బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Oct 18, 2020 , 01:22:10

సత్తువ కోసం..సత్తు ముద్ద

సత్తువ కోసం..సత్తు ముద్ద

 • కష్టపడకుండా వండుకోవచ్చు. పెద్దగా సమయం పట్టదు. పెద్దలు తినవచ్చు, పిల్లలకూ పెట్టవచ్చు. పోషక విలువలు అపారం కాబట్టి, చిన్నారుల ఎదుగుదలకు తోడ్పడుతుంది. 
 • బెల్లం వాడతారు కాబట్టి, మధుమేహులు కూడా నోరు తీపి చేసుకోవచ్చు. 
 • చాలాకాలం నిల్వ ఉంటుంది. చెడిపోతుందన్న భయమూ లేదు.   
 • జాగారాలూ, ఉపవాసాలూ చేస్తున్నప్పుడు నీరసం వస్తుంది. అలా అని, భోజనమూ చేయలేం. 
 • మధ్యేమార్గంగా పండ్లూ కాయలతోపాటు సత్తుముద్దను ఆరగిస్తారు చాలామంది. ఫలితంగా, నీరసం రాదు. శక్తి సన్నగిల్లదు. వ్రతం చెడదు. ఫలితమూ దక్కుతుంది.    
 • నీటి సౌకర్యం పెరిగినందువల్ల తెలంగాణలో అన్ని పంటలూ పుష్కలంగా పండుతున్నాయి. 
 • ఇదివరకు మెట్టపంట అయిన జొన్ననే నమ్ముకునేవారు. దీంతో గాదెల నిండా జొన్నలే! ఏం వండుకున్నా జొన్నలతోనే! జొన్నలతో చేసే వంటకాలకు అలా ప్రాచుర్యం వచ్చింది. వాటిలో ఒకటి సత్తు ముద్ద. 
 • అందరికీ నచ్చే రుచి ఇది. 
 • దీని తయారీ చాలా సులభం. జొన్న పేలాలు చేయడం తెలిస్తే చాలు. 
 • సత్తు ముద్ద్ద చేయడమూ వచ్చినట్టే. మందపాటి మూకుడును పొయ్యి మీద పెట్టి, బాగా వేడిచేసుకోవాలి. అందులో జొన్నలు వేసి పువ్వుల్లా పేలాలు చేసుకోవాలి.
 •  ఆ పేలాలను చల్లారనిచ్చి, మిక్సీలో వేసి మెత్తగా పిండిచేసుకోవాలి. తాటి బెల్లం లేదా మామూలు బెల్లాన్ని పొడిచేసి పెట్టుకోవాలి. దీన్ని నీళ్లలో కరిగించుకోవాలి. బెల్లం త్వరగా కరగడానికి, నీళ్లను కాస్త వేడి చేసుకున్నా ఫర్వాలేదు. నీళ్లలో బెల్లం పూర్తిగా కరిగాక, ఆ నీటిని వడకట్టుకోవాలి. అలా వడకట్టిన నీటికి ఏలకుల పొడి కలుపుకొని పేలాల పిండిలో ఈ నీళ్లు కలిపి లడ్డూల్లా ముద్దలు కట్టుకుంటే సరిపోతుంది. నెయ్యి, కాజూ జోడిస్తే మంచి వాసన, అదనపు రుచి తోడవుతాయి.  
 • బెల్లంలో ఐరన్‌ అపారంగా ఉంటుంది. ఇది సహజ సిద్దమైన తీపి పదార్థం. ఇందులో కాల్షియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం, సెలీరియం, మాంగనీస్‌ వంటి అనేక పోషకాలు ఉంటాయి. బెల్లం మలబద్ధకాన్ని 
 • నివారించి తక్షణ శక్తినిస్తుంది.  
 • జొన్నలు గ్లుటెన్‌ ఫ్రీ ఆహారం. దీని గ్లయిసిమిక్‌ ఇండెక్స్‌ కూడా చాలా తక్కువ. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ప్రతి వంద గ్రాముల జొన్నల్లో 9.7 గ్రాముల పీచుతో  పాటు 10.4 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. మెగ్నీషియం, ఐరన్‌ వంటి పోషకాలు లభిస్తాయి. ఇందులోని సంక్లిష్ట పిండి పదార్థాలు త్వరగా రక్తంలోకి గ్లూకోజ్‌ను విడుదల చెయ్యవు. అందువల్ల మధుమేహులకు మంచి ఆహారం. కెమికల్‌ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతోఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి.


logo