శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sunday - Oct 18, 2020 , 01:46:18

గుడి నీడ

గుడి నీడ

మండల కేంద్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నది. వేంకటేశ్వర స్వామి ఆలయం పక్కన రెండు వందల గజాల తూర్పు ఫేసింగ్‌ ప్లాటు అన్నివిధాలుగా బాగుంటుందనుకున్నాడు సూరి. బేరం కుదిరింది. ప్లాటు యజమాని హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకునే తొందరలో వున్నాడు. సూరికి సొంత వూర్లో నాలుగెకరాల పొలం వుంది. రెండెకరాలు తెగనమ్మి యజమానికి పూర్తి డబ్బు ఇచ్చాడు. రిజిస్ట్రేషన్‌ అయిపోయింది. యజమాని వెళ్ళిపోయాడు.

మిగతా రెండెకరాలు అమ్మి ముందువైపు రెండు షాపులు వేసి వెనక వైపు తనకోసం రెండు మూడు గదులు కట్టుకుంటే బాగుంటుందనుకున్నాడు. ఒక షాపును ఏ కిరాణాకొట్టువాడికో, బట్టల దుకాణం వాడికో కిరాయకు ఇచ్చి, రెండో షాపులో పూలుపండ్లు పూజాసామగ్రి దుకాణం పెట్టుకుంటే నిరంతరం భగవంతుని సేవలో వుండిపోవచ్చుననుకున్నాడు. పదేపదే చేస్తూ వచ్చిన ఈ ఆలోచన ఎంతో తృప్తినిచ్చింది సూరికి.

ప్లాను గీసేవాడి దగ్గరకు వెళ్ళి తన ఉద్దేశం తెలియజేశాడు.

“మంచిది కాకా! రొండొద్దులయినంక రా. గీసిపెడ్త” అన్నాడు ప్లానరు.

వీరి మాటలు విన్న నామం బొట్టు ఆచార్యుల వారు కలుగజేసుకొని “అయ్యా! ఈ ప్లాటు వెంకటేశ్వరాలయానికి ఆనుకొని వున్నదేనా” అని అడిగాడు.

“అవును స్వామీ” అన్నాడు సూరి.

“చివరకు నీకు అంటగట్టిపోయాడా సాంబశివుడు” అన్నాడు.

“అంటే” అర్థం కాక అడిగాడు.

“దేవాలయం నీడపడే చోట ఇల్లు కట్టుకోవటం వాస్తురీత్యా మంచిది కాదు. అందుకే దాన్ని ఎవరూ కొనలేదు. నీవు తెలియక కొన్నట్టున్నావు” అని వెళ్ళిపోయాడు.సూరి డీలా పడిపోయాడు.

“ఆయన మాటలు పట్టించుకోకు కాకా! ఇసుంటి ప్లాట్లల్ల ఎంతోమంది ఇండ్లు కట్టుకొని మంచిగ సంసారాలు చేస్తున్నరు. నేనే వాళ్ళకు ప్లాన్లు గీసిచ్చిన” అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. కాని సూరిలో భయం రాజుకున్నది. ప్లానర్‌ దగ్గరి కాగితాలు తీసుకొని ‘మల్లవస్తా’ అని తన వూరికి వచ్చేశాడు.

సూరిది మండల కేంద్రానికి ముప్పయ్‌ మైళ్ళ దూరంలో వున్న వూరు. భార్య మూడేండ్ల క్రితమే చనిపోయింది. ఒకే కూతురు అదివరకే పెండ్లయి మండల కేంద్రానికి దగ్గర వూళ్ళో చక్కగా కాపురం చేసుకుంటున్నది. సూరి వూరి గణపతి ఆలయంలో వారానికి రెండు రోజులు భజన కార్యక్రమాలు జరుగుతుంటాయి. వీటికి సూరే నాయకుడు. భక్త రామదాసు కీర్తనలు, పోతన భాగవతంలోని పద్యాలు పాడుతూ భక్తుల కథలు చెప్తుంటాడు. ఇవి దాసుకు ఊరటనిచ్చే వ్యాపకాలు.

ఆ రోజు భజన కార్యక్రమం అయిన తర్వాత...

“గుడినీడ పడే ప్లాటు ఇల్లు కట్టుకునేటందుకు పనికి రాదా” అని తన మిత్రులను అడిగాడు.

