

రుతురాగాల్లో..

భూమిమీద ఎవరూ శాశ్వతం కాదు. అందరూ వచ్చిపోయే అతిథులే! కుసుమాలూ అంతే. ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. వస్తూ వస్తూ వాతావరణంలో మార్పులను చెప్పకనే చెబుతాయి. మల్లెల రాకతో వసంతగాలి వలపులు రేపుతుంది. గ్రీష్మతాపానికి బొండుమల్లెలు విరుగుడు మంత్రం వేస్తాయి. వర్షరుతువు హర్షాతిరేకాలకు బంతులు, తామరలు వంతపాడుతాయి. శరదృతువును మన బతుకమ్మ పూలు ఆటపాటలతో స్వాగతిస్తాయి. మంచుకురిసే హేమంతం వచ్చిందని చేమంతులు చెబుతాయి. ఆకురాలే శిశిరాన్ని లిల్లిపూలు అల్లిబిల్లి కలగా మార్చేస్తాయి. ఇలా కాలానుగుణంగా పలకరిస్తూ పులకరింపజేస్తాయి. జీవకోటిని మించి ఉన్నాయి పూలజాతులు. గడ్డి పూలు మొదలు కశ్మీరాన విరిసే తులిప్‌ పుష్పాల వరకు దేని ప్రత్యేకత దానిదే! దేని సౌందర్యం దానిదే!! అత్తరు గుబాళింపును దాచుకున్న పూలు కొన్ని, ఔషధాల నిధులు ఇంకొన్ని, అలంకరణ కోసమే పుట్టినవి మరికొన్ని.. ప్రకృతి నిర్దేశించిన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే, మానవ మేధకు తగిన విధంగా రూపుదాల్చుతూ ఎన్నెన్నో అవసరాలు తీరుస్తున్నాయి.

బతుకమ్మగా వెలిసి..

పూలతో ఆర్చించడం నిత్యవిధిలో అందరూ చేసేదే! పూలనే పూజించే సదాచారం మన బతుకమ్మ పండుగ విశిష్టత. శరన్నవరాత్రులు అత్యంత పవిత్రమైనవి. ఈ సమయంలో శాక్తేయులు, అమ్మవారి ఉపాసకులు వివిధ రకాలుగా శక్తిని కొలుస్తారు. ముగ్గురమ్మల మూలపుటమ్మను శ్రీచక్ర రూపంలో అర్చిస్తారు. మంత్రాలతో, స్తోత్రాలతో తల్లిని పూజిస్తారు. నిర్మలమైన భక్తి తప్ప, వేదమంత్రాలు తెలియని జానపదులు అమ్మను అపురూపంగా కొలిచే అద్భుత ఘట్టం బతుకమ్మ ఉత్సవాల్లో కనిపిస్తుంది. ఆమె సంకల్పంతో పుట్టిన ప్రతి పుట్టా, చెట్టూ, కొమ్మా, పువ్వునూ అమ్మగానే భావిస్తారు. తల్లి ప్రసాదించిన పూలనే శ్రీచక్రాకృతిలో పేర్చి బతుకును అందించిన బతుకమ్మగా భావిస్తారు. జీవంతికా దేవిగా కొలుస్తారు. ఊరంతా ఒక్కచోట చేరి బతుకమ్మకు ఆటపాటలతో అర్చనలు చేస్తారు. గునుగు, తంగెడు, కట్లపూలు, సీతమ్మజడ, బంతి, చల్లగుత్తి, బీరపూలు, గుమ్మిడిపూలు ఎవరికి నచ్చినవి వారు ఏరికోరి తెచ్చుకుంటారు. పొరలు పొరలుగా పూలు పరిచి, తెరలు తెరలుగా రంగులు అద్ది, తరతరాలుగా బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తూ ఉన్నారు. కాకతీయుల కాలంలోనూ పుష్పాలతో బతుకమ్మను ఆరాధించినట్టు ఆధారాలు ఉన్నాయి. 

తీరొక్క పూలతో..

