మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Oct 18, 2020 , 02:07:23

ఒక పాట..వంద సంభాషణల సారం!

ఒక పాట..వంద సంభాషణల సారం!

మాట ఆగిపోయిన చోట పాట గొంతు విచ్చుకుంటుంది. అక్షరాలు లక్షణంగా అలంకరించుకుంటే అందమైన పాట రూపు కడుతుంది. మనలోని అనేకానేక అవ్యక్తభావాలకు అక్షరాల ప్రతినిధి పాట. జీవితాన్ని, పాటను వేరుచేసి చూడలేం. అందుకే పాటంటే ఓ భావం మాత్రమే కాదు, మనందరి జీవితాల్లో ఓ భాగమని  అంటున్నారు ప్రముఖ గీత రచయిత కృష్ణకాంత్‌. తెలుగు పాటల సుక్షేత్రంలో నిత్యనూతన భావాల్ని పండిస్తున్న కలం ఆయనది. వెన్నంటే ఉంటున్నా (అందాల రాక్షసి), నువ్వంటే నా నవ్వు..నేనంటేనే నువ్వు (కృష్ణగాడి వీరప్రేమగాథ), మాటే వినదుగా (టాక్సీడ్రైవర్‌),అదేంటోగాని ఉన్నపాటుగా (జెర్సీ) వంటి  కృష్ణకాంత్‌ గీతాలు పాపులర్‌ అయ్యాయి. ‘బతుకమ్మ’తో ఆయన పంచుకున్న పాటల సంగతులు.. 

మా స్వస్థలం నల్గొండ జిల్లా సూర్యాపేట. చిన్నతనం నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. స్కూల్‌ రోజుల్లో సినిమా కథల్ని విశ్లేషిస్తూ, పాటల్ని ఆస్వాదిస్తూ  కాలం గడిపేవాణ్ణి. ఈ క్రమంలో దర్శకత్వం మీద ఆసక్తి ఏర్పడింది. హైదరాబాద్‌కు వచ్చాక ఈటీవీలో ఉద్యోగంలో చేరాను. జాబ్‌ కొనసాగిస్తూ సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే గీత రచనే సరైన మార్గమనిపించింది. అలా ప్రయత్నాలు మొదలుపెట్టాను. 2009లో ‘కలయో నిజమో’ పేరుతో శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీత దర్శకత్వంలో ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌ చేశాను. ఆ తర్వాత రెండేండ్లకు ‘అందాల రాక్షసి’ ద్వారా తెలుగు చిత్రసీమలో గీత రచయితగా నా ప్రయాణం మొదలైంది.


పాట కథ చెబుతుంది

మంచి పాట పుట్టడానికి సినిమా కథలోని సందర్భమే ప్రధాన భూమిక షోషిస్తుంది. సందర్భం బలంగా ఉంటే, అందుకు తగిన భావాల్ని పాటలో పొందుపరచవచ్చు. ఒక్కోసారి కథ అద్భుతంగా అనిపిస్తుంది కానీ.. సందర్భం పేలవంగా గోచరిస్తూ.. ఏదో ఒక డ్రీమ్‌సాంగ్‌ కోసమే రచన చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో భావాల లేమితో పాట కృతకంగా తయారవుతుంది. కథావిష్కరణలో పాట కూడా ఓ ఉపకరణమని నా అభిప్రాయం. అరగంట కథాసారాన్ని పాట మూడు నిమిషాల నిడివిలో వ్యక్తం చేస్తుంది. అయితే అలా కథ చెప్పే పాటలు చాలా తక్కువగా వస్తుంటాయి. ‘జెర్సీ’ చిత్రంలో అన్ని పాటలూ నేనే రాశాను. అందులోని ప్రతి పాటా కథను చెబుతుంది. ‘అదేంటో గానీ..’ అనే గీతం నాయకానాయికల ప్రణయం మొదలుకొని వివాహానంతరం ఎనిమిదేండ్ల్ల బాబుతో దంపతులుగా జీవనం సాగించే వైనాన్ని మొత్తం కండ్లకు కడుతుంది. ఆ పాటలోని  ‘కౌగిలి ఇరుకు ఆయనే.. తగిలే పసిడి ప్రాణమే..’ అనే చరణం వస్తున్నప్పుడు కథానాయిక విజువల్స్‌లో గర్భవతి అయినట్లుగా కనిపిస్తుంది. ‘దూరమెటుల దూరనే మనకే తెలిసె లోపలే’ అనే చరణంలో దంపతుల మధ్యా బాబును చూపించడం జరుగుతుంది. అదే విధంగా ‘స్పిరిట్‌ ఆఫ్‌ జర్సీ’ అనే పాట కథానాయకుడి సంఘర్షణను మొత్తం ఆవిష్కరిస్తుంది. ఇలా సందర్భంలోని ఉద్వేగాల్ని బట్టి పాటల్లోనే సినిమా కథను తెలియజెప్పవచ్చు.