“అయ్యో! అట్లాంటి ప్లాటు ఎందుకు తీసుకున్నవన్నా? మాకు తెలిసినాయన గుడి పక్క ప్లాటు తీసుకొని వద్దంటున్నా ఇల్లు కట్టుకొని శాన పరేశాన్‌ అయిండు” అన్నాడు సూరి శిష్యుడు వీరాస్వామి.

“అయిందేదో అయింది దాన్ని ఎవరికైనా అమ్మేద్దాం. ధైర్యం చెడకు” అని ధైర్యం చెప్పాడు రాజయ్య అనే మిత్రుడు.కాని బంగారం లాంటి రెండెకరాలు పోయినందుకు లోలోపల కుమిలిపోయాడు. ‘దేవుణ్ణి నమ్ముకొని కట్టుకుంటే ఏమైతది?’ అనిపించింది. కాని, ‘అబ్బోవద్దు’ అని వెంటనే వెనుకంజవేశాడు. ఒకే కూతురు హాయిగా కాపురం చేసుకుంటున్నది. తానెట్లా వున్నా వాళ్ళు బాగుండాలంటే ఆ ప్లాటును ముట్టుకోవద్దన్న నిర్ణయం తీసుకున్నాడు.

వారం తర్వాత రియలెస్టేట్‌ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆ ప్లాటును మారుబేరానికి పెట్టాడు. ఒక ముస్లిం ముందుకు వచ్చాడు. కాని గుడి పక్కన ముస్లింకెట్లా అమ్ముతావని కొందరు నిలదీశారు. అంతే మరే బ్యారం రాలేదు.దాసుకు ఆ ప్లాటు మీద మనసు విరిగింది.

వేంకటేశ్వరాలయం పక్కనే ఆంజనేయస్వామి ఆలయం కూడా కట్టాలని ఆలయ కమిటీ తీర్మానం చేసింది. కాని స్థలం లేని కారణంగా వాయిదా వేసుకున్నది. ఆలయ కమిటీకి ఘనపురం భూస్వామి సంగమేశ్వరయ్య ఛైర్మన్‌గా ఎన్నికైనప్పటి నుంచి హడావుడి పెరిగింది. ఆయన పులి లాంటివాడు. ఎందరి పొలాలనో తన పొలాలలో కలుపుకొని, ఎదిరించినవాళ్ళను తన్నించిన అనుభవజ్ఞుడు. ఆయన దృష్టి దాసు రెండు వందల గజాల ప్లాటు మీద పడింది.ఒక రోజు సూరిని గుడికి పిలిపించి 

“సూరీ నీ ప్లాటును గుడికి దానం చేయరాదా, పుణ్యం పురుషార్థం” అని అడిగాడు.“అయ్యా! నేను గరీబోన్ని. ఊళ్ళ రొండెకరాలమ్మి ఇది కొన్న. నాకొక్క పైస లాభమొద్దు, నష్టమొద్దు. కొన్నరేటుకే అమ్ముతా తీసుకొండి” అన్నాడు సూరి.“గుడి ఖాతాల పైసలు లేవు. ఆ ఉత్సవాలు, ఈ ఉత్సవాలు జరిపించి కొంత ఆదాయం వస్తుంది. ఎంతోకొంత ఇస్తాంలే” అన్నాడు భూస్వామి.“ఆ మాత్రం జాగా నాకింకో చోట చూపించినా సరే” అన్నాడు.“జగమొండిలాగా వున్నావేందయ్యా. గుడినీడ పడే జాగల ఇల్లు కట్టుకోలేవు. గుడికి ఇవ్వుమంటే ఇవ్వనంటున్నవు. నీ ప్లాటుల దినాం ఒక టన్ను చెత్తా పడుతున్నది. దాన్ని ఎవరు సాఫు చేస్తున్నరు మాకు రోజుకు నూరు ఖర్చవుతున్నది”సూరి మౌనం వహించాడు.