బతుకమ్మ అంటేనే తీరొక్క పూల పండుగ. బతుకమ్మను తీర్చిదిద్దే క్రమంలో ఇల్లంతా సందడి వాతావరణం నెలకొంటుంది. మొదటగా తాంబాళంలో గుమ్మడి ఆకులు ఉంచుతారు. తంగెడు పూలు అందంగా పేర్చి అమ్మపాదాలు బంగారు రంగులో మెరిసిపోతున్నాయని భావిస్తారు. ఆ పాదాలకు వెండి పట్టీలు పెట్టినట్టు గునుగుపూలు తీర్చిదిద్దుతారు. గునుగుపూలకు రకరకాల రంగులద్ది అమ్మకు సప్తవర్ణాల చీర చుడతారు. నడుముకు పోకబంతి పూలతో వడ్డాణం పెడతారు. సీతజడ పూలతో అలంకరించి దేవి మెడలో ఇంపుసొంపుల కెంపులపేరు వేసినట్టుగా భావిస్తారు. కట్లపూలు, రుద్రాక్ష పూలతో ముక్కెర, చెవిదుద్దులను అలంకరిస్తారు. చివరగా బతుకమ్మ కొప్పులో గుమ్మడి పువ్వుంచి అందులో ఆమెకు ప్రతిరూపంగా గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు. కాలానుగుణంగా పూల అమరికలో కొత్తకొత్త విధానాలు చోటు చేసుకుంటున్నాయి. అందుబాటులో ఉన్న పూలన్నీ తెచ్చి ఒద్దికగా అలంకరించి అందరిలోనూ తమ బతుకమ్మే ఘనంగా ఉండేలా పోటాపోటీగా పేరుస్తుంటారు. అమ్మ గొప్పదనాన్ని వేనోళ్లా పొగుడుతూనే కుసుమాల సౌందర్యాన్ని జగతికి చాటుతారు.పూల తెలంగాణం

తెలంగాణ మాగాణం సాగుబడిలో తిరుగులేనిది. అడ్డెడు విత్తులు చల్లితే పుట్టెడు సిరులిచ్చే నేలతల్లి ఇది. పూలసాగుకూ తెలంగాణ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, ఉద్యానశాఖ ప్రోత్సాహంతో పూలసాగు మూడు పూవులు ఆరు కాయలుగా విస్తరిస్తున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పూదోటల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోనూ పూలసాగు ఆశించిన స్థాయిలోనే ఉంటున్నది. బంతి, చేమంతి, గులాబీలు, మల్లెలు, సన్నజాజుల సాగుతో పాటు విదేశీ రకాలను కూడా జోరుగా సాగు చేస్తున్నారు. ఆర్చిడ్‌, ట్రాన్స్‌వాల్‌ రకాలు, కార్నేషన్‌ పూలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రభుత్వం  సబ్సిడీ ఇస్తుండటంతో భాగ్యనగర శివారులోని గ్రామాల్లో  పాలీహౌజ్‌ వ్యవసాయం ఊపందుకుంటున్నది. ఈ ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే పూల దిగుమతి నుంచి ఎగుమతి స్థాయికి రాష్ట్రం చేరుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.దేశదేశాల్లో పూలసందడి

పూలంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. మనసుకు ప్రశాంతతనిచ్చే విరులను గౌరవించే సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. దేశదేశాల్లో పూల పండుగలు నిర్వహిస్తూ ఉంటారు. కేరళలో ఓనమ్‌ సందర్భంగా పుష్పాలంకరణ గొప్పగా నిర్వహిస్తారు. ఒడిశాలో బతుకమ్మను పోలిన పండుగ ‘జొహ్ని ఉసా’ వేడుకలు శోభాయానంగా చేస్తారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యే ఈ ఉత్సవాలు కుమార పౌర్ణమి (దసరా తర్వాత వచ్చే పౌర్ణమి)తో ముగుస్తాయి. ‘జొహ్ని’ అంటే బీర. మనం రకరకాల పూలతో బతుకమ్మను పేర్చినట్టే అక్కడా బీరపూలను పేర్చి మధ్యలో గౌరమ్మను ఉంచుతారు. కన్నెపిల్లలు దీని చుట్టూ పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటారు. ఆట పూర్తయ్యాక బీరపూల గౌరమ్మను చెరువులో విడుస్తారు. కొలంబియా, ఇటలీ, బెల్జియం తదితర దేశాల్లోనూ పూల ఉత్సవాలు జరుగుతుంటాయి. బానిస విముక్తికి సంకేతంగా కొలంబియాలో ఏటా మే నెలలో పూల పండుగ చేస్తారు. వివిధ ఆదివాసీ ప్రాంతాల్లోనూ ఇలాంటి సంప్రదాయం కనిపిస్తుంది.
కోరికను బట్టి రంగు

