శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Oct 18, 2020 , 01:00:35

అపోహలే.. అసలు రోగం!

అపోహలే.. అసలు రోగం!

కొన్ని నమ్మకాలు మన ఆరోగ్యాన్ని పక్కదారి పట్టిస్తాయి. టోటల్‌ బాడీ డీటాక్సిఫికేషన్‌ అంటూ చాలామంది ప్రచారం చేస్తుంటారు. ఫాస్ట్‌ ఫుడ్స్‌లో వాడే అజినొమొటో వల్ల క్యాన్సర్‌ వస్తుందని కొంతమంది భయపడుతుంటారు. ఈ నమ్మకాలు నిజమేనా? అంటే, అందుకు రుజువులేమీ లేవని తేల్చేశారు శాస్త్రజ్ఞులు. అదే విధంగా క్రమం తప్పకుండా చేసుకునే బీపీ పరీక్ష గుండెపోటు, స్ట్రోక్‌ రాకుండా ఆపడమే కాదు, మతిమరుపును కూడా నివారిస్తుందంటున్నది ఒక పరిశోధన. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం రోజూ తినే టొమాటోలు చాలంటున్నది మరో పరిశోధన.

శరీరానికి డీటాక్సిఫికేషన్ అవసరమా?

మన శరీరంలో హానికర పదార్థాలెన్నో ఏర్పడుతాయనీ, వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలనీ చెబుతుంటారు. మనం తినే ఆహారం ద్వారా, వివిధ జీవక్రియల ద్వారా ఉత్పత్తి అయిన కొన్ని పదార్థాలు విషపూరితంగా మారుతాయని అంటారు. వీటిని డీటాక్సిఫికేషన్‌ ప్రక్రియ ద్వారా తొలగించాలనే వాదన ఉంది.  ఇందులో కొంతకూడా నిజం లేదు. ఈ అపోహ ఆధారంగానే చాలా కంపెనీలు డీటాక్స్‌ ఫుడ్స్‌ పేరుతో అనేక ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. కొన్ని ఫిట్‌నెస్‌ సెంటర్లు కూడా డీటాక్సిఫికేషన్‌ చేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తుంటాయి. అయితే వైద్యపరంగా అలాంటి ప్రక్రియ ఏదీ ఉండదు. ఎవరైనా విషమో, పురుగుల మందో తీసుకున్నప్పుడు మాత్రం, వైద్యచికిత్స ద్వారా డీటాక్సిఫికేషన్‌ చేస్తారు. జీవక్రియల ద్వారా తయారయ్యే విషపూరిత వ్యర్థాల్ని శరీరమే తొలగిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఔషధాలు గానీ, ఆహారాలు గానీ తీసుకోనవసరం లేదు. కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం.. ఈ హానికర టాక్సిన్స్‌ని తొలగిస్తాయి. కాబట్టి, బాడీ డీటాక్స్‌ అనే పదమే అబద్ధం. 

టొమాటోతో కిడ్నీలు క్షేమం!

టొమాటో లేకుండా దాదాపుగా ఏ కూరా వండలేం. రుచికరమైన టొమాటోలు కిడ్నీలను ఆరోగ్యంగా కూడా ఉంచుతాయంటున్నారు పరిశోధకులు. ఆ ఎర్రెర్రని పండ్లు అక్యూట్‌ కిడ్నీ ఇంజురీ (ఎకెఐ) లాంటి తీవ్రమైన మూత్రపిండ సమస్యల బారిన పడకుండా కాపాడుతాయని అంటున్నారు. అక్యూట్‌ కిడ్నీ ఇంజురీ కారణంగా అకస్మాత్తుగా కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది. కేవలం రెండు రోజుల్లో కిడ్నీలు మూలన పడుతాయి. ఎకెఐ వల్ల ఎండ్‌ స్టేజ్‌ కిడ్నీ డిసీజ్‌ (కిడ్నీ ఫెయిల్యూర్‌) కూడా కావచ్చు. కానీ, టొమాటోలు ఎక్కువగా తినడం ద్వారా ఇలాంటి ప్రమాదాన్ని తగ్గించవచ్చని చెప్తున్నాయి  పరిశోధనలు. టొమాటోలోని లైకోపీన్‌ ఎకెఐ సమస్యను నివారిస్తుంది. లైకోపీన్‌ ఓ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌. ఇది ఫ్రీరాడికల్స్‌ వల్ల జరిగే నష్టాన్ని నివారిస్తుంది. రియాక్టివ్‌ ఆక్సిజన్‌ (ఫ్రీ ఆక్సిజన్‌ రాడికల్స్‌) నుంచి డిఎన్‌ఏ, కొవ్వులు, ప్రొటీన్లను రక్షిస్తుంది. కిడ్నీల టాక్సిసిటీని తగ్గించే పారిశుద్ధ్య కార్మికుడిగా లైకోపీన్‌ పనిచేస్తుంది. అంతేకాదు, డైక్లోఫెనాక్‌ లాంటి ఔషధాల టాక్సిసిటీ నుంచి కూడా ఇది కిడ్నీలను కాపాడుతుంది.అజినొమొటోతో క్యాన్సర్‌?

అజినొమొటోగా సుపరిచితమైన మోనోసోడియం గ్లూటమేట్‌ (ఎంఎస్‌జి)ను ఆహార పదార్థాలలో విలన్‌గా చూస్తాం. అజినొమొటో కూడా ఒక రకమైన లవణమే. ఇది ఆరోగ్యానికి హానికరం అనీ, దీనివల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయనీ ప్రచారం. ఆరోగ్యానికి సంబంధించిన అనేక అపోహల్లో ఇదీ ఒకటి. చిన్న పిల్లలు, చంటిబిడ్డలకు అజినొమొటో ఇవ్వకూడదని సూచిస్తారు నిపుణులు. అంతేగానీ, పెద్దవాళ్లకు దీనివల్ల ప్రమాదమేమీ లేదు. బేకరీ ఉత్పత్తుల వంటి రకరకాల ఫాస్ట్‌ ఫుడ్స్‌ తయారీలో అజినొమొటో లేకుండా పని జరగదు. దానివల్లే మైగ్రేన్‌, క్యాన్సర్ల వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తారు. కానీ అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డిఎ) ఇది సురక్షితమైనదని తేల్చి చెప్పింది. అయితే రుచి కోసం వాడే అజినొమొటో వల్ల కాదు కానీ.. జంక్‌ ఫుడ్స్‌ తీసుకోవడమే మొత్తానికి హానికరమని  నిపుణులు చెప్తున్నారు. అయినదానికీ కానిదానికీ అజినొమొటోను నిందించడం సరికాదంటున్నారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాల మాదిరిగానే ఎంఎస్‌జి కూడా కొందరిలో అలర్జీని ప్రేరేపించవచ్చు. అలాంటివాళ్లకు మాత్రం దూరంగా ఉంచాలి. logo