“నీకేం అన్యాయం చెయ్య, అప్పుడింత ఇప్పుడింత ఇస్తాంలే. ఇయ్యాల దినం బాగున్నది. మా గుమాస్తా ఎంతో కొంత అడ్వాంసు ఇస్తడు. తీసుకో.” అంటూ కారువైపు నడిచాడు. సూరి గుమాస్తా దగ్గరకు వెళ్ళాడు. తెల్లకాగితం మీద సంతకం తీసుకొని నూట పదహార్లు చేతిలో పెట్టి “ఛైర్మన్‌ సారు చెప్పిన్రు గద. నేను గూడ అప్పుడప్పుడు యాది జేస్తుంట” అని అన్నాడు గుమాస్తా.వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని చూస్తూ దాసు పావుగంట కూర్చున్నాడు. ఏదో నిర్ణయానికి వచ్చినట్లు లేచి ఆ నూట పదహార్లను హుండీలోవేసి నమస్కారం చేసి తన వూరి బస్సు ఎక్కాడు.

ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణం జరిగింది. దాని ప్రారంభోత్సవానికి శాఖా మంత్రి వచ్చాడు. ఆ వైభవాన్ని చూసి తరించవచ్చని సూరి, శిష్యుడు వీరాస్వామితో పాటు వచ్చాడు. మంత్రి ప్రారంభోత్సవం చేసి, తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ పెట్టిన శిలాఫలకం మీద ఎవరెవరి పేర్లో వున్నాయి. కాని, సూరి పేరు లేదు. వీరాస్వామికి కోపం వచ్చింది.“ఇదెక్కడి అన్యాయం సామీ” అని భూస్వామిని నిలదీశాడు.

“ఏమిరా కూశావ్‌” అని గట్టిగా అరిచాడు భూస్వామి. దగ్గర్లోవున్న తన మనుషులకు సైగ చేశాడు. ఇద్దరు రౌడీలు ఆ ఇద్దరిని గుడి వెనుకకు లాక్కుపోయి పిడిగుద్దులు గుద్ది, లాఠీలతో పొడిచి, “మల్ల ఎప్పుడన్న గుడిదిక్కొస్తె పానాలు దక్కవ్‌” అని హెచ్చరించిపోయారు. మానసిక బాధకు శరీర బాధ కూడా తోడు కాగా క్రుంగిపోయిన సూరి “వీరసామి, వూరికి పో. నాకోసం నువ్వెందుకు దెబ్బలు దింటవు” అన్నడు.“నిన్నిడిసి నేనెట్ల బోతనే. పొయ్యేదుంటె ఇద్దరం పోదాం” అన్నడు.

ఈ దౌర్జన్యాన్ని దేవమ్మ అనే వృద్ధురాలు చూసి, అక్కడున్న వాళ్ళ ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంది. సూరి మీద ఆమెకు జాలి కలిగింది. తన కొడుకుతో ముందు మంచినీళ్ళు తెప్పించి దెబ్బలు తిన్న ఆ ఇద్దరితో తాగించింది. ఆ నీళ్ళనే తీర్థమనుకొని తాగటం వల్ల వచ్చిన బలమో ఏమోగాని సూరి గొంతెత్తి 

“పాహి రామప్రభో, పాహి రామప్రభో”

అంటూ ఆర్తితో రామదాసు కీర్తన పాడటం మొదలుపెట్టాడు. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటున్న వాళ్ళూ, ప్రదక్షిణలు చేస్తున్నవాళ్ళూ గుడి వెనుకవైపు వచ్చి సూరిని ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఆ పాటలోని ఒక్కొక్క మాట ఆంజనేయస్వామి నోటి నుంచి వస్తున్నదేమోననిపించింది. ఇంతలో ఇందాక కొట్టివెళ్ళిన రౌడీలలో ఒకడు వచ్చి “అరే బద్మాష్‌! ఇంక ఈడనే వున్నావ్‌రా. పాట ఆపు కొడుకా, లేకుంటే బొనిగె పిసికేస్తా” అంటూ గొంతు పట్టుకోబోయాడు. అంతా అవాక్కయ్యారు. కాని దేవమ్మ కాళికాదేవి అవతారం ఎత్తి ఆ రౌడీ చేతిని పట్టి లాగి చెంపమీద ఒక్క దెబ్బవేసింది.