ఆధ్యాత్మిక ప్రపంచంలో పూలకు ప్రత్యేక స్థానం ఉంది. దైవాన్నిబట్టి, కామ్యాన్నిబట్టి పూలను ఎంచుకునే సంప్రదాయమూ ఉంది. అమ్మవారికి ఎరుపు రంగుపూలు, పరమశివుడికి తెల్లని మల్లెలు, శ్రీకృష్ణుడికి పారిజాతాలు, మహాలక్ష్మికి కలువలు ఇలా ఆయా దైవాలకు ఇష్టమైన పూలతో అర్చిస్తే శీఘ్ర అనుగ్రహం లభిస్తుందని పెద్దల మాట. కోరిక అనుసారంగా శివారాధనలో వివిధ రకాలైన పుష్పాలు వాడాలని శైవాగమంలో ఉన్నది. చైత్రంలో దర్భపూలు, వైశాఖంలో మందారాలు, జ్యేష్ట మాసంలో తామరపూలు ఇలా మాసానికో రకం పూలతో శివుడిని అర్చించే విధానాన్ని లింగపురాణం, కార్తీక మహాత్మ్యం పురాణంలో వివరించారు. ధనసిద్ధికి గన్నేరు పూలు, మోక్షప్రాప్తికి ఉమ్మెత్త పూలు ఇలా రకరకాల కోరికలకు వేర్వేరు పుష్పాలతో అర్చించాలని పేర్కొన్నాయి. అయితే, కొన్ని పూలపై నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయి. మొగలిపూలు శివపూజకు పనికిరావని చెబుతారు. వినాయకుడికి తులసిదళాలు అర్పించకూడదన్నారు.      నిదానంగా సాగాలంటారు. నామం పూర్తి అయిన తర్వాత ‘నమః’ అనే సమయంలో పుష్పం అర్పించడం సరైన విధానం. అంతేగానీ, ఉన్నాయి కదా అని పూలను గుమ్మరించడం, రెక్కలు తుంచి వేయడం సరికాదు. ఇలపై ఇంద్ర ధనుస్సులు

ఇంటి వాకిట్లో, పెరట్లో పట్టుమని పది కుండీల్లో పూలను చూసి మురిసిపోతే అందులో ఏముంది? దారులన్నీ పూలబారులతో స్వాగతిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. రంగురంగుల పుష్పాలు ఇంద్ర ధనుస్సును ఇలపై చూపే ప్రదేశాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లోని వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ పేరుకు తగ్గట్టే పూల లోయ. బదరీనాథ్‌ క్షేత్రానికి 25 కిలోమీటర్ల దూరంలోని ఈ విరిలోయలో జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు పూలసందడి కొనసాగుతుంది. దాదాపు 520 రకాల పూలజాతులు కిలోమీటర్ల మేర విస్తరించి విరివనాన్ని చూసేందుకు దేశదేశాల నుంచి పర్యాటకులు తరలి వస్తారు. నాగాలాండ్‌ రాజధాని కోహిమాకు సమీపంలోని జుకోవు పూలలోయ వివిధ వన్నెల కార్పెట్లు పరిచినట్టు కనువిందు చేస్తుంది. మహారాష్ట్రలోని కాస్‌ పీఠభూమిలో 600 రకాల మొక్కలు పుష్పించి ఆహ్లాదాన్ని పంచుతాయి. నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని అరకులోయ అవిసె పూలతో అలరిస్తుంది. కేరళలో మున్నార్‌ సమీపంలోని కొండల్లో 12 ఏండ్లకు ఒకసారి విరబూసే నీలకురింజీ పూలు నీలాల నింగిని భువికి దించుతాయి. 2018లో అలరించిన నీలకురింజీ పూబాలలను మళ్లీ దర్శించాలంటే 2030 వరకు వేచి ఉండాల్సిందే!

పూల చుట్టూ పాటలు

పూలతో కొలువుదీరిన బతుకమ్మను అర్చించే పూలపాటలూ ఉన్నాయి. బతుకమ్మను పూలతో పేర్చేపాట, కొలువుదీర్చే పాట, సాగనంపే పాట ఇలా సందర్భానుసారంగా పూలదేవతకు పూల పాటలు అల్లి ముచ్చటగా పాడుకుంటారు.బతుకమ్మ పేర్చడం ఒక కళ. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇంటిల్లిపాదీ సహకరిస్తుంటే ఆ ఇంటి పెద్ద ముత్తయిదువ పాట పాడుతూ బతుకమ్మను పేర్చుతుంది.తొమ్మిది రోజులు ఉయ్యాలో.. నమ్మికా తోడుత ఉయ్యాలో..

అలరి గుమ్మాడి పూలు ఉయ్యాలో.. అరుగులు వేయించి ఉయ్యాలో..

గోరంట పూలతో ఉయ్యాలో.. గోడలు కట్టించి ఉయ్యాలో..

తామర పూలతో ఉయ్యాలో.. ద్వారాలు వేయించి ఉయ్యాలో..

మొగలి పూలతో ఉయ్యాలో.. మొగరాలు వేయించి ఉయ్యాలో.. 