దర్శకుల ఊహకు తగినట్లు..

సినిమా అంటే దర్శకుడి కల కాబట్టి, అంతిమంగా నిర్దేశకుడికి నచ్చే విధంగా పాటలు రాయాల్సి ఉంటుంది. ఇక సంగీత దర్శకుడు తాను ఇచ్చిన ట్యూన్‌లో పాట ఇమిడిపోతుందా? ఏమైనా పదాలు సరిపోవడం లేదా? అనే విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. పాటకు సంబంధించిన సాహిత్యం విషయంలో సంగీత దర్శకుల జోక్యం చాలా తక్కువగా ఉంటుంది. దర్శకుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌.. ఇద్దరూ పాట బాగా రావాలని కోరుకుంటారు. ఏవో కొన్ని మార్పులు చేర్పులు సూచించినా అది పాట బాగుకోసమే. 

సాహిత్యజ్ఞానం ఉంటే మంచిది

గీత రచయితలకు తప్పకుండా సాహితీ అభినివేశం ఉండితీరాలి. జనాలకు అర్థం కాదని పాటల్లో మంచి సాహిత్యాన్ని విస్మరించొద్దు. అలా చేస్తే పాటను మనమే చంపుకున్నట్లు అవుతుంది. చిత్రసీమలో సాహిత్య జ్ఞానం లేకుండా గీత రచయితలుగా ఎక్కువ కాలం రాణించలేరు. అయితే సాహిత్యం అంటే పౌరాణిక గ్రంథాలు, ఛందస్సులతో కూడిన కావ్యాలపై పట్టు ఉండాలని కాదు. భాషమీద పట్టుతో పాటు వ్యాకరణం, పదాల కూర్పు, ఉచ్ఛారణ, భావాల అభివ్యక్తిపై ప్రాథమికమైన పరిజ్ఞానం తప్పకుండా ఉండాలి. కొందరు అక్షరదోషాల్ని గమనించకుండా గీత రచన చేస్తుంటారు. అలాంటి వారు త్వరగా కనుమరుగవుతారు.

పాట లేనిదే పనిలేదు

మాటల్లో చెప్పలేని భావాన్ని తక్కువ నిడివిలో వ్యక్త పరిచేదే పాట. వంద సంభాషణలు చెప్పలేని భావాన్ని ఓ పాట చెబుతుంది. పాట మనందరి జీవితాల్లో ఓ భాగం. అనేక సందర్భాల్లో పాటే మనకు నేస్తంగా ఉంటుంది. పండితుల నుంచి పామరుల వరకు ప్రతి ఒక్కరూ పాటను ప్రేమిస్తారు. ఓ రకంగా పాటలేనిది పని లేదని చెప్పొచ్చు. నా కెరీర్‌లో అందాల రాక్షసి, మహానుభావుడు, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, జెర్సీ, పడిపడిలేచే మనసు, మళ్లీరావా, డియర్‌ కామ్రేడ్‌, దర్బార్‌, సాహో, హుషారు.. వంటి చిత్రాలు పేరు తెచ్చాయి.

వేటూరిగారు స్ఫూర్తి

నాకు వేటూరిగారు స్ఫూర్తి. స్కూల్‌ రోజుల్లో ఆయన పాటలు వింటూ పదప్రయోగాల గురించి ఆలోచించేవాణ్ణి. ‘జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన ఓ మైనా మైనా’ పాట విన్నప్పుడు అందులో ‘జిలిబిలి పలుకులు’ అనే ప్రయోగం బాగా ఆకట్టుకుంది. అలా వేటూరిగారి పాటల్ని వింటూ, అధ్యయనం చేస్తూ గీతరచనపై మక్కువ పెంచుకున్నా. చలం, శ్రీశ్రీ పుస్తకాల్ని బాగా చదివాను. విప్లవ సాహిత్యం విషయంలో సుద్దాల అశోక్‌తేజ, వంగపండు పాటలు స్ఫూర్తినిచ్చాయి. ఆర్‌.నారాయణమూర్తి సినిమాల్లోని పాటల్ని బాగా వినేవాణ్ణి. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి అభ్యుదయ, విప్లవ భావాలు నాపై తెలియకుండానే ప్రభావం చూపించాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విప్లవ నేపథ్య పాటల్ని రాసే అవసరం రావడం లేదు. నక్సలైట్‌ నేపథ్యంలో రూపొందిస్తున్న ‘విరాటపర్వం’ చిత్రంలో నేను ఓ విప్లవగీతం రాస్తున్నా.