“ఏందిర నీ జులుం. భక్తుడు పాట పాడుతుంటె బొనిగె పిస్కుతాంటావ్‌” అని చుట్టూ వున్న వాళ్ళతో “తమాష చూస్తున్నరేంది. తన్నున్రి నా కొడ్కుని” అనేసరికి పదిమంది ఎగబడ్డారు. ఆ రౌడీ అక్కడ నుంచి పరుగుతీశాడు.సూరికి ఇదేమీ పట్టలేదు. ‘అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా” అంటూ ఎత్తుకున్నాడు. ఆ కీర్తన చుట్టూ వున్న వారి మనసులను కరిగించింది.“మీరు నా కొడుకులసుంటోల్లు. ఇక్కడుండుడు మంచిది కాదు. గుడి కావాల్నంటె ఇదొక్కటే ఉన్నదా. ఇగో సడక్‌ దాటితె పాడుబడ్డ రాములవారి గుడి వున్నది. ఒక్కదినంల బాగ జేపిస్త. పూజలు చేతాం. భజనలు చేతాం. మా బీసీ కాలని అంతా మీ తోటి వుంటది. రాండి” అంటూ తోవ తీసింది. పది పదిహేను మంది ఆమెను అనుసరించారు. చిన్నగుడి. గర్భగుడిలో సీతారామలక్ష్మణుల విగ్రహాలు. ముందు మంటపం. ధ్వజస్తంభం. బయట చేదబావి. ఒక పెద్ద వేపచెట్టు. ఆ చెట్టు చుట్టూ స్టేజిలాగా వున్న అరుగు. చూడగాని తమ వూరిలోని గణపతి గుడి గుర్తుకొచ్చింది.

“అమ్మా మాకు చానా ఇష్టమైంది. ఇంక ఇక్కడ్నే వుండి పోతం” అన్నాడు సూరి. ఆ మాట దేవమ్మకు కొండెక్కినంత సంతోషం కలిగించింది. తనతో వున్న ఆ జనానికి చెప్పింది, గుడిని ప్రాంగణాన్ని బాగు చేయమని. అంతే వాళ్ళంతా ఉత్సాహంతో ఆ పనిలో పడ్డారు. సూరి, వీరాస్వామి వేపచెట్టు అరుగు మీద చిన్నపిల్లలలాగా నిద్రపోయారు. ఆ మరునాడు సున్నం వేసి జాజు పట్టీ పెట్టారు. సాయంత్రం సూరి విగ్రహాలకు క్షీరాభిషేకం చేశాడు. వీరాస్వామి గుడి గంట మోగిస్తుండగా ‘శ్రీరామ నీనామ మేమి రుచిరా’ అని గంభీర స్వరంతో పాడుతూ హారతి ఇచ్చాడు. అంతే ఏ ఆర్భాటం లేకుండా రామాలయం పునః ప్రారంభమైంది. తీర్థ ప్రసాదాల కార్యక్రమం పూర్తయిన తర్వాత అరుగుమీద కూర్చుని పోతన పద్యాలను వీనులవిందుగా పాడుతూ భక్తప్రహ్లాదుని హరి కథను ధారాళంగా చెప్పాడు. భోజనాల తర్వాత భక్తులు కాలనీవాళ్ళ దగ్గర చిరుతలు, తాళాలు, తాంబూర, తబలాలు, హార్మోనియం సేకరించి తెచ్చారు. మరుసటి రోజు రాత్రి నుండి భజన కార్యక్రమం కూడా ప్రారంభమయింది. గుడికి సంబంధించిన ధూపదీపనైవేద్యాలకు, ఆ ఇద్దరి భోజనాలకు కాలనీవాళ్ళు ఏర్పాట్లు చేశారు. విషయం తెలిసి సూరి కూతురు భర్తా, పిల్లలతో కలిసి వచ్చింది. తండ్రితో ఒక పూట గడిపి వెళ్ళిపోయింది.

పాటలనే మంత్రాలుగా సీతారాములను ఆరాధించటం, ఊరి వాళ్ళకు ఎదురుగా వున్న వేంకటేశ్వరాలయానికి, ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కొత్తగా అనిపించసాగింది. కొందరు ఇటువైపు కూడా రాసాగారు. క్రమంగా సంఖ్య పెరుగుతూ వచ్చింది. అక్కడ వేంకటేశ్వర, ఆంజనేయస్వామి ఆలయాలకు హుండీలు ఉన్నాయి. ఇక్కడ రామాలయంలో హుండీ వద్దనుకున్నారు. హారతి పట్టే వీరాస్వామి కూడా పళ్ళెంలో డబ్బులు వేయవద్దని చెప్తున్నాడు.