ఇలా బతుకమ్మను పూలతో పేర్చే విధానాన్ని పాడుకుంటారు.ఈ పూల పండుగకు ఆడబిడ్డల సందడి అంతా ఇంతా ఉండదు. పండుగకు పుట్టింటికి చేరిన ఆడపడుచులను బతుకమ్మగా భావించే సంప్రదాయం మనది. అన్నింటా ఆమెకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ సందర్భాన్ని ఈ పాటలో ఎంత అందంగా చెప్పారో చదవండి..

అప్పుడే వచ్చెను ఉయ్యాలో.. బతుకమ్మ పండగ ఉయ్యాలో

బంగారు నగలు ఉయ్యాలో.. బంగారు గాజులు ఉయ్యాలో..

గుమ్మాడి పూలు ఉయ్యాలో.. గునుగు పూలు ఉయ్యాలో.. 

ఇలా పాటంతా పూలసందడిని వివరిస్తూ సాగిపోతుంది. 

బతుకమ్మను సాగనంపే సందర్భంలోనూ ఆ తల్లిని కొలువు దీర్చిన పూల సంగతులన్నీ ఒక్కొక్కటిగా చెబుతూ పాడుకుంటారు.

తంగెడు పూవుల్ల చందమామ.. బతుకమ్మ పోతుంది చందమామ..

పోతె పోతివిగాని చందమామ.. మల్లెప్పుడొస్తావు చందమామ

యాడాదికోసారి చందమామ.. నువ్వొచ్చి పోవమ్మ చందమామ

బీరాయి పూవుల్ల చందమామ.. బతుకమ్మ పోతుంది చందమామ

కాకర పూవుల్ల చందమామ.. బతుకమ్మ పోతుంది చందమామ.. 

ఈ విధంగా పండుగలో ప్రతి సన్నివేశంలోనూ పూలను తలుచుకుంటూ ఉంటారు మగువలు. నవీన పోకడలు ఎన్ని వస్తున్నా, ఇంటింటా ఆధునికత తొంగిచూస్తున్నా.. బతుకమ్మ సంబురాల విషయంలో సంప్రదాయాలకే పెద్దపీట వేస్తున్నాయి తెలంగాణ పల్లెలు. బతుకమ్మ పాటలు ఆలపిస్తూ అప్రయత్నంగానే భక్తిపారవశ్యంలో లీనమవ్వడం ఇందులోని గొప్పదనం. ఏ అడవిలోనో ఒంటరిగా తపస్సుకు ఉపక్రమించినా కలుగని ఏకాగ్రతను శ్రుతి శుభగమైన పాటలు, లయ బద్ధమైన ఆటలు, వర్ణరంజితమైన పూలు కలిగిస్తాయి. ప్రకృతిలో దైవాన్ని చూడమని చెబుతుంది బతుకమ్మ. అందుకే ఏ ప్రయత్నం లేకుండా పొలాల వెంబడి, చెరువు గట్ల వెంబడి పెరిగిన అడవి పూలే ఏటా బతుకమ్మగా కొలువుదీరుతున్నాయి. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని, పూల గొప్పదనాన్ని చాటి చెబుతున్నాయి.

సుతారంగా కోయాలి

ఎవరు నేర్పారో గానీ, రాత్రి వరకు మొగ్గలతో సిగ్గులొలికే మొక్క తెల్లారేసరికి రెమ్మరెమ్మకూ పూలతో దర్శనమిస్తుంది. అలా విరగబూసిందని చెట్టుకు ఉన్న పూలన్నీ కోయకూదని శాస్త్రం చెబుతున్నది. గుత్తులు గుత్తులుగా పూలు కోయకూడదు. ఒక్కొక్కటిగా తుంచాలి. పూల పక్కనున్న మొగ్గలకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. చేయి తాకగానే కందిపోయే కుసుమాలను అమాంతం రెక్కలను పట్టుకు లాగేయ్యకూడదు. తొడిమె సహా నిదానంగా తుంచాలి. అందంగా పూసిందని చిటారు కొమ్మను నిట్టనిలువునా వంచేసి ఏదో ఘనకార్యం సాధించినట్టు భావించొద్దు. చేతికి అందిన వాటినే నెమ్మదిగా కోయాలి. చెట్టుకు కొన్ని పూలు వదిలేయాలి. దేవతా వృక్షాలు ఉంటాయిని శాస్త్రం చెబుతున్నది. చెట్టుమీద ఒక్కటీ ఉంచకుండా పూలన్నీ కోసేస్తే వాటి ఆగ్రహానికి గురికాక తప్పదని శాస్ర్తాలు హెచ్చరిస్తున్నాయి. అదలా ఉంచితే, అవసరం మేరకే పూలను కోయాలి. చెట్టు తల్లి ఒడిలో పూబాలలు మరింత మనోహరంగా కనిపిస్తాయి కదా! వాటిని చూస్తే కలిగే ఆనందం తుంచి జడలో తురుముకుంటే వస్తుందా?