మెలోడీ పాటలే ఎక్కువ 

నా కెరీర్‌లో మెలోడీ పాటల్ని ఎక్కువగా రాశాను. అందుకే, చాలామంది దర్శకులు అదే శైలి పాటలు కావాలని అడుగుతుంటారు. మరో విషయం ఏమిటంటే, నా మెలోడీ గీతాల్ని ఎక్కువగా సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఆయన పాడిన ప్రతి పాట శ్రోతల ఆదరణను సొంతం చేసుకుంది. శ్రావ్యమైన గీతాలకు ఉండే గొప్పతనం ఏమిటంటే సినిమా విజయంతో సంబంధం లేకుండా అవి సంగీతప్రియుల మనసుల్ని దోచుకుంటాయి. ‘డియర్‌ కామ్రేడ్‌' చిత్రంలో నేను రాసిన ‘ఎటు పోనే..’ అనే గీతం చాలా పాపులర్‌ అయింది. తేలిక పదాలకే ప్రాధాన్యం

పాటలోని భాషాప్రయోగం విషయంలో రెండు అంశాల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అతిసాధారణ పదాలతో సరళంగా భావాన్ని వ్యక్తీకరించడం, గంభీరమైన పదప్రయోగాలతో అర్థవంతంగా పాటను కూర్చడం. ఈ రెండు ప్రక్రియల్లో ఏదో ఒక దానిని ఎంచుకోవాలి. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంలో ‘నువ్వంటే నా నవ్వు.. నేనంటేనే నువ్వు.. నువ్వంటూ నేనంటూ లేమని’ అనే పాట రాశాను.  చాలా సాధారణ పదాలతోనే గాఢమైన భావాన్ని అందించే ప్రయత్నం చేశా. కొన్నిసార్లు గంభీరమైన పదాలు లేకుంటే భావం గొప్పగా అనిపించదు. పాట సందర్భాన్ని భావాల వ్యక్తీకరణ చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా మాత్రం నేను తేలిక పదాలతోనే పాటను ప్రజెంట్‌ చేయాలనుకుంటా.
ట్యూన్‌ తర్వాతే పాట రచన

గీత రచయితలు ఒక పాట మాత్రమే రాసినా, దర్శకులు సినిమా కథను మొత్తం చెబుతారు. అయితే భారీ కమర్షియల్‌ సినిమాల్లో మాత్రం కేవలం సందర్భం మాత్రమే వివరించి పాట రాయమని కోరతారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ ప్రకారం సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్‌కే గీత రచయితలు పాటలు రాస్తున్నారు. పాట రాసిన తర్వాత స్వరకల్పన చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎవరో కొందరు సంగీత దర్శకులు, ఎప్పుడో ఓ సందర్భంలో మాత్రమే... అప్పటికే రాసిన పాటకు ట్యూన్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ పద్ధతి చాలా తక్కువగా కనిపిస్తుంది.

మహోన్నత కార్యం

గీత రచయితలు ఎంతోమంది వస్తున్నా, మంచి పాటలు రాసేవారికి ఎప్పుడూ విలువ ఉంటుంది. ఆత్రేయ, వేటూరి పాటలు ఎన్ని తరాలైనా అజరామరమై అలరిస్తూనే ఉంటాయి. చిత్రసీమలో పోటీకంటే వ్యక్తిగత ప్రతిభా పాటవాలు చాలా ముఖ్యం. రాయాలనే తపన, ప్రేమ ఉంటే కాలక్రమంలో రాణిస్తాం. నేను కూడా తొలినాళ్లలో ఎంతో స్ట్రగుల్‌ అయ్యాను. కొన్ని సినిమాలకు పాటలు రాయించుకొని డబ్బులిచ్చేవాళ్లు కాదు. ఇవన్నీ జీవితంలో ఓ భాగం అనుకొని సాగిపోవాలి. రచన మీద ప్యాషన్‌ లేకుండా ధనార్జనే ప్రధానం అనుకునేవారు ఇండస్ట్రీలో అస్సలు రాణించలేరు. మనలో తపన ఉంటే ఏదో ఒకరోజు తప్పకుండా సక్సెస్‌ అవుతాం. ఓ రోజు సీతారామశాస్త్రిగారు నాతో మాట్లాడుతూ ‘గొప్ప గొప్ప పండితులు, అవధానులు కూడా ట్యూన్‌ ఇస్తే పాట రాయలేకపోవచ్చు. ఆ పని మనం చేస్తున్నాం. గీత రచన చేస్తూ మనం ఒక  మహోన్నత కార్యంలో నిమగ్నమై ఉన్నాం’ అన్నారు. ఆయన మాటల్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. ప్రస్తుతం పాటల రచనతోపాటు మూడు సినిమాలకు సంభాషణల్ని కూడా అందిస్తున్నా.-కళాధర్‌ రావు


logo