ఇదంతా ఘనపురం భూస్వామి దృష్టికి పోయింది. అతడు కోపంతో రగిలిపోయాడు. అతని అహం దెబ్బతిన్నది. కాని కమిటీ సభ్యులు శాంతింపజేశారు. ‘వృద్ధురాలు దేవమ్మ సామాన్యురాలే కాని, బీసీలంతా ఆమె చెప్పినట్టు వింటారు. అదే జరిగితే ముందు జెండాకెక్కేది మనమే’ అని శాంతింపజేశారు. దానికి విరుగుడుగా వేంకటేశ్వరస్వామికి బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరిపించి భక్తుల దృష్టిని ఇటు మళ్ళించుకోవచ్చునని కూడా సలహా ఇచ్చారు. ఇదీ బాగుందనుకున్నాడు భూస్వామి. రోజుకొక రాజకీయ నాయకుణ్ణి రప్పించటం ద్వారా తాను మండల అధ్యక్ష పదవిని దక్కించుకోవటానికి మంత్రాంగం నెరపవచ్చునని ఎత్తువేశాడు.

బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఆర్థిక శాఖామాత్యులు వేంచేశారు. దూరప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. వచ్చిన వారిలో సగమైనా రామాలయానికి వెళ్తున్నారు. సూరి పాడే రామదాసు కీర్తనలు వింటున్నారు. భాగవతంలోని పద్యాలను, భక్తుల కథలను వింటున్నారు. ఆసక్తి వున్నవారు రాత్రి భజన కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు.

చివరి రోజు దేవాదాయశాఖామంత్రి సతీసమేతంగా వచ్చారు. వేంకటేశ్వరాలయంలో మంత్రి గారి భార్య అర్చనలు చేయిస్తున్నప్పుడే ఆమెకు ‘ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’ అన్న కీర్తన వినిపించింది. హుండీలో ఐదువందల నోటు వేసింది. అప్రయత్నంగా కాళ్ళు ఆమెను రామాలయం వైపు నడపించాయి. ఆమె వెంట మంత్రిగారు నడిచారు. భూస్వామికి వెళ్ళక తప్పలేదు. ఆమె దైవ దర్శనం చేసుకొని, చిరుతలు వాయిస్తూ నిలబడి పాడుతున్న సూరికి దగ్గరగా కూర్చుంది. ఆ చిరిగిన, దుమ్ముకొట్టుకుపోయిన కార్పెట్‌ మీద మంత్రిగారు కూర్చున్నారు. ఆయన వెనుక భూస్వామి కూడా కూర్చున్నాడు. గర్భగుడిలో గాని, చుట్టూరా గాని ఏ విద్యుత్తు అలంకరణలు లేవు. రెండు వీధిలైట్లు మాత్రం వెలుగుతున్నాయి. అట్టహాసం, హడావుడి లేవు. తైలదీపాల మధ్యనే సీతారామలక్ష్మణులు దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. సూరి కీర్తనలు ఆ తేజస్సును పెంచుతున్నాయి. మంత్రిగారి భార్య లేచింది. మంత్రి, భూస్వామి కూడా లేచారు. వీరాస్వామి ఆమె కు తీర్థప్రసాదాలుఅందజేసి, మంత్రివైపు తిరిగాడు. ఆమె అటూఇటూ హుండీ కోసం చూసింది. అది లేకపోవటంతో వీరాస్వామి చేతిలోని పళ్ళెంలోనే ఐదువందల కాగితం వేసింది. వీరాస్వామి దాన్ని కళ్ళకద్దుకొని, రామునివైపు చూపించి, తిరిగి ఆమెకే ఇచ్చేశాడు.

“మన్నించండమ్మా! ఇక్కడ ఆ పద్ధతి లేదు” అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి సూరివైపు తిరిగింది. వంగి అతనికి పాదాభివందనం చేసింది. వెంటనే సూరి కిందికి దిగి ఆమెకు తానూ పాదాభివందనం చేసి “నేనెంతో మీరూ అంతేనమ్మా! మీలో వున్నదీ, నాలో వున్నదీ ఆ రాముడే” అన్నాడు.ఆ మాటలకు అప్రయత్నంగా భూస్వామి చేతులు జోడించాడు. సూరి కూడా ప్రతి నమస్కారం చేసి వేదిక ఎక్కాడు.“అంతారామమయం.. ఈ జగమంతా రామమయం” అన్న కీర్తన వినిపిస్తుండగా ఆ ముగ్గురూ వెనుతిరిగారు.

-అమ్మంగి వేణుగోపాల్‌ ,సెల్‌ : 9441054637


logo